గ్లేషియర్ నవలపై సమీక్ష
అద్దంకి వెంకట్
జీవితంలో అమూల్యమైనది బాల్యం, బాల్యంనుండి కొంచం ఊహ తెలుస్తున్నప్పుడు, జీవితంలో మంచి వ్యక్తులుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ స్కూల్ గడప తొక్కిస్తారు. అలా మొదలయిన మన స్కూల్ జీవితం రకరకాల స్నేహితులు, స్నేహాల మధ్య సాగే చదువు సంధ్యలు , పోటీలు, చక్కగా రోజులు గడచిపోతాయి. అలాగే అప్పుడు నేర్చుకున్న విషయాలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి.
అందులోనూ స్నేహితులు గానీ, టీచర్లు గానీ మనకి తెలియని ప్రదేశాల గురించి చెప్పినప్పుడు మనసు అప్పటికప్పుడు ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోవడమే కాదు, ఆ ప్రదేశాలు దర్శించాలన్న కోరిక బలంగా నాటుకుపోవడం సహజం.
కొంత మందికి జీవితంలో ఆ ప్రదేశాలు దర్శించే భాగ్యం తొందర్లోనే తీరవచ్చు కొంత మందికి సమయమూ పట్టవచ్చు లేక దర్శించే భాగ్యమే కలగని పరిస్ధితులు ఉండవచ్చు.
ఏదైనా కూడా మనకి భాగ్యం కలగకపోతే చర్చించుకోనక్కరలేదు, కానీ అదే ఆ అవకాశం వెంటనే తీరిపోయినా కూడా పెద్దగా చెప్పుకుందుకు ఉండదు.
మరి వేచి వేచి చూసిన తరువాత ఆలస్యంగా అటువంటి కోరికలు తీరుతుంటే అదీ జీవితంలో కుటుంబసంబంధాలు పూర్తిగా నిలుపుకుంటూ, కుటుంబసభ్యులు పెరిగాక విశ్రాంతజీవితంలోకి వచ్చాక చిన్నప్పటినుండీ మనసులో బలంగా నాటుకుపోయిన కోరికలు తీరుతుంటే, ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ప్రదేశాలను దర్ళించుకునే ముందు మనసులో కలిగే ఉద్వేగం , పులకరింత , సంతోషం వర్ణించడం కష్టమే అని చెప్పచ్చు.
అలాంటి ఒక అమ్మాయి కధే "గ్లేషియర్స్" పేరుతో తెలుగులో వచ్చిన నవల మనలను ఎక్కడెక్కడో విహరింపజేస్తుంది. రచయిత్రి తన రచానానుభవాన్ని చూపిస్తూ ఈ నవలలో పాత్రలను మలిచారు. ఎక్కడో ఒక పల్లెలో పుట్టి పెరిగి ఒక ఉపాధ్యాయని వివరంచే చెప్పిన ప్రదేశాల ఎడ అభిమానం పెంచుకుని తనూ ఒక రీడర్ గా ఎదిగి పిల్లల పెళ్ళిళ్ళయ్యి, మనవలు పుట్టేక తను చిన్నప్పటినుండీ చూడాలనుకున్న మంచుపర్వతాలు, ఓడ ప్రయాణం, ప్రయాణంలో కూడా కుదిరిన స్నేహాలు, తన చిన్ననాటి స్నేహితుడు, తమకు చదువుచెప్పిన ఉపాధ్యాయనిని కలుసుకోవడం ఒకటా రెండా ఎన్నో అనుభవాలు. నవల చదువుతున్నంత సేపూ మనలనీ భారతదేశంలో ఉన్న తాజ్ మహల్, మనాలీ , మధుర దగ్గరనుండి అలస్కా దాకా ప్రతిచోటుకీ మనం కూడా ప్రయాణం చేస్తున్నామా అన్నంతగా ఊగిస్తుంది. తమతో బాటూ ప్రయాణించిన వివిధ దేశ,ప్రాంత ప్రజలు వారి వారి నేపధ్యాలు కూడా తెలుసుకునే అవకాశం తెలిపే విశిష్టమైన నవల "గ్లేషియర్స్". ప్రముఖ రచయిత్రి శ్రీమతి మంధా భానుమతి గారు వ్రాసిన నవల తప్పక చదివితీరవలసినదే, ఇది చదివేక మనకీ ఆయా ప్రదేశాలు చూడాలన్న కోరిక కలగడం ఎంత సహజమో అలాగే ఆ ప్రదేశాలు దర్శంచే ముందు అక్కడ ఉండే లోటుపాట్లూ తెలియడంతో మనం ఆ ప్రదేశాలు దర్శించేటప్పుడు కావలసిన జాగ్రత్తలు తెలుస్తాయి.
జేవీ పబ్లికేషన్ సంస్ధ ప్రచురించిన ఈ చిన్న నవల ఖరీదు ఎక్కువ కాదు. మన మనసులను ఊగిసిలాడిస్తూ మనకి విషయజ్ఞానం కూడా కలిగిస్తుందనడంలో సందేహం ఎంత మాత్రం లేదు.
భానుమతి గారి రచనా శైలి అద్భుతం అని నిరూపించే నవల ఇది. తప్పక కొని చదవండి. మీ కాపీ కోసం జేవీ పబ్లికేషన్స్ , హైదరాబాద్ సంస్ధను సంప్రదించండి.
No comments:
Post a Comment