చిన్న ఉపాయం - అచ్చంగా తెలుగు
చిన్న ఉపాయం
దొండపాటి కృష్ణ 

“నమస్కారమండీ ఆఫీసరు గారు! బాగున్నారా?” అన్న మాటలకు, తన కోసమే ఎదురుచూస్తూ పేరుకుపోయిన ఆఫీస్ పనిని పూర్తి చేసే పనిలో ఉన్న గోపాల్ తలపైకెత్తి చూశాడు. 
“అరే రామకృష్ణ. ఎన్నాళ్ళయ్యింది రా నిన్ను చూసి. మళ్ళీ ఇన్నాళ్ళకు దర్శనమిచ్చావ్… రా... వచ్చి కూర్చో” సాదరంగా ఆహ్వానించి ఆత్మీయ ఆలింగనాన్ని ఇచ్చాడు గోపాల్. 
“ఆఫీసరు గారు ఈ మధ్య చాలా మర్యాదలు అలవరచుకుంటున్నారే!” అని చూపించిన కుర్చీలో కూర్చున్నాడు రామకృష్ణ. 
“చాన్నాళ్ళ తర్వాత కలిశాం కదరా అందుకే ఇలా… కొత్తగా మన మద్య మర్యాదలేంటి చెప్పు… ఏం తీసుకుంటావ్?” అడిగాడు గోపాల్ ఆనందం నిండిన మొహంతో. 
“అబ్బే ఏం వద్దులే! అన్నీ బయటే అయిపోయాయిలే. చాలా బిజీగా ఉన్నట్లున్నావ్. ఏమన్నా డిస్టర్బ్ చేశానా?” అనుమానంగా అడిగాడు రామకృష్ణ. 
“రెండు రోజులు శెలవు పెడితే ఇదిగో ఇలా పేరుకుపోతుంది. నా సంగతికేం కాని నువ్వు చెప్పు. ఎలా ఉన్నావ్? పిల్లలెలా ఉన్నారు? నీ భార్య ఎలా ఉంది. జాబ్ సాటిస్ఫ్యాక్షన్ ఉందా?” అంటూ చకచకా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు గోపాల్. 
“ఆపరా నీ ప్రశ్నలు! ఎవరొచ్చినా ఇలా ప్రశ్నల వర్షం కురిపించడం మానలేదా?” గతాన్ని తడిమాడు రామకృష్ణ. 
“పలకరింపులు ప్రశ్నల్లా అనిపించినప్పుడు పలకరించిన వాడినే తప్పుబట్టడం సహజమేలే! ఇంతకీ విషయమేంటి?” అసహనాన్ని కనబరచాడు గోపాల్, తనను పరోక్షంగా హేళన చేసాడని.
“నీ గ్రాంధికం ఆపు! విశేషమంటూ ఏమీ లేదు కాని ఈ ఊర్లోనే తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంటే వచ్చాను. నువ్విక్కడే చేస్తున్నావని ఒకసారి కలిసిపోదామని వచ్చాను. ఎలా ఉన్నావ్ నువ్వు?” చెప్పుకొచ్చాడు రామకృష్ణ. 
“ఫంక్షనా! ఏం ఫంక్షన్! ఎలా జరిగింది? వివరాలడిగాడు గోపాల్. 
“స్నేహితుడి కొడుకు నిశ్చితార్ధం అంటే వచ్చాను. బాగానే జరిగింది. మీ డిపార్టుమెంటు వాళ్లకు బోలెడంత పని పెట్టేసారులే. పనికిరాని వస్తువులన్నీ, పాత బట్టలు, విస్తరాకులు అంతా బయట పడేశారు. రేపు అది చూశాక మీ వాళ్లకి విసుగు రావడం ఖాయం” అన్నాడు రామకృష్ణ. 
“అవునా! ఎక్కడది? కలిపి పడేశారా లేక వేర్వేరుగా పడేశారా?” కుతూహలంగా ఆరా తీశాడు గోపాల్.
“అదేం విచిత్రమో గాని అక్కడ రెండు చెత్త కుండీలు ఉన్నాయి. ఒకదాంట్లో చెత్త మరోదాంట్లో వస్తువులు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక చెత్త కుండీ ఉంటేనే దాంట్లో కాకుండా బయటే పడేసి వెళ్ళిపోయేవాళ్ళును చూసాను గాని దేనికదే సెపరేట్ గా పడెయ్యడం ఇప్పుడే చూస్తున్న” అన్నాడు రామకృష్ణ. 
“అయితే అంతా తమ లాంటి వాళ్ళ దయ” కూల్ గా సమాధానమిచ్చాడు గోపాల్.
“సర్! మీ కోసం వెంకటాద్రి ముఠా వచ్చారు సర్! వాళ్ళను పిలవమంటారా లేక కాసేపు ఆగమంటారా?” విషయాన్ని చెప్పాడు అక్కడున్న బంట్రోతు. 
