అద్భుతాభినయ లాస్యం - పవని శ్రీలతా ప్రసాద్
భావరాజు పద్మిని
ఎదురుగా సాక్షాత్తూ పార్వతీ అమ్మవారు కూర్చుని నాట్యం నేర్పుతున్నట్లే ఉంటుంది ఆవిడను చూస్తే! అందం, అభినయం, అఖండమైన మేధస్సు, శిష్యుల శక్తియుక్తులను అంచానా వేసే సామర్ధ్యం, ప్రేమ, ఓర్పు, కరుణ అన్నీ కలిపితే - శ్రీలత గారు అవుతారు. 'పేదరికం వలన విద్య ఆగిపోకూడదు' అంటూ పేద విద్యార్ధులకు తన కళాశాలలో ఉచితంగానే నాట్య విద్యను అందించే ఔదార్యం కల పవని శ్రీలతా ప్రసాద్ గారి పరిచయం ఈ నెల శింజారవంలో ప్రత్యేకించి మీకోసం...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు పాటలు నృత్యాలు అంటే ఇష్టమే. అంటే అది ప్రత్యేకమైన ఆసక్తి అని చెప్పలేను. కానీ చదువుతో పాటు ఇవి కూడా ఇష్టమైనవిగా ఉండేవి. మక్కువ అంటే, అది అధికశాతం మా అమ్మ నుండి నాకు వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం. నాకు సంగీతము,నృత్యము – ఈ రెంటిలో ప్రవేశం కల్పించడమే కాక, మా అమ్మ అందులో ఆసక్తి కల్పించడంలో చాలా ముఖ్య భూమిక నిర్వహించింది. వాని నేపథ్యంలో ఉన్న సినిమాలకు తీసుకు వెళ్లి చూపించడం, తత్సంబంధిత ప్రచురణ పుస్తకాలు చదివించడం లాంటివి అందుకు దోహదపడ్డాయి.
నాట్యం పట్ల మక్కువ ఎలా కలిగింది ? మీ గురువులు, అభిమానించే నృత్యకారులు ఎవరు ?
నాకు తొలిగురువు శ్రీమతి పద్మాంజలి గారు. అందకు మునుపు శ్రీమతి హేమలతగారి వద్ద (బహుశ 4-5 సంవత్సరాల వయసులో శిష్యరికం
చేసినా,ఒక క్రమబద్ధమైన నాట్యం అన్నది అభ్యసించింది శ్రీమతి పద్మాంజలి గారి వద్దనే అనుకోవచ్చు. వీరు పాత సినిమాలలో అనేక ముఖ్య పాత్రలు వేసి మంచి నటిగా పేరొందిన వారు. వారు ముచ్చటిస్తున్నపుడు వెంపటి పెదసత్యం గారు.పసుమర్తి కృష్ణమూర్తి గారు, వేదాంతం రాఘవయ్య గారు – ఇలా ఎందఱో మహానుభావుల గురించి చెప్పేవారు.
నా వయస్సు అప్పటికి 7-8 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఆవిడ నాపై చూపిన వాత్సల్యం నేను ఎన్నటికీ మరువలేను. నన్ను చిన సత్యంగారి వద్దకు తీసుకువెళ్ళారు. ఎంతోమంది మహామహులకు నన్ను పరిచయం చేసారు.
పద్మావతిగారి ద్వారానే శ్రీ నటరాజ రామకృష్ణగారి వద్ద, శ్రీమతి మరియు శ్రీ ఉదయకాంతగార్ల వద్ద నృత్యం అభ్యసించాను. 2005 లో హైదరాబాదు తరలి వచ్చిన తర్వాత శ్రీ భాగవతుల సేతురాం గారి వద్ద సర్టిఫికేట్ కోర్సు చేసి,2007-2009 లో ఎం.ఏ. కూచిపూడి రెండు బంగారు పతకాలతో సాధించాను. నాకు అంతటి మంచి గురువులు లభించడం నా అదృష్టం.
