కాలం మనదే ..
సుజాత తిమ్మన
నిన్నటిని చీకటిలో విప్పేసి..
నులివెచ్చని భానుని కిరణాలలో జలకాలాడుతూ..
నేటిని తొడుక్కుంటూ ఉంటుంది కాలం ..
రైలు బండి తను ముందుకు వెళుతూ ..చెట్లని ,చేలని,.
గిరులను , తరులను ,వెనక్కి తోసేస్తున్నట్టు ...
క్షణాలను తొక్కుకుంటూ..పరిగెడుతుంది కాలం
రామాయణం , భాగవతాది ఇతిహాసాలను ..
ప్రాచిన సంస్కృతీ సంపదలను రాచరికపు రక్తచరిత్రలను ..
స్వతంత్రభారతానికి తెల్లవాళ్ళ అహంకారాన్ని అణచి ..
ప్రజాస్వామ్య పరిపాలనలో అభివృద్దిని సాధిస్తున్న ఘనతను..
కుల మత జాతి వైషమ్యాలను ఎరుగని స్వచ్చతను
తనలో దాచుకునే….. అక్షయమైనది కాలం...
గడియారంముళ్ళు పరుగులు పెడుతూ..
తనలో బంధించాలని ఎంతగా చూసినా...
తన ధోరణిలో తాను అలుపెరుగక పయనించేదే కాలం..
సృష్టి స్థితి లయలకు మూలకారణమై ...
విశ్వాన్ని మొత్తంగా తన ఆధీనంలో ఉంచుకుని సాగిపోయేదే కాలం ..
మానవ జన్మ పొందినందుకు ..కాలంతో పాటూ అడుగులు కదుపుతూ..
వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలుపుకుని...ఎదుటివారికి మంచిని పంచుతూ..
ముందు తరానికి మార్గదర్శకులమైతే..ఇక ఎప్పటికీ మనదే కాలం..!!
***************
Kavita Chaalaa Bavundi
ReplyDelete