“ఎందుకు ఎదురుచూడ్డం. వాళ్ళను పంపించు” ఆజ్ఞ చేశాడు గోపాల్. 
“అలాగే సర్! ఇప్పుడే పంపిస్తాను” అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు బంట్రోతు. 
“ఒరేయ్ రామ! ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయిరా. కొంచెం వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను” అన్నాడు గోపాల్. 
“అలాగే. నాకేం పని లేదు. ఈ రోజు శెలవు పెట్టాను. నువ్వు బిజీ అయితే చెప్పు ఇంకోసారి కలుద్దాం” అన్నాడు రామకృష్ణ. 
“అబ్బే షెడ్యూల్ అంటూ ఏమీ లేదురా. వీళ్ళు అనుకోకుండా వచ్చారు” వివరణ ఇచ్చాడు గోపాల్.
“నమస్కారం సర్!” అంటూ వెంకటాద్రి, అతని మనుషులు చేతులు రెండూ కట్టుకుని, నెత్తి మీద టవల్ ను చంకలో పెట్టుకుని గోపాల్ ముందు నుల్చున్నారు. 
“ఏంటి వెంకటాద్రి, ఇలా వచ్చారు?” కారణాన్ని అడిగాడు గోపాల్. “మీకు కృతజ్ఞతలు చెప్పి పోదామని మేం ఇలా వచ్చాం సర్” కారణం చెప్పాడు వెంకటాద్రి. 
“కృతజ్ఞతలా! నాకా...! నాకెందుకయ్యా!” ఆనందం నిండిన ఆశ్చర్యంతో పెదవులపై చిరునవ్వుని నిలయం చేసుకుని ప్రశ్నించాడు గోపాల్. 
“అదేంటి సర్ అలా అంటారు. మేము ఇలా ఉండడానికి కారణం మీరే కదా! మీకు కృతజ్ఞత కూడా చెప్పుకోకపోతే ఎలా సర్” వినయంగా అన్నాడు రామయ్య. 
“చూడు రామయ్య! నేను ఉపాయం మాత్రమే చెప్పాను. దానికో చిన్న దారిని చూపాను. నిర్ణయం తీసుకుంది మీరు, దాన్ని ఆచరించింది మీరు కాబట్టి నేనే మీకు చెప్పాలయ్యా. ఎందుకంటే నా మాటలకు విలువనిచ్చారు మీరు” కృతజ్ఞతా భావంతో చెప్పాడు గోపాల్.
“అయ్యో అలా అనకండి సర్. మీరే అవకాశం ఇవ్వకపోయినా, దారి చూపకపోయినా కడుపు నిండేది కాదు. మీలా మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేడు సర్. చాలా చీవాట్లు తినేవాళ్ళం. కాని మాకో అండనిచ్చి ధైర్యాన్నిచ్చింది మీరే కాబట్టి మీకు ధన్యవాదాలు సర్” అన్నాడు నాగరాజు. 
“ఎంతో మందికి చెప్పాను. చాలామంది నన్ను నమ్మలేదు. చేసే ఓపికున్నా అడుక్కోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ చిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాని మీరు నన్ను నమ్మి వచ్చారు. నా ఉపాయానికి రూపాన్నిచ్చారు. అందుకు నేనే కృతజ్ఞుడిని” భావావేషంగా మాట్లాడాడు గోపాల్. 
“వాళ్ళు కూడా త్వరలో తెలుసుకుంటారు సర్. మాలాగే మంచి దారిలోకి వచ్చేస్తారు” అన్నాడు వెంకటాద్రి. 
“అంతకన్నా కావాల్సింది ఏముంది. సర్లే! ఇవెప్పుడూ ఉండేవేలే! వెళ్లి మీ పనులు చూసుకోండి. ఇలాగే చేసుకుంటూ ఆదర్శంగా ఉండండి. సరేనా!” ముగింపు పలికాడు గోపాల్. 
“అలాగే సర్. వెళ్లోస్తాం” అంటూ అక్కడినుంచి నలుగురూ వెళ్ళిపోయారు. 
* * * *

 జరిగినదంతా చూస్తున్న రామకృష్ణ అలాగే ఉండిపోయాడు. గోపాల్కి కొందరోచ్చి కృతజ్ఞతలు చెప్పడం మొదటిసారి చూస్తున్నాడు. సంస్కృతి సంప్రదయాలు ఆచార వ్యవహారాలు అంటూ పూర్వం పద్ధతులనే పట్టుకుని వేలాడుతుండే గోపాల్ నేనా తను చూస్తున్నది. పై అధికారి కావడం వలన ఇతను చెప్పిందే శాసనమక్కడ. ప్రభుత్వ నియమాలకు తిలోదకాలివ్వడు. సమయపాలన లేనిదే ఒప్పుకోడు. ప్రభుత్వ నిధులను పక్కదారికి పోనివ్వడు. ఇన్ని చేస్తూ ఆఫీస్లో అందరిచేతా ‘చండశాసనుడు, రాక్షసుడు’ అంటూ సిబ్బంది చేత తిట్టుకునే గోపాల్ నేనా ఇతను. ఎంత మార్పు ఎంత మార్పు అనుకుంటూ ఆలోచనల్లో ఉన్న రామకృష్ణ గోపాల్ అరుపులకు బయటకోచ్చేశాడు.
