ఈ దారి మనసైనది -2 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -2
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది.)
 సెకండ్ ఇయర్ లో....
సుప్రభాత వేళ ......

మహా సముద్రంలో..... కెరటాలు పైకి లేచి తీరాన్ని తాకుతుంటే మంచులో తడిసిన ప్రకృతి - ప్రపంచాన్ని వణికిస్తోంది.

ఏపుగా పెరిగి కాస్త పక్కకి వంగిన గులాబి చెట్టు కొమ్మ కిటికీ గ్రిల్ ని  తాకి తన ఉనికిని చాటుతుంటే, దాని పూల పరిమళం పరిసరాలను తాదాత్మ్యంలో ముంచుతోంది. ఆ నిశ్శబ్దంలో.... ఆకులపై నిలిచిన మంచుబిందువులు కదిలితే క్రింద పడేలా వున్నాయి.

నీటి చుక్క ముత్యం చిప్పలో పడితే ముత్యమవుతుంది.

సముద్రంలో పడితే ఉప్పనీరు అవుతుంది.

కనురెప్పల క్రింద జారితే కన్నీరవుతుంది.

మరి గుండె క్రింద చేరితే ....

దీక్షిత తన మొబైల్ కి  మెసేజ్ వచ్చిన శబ్దానికి రోజూ లాగే తన హృదయంలో తరంగిణి కదిలినట్లై... కళ్లు విప్పింది.

వెంటనే తన రెండు అర చేతుల్ని కళ్ల కెదురుగా పెట్టుకొని 'కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థితే గౌరి" అని మనసులో అనుకుంటూ అరచేతుల్ని కళ్లకి అద్దుకొనికుడిచేతిని దిండు  కిందకిపోనిచ్చి, మొబైల్ తీసి మెసేజ్ చూసుకొంది.

"కుహూకుహూ రాగాల కోకిలమ్మను కోరాను. నా చెలికి నీ కమ్మని స్వరంతో సుప్రభాతాన్ని అందించమని... తిరిగొచ్చి "షి ఈజ్ స్లీపింగ్ అంది" అని పంపిన అనురాగ్ మెసేజ్ చూడగానే కప్పుకున్న బ్లాంకెట్ను పూర్తిగా తొలిగించి బెడ్ దిగింది.

మనసులో నిజమైన అనుభూతి ఉంటే తప్పకుండా అది అవతలవారికి చేరుతుందంటారు. తనింకా నిద్రలేవకపోవటం అతనికి తెలిసింది కూడా అలాంటి భావన ద్వారానే. ప్రతి అద్భుతం భావన ద్వారానే... పుడుతుంది కాబోలు!

మనసుకి స్పందన, శరీరం మీద శ్రద్ద, ఒక మనిషి గురించి ఆలోచనలు, ప్రతిక్షణం అద్భుతంగా అన్పించటం.... ఇదంతా తనలోఅతని ద్వారానే జరుగుతోంది. తను పుట్టాక ఎన్నో రకాలుగా తన మనసు స్పందించింది. కానీ.... ఆ స్పందనలలో ఇలాంటి అనుభూతి లేదు.

అతను పంపే ప్రతి మెస్సేజ్ ఆర్ద్రత  నిండిన భావంలా, వెన్నెల అల్లిన మువ్వల సవ్వడిలా, మౌనరాగరంజనిలా చెవులకి సోకి హృదయమంతా అమృతం నింపిన అనుభవం కలుగుతుంది.

"నువ్వు పోగొట్టుకునే ఏ క్షణం నీకు తిరిగి రాదు దీక్షా ! ప్రకృతికే ప్రకృతిలా రససిద్ది పొందిన కళాకృతిలా వున్న నీరూపం నా మదిని మంచువర్షంలా తడిపేస్తుంటే, నీ మౌనమేమో నీకూ, నాకూ మధ్య నిశ్శబ్ద అగాధాలను సృష్టిస్తోంది. నువ్వలావుంటే నా చుట్టూ వున్న వెన్నెల నన్ను వెక్కిరిస్తోంది. కిటికీ అవతల సంపంగి అవహేళన చేస్తోంది. నీ కిది ధర్మమా ? " అంటూ ఒక రోజు అతను పంపిన మెసేజ్ చదివి ఏంచేయాలో తోచలేదు. 

