నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)-మల్లెమొగ్గ
శారదాప్రసాద్
గురజాలలో మాకు బంధువులు ఉండేవారు .వారు మా నాన్నగారి పినతల్లి కూతురు,అల్లుడు.ఆ రోజుల్లో మా బంధువుల్లో వారు గొప్ప ధనవంతులు.పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చినప్పుడు మేమందరమూ మా స్వగ్రామమైన మాచవరం వెళ్లేవారం.మా నాన్న పినతండ్రి గారి కుమారుడు,అంటే నాకు బాబాయి అన్నమాట!ఆయన చాలా హాస్యప్రియుడు.అందరికీ గమ్మత్తైన పేర్లు పెట్టేవారు.విశేషం ఏమంటే తల్లి తండ్రులు బాలసారె రోజు సుముహూర్తాన బియ్యంలో వ్రాసిన పేర్లు కాకుండా ,మా బాబాయి గారు పెట్టిన పేర్లే స్థిరపడిపోయేవి ! ఆయనకు ఒక్కడే కుమారుడు.వాడు నా కన్నా పెద్దవాడు.వాడికి కార్లు అంటే చెప్పలేనంత పిచ్చి. గురజాల వస్తే, వాడు మధ్యాహ్నం భోజన సమయం దాకా బస్సు స్టాండ్ లో ఉండి వచ్చేపోయే రకరకాల వాహనాలను చూస్తూండేవాడు.ఆ రోజుల్లో పల్నాడులో ఎక్కువగా శౌరయ్య గారి ప్రైవేట్ వాహనాలు నడుస్తుండేవి.అప్పటికి ఇంకా RTC బస్సులు రాలేదు. ఆ పాతకాలం బస్సులు కొన్నిటిని బొగ్గుతో కూడా నడిపేవారు.ఆ బస్సులకు ముందర మూతి (లాగా) ఉండేది. దానిలోనే ఇంజన్ ఉండేది.అప్పట్లో కొత్తగా ఇప్పటిలాంటి మూతిలేని బస్సులు రావటం ప్రారంభించాయి.మా వాడు ఇంటికొచ్చి "ఈ రోజు మూడు మూతిలేని బస్సులను చూసాను,వాటి రంగులు ఇవి!" అని ఆనందంగా వివరించి చెప్పేవాడు.ఇక వారి స్వగ్రామం వెళ్లిన తర్వాత వాడు స్కూల్ కు వెళ్ళేటప్పుడు,డుర్ ,డుర్ ...అని శబ్దాన్ని నోటితో చేసుకుంటూ,చేతులతో స్టీరింగ్ పట్టుకున్నట్లుగా చక్కని భంగిమలో స్కూల్ కు వెళ్ళేవాడు. వాడు ఏదైనా మారం చేస్తే ,మా బాబాయి గారు వాడిని సముదాయిస్తూ,"నాన్నా!కారు కొనిపెడతాలే !"అనేవారు.అలా అలా వాడి పేరు కాస్తా 'నాన్నాకారు' గా మిగిలిపోయింది. అసలు ఇంకా విచిత్రమేమంటే ,వాడి అభిరుచికి తగినట్లుగా పెద్దైన తర్వాత వాడికి APSRTC లోనే ఉద్యోగం వచ్చింది. సర్వీస్ అంతా అందులోనే చేసే ఇప్పడు విశ్రాంత జీవితాన్ని హైదరాబాద్ లో గడువుతున్నాడు.ఇక నా పేరుకు వస్తే,నా మేనత్తలు ఎవ్వరూ నన్ను పేరు పెట్టి పిలవలేదు,"నాయనగారూ!" అని పిలిచేవారు.ఎందుకంటే నాకు మా తాతగారి పేరు పెట్టారు కనుక! నా పెదతల్లి గారు "మామగారూ!" అని పిలిచేవారు.ఇంట్లో నన్ను "బాబు" అని పిలిచేవారు.నాకు తమ్ముడు పుట్టిన తర్వాత అది కాస్తా "పెదబాబు" గా మారింది.బంధువుల్లో చాలామందికి నా పేరు తెలిసేది కాదు.పెదబాబుగానే బంధులోకంలో నా పేరు స్థిరపడిపోయింది.ఒకసారి ఒక బంధువు బ్యాంకుకు వచ్చి,"మా పెదబాబు !ఇక్కడేనా పనిచేసేది?"అని అడగగానే ,స్టాఫ్ అంతా బిక్క మొహాలు వేశారు.ఎక్కడో ఆ
గొంతు విన్నట్లుగా ఉందని లోపల నుంచి బయటకు వస్తే ,వచ్చినాయన మా బాబాయి.వీడే! పెదబాబు అంటూ అందరికీ చెప్పాడు.ఆయనను తీసుకొని ఇంటికి వెళ్లాను.ఆ తర్వాత బ్యాంకులో కొద్దిగా చనువున్న వారు కూడా పెదబాబు అని పిలవటం ప్రారంభించారు.ఇక మా స్వగ్రామంలో ఇతర కులస్తులందరూ నన్ను "తాతగారూ!"అని పిలిచేవారు.పెళ్ళైన కొత్తల్లో నా భార్య కూడా నన్ను "తాతగారు" అని పిలుస్తూ ఎగతాళి చేసేది.ఏది ఏమైనా నా పేరు మాత్రం పెదబాబుగానే స్థిరపడింది.ఈ పేరు కూడా పెట్టింది మా బాబాయి గారేనట ! ఇప్పటికీ నా మనవళ్లు నన్ను,"బాబు తాతయ్య" అని పిలుస్తుంటారు.ఇక గురజాలలోని మా బాబాయి గారి చెల్లెలికి స్త్రీ సంతానం ఎక్కువ!మొదటి అమ్మాయికి "లక్ష్మీనరసమ్మ"అనే నామకరణం చేశారు తల్లితండ్రులు.పిల్ల తెల్లగా ,చక్కగా ఉండేది.ఆ అమ్మాయి అందాన్ని చూసి మా బాబాయి గారు ఆ అమ్మాయికి "మల్లెమొగ్గ"అనే పేరు పెట్టారు.ఆ అమ్మాయి అసలు పేరు కాస్తా మరుగున పడిపోయి ,ఈ మల్లెమొగ్గ అనే పేరే స్థిరపడింది.మేమందరమూ కూడా ఆమెను ఈ మధ్యదాకా కూడా "మల్లెమొగ్గ" అనే పిలిచేవాళ్ళం! మల్లెమొగ్గ ఎంత చక్కని పేరు!మల్లెమొగ్గ గుబాళింపు ఎక్కువ కాలం ఉండదు. అయితే అదిచ్చే ఆ పరిమళం మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది.మల్లెమొగ్గ జీవితం కూడా ఆఖరికి అంతే అయింది. పూర్ణాయుర్దాయాన్ని అనుభవించకుండా ఒక ఏడేళ్ళ క్రితం అర్ధాంతరంగంగా మల్లెమొగ్గను కాలం కాన్సర్ రూపంలో కాటేసింది.భౌతికంగా "మల్లెమొగ్గ" నల్లపడి ఉండొచ్చు!కానీ "మల్లెమొగ్గ" అందరి మనస్సులో మాత్రం మొగ్గగానే మిగిలిపోయింది!
"మల్లెమొగ్గ" ఆత్మ శాంతించుగాక!"మల్లెమొగ్గ "చిరంజీవి.ఎందుకంటే ,మల్లెమొగ్గలను చూసినప్పుడల్లా ఆమె గుర్తుకు వస్తుంది!
***
EXCELLENT NARRATION
ReplyDelete