“ఏరా పిలుస్తుంటే పలకవెం? ఆఫీస్ లో పడుకున్నట్లు ఇక్కడ కూడా నిద్ర పోతున్నావా ఏంటి?” అంటూ జోకులేశాడు గోపాల్. 
“మీ ఆఫీస్ కొచ్చేటప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. కాని వదిలేశాను. ఒకప్పుడు ఇది శిధిలావస్థకు చేరుకున్నట్లు ఉండేది కాని ఇప్పుడు కళకళలాడుతూ కొత్త రంగులతో మెరుస్తూ కన్పిస్తుంది. చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం. అలంకరణ సామాగ్రి. పూల మొక్కలతో ఆహ్లాద వాతావరణం. వ్యాన్ లకు ప్రత్యేకమైన చోటు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉద్యానవనంలా ఉందంటే నీవు ఎంతలా మార్పు చేశావో. వీళ్లోచ్చి థాంక్స్ చెప్ప్తుంటే ఇదంతా నీ పనే అన్పిస్తుంది. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నువ్వు తిరస్కరించడం అంతా ఏంటిరా? బిచ్చగాళ్ళు అంటున్నావ్. వాళ్ళతో కలిసి ఏమి ప్లాన్ చేశావ్? నాకంతా అయోమయంగానూ, ఆశ్చర్యంగాను ఉంది... చెప్పరా!” అంటూ ఒక ప్రశ్నాపత్రాన్నే గోపాల్ ముందుంచి జవాబు కోసం చూస్తున్నాడు రామకృష్ణ.
“ఒకప్పుడు వీళ్ళు బిచ్చగాళ్ళు అన్న మాట వాస్తవమే! కాని ఇకనుంచి వారికీ ట్యాగ్ లైన్ ఉండదు. వాళ్ళూ జనజీవన స్రవంతిలో భాగమే! జీవితంపై ఉన్నతమైన ఆలోచనలున్నా, పరిస్థితులు అనుకూలించక బిచ్చగాళ్ళుగా మారిన వాళ్ళ జీవితం ఇప్పుడు మళ్ళీ చిగురించింది. వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళే నిలబడి సంపాదించుకుంటున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది రామ” తృప్తిగా సమాధానమిచ్చాడు గోపాల్. 
“వేరీ గుడ్! వాళ్ళలా మారడానికి నువ్వే కారణమంటున్నారు. ఏం చేశావ్?” అసలు విషయం తెలుసుకోవడానికి కుతూహల పడిపోతున్నాడు రామకృష్ణ.
“పెద్దగా నేను చేసిందేం లేదు. ఓ చిన్న ఉపాయంతో ఉత్ప్రేరకంగా పనిచేశాను. ఒక ఉపాయం జీవితాన్ని మారుస్తుందంటారు కదా అది నిజమేననిపిస్తుంది - వీళ్ళను చూసినప్పుడల్లా. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని ఆనందంతో వచ్చారు. అందుకే ఈ పొగడ్తలు” చెప్పాడు గోపాల్. 
“ఏంటి గోపి! ఆ ఉపాయం గురించి చెప్పమంటే సోదంతా చెప్తావెందుకు? నువ్వేం చేశావో చెప్పు” అన్నాడు రామకృష్ణ.
“ఓకే...ఓకే... చిరాకు పడకు. ఏం లేదురా. చాలామంది అవసరం లేని పాత బట్టలను బయట పారేస్తుంటారు కదా వాటిని సేకరించి వీళ్ళకు పంచిపెట్టాను అంతే సింపుల్” అన్నాడు గోపాల్.
“చాలా ఆశ్చర్యంగా ఉందే! పాత బట్టలను పంచి పెట్టినంత మాత్రానికే మారిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారంటే ఎలా నమ్మాలి?” అన్నాడు రామకృష్ణ. 
“నమ్మాలి రా. వాళ్ళను చూసి కూడా నమ్మకపోతే ఎలా?” ప్రశ్నించాడు గోపాల్. 
“వింతలూ విచిత్రాలు చందమామ కథల్లోనే కాని మనిషి జీవితాల్లో కాదు. అసలేం చేశావో క్లియర్ గా చెప్పు.... అప్పుడు నమ్ముతా” అన్నాడు రామకృష్ణ. బంట్రోతు తెచ్చిన కాఫీ ని త్రాగుతూ అలా బయటకు వచ్చారు చెట్టు కిందకి.