ఒకటి, రెండు ... ఐదు.... పది.... ఇలా ఎన్ని నిముషాలు గడిచినా డ్రస్సింగ్ టేబుల్ ముందు అలాగే నిలబడివున్నది. మనుసులో.... భావాల ఉధృతికి  లోలోనే తట్టుకోలేని యుద్ధం జరుగుతుంటే, ఆ యుద్దానికి మనసును సంసిద్దం చేసుకోలేక పోతోంది.

ఎవరైనా మన ప్రమేయం లేకుండా బలవంతంగా మన మది తలుపుల్ని తోసుకొని తలపుల్లోకి జొరబడి అతి సున్నితమైన సూక్ష్మమైన కదలిక పుట్టించి....ఉరకలు వేసే ఉత్సాహాన్ని, అంబరాన్ని తాకే ఆనందాన్ని, అందిస్తుంటే..! మాటలకందని మధుర భావాల స్రవంతిలో తడిసిపోతూ భరించలేని ఉద్వేగాన్ని తట్టుకుంటూ తను ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతనే అని తెలిసినా..! అతని కళ్లలోకి చూస్తున్నప్పడు కలిగే అనిర్వచనీయమైన భావాన్ని చంపుకుంటూ.. ఇలా మౌనంగా వుండాలంటే ఎంత కష్టమో దీక్షితకి అనుభవంలోకి వచ్చింది.

అతను కన్పించిన ప్రతిసారినువ్వు నాకు ఎన్నోఏళ్ల పరిచయం' అన్నట్లు తన మనసులోతుల్లోకి చూస్తుంటే ముభావంగా, అభావంగా ఇంకా ఎన్నాళ్లిలా తప్పకు తిరగాలి? అన్నదే ఆమె ఆలోచన.

ప్రొఫెసర్లు గమనిస్తున్నా, సూడెంట్స్ తిరుగుతున్నా అతను తనవైపే చూస్తున్న భావన కలిగినప్పుడు కూసింత ఇబ్బందిగా, కాసింత విభ్రమగా, మరి కాస్త పులకింతగా మనసు తొలకరి మొలకలా మారుతోంది. ఎంతవద్దనుకున్నా... దీక్షిత మనసులో అలలగాలి సవ్వడిలా అలా అలా అనంతంగా అనురాగ్ రూపం మెదులుతుంటే .... చక, చక రెడీ అయి...ఎప్రాన్ వేసుకొని, స్టెతస్కోప్ పట్టుకొని హాస్టల్ నుండి బయట కొచ్చి కాలేజిలో అడుగు పెట్టింది.

ఆమె అలా అడుగు పెట్టగానే కాకతీయ మెడికల్ కాలేజి ప్రాంగణం తొలిపొద్దులా మెరిసినట్లైంది అనురాగ్ కి.

అమెను అలా చూస్తుంటే ... ఎన్నో ఏళ్లగా పారేసుకున్న జ్ఞాపకంలా ... నడచివస్తున్న నగిషీలు చెక్కిన శిల్పంలా ఎప్పటికప్పుడు కొత్తగా అన్పిస్తూ "హాయ్అన్నాడు .

దీక్షిత కూడా "హాయ్చెప్పి ల్యాబ్ వైపు నడిచింది.

అలా నడుస్తున్న దీక్షితకి తన సొంత ఊరైన పాకాలకి దగ్గర్లో వున్న అశోక్ నగర్ గుర్తొచ్చింది.

అది గుర్తురాగానే ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు తీగల్లా సాగి ఆమె కళ్ల ముందు మెదిలాయి.

