ఏకుతా(రా) {ఏక్తార}
(జ)వరాలి కధలు - 24
గొర్తివేంకటసోమనాధశాస్త్రి (సోమసుధ)
జీవనపధంలో మార్పు సహజం. పుట్టగానే వెల్లకిలా పడుకోవటమే తప్ప ఏమీ తెలియని పసివాడు కొన్నాళ్ళకు బోర్లాపడటం నేర్చుకొంటాడు. బోర్లాపడినవాడు గోడలనో, ఏదో ఆధారాన్ని పట్టుకొనో లేచి నిలబడే ప్రయత్నం చేస్తాడు. కొన్నాళ్ళకు ఏ ఆధారం లేకుండా నడిచే ప్రయత్నం చేస్తాడు. మరికొన్నాళ్ళకు పరిగెత్తటం నేర్చుకొంటాడు. చివరికి యీ పరిగెత్తే ప్రపంచంలో గెలవటం కోసం చాలాదూరం పరిగెత్తి, వయసు ఉడిగాక అలసిపోయి ఆయాసపడుతూ, తరువాత తరాన్ని అలా పరుగులు తీయవద్దని పాఠాలు చెప్పటం నేర్చుకొంటాడు. కానీ వయసులో ఉన్నవాళ్ళు వీరి మాటలు లెక్కచేయక పరుగులు తీసి బొక్కబోర్లాపడుతూంటారు. కానీ ప్రక్కవాడు పడిపోవటం చూసి తను పరుగెత్తటం మానుతాడా? లేదు. ఎవరి పంధా వారిదే! చూసి నేర్చుకొనే రోజులు పోయాయి. ఎవరికి వారు తమకు తోచినట్లు తాము చేసుకుపోవటమే! ఒకప్పుడు గెడ్డం గీసుకోవాలన్నా మంగలిని నమ్ముకోవలసినదే! తరువాత రేజర్లు, బ్లేడ్లు కొనుక్కొని ఎవడి గడ్డం వాళ్ళే చేసుకొంటున్నారు. దానివల్ల మంగలివృత్తి మూలపడుతుందని ఆలోచిస్తున్నారా? వాషింగ్ మెషిన్లు వచ్చాయి. చాకలోళ్ళను పక్కకు నెట్టేశారు. అదే తమ ఆఫీసుల్లో కొత్త యంత్రపరికరాలు కొంటామంటే ధర్నాలు, సమ్మెలు, ఊరేగింపులు, నినాదాలు. కారణం వాటివల్ల తమ ఉద్యోగాలు పోతాయని కంగారు. అంటే అవతలి వాడి కూడు పోయినా ఫరవాలేదు, మన పని త్వరగా అయిపోవాలి. అదే మన కూడు పోతోందంటే, పోనీలే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తారా? ముందు మనం బాగుండాలి, తరువాతే దేశం సంగతి. ఇప్పటి పాలకులైనా అంతే, ప్రజలైనా అంతే!
"ఏమిటి వ్రాస్తున్నారు?" వరాలి ప్రశ్నకు మంచం మీద కూర్చుని వ్రాస్తున్న నేను ఉలికిపడ్డాను.
"డైరీ!" సణిగాను.
"మీరు నాకు గాక దానికే పుస్తె గట్టి ఉంటే సరిపోయేదిగా! సరే! లేవండి. ఏకే అతను వచ్చాడు. ఈ పరుపు అతనికి పడేస్తే ఏకుతాడు."
వరాలికి మారు మాట్లాడక లేచి పక్కనున్న కుర్చీలోకి బదిలీ అయ్యాను.
"బాబూ! ఇలారా!" అనగానే ఒక పాతికేళ్ళ కుర్రాడు లోనికొచ్చి మంచంపై పరుపును చుట్టచుట్టి వసారాలోకి మోసుకుపోయాడు.
వ్రాస్తున్న పుస్తకం పక్కన బెట్టి వరాలి వెనుకే వసారాలోకి వెళ్ళాను. దూదేకుల సాయిబు తన భుజాన ఉన్న ఏకే సాధనాన్ని ఒక తాడుకి కట్టి వసారాలో ఉన్న దూలానికి వేలాడదీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపున అతని సహాయకుడు పరుపుని నేలమీద పరచి దాని కుట్లు విప్పి, దానిలో ఉండలు కట్టిన దూదిని చేతి గోళ్ళతో చీల్చుతున్నాడు. వరాలు దూరంగా చదికిలబడి వాళ్ళు చేసే పనిని చూస్తోంది.