“ఎందుకంత ఆశ్చర్యం రామ. చాలా సింపుల్ విషయం. రోజూ ఆఫీస్ నుండి ఇంటికెళ్ళే దారిలో, అదే కల్పన థియేటర్ సెంటర్ తెలుసుగా అక్కడ ఒక బ్రిడ్జి ఉంది కదా! బ్రిడ్జి పైన పక్కనే ఫుట్ పాత్ పైన చలికి వణుకుతూ చిరిగినా బట్టలతో చాలామంది చూస్తున్నారు. మనస్సుకు చాల బాధేస్తుంది. ఏం చేయలేక పోతున్నామనే బాధ, ఏమీ చేయలేమా అనే ప్రశ్నలు రెండూ నన్ను విపరీతంగా బాధించేవి. దేశంలో ధనవంతులు ఎంతోమంది ఉన్నా, చేయగలిగే సామర్ధ్యమున్న వ్యక్తులున్నా నిస్సహాయుల్ని ఆదుకోవడం లేదనే ఆలోచనలతో మతి చేడిపోయేది. రోజూ వాళ్ళు నా ఆలోచనలనుండి బయటకెళ్ళేవారు కాదు. నన్ను చూసి రమణి బాధపడేది. తను నాతో ఒకరోజు చెప్పింది ‘రోజూ ఇలా డిస్కషన్స్ పెట్టే బదులు ఏదన్నా సాయం చేయొచ్చు కదా! ఎవరో చేయాలని చూడడమెందుకు? మీరే చేయండి. సాయమంటే ఏదైనా కావొచ్చు. డబ్బిస్తే తిని తగలేస్తారు. వాళ్ళలో మార్పు వచ్చేలా చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుంది.  ఏమన్నా పాత బట్టలు ఇవ్వండి. చలికి వణుకుతున్నారు కదా అవైతే కొంచెం అడ్డుగా ఉంటాయి వాళ్లకి’ అంది. ఆ మాటలు నా ఆలోచనలను పాదరసంలా పరిగెత్తించాయి. నావి పాత బట్టలు ఓ ఇద్దరికీ ఇచ్చాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించేసరికి నాకు సంతృప్తిగా అనిపించింది. ఒకరోజు ఒకామె పాత బట్టల మూటను చెత్తకుండీలో వేయడం గమనించాను. మాకు పని కల్పిస్తున్న ఆమెను చూశాక మొదట అసహనం వచ్చినా తనే నాకో దారి చూపించిందని అర్ధం చేసుకున్నాను. పాతబట్టలను అడిగి తీసుకుని వీళ్ళకు పంపిణీ చేయడం మొదలెట్టాను. అది విజయవంతం అయింది. ఇదీ సంగతి! ఏమంటావ్? నమ్ముతావా?” ముగించాడు గోపాల్.
“వెరీ గుడ్ గోపి! అభినందించకుండా ఉండలేను. వాళ్లకేవో దారి చూపించావ్ అంటున్నారు, అవకాశం ఇచ్చావంటున్నారు. ఏం చేశావ్?” అభినందించి అడిగాడు రామకృష్ణ. 
“స్పోన్సర్స్ సాయంతో ఒక చిన్న బండిని కొన్నా. పాత బట్టలు ఎవరిదగ్గరనైనా ఉంటె బయట పారెయ్యకుండా మున్సిపల్ ఆఫీస్ కు ఫోన్ చేస్తే ఇంటికొచ్చి తీసుకెళ్తామని, అలా చేసిన వాళ్లకు కొంత రాయితీ ఇస్తామని చెప్పాను. అదేలే – రోజూ ఇంటికొచ్చి చెత్తను తీసుకేళ్తునందుకు కొంత మొత్తం కట్టాలిగా... దాంట్లో రాయితీ ఇస్తామన్నాను. అనూహ్య స్పందనొచ్చింది. అన్న మాట ప్రకారం రాయితీ ఇచ్చేసరికి ప్రజల్లో మాపై నమ్మకం కుదిరింది” చెప్పాడు గోపాల్. 
“గవర్నమెంట్ రూల్ కాకుండా నీ సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటావ్? రాయితీ ఇస్తే గవర్నమెంట్కు మీ డిపార్టుమెంటు కట్టాల్సిన డబ్బు ఎక్కడినుంచి తెస్తావ్?” అనుమానమంగా అడిగాడు రామకృష్ణ.
“మంచి ప్రశ్న! నీకు తెలియంది ఏముంది. ఆ సొమ్మంతా గవర్నమెంట్కు వెళ్తుందనే నువ్వు అనుకుంటున్నావా? ఎవరేరో జేబుల్లోకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్కు కట్టల్సింది రు.100 అయితే దానిపైనే వసూలు చేస్తూ వచ్చారు అంతకు ముందు అధికారులు. వాళ్ళపై ఆరోపణలు మోపకూడదు. అందుకే 100 పైన ఉన్న డబ్బులను రాయితీగా ఇచ్చాను. దీని గురించి ఎవరూ ప్రశ్నించరు. ప్రశ్నించి పీకలమీద దాకా తెచ్చుకోరు. దొంగ సొమ్ము కదా!” అన్నాడు గోపాల్. రామకృష్ణ ఏమీ మాట్లాడలేదు ఆ సమాధానానికి. 