ఆమెను - ఆమె తండ్రి సోమన్న పాకాల నుండి అశోక్ నగర్ తీసికెళ్ళి, ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చేర్పించి, దానికి రెండు కిలో మీటర్ల దూరంలో వుండే స్కూల్లో వదిలాడు. అందులో సీటు రావటానికి అతను చాలా కష్టపడ్డాడు. అప్పడు ఆమె ఐదో తరగతి.

నడవటం తేలికే కాని ఒంటరిగా నడవటం కష్టంగా వుంటుందన్న ఉద్దేశ్యంతో తనతోటి పిల్లలు రెడి అయ్యేంత వరకు ఆగి, వాళ్లతో కలిసి నడుచుకుంటూ వెళ్లమన్నాడు తండ్రి. దారిలో ఎక్కడా ఆగొద్దన్నాడు. దారి చూసి నడవమన్నాడు. చీకటి పడకముందే హాస్టల్కి చేరుకోమన్నాడు. తలవంచుకొని నడిస్తే వాహనాలు గుద్దేస్తాయన్నాడు. తోటి పిల్లలతో కలిసి మెలిసి స్నేహంగా వుండమన్నాడు.

'సరేఅని దీక్షిత తల వూపినప్పడు తెల్ల రిబ్బన్లతో పైకి కట్టిన రెండు జడలు మడిచిన నల్ల తాచులా కదిలాయి. సోమన్న - కూతుర్ని వదిలిపోవాలంటే….పోలేక కళ్లనీళ్లుపెట్టుకున్నాడు. తండ్రి కన్నీళ్లు చూడగానే ఇంటి దగ్గర వున్న తల్లి గుర్తోచ్చింది దీక్షితకి. ప్రాద్దున బస్ ఎక్కించటానికి తనను భుజాల మీద ఎక్కించుకొని వస్తున్న తండ్రి పక్కన నడుస్తూ తన కాళ్లను పట్టుకొని నిమురుతూనే బస్ వరకు వచ్చి సాగనంపి వెళ్ళింది. తన తల్లిదండ్రులకి తనంటే ఎంత ప్రాణం !!

" పసి బిడ్డను తీసికెళ్ళి బయట ఊర్లోవుంచి చదివించక పోతేనేం రామలక్ష్మీ ?ఏదో ఇంటి పట్టునవుండి చదివిన ఆ నాలుగు తరగతులు చాలవా? ఇంకా చదివి ఉద్యోగాలు చేసి ఊరేమైనా ఏలాలా ? చక్కగా ఇంటిపని, వంటపని పొలం పని నేర్చుకొని ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెడితే సరిపోయేదిగా " అంటూ చుట్టు పక్కల వాళ్లు అనే మాటల్ని తల్లి ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు.

"ఇప్పడేదో చిన్న చదువేకదా అని చదివిస్తున్నావులే సోమన్నా. రేప్పొద్దున వాళ్లకి చదువువిూద మమకారం పెరిగి, పెద్ద చదువులు చదువుతామంటే నీ గతేమవుతుంది? నీ తలకు నువ్వే కొరివిపెట్టుకున్నట్లు కాదా? నా మాటవిని నీబిడ్డను నాలుగోతరగతిలోనే చదువు మాన్పించి ఇంట్లో పెట్టుకో. నువ్వలా చూస్తుండగానే పొలం పనులకి అక్కరకొస్తుంది. ఎన్ని రోజులని ఒక్కడివే కష్టపడతావు? కొడుకును ఎలాగూ చదువుకోసమే వదిలి పెట్టావు. అంతవరకు చాలనుకో " అన్నారు తనతో కలిసి పొలం పనులు చేసే మిత్రులు.

సోమన్నవినలేదు. అక్షర జ్ఞానం గొప్పది. చదువుకుంటే తన కూతురు ధైర్యంగా బ్రతకగలుగుతుంది. సమస్యలు ఎదురైప్పడు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచించగలుగుతుంది.