నేను అభిమానించే నృత్యకారులు అనేకమంది ఉన్నారు. కథక్ నృత్యాచార్యులు శ్రీ గోపీ కృష్ణ పండిత బూర్జూ మహారాజ్ కూచిపూడికి చెందిన శ్రీ వేదాంతం సూర్యనారాయణ శర్మ గారు వెంపటి చినసత్యం గారు ఇలా చెప్పాలంటే స్పూర్తిదాతలు అనేకులు.
ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ప్రతిరంగంలో ఒడిదుడుకులు అనేవి తప్పవు. నా పంతొమ్మిదవ యేట, నేను డిగ్రీ చేస్తునపుడే నాడు “ఇండియన్ బ్యాంక్”లో క్యాషియర్ ఉద్యోగం వచ్చింది. అది కర్ణాటక లోని రాయచూరులో చేయవలసి వచ్చింది. దాని వలన నా నృత్యబ్యాసం దాదాపు మరుగున పడినట్టే అయింది. కానీ, నా వరకు నేను సాధన చేసుకోవడం తప్పితే, నాట్యాన్ని నా కెరీర్ గా మార్చుకోవాలన్న ఆలోచన అప్పట్లో నాకు లేదు.
అయితే కొన్ని కుటుంబ కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసాను. దానికి నేను ఎన్నడు బాధ పడలేదు. బాధపడను కూడా. ఆ భగవంతుని నిర్ణయాన్ని నేను మనసా వాచా కర్మణా నమ్ముతాను. నా వివాహం జరగక ముందు, ఆ తర్వాత కొంత విరామం వచ్చినా, వివాహానంతరం
తిరుపతిలో శ్రీ కాందా రవికుమార్ గారి వద్ద అభ్యాసం పునః ప్రారంభించాను.నేను నా నృత్యాన్ని పునః ప్రారంభించిన తర్వాత ఇదే నా కెరీర్ ఎందుకు కాకూడదు అని అనిపించి, నలుగురికి నేర్పడం మొదలు పెట్టాను. అయితే నేను వెనుతిరిగి చూసుకునే అవకాశం రానంత అద్భుతంగా సాగుతోంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రత్యేకించి ఇందులో నేను పడిన కష్టాలేవీ లేవు. ఆ దేవుని దయ, నా గురువుల ఆశీర్వాదబలం నన్ను నడిపిస్తున్నాయని అనుకుంటాను.
తిరుపతిలో శ్రీ కాందా రవికుమార్ గారి వద్ద అభ్యాసం పునః ప్రారంభించాను.నేను నా నృత్యాన్ని పునః ప్రారంభించిన తర్వాత ఇదే నా కెరీర్ ఎందుకు కాకూడదు అని అనిపించి, నలుగురికి నేర్పడం మొదలు పెట్టాను. అయితే నేను వెనుతిరిగి చూసుకునే అవకాశం రానంత అద్భుతంగా సాగుతోంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రత్యేకించి ఇందులో నేను పడిన కష్టాలేవీ లేవు. ఆ దేవుని దయ, నా గురువుల ఆశీర్వాదబలం నన్ను నడిపిస్తున్నాయని అనుకుంటాను.
నాట్య కళలో మీరు విశిష్టంగా చేసిన వైవిధ్యమైన ప్రయోగాలు ఏమిటి?
నేను ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెడుతున్నాను. వైవిధ్యభరితంగా ఏదైనా నేను చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే, నా గురువులలో ఒకరైన సేతురాం గారు ఇలాంటి ప్రయోగాలు చేయడంలో నిష్ణాతులు వారి అనేక ప్రయోగాలలో నేను పాలుపంచుకోవడం నాకు చాలా విధాలుగా సాయపడింది. చేస్తే అలా చేయాలి అని అనుకుంటాను కాబట్టి, దానికి ఇంకా నా అనుభవం సరిపోవని నా అభిప్రాయం.
అయితే ఇటీవలకాలంలో నేను నృత్యరూప కల్పన చేసిన “మహాన్ భారతోహం” అన్న శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడు గారి రచన వైవిధ్యమైన రూపకల్పనగా చెప్పవచ్చు. ఇది కేవలం ఆరంభమే.
మీరు చేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బాలె గురించి చెప్పండి.