అక్కడ నా అవసరం లేదు గనుక మళ్ళీ గదిలోకి వచ్చి నా రాత కార్యక్రమాన్ని కొనసాగించాను.
అసలు ఈ రోజంతా యిది వ్రాయటానికి ముఖ్యకారణం నా అత్తామామలే! వరాలి కోరికపై కొన్నాళ్ళు ఆఫీసుకి సెలవు పెట్టి అత్తవారి గ్రామానికి బయల్దేరాను. మేము వెళ్ళిన నాలుగు రోజులకి అత్తగారి చుట్టాలెవరికో ఒంట్లో బాగులేదని కబురొచ్చి వాళ్ళ ఊరికి ఆదిదంపతులు వెళ్ళారు. ఇంక వరాలు, నేను ఆ యింటి కాపలాగా వాళ్ళు వచ్చేవరకూ ఉండాల్సిందే! అఫ్ కోర్స్! నేను సెలవు ఎంతవరకూ పెట్టానో వారికి చెప్పాననుకోండి. ఆ లెక్కన మరో పదిరోజులు అక్కడ ఉండాలని నేను ముందు అనుకున్నదే! ఈ లోపున వాళ్ళూ తిరిగి రావచ్చు. ఇంతకీ మార్పు, తత్వాలు అంటూ ఉదయాన్నే వ్రాయటం ఎందుకు మొదలెట్టానంటే కొంతమంది జనాలు ముఖ్యంగా నగరాల్లో యీ రోజు కట్టిన బట్ట మరునాడు కట్టరు. ఒకప్పుడు మగవాళ్ళు ఒంగితే చిరిగిపోయే నేరోకట్లు వేసుకొనేవారు. కొన్నాళ్ళకు మునిసిపాలిటీవాళ్ళతో సంబంధం లేకుండా రోడ్లు ఊడ్చేలా నేలకు తగిలే బెల్ బాటంలు, ఆ ఫాంటులకు అడుగున జిప్ లు కుట్టించుకొనేవారు. కొన్నాళ్ళకు మాసిపోయినట్లు కనిపించే జీన్స్ వాడారు. ప్రస్తుతం అక్కడక్కడ చిరుగులున్న జీన్స్ వాడుతున్నారు. ఈ వేషాలు చాలనట్లు ఆడా, మగా కాకుండా "మాడా" అనిపించేలా ఒక చెవికే పోగులు పెట్టుకొంటున్నారు. ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకొంటున్నారు. లోకం యింతలా మారిపోతున్నా నా మావగారు పాతకాలపు పెంకుటింట్లోనే ఉంటున్నారు. ఎప్పుడైనా కొండముచ్చులు షికారుకొచ్చి పెంకుల్ని విరగ్గొట్టి పోయినా వాటిపై మళ్ళీ పెంకులు పరిపిస్తారు తప్ప, శుభ్రంగా ఒక డాబా కట్టుకోవాలన్న ఆలోచనలు రావు. చుట్టుపక్కల పెంకుటిళ్ళ స్థానంలో డాబాలొచ్చినా, వీళ్ళయిల్లు మాత్రం వాటి మధ్యలో దిష్టిబొమ్మలా నిలచి ఉంటుంది. ఏమన్నా అంటే ఆ గదిలో అది జరిగింది, యీ గదిలో యిది జరిగింది. . .అవన్నీ మాకు మధుర జ్ఞాపకాలు అంటారు. ఆయనే కాదనుకోండి. మా నాన్న తరఫు వాళ్ళు కూడా మొదట్లో పెంకుటిల్లు, అన్ని గదుల్లో విద్యుద్దీపాలు ఉండేవి. రెండుసార్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పెంకుటిల్లు అంటుకొందని, ఆ యిల్లు పడగొట్టి తాటాకు యిల్లు కట్టుకొన్నారు. విద్యుత్ వాడకం కూడా నిషేధించారు. ఆ ఊరెడితే కిరోసిను లాంతర్ల క్రిందే భోజనాలు చేయవలసి వచ్చేది. ఆ తరువాత అగ్నిప్రమాదాలు జరగలేదని వాళ్ళు పోయేవరకూ చమురుదీపాలతో తాటాకు యింట్లోనే గడిపారు. దీపావళిరోజు ఆ తాటాకు యింటికి అగ్నిప్రమాదం జరగకుండా నీటితో పైకప్పు పూర్తిగా తడిపేయటం, రాత్రి పదివరకూ ఏ తారాజువ్వా యింటిపై పడకుండా కాపలా కాయటం. . .