చదువు అనేది ఎల్లప్పడు ఆరని దీపంలా తోడుంటుంది. దొంగలు పట్టుకెళ్లలేని సంపద చదువు ఒక్కటే. చదువులేని వాళ్ల జీవితం తెడ్డులేని పడవ. అందుకు ఉదాహరణ తన జీవితమేనని నమ్మిన సోమన్న దృష్టంతా దీక్షిత చదువు మీదనే నిలిచింది. కానీ చేతిలో తగినంత డబ్బులేదు. దీక్షితను ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చేర్పించటానికి కారణం కూడా అదే.

స్కూలు నుండి తనుండే హాస్టల్కి రోజూ రెండు కిలో మీటర్లు నడిచి రావటం, పోవడం.... స్కూలు నుండి వచ్చాక బోరింగ్ పంపు క్రింద కూర్చుని బట్టలు ఉతుక్కోవడం దీక్షితకి కష్టంగా వుంది.

ప్రభుత్వం సరైన సరుకుల్ని ప్రొవైడ్ చేసినా, ఆ సరుకులు మధ్యవర్తులు చేతులు మారడంతో ఒక్క రోజు కూడా ఆ తిండి తినలేకపోతోంది. వర్కర్స్ నిర్లక్ష్యం వల్ల అన్నంలో, కూరగాయలు ముక్కల్లో పురుగులొస్తూ, ఏ కూర చూసినా నీళ్ళలా అన్పినూ, పెట్టుకున్న అన్నం మొత్తం వదిలేస్తోంది.

పేద విద్యార్ధులైన వాళ్ళకి ప్రభుత్వం నెల నెలా ఇవ్వాల్సిన సోపుల్ని బట్టల్ని యివ్వకుండా ప్రతిరోజు ఇవ్వాల్సిన పాలు, బిస్మెట్స్ ఇవ్వకుండా పిల్లల్ని దోచుకుంటున్నారు.

'క్యూ' పద్ధతి పాటించకుండా బాత్రూంల దగ్గర, నీళ్ల దగ్గర, తిండి తినే దగ్గర, ప్రతి రోజు గొడవ. కొంత మంది లీడర్లను నియమించినా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంకా పిల్లలు చెప్పకోలేని ఇబ్బందులు కూడా కొన్ని వున్నాయి.

హాస్టల్ నీటిగా వుండేది కాదు. కలెక్టర్ లాంటి పెద్దపెద్దవాళ్ళు  వచ్చినప్పడు శుబ్రంగా వుంచేవాళ్ళు, తినటానికి కూడా అన్ని పెట్టేవాళ్ళు... వాళ్లు వెళ్లేంత వరకు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్న వాళ్లలా అప్రమత్తంగా  ఉండే ఆ వార్డెన్లను, వర్కర్స్ను చూస్తుంటే వింత మృగాల్లా అన్పిస్తుంటారు.

స్కూల్ నుండి నడుచుకుంటూ వస్తుంటే దీక్షిత కాలి చెప్పుతెగింది. దారిలో కొంత దూరం మట్టి రోడ్డు అయినందువల్ల ఎండకి మట్టి వేడిక్కి కాళ్లకి అంటుకుంటూ భగభగమండుతుంటే వచ్చే ఏడుపును ఆపుకుంటోంది. మండుతున్నా ఓర్చుకొని నడిచింది. కొంత దూరం వెళ్ళాక ఓర్చుకోలేక ఆ లేత బుగ్గలపై జారిన కన్నీటిపాయను నెమ్మదిగా తుడుచుకుంది దీక్షిత.