ప్రకృతి చిరు అల్లరులకు  చెట్లు నృత్యాలు చేస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తు౦టే చూస్తూ కూర్చున్నారు. శీతాకాలం కావడంతో వాతావరణమంతా మార్పులు చేసుకుని చల్లబడే ఉంది. అందుకే ఎక్కువ సేపు చెట్టు కిందనే కూర్చోలేకపోయారు. ఎన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నా రామకృష్ణకు మాత్రం గోపాల్ చేసే పని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనస్సు ఆరాటపడుతుంది. అందుకే టాపిక్ ను మార్చేశాడు. 
“బండిని కొన్నావ్. ఆఫీస్ వాళ్ళను నీ పర్సనల్ పనికి వాడడం తప్పు కదరా?” అడిగాడు రామకృష్ణ.
“దానికోసం ఆఫీస్ వాళ్ళను వాడుతున్నానని ఎవరు చెప్పారు! ఇందాక చూశావ్ కదా వెంకటాద్రి ముఠాను. అలాంటి వాళ్ళే ఈ పనిని మొత్తం చూసుకునేది. డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు బండిని నడిపితే ఒకరో ఇద్దరో బట్టలను సేకరించి తెస్తారు. దాని కోసం నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటి హాల్ ను అడిగి తీసుకుని వాడుతున్నాం. బిచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళే అందించడం వలన ఆనోటా ఈనోటా త్వరగా ప్రాచుర్యం పొందింది” అన్నాడు గోపాల్. 
“మరి వాళ్లకు జీతాల సంగతి?” అడిగాడు రామకృష్ణ. 
“ప్రతి డిపార్టుమెంటు లో ఖాళీగా ఎంతోకొంత నిధులు మిగిలిపోతాయి. వాటిని వెనక్కి పంపించే బదులు ఇలా ఉపయోగిస్తే పుణ్యం కూడా. మారాలనే ఆలోచన వచ్చినోళ్ళు స్వయంగా వచ్చి ఏదైనా పని కల్పించమని అడగడంతో రోడ్డు మీద మొక్కలకు నీళ్ళు పెట్టే వాళ్లకు సహాయంగా నియమించాను” చెప్పాడు గోపాల్.
“మందు, సిగరెట్ అలవాటు ఉన్నోళ్ళు బంధువుల పోరు పడలేక మానేస్తానని వారం రోజులు మడి కట్టుకొని కూర్చున్నా మారలేక మళ్ళీ మామూలు జీవితానికే అంకితమవుతున్న రోజులివి. బిక్షాటనకు అలవాటు పడి, అదో వ్యాపారంలా చూసేవాడు ఎలా మారిపోతాడని నమ్మావ్? మళ్ళీ అడుక్కోవడానికే వెళ్లిపోరని ఏంటి గ్యారంటీ?” విలువైన ప్రశ్నను సంధించాడు రామకృష్ణ. తన ప్రశ్నకు తిరుగే లేదనుకున్నాడు. సమాజంలో ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకున్న వాళ్ళు ఇలా ఆలోచించడంలో తప్పులేదు. గోపాల్ కాసేపు మాట్లాడలేదు. 
“నమ్మకమేరా జీవితం. జీవితంలో బాగా దెబ్బతిన్న వాళ్ళే, జీవితం విలువ తెలిసిన వాళ్ళే మార్పుకు ముందుకొస్తారు. నువ్వన్నదీ నిజమే! అదో వ్యాపారంలా చూసేవాడు మారనే మారడు. మా దగ్గరకు అసలు రాడు. అలా వచ్చాడంటే వాడో పరిపూర్ణ మనిషే. పరిస్థితులు అనుకూలించకే వాళ్ళలా మారిపోతున్నారు కాని వాళ్ళకి నచ్చి కాదు. ఉమ్మడి కుటుంబాలు దెబ్బతినడం కూడా ఓ కారణమనుకోవచ్చు. కుంభకోణాలు చేసి దేశాన్ని దోచేస్తున్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళదంత మోసం కాదులే” సరైన సమాధానాన్ని ఇచ్చాడు గోపాల్.
“వాళ్ళకీ వీళ్ళకీ పోల్చుతావెందుకు?” అన్నాడు రామకృష్ణ. 
“పోల్చుకున్నప్పుడే తేడాలు తెలిసేవి. ఒకవేళ మోసం చేసినా మళ్ళీ బిక్షాటనకే పరిమితమై పోతారు. ఆ భయం ఉంది కాబట్టే బుద్ధిగా చేసుకుంటున్నారు. మూడు పూటలా తృప్తిగా తింటున్నారు” గర్వంగా చెప్పాడు గోపాల్. 
