ఓటమీ..!! - అచ్చంగా తెలుగు
ఓటమీ..!!
 శ్రీధర్ చౌడారపు

నాకు తెలుసు 

నువ్వు నా వెన్నంటే వస్తున్నావని
నను వీడని నీడలా నన్నంటే ఉన్నావని
అడుగుల్లో అడుగేస్తూ
వడివడిగా నావెనకే నడుస్తున్నావని...

నాకు తెలుసు

నా లక్ష్యానికి అడ్డంగా 
చీకటి తెరలెన్నో దింపావని
దుమ్ముతెరలెన్నో దట్టంగా లేపావని
నా దారి పొడవునా 
ఆటంకాల కంటకాలు పరిచినావని
అవరోధాల కందకాలు లోతుగా తవ్వినావని...

అలసత్వపు వల విసిరి నను బంధించాలని
అనుమానాల ఉచ్చులు వేసి పడగొట్టాలని
అనుక్షణం ఆలోచిస్తున్నావనీ
ఆచరణలో పెట్టేస్తూ ఉన్నావనీ 
నాకు తెలుసు... నిశ్చయంగా తెలుసు...

నీడలా నన్ను వెంటాడుతున్నావనీ
ఆదమరిస్తే, ఒక్క క్షణం ఏమారిస్తే
ఆదాటున నీ కౌగిటిలో బంధిస్తావనీ
ఒడిలో చేర్చుకొని ఓర్పుగా
ఓదార్పు గీతాల జోల పాడతావనీ
నీ రసరమ్య మందిరాన
సరస శృంగార క్రీడల్లో ఓలలాడిస్తావనీ 
మురిపించి మైమరిపించి 
నా ధ్యేయాన్ని మరిపించి
నా దారి మల్లిస్తావని, దారే లేకుండా చేస్తావని
నాకు తెలుసు... నిశ్చయంగా తెలుసు...

అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు
అలా అలా అలసి సొలసి
నీ ఒడిలో అడ్డంగా వాలిపోయినా
లక్ష్యపథాన్ని వీడి నీ ప్రణయాగ్నికీలల్లో 
నిలువుగా కాలిపోయినా
ఆ నెగడుల్లోని నివురుల్లోంచి
ఆ బుగ్గి అయిపోయిన బూడిదల్లోంచి
మరోసారి కొత్తగా పుడతాను
మరింత దీటుగా ముందుకెడతాను

నన్ను అందుకోవాలనే
నీ పట్టుదలను చూస్తే ముచ్చటేస్తోంది
ఇష్టంలేని నా పొందు కోరే
నీ ఆశను చూస్తే జాలేస్తోంది
ఎన్ని చేసైనా నన్ను లొంగదీసుకోవాలనే
నీ జిత్తులు చూస్తే అసహ్యం వేస్తోంది

"ఓటమీ" ... వెళ్ళిపో...
నీ ఆకారం అగుపించనంతటి దూరాల్లోకి
నీ అస్తిత్వం ఆవిరయ్యేంతటి వేడి ఎడారుల్లోకి

నేను
ప్రయత్నాన్ని నేను
నిరంతర ప్రయత్నాన్ని నేను
నా ప్రయాణం ... లక్ష్య సామ్రాజ్యానికే
నా పాణిగ్రహణం
గెలుపు సుందరి సుందరహస్తాలతోనే
    
 *****
  
 


No comments:

Post a Comment

Pages