వాళ్ల ఊరిలో ఒకమ్మాయి తల్లిపురుడు పోసుకుంటూ హాస్పిటల్ వసతి లేక అదే ఊరిలో చనిపోవడం భయం కలిగించి, ఆ రాత్రంతా నిద్రపోకుండా మేల్కొంది దీక్షిత. మరుసటిరోజు యింకో అమ్మాయి తండ్రికి, పొలంలో పురుగుకుట్టి సిటీలో వుండే హాస్పిటల్కి తీసికెళ్లే లోపలే చనిపోయాడని తెలిసి అందరు ఏడుస్తుంటే తనుకూడా ఏడుస్తూ కూర్చొంది.

ఇలా ఎప్పడూ ఏదో ఒక సంఘటన దీక్షిత మనసుని కలచివేస్తుంటే తల్లిదండ్రులకి చెప్పకోవాలనిపించినా చెప్పకోలేక పోతోంది. ప్రాద్దున లేచినప్పటినుండి పొలంలో పనులు చేసుకుంటూ రెక్కాడితేనే డొక్కాడదన్నట్టుగా వుండే వాళ్లకి తన బాధల్ని చెప్పి, యింకాబాధ పెట్ట కూడదని గట్టిగా నిర్ణయించుకొంది.

ఈ మధ్యనైతే ఎప్పుడు చూసినా దీక్షిత కడుపులో పేగులు అర్ధాకలితో సన్నగా అరవటం ఎక్కువైంది. తినగలిగిన వయసులో సరైన తిండి లేకపోతే అలాగే వుంటుందని ఒకమ్మాయి తల్లి తన బిడ్డను కావలించుకొని కళ్ళుతుడుచుకోవడం చూసిన తర్వాత "ఇది ఆకలి బాధ" అని అర్థమైంది దీక్షితకి. ఆ హాస్టల్లో పిల్లలు వార్డెన్ ముందుకెళ్లి వాదించినా, ఎదిరించినా, ఏడ్చినా అది అరణ్య రోదనే.

ఈ బాధలతో పాటు, హోంసిక్ కూడా తోడై దీక్షిత చదువు సరిగ్గా సాగలేదు. అలాగే . ఎయిత్ క్లాస్ వరకు చదివింది.

ఎయిత్ క్లాస్ అయిన తర్వాత "సోషల్ వెల్ఫేర్  రెసిడెన్సియల్ స్కూల్లో" ఒక వేకెన్సీ వున్నట్లు స్కూల్ టీచర్ దానికి సంబందించిన పేపరు ఇచ్చింది. తన కళ్లను మరింత పెద్దవి చేసి మళ్లీ మళ్లీచూసింది దీక్షిత. ఇన్ని రోజులు తనుపడున్న కష్టాల నుండి విముక్తి కోసం ఎదురు చూస్తున్న ఆమెకి ఇది మంచి అవకాశమనిపించింది. ఆ పేపర్నిఅలాగే గుండెలకి హత్తుకొంది. ఆ సీటు తనకి వచ్చినట్లే ఊహించుకొంది. ఆమెలో ఇప్పడు ఆశ తప్ప నిరాశలేదు. ఎలాగైనా కష్టపడి సీటు సంపాయించాలన్న తపన తప్ప యింకో ఆలోచనలేదు.

కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్హామ్ రోజు తన అన్నయ్య మహదీర్ ను తోడుగా తీసికెళ్లి ఎగ్సామ్ రాసి వచ్చింది.

నయింత్ క్లాస్ ఎంట్రన్స్ లో దీక్షితకి మహబూబాబాద్ సోషల్  వెల్ఫేర్  రెసిడెన్సియల్ స్కూల్లో సీటొచ్చినట్లు ఇంటికి లెటరొచ్చింది.

ఆ లెటర్ని తీసుకొని మహధీర్ ని  వెంట బెట్టుకొని జాయినింగ్ కోసం స్కూల్ కెళ్ళింది దీక్షిత.

 అక్కడ.... బయట బ్రోకర్లు లంచంతీసుకొని, ఆ సీటుని వేరేవాళ్లకి యిద్దామన్నట్లుగా ప్రయత్నాలు జరగడంతో ....