అదే వాళ్ళ దీపావళి సంబరాలు. నా పెళ్ళయిన కొత్తలో మావగారికి డాబా కట్టమని చెబితే ఆయన మధుర జ్ఞాపకాలు చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్లు యీ బూరుగుదూది పరుపు. ఆరోగ్యరీత్యా దూది పరుపు మంచిదే కావచ్చు. స్పాంజి పరుపులవల్ల ఒళ్ళునొప్పులు పుట్టి వైద్యుడు దగ్గరకెళ్ళవలసి రావచ్చు. కానీ మారుతున్న కాలంతో మనమూ మారాలిగా! కొన్నాళ్ళకు పరుపులోని దూది ఉండకట్టిపోతూంటే యిలా దూదేకులవాణ్ణి పిలిచి ఏకించుకుంటూ ఉండాలి.
ఇదే మాట వరాలి దగ్గర అంటే "అసలు ఏకించుకోవటం అలవాటులేకే మీరిలా తయారయ్యారు. అందువల్ల అప్పుడప్పుడు నేనా పని చేయాల్సి వస్తోంది. కట్టుకొనే బట్ట మాసిపోతే ఉతుక్కొని మళ్ళీ వేసుకుంటాం కదా! ఇది అంతే! పడుక్కొనే పరుపుని ఏకించుకొని వాడితే ఎంత మజా వస్తుందో మీ నగరం వాళ్ళకేం తెలుసు?" అని అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటుంది.
వసారాలో ఏకటం మొదలవగానే నా ఆలోచనలకు బ్రేకు పడింది. పుస్తకం మూసేసి కళ్ళు మూసుకొని ఆ "ఏకుతా"రాగంలో మునిగిపోయాను. ఈ కాలం చిత్రగీతాల సంగీతం కన్నా ఎంతో మధురంగా ఉందా రాగం. ఇంటి దూలానికి ఏకే యంత్రాన్ని వేలాడదీసి, ఉండకట్టిన దూదిలో ముంచి చేతిలోని పిడికర్రతో ఆ యంత్రానికున్న లావు తీగను పట్టి లాగుతూంటే దూది ఉండలు ముక్కలై, లోపలున్న మెత్తటిదూది పైకి వచ్చి ఆ ప్రాంతంలో ఎగిరి గాలిలో నాట్యం చేస్తుంది. ఈనాటి స్పాంజి జీవితతరాలకు ఆ ఏకే రాగంలో అందం, గాలిలో ఎగిరే దూదిలోని నాట్యవిలాసం అసలు తెలియదనే చెప్పాలి.
"మీది యీ ఊరేనా?" అకస్మాత్తుగా వరాలి ప్రశ్న వినిపించింది.
"లేదమ్మా! ప్రక్క ఊరు. ఈ చుట్టుప్రక్కల మూడు ఊళ్ళు తిరుగుతాను. రెక్కాడితే గాని డొక్కాడదుగా! కానీ రోజులు మారిపోయాయమ్మా! ఎక్కడో మీలాంటి కుటుంబాలు తప్ప యీ రోజుల్లో అందరూ స్పాంజ్ పరుపులు కొనేస్తున్నారు. దానివల్ల మా కూడులో మట్టి పడుతోంది."
"ఈ అబ్బాయి మీవాడేనా?" అడిగింది.
"లేదమ్మా! నాకు సహాయకుడిగా పని చేస్తున్నాడు. కానీ దీనివల్ల కిట్టుబాటయ్యేలా లేదు. ఏ పట్టణానికైనా పోయి ఏదో కంపెనీలో కూలివాడిగా చేరినా యింతకన్న ఎక్కువే సంపాదించవచ్చనుకొంటున్నాడు. నాకు ఓపిక ఉన్నంతకాలం వదిలిపోవద్దని చెప్పాను. నేను యీ పని కూడా చేయలేకపోతే వీడి దగ్గరకే వెళ్ళాలి."