ఇప్పటి వరకు నేను నృత్యకల్పన చేసిన నృత్యరూపకం “కృష్ణవేణి వైభవం” ఇది అన్ని విధాల నాకు సంతృప్తి నిచ్చినది.బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారెచే ప్రశంసలు అందకున్న రూపకమిది.ఇది కృష్ణానది పుట్టుపూర్వోత్తరాల గురించిన నృత్యరూపకం.
“శ్రీ కృష్ణ తత్త్వం” అన్న ఒక నృత్య కదంబం కూడా రూపొంచించడం జరిగింది.కేవలం అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీ కృష్ణుని జననం నుండి భగవద్గీత వరకు సాగే నృత్యకదంబం.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
అవార్డులేవి లేవు.గత ఆరు సంవత్సరాలుగా కాకినాడ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రతి దసరా మహోత్సవానికి ఆహ్వానం లభిస్తోంది.అదేగాక కరూర్ లోని “నాట్యాంజలి” నృత్య మహోత్సవం తి.తి.దే వారి “నాదనీరాజసం” ఇత్యాది ప్రదర్శనలు నాకు చాలా గుర్తింపు నిచ్చాయి.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు గానీ, విహాహానంతరం నా జీవితభాగస్వామి గానీ ఏనాడు నా అభిరుచులకు అడ్డు చెప్పలేదు. వారు అందిస్తున్న సహకారం అపారం. వారి ప్రోత్సాహం లేకపోతే నేను ఏ పని చేయలేకపోయేదాన్ని అన్నది సత్యం.
మీ డాన్స్ స్కూల్ గురించి చెప్పండి?
అభినయ కూచిపూడి కళాక్షేత్రం 2005 లో స్థాపించబడినది. కేవలం ఒకరిద్దరితో మొదలైన మా కళాక్షేత్రం నేటికి 300 పై చిలుకు నృత్యకళాకారిణులతో వెలుగొందు తుంది. దీనికి కారకులైన మా పిల్లలు, వారి తల్లిదండ్రులకు నేను సర్వదా కృతజ్నురాలై వుంటాను.
కళాక్షేత్రంలో నృత్యశిక్షణ ఇవ్వబడుతుంది అనడం కన్నా, ఈ కళలో జీవించడం నేర్పబడుతుంది అన్నది సమంజసంగా ఉంటుంది.నా వద్ద నున్న పిల్లలు దీన్ని తమ జీవితంగా భావిస్తారన్నది చెప్పగలను. నృత్యాన్ని పిల్లల వికాస ప్రక్రియగా వారికి నేర్పించబడుతుంది.
ఇప్పటివరకు అనేకమంది కళాకారులు సర్టిఫికేట్ కోర్సు ను ముగించి ఇంకా కొనసాగుతున్నారు.
10. భావి నృత్యకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
సందేశాలు ఇచ్చేంత అనుభవం నాకు లేదు. నేను నమ్మిన సిద్దాంతం ఒకటే అది – ఆత్మను నమ్మడం,పరమాత్మను నమ్మడం.నిరంతరం ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని, అది సాధించడం కొరకు సాధన చేయడమే జీవితం అని నా అభిప్రాయం. లలితకళలు కానీ మరేదైనా విద్య కానీ పిల్లలను పరిపూర్ణ వ్యక్తిత్వంతో వికసించేలా చేయాలి.ఆ దిశలో తల్లిదండ్రులు, గురువులు పిల్లలను పెంచితే దేశం బాగుపడుతుంది.ఆ బాధ్యతను నా పరిధిలో నేను తీసుకున్నాను.
కళ – పేరు ప్రతిష్టలు ,ధనార్జన ప్రదర్శనల కోసం కాదు. మనలను మనం మార్చుకుంటూ భగవంతుని చేరే మార్గం అని తెలుసుకున్న రోజు కళాకారుడు/కళాకారిణి సంపూర్ణత సంతరించుకుంటారు.
శ్రీమతి శ్రీలతా ప్రసాద్ గారు అఖండ విజయాలను సాధించి, చిరకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని, మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు.
No comments:
Post a Comment