“తింటున్నారు అనే సరికి గుర్తొచ్చింది. పదా ఏదన్నా తిందాం. లంచ్ టైం కూడా అయ్యింది కదా, పదా వెళ్దాం” అన్నాడు గోపాల్. ఇద్దరూ లంచ్ చేశారు.

****

“నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తుంది కదా గవర్నమెంట్. అలా ఖాళీగా ఉన్న వాటిల్లో వీళ్ళను పెట్టడం గురించి మీడియా కు తెలిసిందనుకో రూల్స్ నీకు నచ్చినట్లు మార్చేస్తున్నావని గొడవ చేస్తారేమో. అది నీ ఉద్యోగానికే ఎసరు పెట్టవచ్చు కదా?” ముందు జాగ్రత్త కోసం అడిగాడు రామకృష్ణ.
“దీని గురించి ముందే ఊహించాను. అందుకే ముందుగా కలెక్టర్ గారిని కలిసి విషయం చెప్పా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు భర్తీ చేస్తారు. అంత వరకు వీళ్ళు ఉంటారు. తర్వాత మరో మార్గం వెతుకుతాం. గవర్నమెంట్ ఎప్పుడు ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తుందిరా! అప్పుడు చూద్దాంలే. అయినా వీళ్ళు మొక్కలకు నీళ్ళు పెట్టడం, రోడ్లు ఊడ్చడం వంటివే కదా. మీడియాకు తెలిసి పెద్ద గోడవై పై-అధికారులకు చేరుకుంటే ఇక్కడ జరిగిందంతా తెలుస్కుంటే ఇంకా గొప్ప పేరు వస్తుంది. అందరికీ తెలుస్తుంది మీడియా పుణ్యామాని. మంచి పనికి నమ్మకం దొరకడం కొంచెం ఆలస్యమైనా అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని నా అభిప్రాయం” సూత్రపాయంగా చెప్పాడు గోపాల్. 
“ఇంత మాటకారికి ఎప్పుడయ్యావ్ గోపి! చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను చూస్తుంటే. ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, వాటికి తగ్గ సమాధానాలు అన్నీ ఎలా సాధ్యమైంది? ఎప్పుడూ అభ్యుదయ భావాలంటూ ముడుచుకుని కూర్చునే నువ్వు ఈ రోజిలా.., గ్రేట్... కవితలంటూ పుస్తకాలు పట్టుకుని సమ్మేళనాల చుట్టూ తిరిగే నీలో ఒక ఆలోచన, దాని ఆచరణ చూస్తుంటే ముచ్చటేస్తుంది రా గోపి. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించావ్. మార్పు అనివార్యమని తెలిసేలా చేసావ్” అభినందనలు తెలుపుతూ అన్నాడు రామకృష్ణ. 
“ఆవేశాలతో సహవాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశబ్డమే అతని కవిత్వమవుతుంది. నేనే సమ్మేళనానికి వెళ్ళినా ఒకటే ఊకదంపుడు మాటలు విన్పిస్తుంటాయి. గొప్ప కవిత్వమైతే రాస్తారు కాని గొప్ప పనంటూ ఒక్కటీ చేయరు. సమస్యలను వస్తువులుగా తీసుకొని కవిత్వం రాసి బహుమతులను పొందుతారు, సన్మానాలు చేయించుకుంటారు కాని సమస్యలను తీర్చే మార్గాలవైపు మాత్రం అడుగులేయ్యరు. మనం సాయం చేశాకనే ఇంకొకరి నుంచి సాయాన్ని ఆశించాలన్నదే నా సిద్ధాంతం. దాన్ని ఆచరించి ముందగుగేయ్యమని రమణి ధైర్యాన్నివ్వడంతో సాగిపోయాను. ఎదుటివాడి తృప్తి మనకి మరింత సంతృప్తినిస్తుంది. ఈ చిన్న ఉపాయం వలన వీళ్ళిలా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రామ” అంటూ ఆనందపడిపోయాడు గోపాల్. 
“నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుందిలే నువ్వెంత సంతోషంగా ఉన్నావో. ఎట్టకేలకు జీవితాన్ని మనసారా ఆస్వాదిస్తున్నావు. నాకది కుదరదు. బిసినెస్ అంటూ తీరిక లేకుండా తిరగడమే. కంపెని వాళ్లకు నా మీదనే బాగా గురి. అందుకే పెద్ద పెద్ద విషయాల్లో నన్నే ఉంచుతారు. ఏదో వీలు చూసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచయం చేశావ్. నెక్స్ట్ ఏంటి?” అడిగాడు రామకృష్ణ. 