"అదేం! నీకు పిల్లలెవరూ లేరా?"
"ఉన్నారమ్మా! ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అయినా యిప్పటివాళ్ళు వాళ్ళ బ్రతుకులే వాళ్ళు సరిగా తీర్చిదిద్దుకోలేరు. నాకేం సాయం చేస్తారమ్మా?"
"నీ పిల్లలు ఏం చేస్తున్నారేంటి?" వరాలు అడిగింది.
"కాస్త మంచినీళ్ళు యిస్తావమ్మా!" పెద్దాయన అడిగాడని వరాలు వంటింట్లోకి వెళ్ళింది. అతను ఏకే రాగాన్ని ఆపేసి పెరట్లోకి వెళ్ళాడు. బయట బక్కెట్లో నీళ్ళతో నోరు పుక్కిలించుకొని వచ్చి వరాలిచ్చిన నీళ్ళు తాగుతున్నాడు. ఈసారి యువకుడు ఏకటం మొదలెట్టాడు.
భుజం మీద కండువాతో ముఖం తుడుచుకొని " అబ్బ! ఎండ మండిపోతోందమ్మా!" అన్నాడు.
"కాలం మారిపోయింది. సకాలంలో వర్షాలు పడవు, చలి పరిస్థితి అంతే! కానీ ఎండలు మాత్రం ఏ కాలంలోను వదలకుండా మండబెట్టేస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం చెట్లు కొట్టేయటమే!" వరాలు బదులిచ్చింది. "మీ పిల్లలు ఏం చేస్తున్నారేంటి?" తన ప్రశ్నను తిరిగి సంధించింది.
"ఏం చేస్తారమ్మా! ఈ రోజుల్లో మా పనిని నమ్ముకొంటే రోజు వెళ్ళదని వాళ్ళను చదువులో పెట్టాను. ఆడపిల్లను చిన్నవయసులో పెళ్ళేమిటని, దానికీ చదువు చెప్పించాను. అలా చెప్పించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకొనేలా చేశారు వాళ్ళు."
"అసలేం జరిగింది?"
"ఏం చెప్పను? కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది. పిల్లల సరదాలు తీర్చటం పెద్దల విధి అని దానికో మొబైల్, వీడికో బైక్ కొనిచ్చాను. నేనిలా ఊళ్ళపై తిరుగుతుంటాను కదాని వాళ్ళను అంతగా పట్టించుకోలేదు. వాడు బైక్ పై ఫీట్లు చేస్తూ పడితే చెయ్యి విరిగింది. దాని వైద్యానికి సుమారు ఇరవై వేల వరకూ వదిలింది. "ఏందిరా యిది?" అంటే "బైకన్నాక ప్రమాదాలు జరగవా? ఇది బైకున్న ప్రతివాడికి మామూలే!" అంటాడు. తల్లిలేని పిల్లలు కదా అని వాళ్ళు అడిగిందల్లా కాదనకుండా గారం చేశాను. చివరికి వాడు నాకే పాఠాలు చెప్పేలా తయారయ్యాడు" బాధగా అంటూ కొన్ని క్షణాలు ఆగాడు.
"మీ వాళ్ళే కాదయ్యా! ఈ రోజుల్లో పిల్లలంతా అలాగే ఉన్నారు. నగరాల్లో అయితే మరీ ఎక్కువ. అక్కడ భర్త ఆదాయానికి, ధరలకూ లంగరు కుదరక భార్యలు కూడా ఉద్యోగానికి పోతుంటారు. అందువల్ల పసితనం నుంచే పిల్లలను ఏదో క్రచే లోనో, యింటిదగ్గర పనిపిల్లకో అప్పజెప్పిపోతున్నారు. ఎవరి పిల్లల్ని ఎవరు సరిగా చూస్తారు చెప్పు? అందుకే పిల్లలు తల్లిదండ్రుల మాటలను ఖాతరు చేయటం లేదు. అయినా మనం ఎంత చెప్పినా, బయట సమాజంలో వాళ్ళెక్కువగా మసలుతారు గనుక ఆ ప్రభావమే వాళ్ళమీద ఎక్కువగా ఉంటోంది"
"అంతేనమ్మా! మావాడి సంగతే చూడండి. పోనీ చెయ్యి విరిగాక దూకుడు తగ్గించాడా? వారం క్రితం అదే దూకుడులో రోడ్డు మీద పోతూ నడిచివెళ్తున్న వాళ్ళను గుద్దేశాడు. తల్లికి విపరీతంగా గాయాలై ఆసుపత్రిలో పడితే, వీణ్ణి తీసుకెళ్ళి జైలులో పడేశారు. వాడిని కోర్టులో ప్రవేశపెట్టి ఏం చేయాలో తేల్చేదాక, వాడు ఆ జైలులో మగ్గిపోక తప్పదు. పుత్రుడు, పున్నామనరకం అంటూ మీ పెద్దోళ్ళు ఏదో అంటూంటారు. ఆ నరకం సంగతేమో కానీ వీడు బతికుండగానే నరకం చూపిస్తున్నాడు. కొడుకు జైలు పాలయ్యాడని పోలీసుస్టేషనుకెడితే ఆ పోలీసాయన పిచ్చ చివాట్లు పెట్టాడు. ఏమ్మా! పిల్లల్ని ప్రేమగా పెంచటం తప్పా? ' ఎందుకయ్యా యిలాంటి పిల్లల్ని కని సమాజాన్ని చెడగొడతారు?' అని పోలీసాయన తిడుతూంటే తల కొట్టేసినట్లయింది" అంటూ భుజంపై తుండుతో కళ్ళు తుడుచుకోవటం, నేను కూర్చున్న గుమ్మానికెదురుగా ఉన్న అద్దంలో చూశాను.
"బాధపడకు. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు గానీ వాళ్ళ తలరాతలు కనలేరు కదా!" అంటూ వరాలు వంటింటి వైపు వెళ్ళింది.
"మావా! ఏకటం అయిపోయింది" అతని శిష్యుడు చెప్పగానే యిద్దరూ కలిసి పనికిరాని దూది ముద్దని పక్కన పడేసి, మెత్తటి దూదిని విప్పిన గుడ్డ కవరులోకి ఎక్కిస్తున్నారు. ఈ లోపున వరాలు వంటింట్లోంచి కాఫీగ్లాసుతో నా దగ్గరకు వచ్చింది.
"ఎందుకోయి? వాళ్ళకేదో పని చెప్పావు. వాళ్ళపని వాళ్ళు చేసుకొంటున్నారు. మధ్యలో వాళ్ళని కదిపి వాళ్ళ విషయాలు అడగటమెందుకు? నిజమో, కాదో? ఒక కన్నీటి కావ్యాన్ని నీ వద్ద వల్లించి, "అమ్మా! కష్టాల్లో ఉన్నాను. నాకేదైనా సాయం చేయవా?" అంటే వాడి కధ అడిగినందుకైనా సాయం చేయాల్సి ఉంటుంది. సాయం చెయ్యకపోతే-యీ మాత్రం దానికి నా కధ అడగటం ఎందుకు?-అని వాడు చాటుగా తిట్టుకోడా?" చిన్నగా కేకలేశాను.
"మీకు అందరిమీద అనుమానమే! మీ నగరం మనుషుల్లా మా పల్లెజనాలు ఉండరులెండి! అతని వాలకం చూస్తే నిజమో, అబద్ధమో తెలియటం లేదా? అయినా చాటుగా మా మాటలు వినే ఉంటారుగా! అతని కధనే మీరు ఏ పత్రికకో రాసి పంపటానికి పనికొస్తుందిగా!" అంటూ వంటింటివైపు వెళ్ళిపోయింది.
"ఇదిగో! దబ్బనంలోకి దారం ఎక్కించాను. పరుపుని గట్టిగా బిగించి కుట్టు" అన్నాడతను.
"అలాగే మావా!" అంటూ కుర్రాడు కుట్టుడుపనిలో పడ్డాడు..
"ఇదిగో బాబూ! కాఫీ! బాబూ! నీక్కూడా యిక్కడ పెడుతున్నా! పరుపు కుట్టేశాక తాగు" వరాలు అంది.