నోట మాటరాని దానిలా దిగ్భ్రాంతి  చెందింది దీక్షిత.

చెల్లెలి వైపు నిస్సహాయంగా చూస్తూ - అటు, ఇటు తిరగడం తప్ప ఏమిచెయ్యలేక పోతున్నాడు మహధీర్.

మనస్సుకి మాటలకి వైరుధ్యం ఏర్పడి చచ్చిపోయిన వ్యక్తిత్వంతో చెలరేగిపోతూ, వాళ్లు చెప్పిందే వేదంలా వుండడంతో నిజం ప్రయాణం చేసేలోపలే అబద్దం ప్రపంచమంతా తిరిగినట్లుంది అక్కడి వాతావరణం.

"ఇలా జరిగిందేం అన్నయ్యా? ఇప్పడెలా? అంది దీక్షిత. మధ్యవర్తులు లోలోపల చేసే ఆ కంత్రీ రాజకీయాలను ఆ పసి గుండెలు తట్టుకోలేకపోతున్నాయి.

మాటలు రాని వాడిలా చెల్లినే చూస్తున్న మహధీర్ కి మతిపోతోంది. తనే స్వయంగా చెల్లిని తీసుకొచ్చి పరీక్ష  రాయించాడు.  రాసేంతవరకు బయటేవున్నాడు. ఆరోజు ఆమె పరీక్ష రాయలేదని, మీరు తెచ్చిన లెటరు చెల్లదని... ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్లమనివాళ్లు అంటుంటే తమ గోడు ఎవరికి చెప్పకోవాలో చెప్పినా ఎవరు ఆదుకుంటారో తెలియడంలేదు.

జారిపడ్డవాళ్ళ- వాళ్లను వాళ్లే లేపుకోవాలి. లేచి తిరిగి నడిస్తేనే గమ్యం దొరుకుతుంది. భవిష్యత్తులోని విపత్తును వూహించలేకపోయినా ఈ సీటు మాత్రం తప్పకుండా తనదే అన్న నమ్మకం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎవరికైనా ఆత్మ విశ్వాసం తిరుగులేని ఆయుధం. అది వుంటే అదిరోహించనిఎత్తులు లేవు. ఆమెలోని ఆత్మ విశ్వాసమే ఆమెకు అద్భుతమైన శక్తిని యిచ్చింది. అశోక్ నగర్ వెళ్లి వాళ్ల టీచర్ సహాయంతో.....

ఎంట్రన్స్ పరీక్ష రోజు ఇన్విజిలేటర్గా వచ్చిన లెక్చరర్స్ ని  ఆ స్కూల్లో అటెండర్స్ని గుర్తు పట్టి, ఇంకా ఆరోజు పరిచయమైన  తమ సీనియర్స్ అయిన పడవ తరగతి పిల్లల్ని ప్రిన్సిపల్ దగ్గరికి తీసికెళ్లి, ఆ రోజు తను పరీక్ష రాసినట్లు ప్రూవ్  చేసుకొంది. ఆధారాలు బలంగా వుండడంతో ప్రిన్సిపాల్ దీక్షితను తమ స్కూల్ అండ్ రెసిడెన్సియల్లోజాయిన్చేసుకున్నాడు.

ట్రంక్ బాక్స్, నోట్ బుక్స్, స్కూల్ డ్రస్, పి.టి డ్రెస్ ,షూస్, సాక్స్ యిచ్చి, క్లాసుకెళ్లి కూర్చోమన్నారు.

ఇప్పడు స్కూల్&రెసిడెన్స్ ఒకే చోట వున్నందువల్ల ఇన్నిరోజులు వున్న ఇబ్బందులేమి అక్కడలేవు దీక్షితకి. తన తండ్రి మాటల్ని ఆశయంగా, ఆదర్శంగా తీసుకొని ఒక ఆశయం వైపున నడవాలని దృఢసంకల్పం తీసుకొంది. ముందుగా తను ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోక పోయినా తన చుట్టూ వున్న పరిసరాలు ఆ లక్ష్యాన్ని నిర్దేశించి పెట్టాయి. దానికి ఉపాధ్యాయులు సహాయం పూర్తిగాతోడైంది.