“చేసేది మంచి పనైతే మనం మొదలుపెట్టిన క్షణమే మంచి ముహూర్తం అవుతుంది. దానికి ప్రత్యేకించి మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం అంటూ ఏమీ ఉండదు. అందుకే విజయం సాధించాననుకుంటున్నా. ఇంకా చేయాలి. ఈ గ్రామంలోనే కాకుండా మెల్లిమెల్లిగా విస్తృత పరచాలని ఉంది. బిచ్చగాళ్ళను రూపుమాపాలనుకోవడం అత్యాసే అవుతుందని తెలుసు. కానీ నాదైన నా దేశంలో నా చేతనైనంతమేర బిచ్చగాళ్ళను తగ్గించాలన్నదే అభిమతం. అప్పుడే ఆత్మతృప్తిగా ఉంటుందిరా రామ..!” గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు గోపాల్. 
“బాగానే ఉంది కాని., మొత్తం అంటే కష్టమైన పనేమో! అయినా కష్టం అనుకుంటే ఇంతవరకూ వచ్చేవాడివి కాదులే. ప్రయత్నించు. ఈ సేవను పెద్ద సంకల్పంగా మార్చుకో మరి” బోధించాడు రామకృష్ణ.
“నువ్వన్నట్లు బిక్షాటనను కూడా వ్యాపారంగా మార్చేసిన వాళ్ళను కూడా మార్చాలని ఉంది రామ... ఓపికున్నా చేసుకోకుండా అడుక్కోవడానికే అలవాటు పడిపోయిన వీళ్ళు ఎప్పుడు మారతారోరని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఉపాయంతో వచ్చినా, సాయంతో వచ్చినా వాటిని స్వీకరించి అవలంభించడానికి నేనెప్పుడూ సిద్ధమే! చూద్దాం నేను వెళ్ళేలోపు ఎంతమందిని ప్రభావితం చేయగలనో” అంటూ ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు గోపాల్. 
“సరే గోపి! నేను బయలుదేరుతాను. ఇప్పటికే బోల్డంత సమయం అయిపొయింది. మాటల్లో పడి నీ సమయాన్ని కూడా వృధా చేశాను. ఇక ఉంటా మరి. రమణిని అడిగానని చెప్పు. మళ్ళీ వీలు చూసుకొని కలుద్దాం” అంటూ కాంటీన్ నుండి బయలుదేరాడు రామకృష్ణ. 
“ఈ రోజు నువ్వు నా అతిధి. అందరినీ అడిగానని చెప్పు. మళ్ళీ కలుద్దాం” అంటూ చేతులూపుతూ రామకృష్ణ ను సాగనంపి తన చాంబర్ లోకి వెళ్లి ఫైల్స్ పని పడుతున్నాడు గోపాల్.
****

“సర్! మీకో లెటర్ వచ్చింది. ఇదుగోండి” అంటూ గోపాల్ చేతికందించాడు బంట్రోతు. 
“సరే! నేను చూస్తానులే నువ్వెళ్ళు” అంటూ చేతులోకి తీసుకున్నాడు గోపాల్. లెటర్ కొంచెం బరురువుగా అనిపించేసరికి అనుమానమొచ్చి వెంటనే తెరిచి చూశాడు. అవాక్కవ్వడం గోపాల్ వంతైంది. 
‘ప్రియమైన గోపాల్ కు ప్రేమతో వ్రాయునది ఏమనగా... ఈ విషయాన్ని ఫోన్ లో కూడా చెప్పొచ్చు. అక్కడ ఇద్దరి మాటలు ఉంటాయి. ఆలోచించే సమయం ఉండదు. ప్రేమా ఉండదు. ఆత్మ లోపిస్తుంది. అదే ఉత్తరమైతే భాషను, భావాన్ని బాగా దగ్గర చేస్తుందని రాస్తున్నా. నీ దగ్గరనుండి వచ్చిన దగ్గర్నుంచి నా మనస్సు మనస్సులో లేదు. ఒకటే ఆలోచనలు. నీ మాటలు, చేతలు బాగా ప్రభావితం చేశాయి. నాకూ ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే ఇలా ఇప్పుడు నీ ముందు... ఇందులో రెండు చెక్ లు ఉన్నాయి చూడు – ఒకటి నా నెల జీతం, రెండోది మా  కంపని తరుపున నేను పోరాడి సాధించినది. ఇవి రెండూ ఎంతో కొంత నీ కార్యక్రమానికి ఉపయోగపడుతుందని పంపిస్తున్నా. కాదనకుండా తీసుకొని ఉపయోగించు. తెలిసినోళ్ళను కూడా నీవు చేసే స్వచ్చంద కార్యక్రమం గురించి చెప్పి సాయమందించమని అడిగాను. వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయం తీసుకున్నారు.
విషయాన్ని బట్టే ప్రాధాన్యత ఉంటుందని మళ్ళీ నువ్వు నిరూపించావ్. వ్యక్తీ ఎలాంటి వాడనేది అతని ఆలోచన, ఆచరణలే చెప్తాయి. నీకూ అలాంటి గుర్తింపే వచ్చింది. నీళ్ళల్లో పడి కొట్టుకుంటున్న చీమను చూసి జాలిపడడం మానేసి దానికో ఆకును ఆసరాగా ఇస్తే చాలు ప్రత్యేకించి ఇంకేం చేయాల్సిన పని లేదు. దాని దారి అది చూసుకుంటుంది. దూరం నడవాలంటే ముందు ఒక అడుగుతోనే ప్రారంభించాలి కదా! నువ్వదే చేశావ్. అందుకు ధన్యవాదములు.
నిజాలు నిర్భయంగా మాట్లాడేదెంతమంది? సమస్యలను పరిష్కరించేది ఎవరు? ఎంతోమంది ఎన్నో కలలు కంటారు. కోరికలుంటాయి. కాని వాటిని అమలుపరిచే దారే తెలియదు, ధైర్యం చేయడానికి భయపడతారు. వెనకడుగు వేస్తారు. ఈ మధ్యకాలంలో ధనవంతులు ఎన్నో బట్టలను రోడ్డుపాలు చేస్తున్నారు. ప్యాషన్ ప్యాషన్ అంటూ ఈ రోజు కట్టిన గుడ్డ రేపు కట్టడం లేదు. రోజుకో కొత్త రకం దుస్తుల్నే వేసుకుంటున్నారు. వాడుకోవడం, పారెయ్యడం మాత్రమే తెలుసు. పబ్ లవెంట తిరిగే సమయం ఉంటుంది కాని ఇలా బిచ్చగాళ్ళకు కాని నిరాశ్రాయులకు కాని ఇచ్చే సమయం ఉండదు. కాని వాళ్ళు చేయలేని పనిని నువ్వు చేసి చూపించావ్. అలా ఎక్కువుగా చేయడం మామూలు విషయం కాదని నిరూపించావ్. ఇదిబృహత్తర కార్యం అని నేనంటున్నా. కాకినాడకే కాకుండా నలుదిక్కులకూ వ్యాపించాలని మనసారా కోరుకుంటున్నాను. నా మనస్థత్వాన్ని మార్చిన నీ ఆలోచనకు మనస్పూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ స్నేహితుడని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది. నువ్వీలాగే ముందుకు సాగిపోయి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలి.
కొంతమంది ధనవంతుల ఇళ్ళల్లో పనిచేయడానికి నమ్మకస్తులు దొరకడం లేదని విన్నాను. వాళ్ళు వంటింట్లో పనే చేసుకోలేకపోతున్నారు, పెరట్లో పని కూడా చేసుకోవడం ఇబ్బందిగా ఉందని విన్నాను. నమ్మకస్తులను, పని తెలిసిన వాళ్ళను చూసి పని కల్పిస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. వాళ్ళకూ పని దొరుకుతుంది. నా ఈ చిన్న సలహా గురించి ఒకసారి ఆలోచించు. ఇంకా....ఇంకా... త్వరలో స్పాన్సర్స్ ను నీ వద్దకు పంపిస్తానని మాటిస్తున్నాను. ఇక శెలవు..!
ఇట్లు 
మీ రామకృష్ణ”
లెటర్ మొత్తం చదవడం పూర్తయింది. పొగడ్త మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది. కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది. గోపాల్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు మేఘాల్లా కమ్ముకున్నాయి. మొదటిసారి స్నేహితులనుండి సాయం అందింది. రెండు చెక్ లను ప్రేమగా చూశాడు. తన ప్రచారానికి ఉత్ప్రేరకంలా పనిచేసి ఆయుధాలవి..!
........ సమాప్తం …….

5 comments:

  1. కథని నడిపిన తీరు చాలా బాగుంది కృష్ణ...మంచి సందేశాన్ని అందించావు...నిజంగా ఇలా బట్టలు సేకరించే వాళ్ళు వస్తే బాగుండు...ఎన్ని బట్టలో ..తీసుకెళ్ళి ఇవ్వాలంటే కుదరదు ఎలా అనుకుంటున్న వాళ్ళకి చక్కని అవకాసం చూపించావు...అభినందనలు కృష్ణ....

    ReplyDelete
  2. ధన్యవాదములమ్మా..!

    ReplyDelete
  3. కథాంశం సామాజిక పరంగా ప్రయోజనకరంగా వుంది. కథనం విషయంలో శ్రధ్ధ తీసుకోవలసిన అవసరం వుంది. సాగతీత ఈ తరం పాఠకులకు నచ్చదు.

    ReplyDelete
    Replies
    1. కనువిప్పు కలిగించే సూచనను చేసిన పూజ్యులకు ధన్యవాదములు.! మీ సూచనను తప్పక పాటిస్తాను.

      Delete
    2. సహృదయంతో స్వీకరించినందుకు కృతజ్ఞతలు.

      Delete

Pages