"మా తల్లి! మర్యాదగల తల్లి! మా చేత పని చేయించుకొని డబ్బులిచ్చి పంపేవాళ్ళే గాని యిలా కాఫీలిచ్చి మా కష్టసుఖాలు విచారించేవాళ్ళే లేరమ్మా!"
"దాందేముందిలే! ఆరుపదులు పైబడినా యింకా కష్టం చేసి బతుకుతున్నావ్. ఎండన పడి వచ్చావు. కాఫీతో మా ఆస్తులు కరిగిపోయేదేమీలేదులే!" వరాలి మాటలు వినిపించాయి.
"పిల్లాడి సంగతి సరే! ఆడపిల్లయితేనేంటి? వాళ్ళే యింటిపరువును అంతో, యింతో నిలుపుతున్నారు. మీ అమ్మాయి అంతేనా?"
"ఏం చెప్పనమ్మా? అది కూడా యీ కాలం ఆడపిల్లే కదా! ఎప్పుడూ ఆ మొబైల్ కి ఏదో తీగ తగిలిచ్చి వింటూండేది. ఏమిటే అంటే యియర్ఫోను అనేది. మధ్య, మధ్యలో దానిలో ఏదో కొడుతూండేది. ఏమిటే అంటే అదేదో చాటింగట! ఎప్పుడూ దాన్నే పట్టుకొని ఉంటే పుస్తకాలు పట్టుకొనేదెప్పుడే అంటే పాఠాలన్నీ దీన్లోనే దొరుకుతాయి. పుస్తకాలతో పనిలేదనేది. ఈ మధ్యన కాలేజివాళ్ళు నగరానికి తీసుకెడతారట, డబ్బులు కావాలంది. మా రోజుల్లో స్కూలు వదిలి బయటకు తీసుకెళ్ళేవారు కాదు. ఏమోలే! ఈ మధ్యన కొన్ని స్కూళ్ళు . . .అదేంట్రా?" ప్రక్క కుర్రాణ్ణడిగాడు.
"ఎక్స్కర్షన్ మావా!" అని వాడు చెప్పాడు.
"అదే. . . . దానికి వెడతానంటే సరే అని డబ్బులిచ్చినా. అక్కడనుంచి వచ్చాక కొన్నాళ్ళు హుషారుగానే ఉంది. కానీ రానురాను దానిలో మార్పు గమనించి విషయం తెలుసుకున్నాను. గుట్టుచప్పుడు కాకుండా పక్క పట్టణం ఆసుపత్రిలో కడిగేయించాను. ఆ తరువాత అది పిచ్చి పట్టినదానిలా ఏడుస్తూంటే ఏమీ చేసేదిలేక బాధపడుతున్నాను. కాలేజికెళ్ళటం కూడా మానేసింది."
"అమ్మాయినేమీ అనకు. మెల్లిగా ధైర్యం చెప్పి చదువుమీదకి దృష్టిని మళ్ళించేలా చూడు. మోసం చేసేవాళ్ళు పాపం, పుణ్యం ఆలోచించరు. అప్పుడప్పుడు జీవితాల్లో యిలా మోసపోవటం మామూలే"
వరాలి మాటలు పూర్తయ్యాక కుర్రాడు పరుపుని ఎత్తుకొని వచ్చి మంచంపై పడేసి సర్దాడు. పూర్వం కన్నా దాని పరిమాణం కొద్దిగా తగ్గింది.
"ఇంకో రెండు సార్లు ఏకించవచ్చు బాబూ! ఆ తరువాత యిది రెండు తలగడలుగా కుట్టించుకొందుకు మాత్రమే పనిచేస్తుంది" అంటూ నాతో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తరువాత చీపురుతో వసారా చిమ్మి, నీళ్ళతో కడిగేశాడు. ఈలోపున పెద్దాయన పెరట్లోకి వెళ్ళి ఉండలు కట్టి పనికిరాని దూది చెత్తను దొడ్డిలో దూరంగా పడేశాడు. తరువాత నూతి దగ్గర కాళ్ళు మొహం కడుక్కొని లోనికొచ్చి, భుజం మీద తుండుతో ఒళ్ళంతా తుడుచుకొన్నాడు. ఈలోపున వరాలు నా దగ్గర వాళ్ళకివ్వవలసిన మొత్తాన్ని తీసుకొని పెద్దాయనకి యిచ్చింది. కుర్రాడు ఏకే సామానంతా సర్దేసి భుజాన వేసుకొన్నాడు.
"వస్తానమ్మా!" అంటూంటే గదిలోంచి బయటకెళ్ళాను.
"అలాగేనయ్యా!" అంటూ వరాలు వెనక్కి తిరిగింది.
"దయగల తల్లివి! కష్టం చెప్పుకొన్నా! ఏదైనా సాయం చేయండమ్మా!" అన్నాడు. ఆ మాటలకు వరాలు ముఖంలో ఏదో మార్పు.
"మీరూ ఆలోచించండయ్యా!" అంటూ నావైపు చూశాడు.
నాకన్నా ముందే వరాలు స్పందించింది.
"ఒక అయిదువందలు ఉంటే యివ్వండి" అంది. ఆమె మాటకు నేను బిత్తరపోవటం, ఆ ముసలాడి కళ్ళు ఆనందంతో మెరవటం ఒకే క్షణంలో జరిగాయి. అతని ఎదురుగా ఆమెను చిన్నబుచ్చటం యిష్టం లేక లోపలకొచ్చి జేబులో డబ్బులిచ్చాను. ఆ నోట్లు తన చేతిలో పడగానే అతను రెండుసార్లు మాకు వంగి నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. వరాలు వాళ్ళు తాగి వదిలిన కప్పులు కడుగుదామని పెరట్లోకి వెళ్ళింది. మా మావగారి యింటి పిట్టగోడని ఆనుకొని ఉన్న రోడ్డుమీద వాళ్ళు వెడుతూ మాట్లాడుకొన్నారట! అనుకోకుండా వాళ్ళ మాటలు వరాలికి వినిపించాయట!
"మావా! పిల్లలు మన ఊళ్ళోనే హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూంటే, అమ్మగారిని ఏదో సినిమాకధతో బురిడీ కొట్టించి అయిదొందలు భలే పట్టేశావే!" ప్రక్కనున్న కుర్రాడు అతనితో అన్నాడు.
"లేకపోతే! ఏకటానికి యింత అవుతుందమ్మా అంటే బేరమాడింది. అసలే మార్కెట్లో దూది పరుపులు తగ్గిపోయి మన రాబడి కుళాయి ధారలా సన్నబడిపోతోంది. సరె! వచ్చిన బేరం వదులుకోకూడదని ఒప్పుకొని పని మొదలెట్టానా? ఆవిడ కబుర్లు మొదలెట్టింది. జీవితంలో నువ్వు నేర్చుకోవలసినది అదే! మనచేత మౌనంగా పని చేయించుకొనేవాళ్ళు అసలు కొరుకుడు పడరు. ఇలా మధ్యలో కబుర్లాడేవారే మన బుట్టలో పడతారు. అందులో కష్టసుఖాలడిగే ఆడవాళ్ళను సులువుగా బురిడీ కొట్టించవచ్చు. వాళ్ళకు కన్నీటి గాధ వినిపించేసి "అమ్మా" అని చేయిచాపామనుకో! ఇంతకధా విన్నామన్న మొహమాటంలో లాక్కోలేక, పీక్కోలేక మనకు సాయం చేసేస్తారు. ఇలాంటి అమాయకపు ఆడవాళ్ళు దొరికినప్పుడు మనలాంటివాళ్ళు సొమ్ముచేసుకోవటానికి ఏదో సినిమాకధలు చెప్పేస్తూ ఉండాలి" అనగానే యిద్దరూ పగలబడి నవ్వుకొన్నారట!
వాళ్ళ మాటలను విన్న వరాలు అవమానంతో లోనికి వచ్చి కన్నీళ్ళు తుడుచుకుంటోంది.
అది గమనించిన నేను వరాలు దగ్గరకెళ్ళి విషయమడిగాను. ముందు చెప్పటానికి సందేహించినా తరువాత తను విన్నదంతా చెప్పింది.
"ఇన్నాళ్ళు పల్లెటూళ్ళో తిరిగినదానవు, భోళాతనం కల మనిషివి గనుక మోసపోయావు. నువ్వు మన మహానగరంలో చూశావు కదా! ఎవరింట్లో ఏ గొడవలు జరిగినా ఎవరూ పట్టించుకోక పోవటానికి కారణం అదే! నిజంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నా యిలాంటి మోసగాళ్ళ వలన ఎవరికీ సాయం చేయకూడదనిపిస్తుంది. ఈ దూదేకులవాడు ఒక్కణ్ణే నువ్వు చూశావు. కానీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణాలు చేసి ఓట్లడిగిన నాయకులు, అధికారం చేజిక్కగానే ఏదో కధలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వాళ్ళ సంగతేమిటి? అతనే చెప్పిన . . . .మొబైల్లో ఛాటింగులు ఎంతమంది కొంపలు ముంచుతున్నాయో వెలుగుని చూడటంలేదు. స్నేహాన్ని కోరుతూ సందేశాలు పంపుతారు. ఒప్పుకోగానే మెస్సెంజర్లో ఛాటింగులు మొదలెడతారు. వాళ్ళెవరో వీళ్ళకు తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకు తెలియదు. కొంతమంది వాళ్ళ చిరునామాలు గాని, ఫొటోలు గానీ ఏమీ పెట్టరు. కొన్నాళ్ళు స్నేహసందేశాలు రహస్యంగా నడుస్తాయి. తరువాత యిలాగే ఏవో కష్టాలకధలు చెప్పి ఆడవాళ్ళు తమ అక్కౌంట్ నంబర్లు యిచ్చి, ఆన్లైన్లో మొత్తాలు పంపమని ప్రార్ధిస్తారు. ఆడపిల్ల అనగానే మగాళ్ళు ఎగబడి డబ్బులు పంపేస్తారు. అటుపక్క నిజంగా ఆడపిల్లేనా, ఆడపిల్ల పేరుతో మగాడు అడుగుతున్నాడా ఏమీ చూడరు. కొన్నాళ్ళ తరువాత పంపిన డబ్బులు తిరిగిరావు. ఆపై తిట్ల పురాణాలు సాగుతాయి. ఇక కొంతమంది మగపిల్లలు ఆడవాళ్ళతో కొన్నాళ్ళు ఛాటింగులు చేసి ఒక శుభ ముహూర్తం చూసుకొని ఆడపిల్ల యింట్లో దిగిపోతారు. స్నేహం అనే మొహమాటమో, మోహమో వాళ్ళని కమ్మేస్తుంది. పెళ్ళయిన ఆడపిల్లయితే కాపురం కూలిపోతుంది. పెళ్ళికాని ఆడపిల్ల మోసపోతుంది. కానీ కధలు చెప్పేవాళ్ళకి, కధనాలు నడిపించేవాళ్ళకి పాపభీతి ఉండదు. అది పాలకులైనా ఒకటే! సామాన్య ప్రజలైనా ఒకటే! అందినంతవరకు ఏవో కధలు చెప్పి మోసం చేయటమే వాళ్ళ పని. అందుకే పాతకాలంలోలా మనిషిని పూర్తిగా నమ్మకూడదు. ఒకవేళ వాళ్ళకధలు నమ్మి మోసపోతే, అది గుణపాఠంగా తీసుకొని మరొకసారి మోసపోకుండ జాగ్రత్తపడటం తప్ప మనమేం చేయలేము."
" మీకు నా మీద కోపం లేదా?"
" కోపమెందుకు? కానీ ఒకమాట మాత్రం గుర్తుపెట్టుకో! ఎదుటి మనిషి కష్టం చూసి సాయపడితే తప్పులేదు. కానీ యిలా కన్నీటికధలు విని సాయపడ్డాక మోసపోయానని బాధపడటం అనవసరం. నిజంగానే అతనికి కష్టాల్లో సాయపడ్డావనే సర్దిపుచ్చుకో! ఆపైన మంచిచెడ్డలు ఆ భగవంతుడే చూసుకొంటాడు" నా మాటలు విని పెరటివైపు వెళ్ళబోయింది.
" ఒక్కమాట" నా పిలుపుకు ఆగి ఏమిటన్నట్లు చూసింది.
" డబ్బులు పోతే పోయాయి. పరుపు సరిగా ఏకాడో, లేదో?" అర్ధోక్తిలో ఆగాను.
" ఛీ! " అంటూ పెరటిగుమ్మం తలుపు మూయటానికి వెళ్ళింది.

***
No comments:
Post a Comment