టెన్త్  క్లాసులో ఆ స్కూల్లో దీక్షిత ఫస్ట్ వచ్చింది. మార్కులు 570 వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు కోరుకున్నట్టే దీక్షిత్ర తలిద్రండులు కూడా ఆమె డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని లోలోన ఆశపడూ ఒకరోజు ఆమెతో చెప్పారు. ఆమెను కూడా అవే ఆలోచనలు చుట్టు ముట్టాయి.

సొంత ఊరైనా పాకాల అంటే దీక్షితకి ప్రాణం. వేసవి సెలవుల్లో పాకాల వెళ్లి ఇంటి దగ్గరున్నదీక్షితకి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.

చెరువుకి దగ్గర్లోవుండే ఆ ఊరు అక్కడక్కడ పచ్చని చెట్లతో చిన్నచిన్న డాబా ఇళ్ళతో పూరి గుడిసెలతో నిండుగా పూలు పెట్టుకొని వయ్యారంగా నిలబడివున్న సౌందర్యవతిలా వుంటుంది.

ఆ ఊరిలో వాళ్ల ఇల్లు పర్ణశాలను తలపించేలా వుంటుంది. ఆ ఇంటి చుట్టూ కందికంపతో దడి కట్టి ఆ దడిపక్కన సొరపాదులు, బీరపాదులు తీగలుసాగి అల్లుకొని వుండటం విశేష ఆకర్షణగా వుంటుంది. ఎత్తుగా పెరిగిన బంతిపూల మొక్కలు రకరకాలు పూలుపూసి దారిన పోయేవాళ్లను పిలుస్తునట్లే వుంటాయి. ఇంటిపైకి ఎక్కిన గుమ్మడి చెట్టువిరగ కాసి "నేను మీకు కావాలా? అన్నట్లుచూస్తుంటాయి. బావి పక్కన కొబ్బరి చెట్లు, అరటిచెట్లు లోపలికివస్తున్న వాళ్లని ఆహ్వానిస్తున్నట్లే వుంటాయి.

ఇంటి ముందున్న మట్టి అరుగుల్ని అలికి, కళ్లాపిచల్లి పచ్చని ముంగిట్లో బియ్యం పిండితో ముగ్గులు పెట్టడంతో ఆ పరిసరాలు కమ్మటి వాసన వస్తు ఇంకాసేపు అక్కడే నిలబడాలనిపిస్తుంది.

ఆ ఇల్లు అలాంటి శోభను సంతరించకోవటానికి ప్రాద్దునలేచి తల్లి ఎంతో ఉత్సాహంగా చేసే పనులే కారణం.

ప్రాద్దునే లేచి అలా ఒకదాని వెంట ఒకటిగా తల్లి చేసుకుపోతున్న ఆ పనుల్ని చూసి, చూసి క్రమ శిక్షణ నేర్చుకుంది దీక్షిత. బద్దకమనేది ఆయింటి వాతావరణంలో ఎక్కడా కన్పించదు. తండ్రి కూడా రాత్రి నిద్రపోయేముందు - ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి తలచుకొని మరుసటిరోజు ఆ పొరపాట్లు లేకుండా చూసుకోమని చెపుతుంటాడు. వాళ్లిద్దరే ఆమె మొదటి గురువులు.

తల్లి వెంట తనుకూడా పొలం వెళ్లాలని ఎప్పటిలా తల్లి దండ్రితో పాటు తనకి అన్నయ్యకి కూడా టిఫిన్లో అన్నం పెట్టి అది పట్టుకొని బయలుదేరబోయింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages