ప్రారబ్ధం - అచ్చంగా తెలుగు
ప్రారబ్ధం
  -చెన్నూరి సుదర్శన్.

“ఏమయ్యా.. వింటున్నావా..! మిమ్మల్నే..! చెవుల్లో చెట్లేమైనా  మొలిచాయా.. ఊ..! అనవు.. ఆ..! అనవూ.. !!” అంటూ ఆశమ్మ వెటకారంగా ముఖంలో ముఖం పెట్టి చూసే సరికి  ఝల్లున వణికాడు చంద్రయ్య.
“ఏంటీ.. ఇంకా ఆలోచించేదీ..” అంటూ దీర్ఘాలు తీసింది. “నేను చెప్పిందేమన్న తల కెక్కిందా.. లేదా..!”  కనుగుడ్లు బండిగీరల్లా తిప్పుతూ అడిగింది ఆశమ్మ. 
ఆశమ్మ చూపు ధాటికి తట్టుకోలేక చంద్రయ్య నేల చూపులు చూడసాగాడు.. 
“అది న్యాయంకాదే ఆశమ్మా.. నా మాటిను. నేను నలుగురికి చెప్పేవాన్నే గాని.. చెప్పించుకునే వాన్ని గాను” అన్నాడు భయం భయంగా.. బట్టతలగోక్కుంటూ.
 “అయితే ఇలాగే  మన  పాపిగాడు తిడుతూంటే.. కొడుతూంటే.. వీపులప్పగించి ఇకిలిద్దామా..!.. చేతులు జోడించి దండాలు పెడదామా..!” అనుకుంటూ  అరచేతులు చటుక్కున చరిచి..  అపహాస్యంగా తిప్పింది.
“మన పాపయ్యను మనం దారిలోకి  తెచ్చుకోవాలిగాని అలా   అడ్డ దారి  తొక్కితే బాగుంటుందా..! నల్గురు  మన నోట్లో ఊమ్మేయరూ...” కాస్తా  ధైర్యం తెచ్చుకొని నోటి వాల్యూం పెంచాడు చంద్రయ్య. 
ఆశమ్మ కయ్యిన లేచింది దీపావళి మతాబాలా..“ఏం పెద్దమనిషివయ్యా.. ఊళ్ళో అందరికీ పంచాయితీ తీర్మానాలు చేసేవాడివే గదా..! మన కొడుకును మనం కావాలని అడిగితే నలుగురుమ్మేస్తారా..! బలే చెప్పొచ్చావు..” మూతి మూడు వంకర్లు తిప్పింది.. అలనాటి నటి ఛాయాదేవిలా. “నీలాంటి   తెలివిగల మొగవాడీలోకంలో మరొకడున్నా..డు”  శాపనార్థాలు పెడుతున్నట్లు చేతులూపసాగింది.
“ఇప్పుడు సత్తయ్య మన కొడుకెలా అవుతాడు.. ఏనాడో మరదలు సావిత్రమ్మకు సాదుకోనిస్తిమి. ఇప్పుడు వెళ్లి  మా  సత్తయ్యను మాకివ్వమని  ఏముఖం పెట్టుకొని అడగ్గలం”
“ఎందుకడుగలేమూ.!. కాగితాలేమైనా రాసుకున్నమా..! పూసుకున్నమా..!”
“కాగితం కరారానే.. మాట కరారుగాని. మనది నాలికా.. తాటిమట్టా..!  అయినా గిన్నేండ్ల తరువాత  వాడేదో నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నాడని ఆశపడి పోయి మా కొడుకు సత్తయ్య మాక్కావాలి.. అని అడుగుదామా..! నీకు  ఆలోచన తక్కువ.. స్వార్థమెక్కువ అని తెలుస్తోంది” మరింత ధైర్యంగా అన్నాడు చంద్రయ్య. వాదన పెంచితే వాడవాడకట్టు జనం  జమకూడుతారని జంకి.. లేచి జోళ్ళల్లో కాళ్ళు జొప్పించాడు.  బీడీ వెలిగించుకొని .. ఒక్క అంగలో  ఆవల పడ్డాడు. 
“నువ్వేం అడుగకు.. గాజులు తొడిగించుకొని ఇంట్లో ఓ మూలకు కూర్చో.. సమర్తాడిన పోరిలాగా. నేనే వెళ్లి  అటో ఇటో తేల్చుకుని వస్తా.. ” 
ఆశమ్మ మాటలు  చంద్రయ్య చెఎడంవిలో దూరగానే.. సుతారంగా బీడీ పొగ ఊదినట్లు  కుడిచెవి గుండా ఊదేసాడు. 
ఆశమ్మ శోకునం బెట్టి ఏడ్వసాగింది.
ఆడవారికి ఆయుధమే ఏడుపు. వారికి దేవుడిచ్చిన గొప్ప వరమది. ఇలాగే ఏడుస్తూ బెదిరిస్తారని బేఫికరుగా బీడీ దమ్ము మరో మారు గట్టిగా  లాక్కుంటూ నడక వేగం పెంచాడు చంద్రయ్య.
“నా కొడుకో కొడుకా..! మమ్ముల్ని ఎంత అన్యాయం  చేస్తివవిరా కొడుకా..!  ఏ ముదనష్టపు వేళల్లో  కొడుకా..! నిన్ను సాదుకోనిస్తిమిరా.. కొడుకా..! మా సావుమీదికొచ్చిందిరా కొడుకా..!” ఎగబోసుకుంటూ ఏడ్వ 
సాగింది ఆశమ్మ. 
 నలుగురొచ్చి సానుభూతి వచనాలు పలుకుతారనుకుంటే.. ఇంకా ఎవరూ రాలేదేమని అటూ ఇటూ చూసి..  తన ఏడుపును తారాస్థాయికి పెంచింది.. 
 “నా బంగారు కొండవురో.. సత్తయ్య! మల్ల  మనింటికి తిరిగిరారో.. సత్తయ్య! నీ అన్న పాపయ్యా.. సత్తయ్య!. మమ్మల్ని.. అరిగోస పెడ్తాండురా.. సత్తయ్య!. వానికి బుద్దన్న చెప్పురా.. సత్తయ్య!. మా బతుకు బండలైనైరో సత్తయ్య!. నువ్వస్తే బాగుపడతైరో.. సత్తయ్య!” అని వల్లించుకుంటూ.. వల, వల ఏడ్వసాగింది. ఆమె కళ్ళల్లో  నీళ్ళు  కాలువలై కారసాగాయి. ముక్కు చీది గోడకు పూసింది.. కొస కొంగుతో తుడ్చుకున్నది. ముక్కు చివర కందిపోయింది. 
ఆశమ్మ ఆశయం సిద్ధించింది. వాడజనం వాగులా  తరలి వచ్చారు. 
ఆశమ్మ ఏడుపుకు కారణం తెలిసిన కాంతమ్మ మనసు కరిగిపోయి ఊరడించ సాగింది.
“ఏంటీ.. కాంతమ్మవదినా.. ఎందుకేడుస్తుంది ఆశమ్మ” అని గుంపులో నుండి ఆ వాడ  కడింటికి   కొత్తగా వచ్చిన  కోడలుపిల్ల కొమురమ్మ అడిగింది. ఆమెకింకా వాడకట్టు ముచ్చట్లు తెలిసి రాలేదు.
చెప్పాలా ..! వద్దా..! అన్నట్లు ఆశమ్మ వంక  చూసింది కాంతమ్మ. ఆశమ్మ నుదురు సుతారంగా కొట్టుకోసాగింది.
“ఊరుకో..ఆశమ్మా.. ఊరుకో..! ఇప్పుడనుకొని ఏం లాభం.. ముందు చూపు లేకపోవడం  అంతా అనర్థానికి దారి తీసింది” అంది కాంతమ్మ. 
 కొమురమ్మను చూసుకుంటూ.. ఆశమ్మ ఇంటి కథ హరికథలా   చెప్పసాగింది కాంతమ్మ.
“అశమ్మకిద్దరు కొడుకులు కొమురమ్మా. పెద్దోడు పాపయ్య.. చిన్నోడు సత్తయ్య. ఇద్దరికీ యాడాది భేదం. సత్తయ్య తరువాత  మళ్ళీ కాన్పు కాదనుకున్నది ఆశమ్మ. కాని దేవుని లీలలు ఎవరికెరుక. నాలుగేండ్లకు మళ్ళీ నీళ్ళు పోసుకున్నది.  
ముగ్గురుపిల్లలతో సంసారం గడవడం కష్టమని అనుకున్నారో ఏమో..!  ఆశమ్మ తోటి కోడలు సావిత్రమ్మ.. పాపం విధవరాలు.. పిల్లలు లేకుంటే  సత్తయ్యను సాదుకోనిచ్చారు.. సత్తయ్య వీరి గడప అలా దాటాడో లేదో..  ఇలా వీరికి కష్టాలు మొదలయ్యాయి”
ఏంటాష్టాలన్నట్లు  కొమురమ్మ ముఖం పెట్టెసరికి.. కాంతమ్మ గొంతు సవరించుకొని మళ్ళీ చెప్పడమారంభించింది. 
పాపయ్య మహా దేశముదురు. దారెంట  నడిచే వారిని వావి వరుస లేకుండా.. బండబూతులు తిట్టేవాడు. ఒక రోజు  ఆశమ్మ చెయ్యిసేసుకున్నది. ఆకోపంతో  పాపయ్య దొంగలా వచ్చి..  ఆశమ్మను అరుగుపై నుండి కిందకు తోసేసాడు. బొక్కబోర్ల పడిపోయింది.. గిజ గిజలాడిండి  ఆశమ్మ.  వెంటనే ఆశమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్లాం.
ఆశమ్మ గర్భం  పోయింది. పోతే పోయింది.. పెద్ద ప్రాణం దక్కిందని చంద్రయ్య మనసుకు తృప్తి చేసుకోక తప్పలేదు.   
ఇంత జరిగినా పాపయ్యలో ఇసుమంత కూడా  మార్పు రాలేదు. ఇంటికి పెద్డోడే  బుద్ధిమంతుడవుతాడు. చిన్నవాడు తుంటరి అవుతాడని నానుడి. కాని  వీళ్ళింట్లో సత్తయ్య చిన్నోడే బుద్ధిమంతుడయ్యాడు. సిటీలో  పెద్ద జాబ్ చేస్తున్నాడు.  సావిత్రమ్మను  తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.
 ఇక్కడేమో.. పెద్దోడు పాపయ్య పననడు.. పాటనడు. వీధీ రౌడీలా తయారయ్యాడు.
  చంద్రయ్యది మొగ్గం గుంటలో  బతుకు. అందులో ఆదాయమేముంది..?  ‘గడియ రికాం లేదు.. గవ్వ 
రాకడలేదన్నట్టు’ ఇద్దరు రెక్కలు ముక్కలు సేసుకున్నా ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళడం కష్టమాయె.. పైపెచ్చు పాపయ్య పీక్క తినడం.. లోపుకు తాగుడం.. తాగటానికి డబ్బులివ్వకుంటే తన్నడం.. వీపులు చీరెయ్యడం.
 అమ్మా.. నాన్న అనే గౌరవమర్యాదలు గాని.. నీతి నియమాలు గాని లేవు. థూ.. పాడు బతుకు” అనుకుంటూ కాంతమ్మ చెబ్తుంటే.. కొమురమ్మ మ్రాన్పడిపోయి.. నోరు తెరిచి.. ముక్కుమీద వేలేసుకుంది. 
 “అదుగో.. పాపయ్య వచ్చేస్తున్నాడు..” అని జనంలో నుండి ఎవరో ఒక అమ్మాయి   కీచు పిట్టలా   కేక పెట్టింది. 
 గాలి దుమారానికి కాగితాలు కొట్టుక పోయినట్లు.. ఎవరింటికి వారు చెల్లాచెదురయ్యారు.
***
 తెల్లవారుఝాము.. 
చంద్రయ్య ఇంట్లో నుండి ఏడ్పులు.. పెడబొబ్బలు మిన్నంటాయి.  
 వాడ సాంతం  లేచి పరుగెత్తుకు వచ్చింది.
 వాకిట్లో వరిగడ్డి పరచిన  ఈతచాప మీద చంద్రయ్యను పడుకోబెట్టి తెల్లగుడ్డ కప్పారు. తలాపుకు దీపం.. అగరొత్తులు వెలిగించి వున్నాయి.  
ఆశమ్మ నెత్తీ నోరు కొట్టుకుంటూ ఏడుస్తోంది. పాపయ్య రెండు చేతులు గదుమ కింద పెట్టుకొని కనురెప్పలాడించకుండా చూస్తూన్నాడు.  కన్నీళ్లు తుడుచుకోవాలన్న ధ్యాసలో లేడు.
ఇంతలో వీధి గుమ్మం ముందు కారాగిన  చప్పుడయ్యింది. 
సత్తయ్య, సావిత్రమ్మ రావడం చూసి  ఆశమ్మ గుండెలు మరింత గట్టిగా బాదుకోసాగింది.. 
వాకిట్లో చంద్రయ్య శవాన్ని చూడగానే..  కాళ్ళపై కుప్పలా కూలిపోయాడు సత్తయ్య. 
సావిత్రమ్మ.. అశమ్మ మీదబడి శోకునాలు పెట్టసాగింది. 
వాతావరణమంతా కన్నీటిమయమయ్యింది.
 “నాన్నా.. ఇక లేచి కూర్చో..” అంటూ  చంద్రయ్య మీద  కప్పిన తల్లగుడ్డను లాగాడు పాపయ్య. 
చంద్రయ్య అమాంతం లేచి కూర్చున్నాడు.. 
 ఆశమ్మ గావుకేకపెట్టి మంచంపై నుండి దిగ్గున లేచి కూర్చుంది. గజ గజా వణకసాగింది.         
 “ఏమయ్యింది ఆశమ్మా..!” అంటూ  ఆశమ్మ భుజం తట్టాడు చంద్రయ్య. ఆశమ్మ కళ్ళు తెరచి  పిచ్చి చూపులు చూడసాగింది.
“పీడకలగాని  వచ్చిందా.. అలా కేక పెట్టావేంటి?..  నాకు గుండె ఆగినంత పనయ్యింది. నీ మనసులో యింకా  సత్తయ్య  ఆలోచనలే ఉన్నాయి. మన  ఆలాపనలోనే  కలలోకి  రావడమూ కద్దు.  ఏం కల వచ్చింది..?” అనుకుంటూ  ఆశమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చిరునవ్వుతో అడిగాడు చంద్రయ్య. 
 ఇంటి వెనకాల గదిలో  జల్లకింద కోడి పుంజు ‘కొక్కొరో.. కో..’ అని కూయ సాగింది. 
ఇంకా ఆశమ్మ భయం నుండి తెరుకోలేదని.. చంద్రయ్య నెమ్మదిగా  ఆశమ్మ  పక్కనే మంచంమ్మీద కూర్చున్నాడు. 
కాసంత దూరంలో పాపయ్య నులుకమంచంలో మహారాజులా గుర్రు పెడ్తుండటం ఆశమ్మ చూసింది. దొరకింకా రాత్రి తాగింది దిగనట్టుంది..ఈ లోకంలో లేడని మనసులో అనుకుంటూ   మంచం కిందికి వంగి సర్వలో ఉన్న మంచినీళ్ళు గ్లాసులో వంచుకొని త్రాగింది. 
“పీడకలనే..” అన్నది గొంతు సవరించుకుంటూ.
చంద్రయ్య  గడుమ కింద అరచేయి పెట్టుకొని  కళ్ళు మిటకరిస్తూ ఆశమ్మనే చూడసాగాడు.
“మళ్ళీ పాపయ్యతో అనేవు.. నా చావుమీదకొస్తుంది” అనుకుంటూ  చంద్రయ్య  చెవిలో  గుస, గుసలాడుతూ విషయం వివరించసాగింది.
“పాపయ్య బతికుండగా  సత్తయ్య మన వద్దకు రాడని.. వాన్ని లేపేస్తే  పీడ పోతుందని మజ్జిగలో  విషం కలిచ్చానట. అది తాగితే నిషా  దిగుతుండని నాకు తెలియకుండా  పాపయ్య  నీకిచ్చాడట..  మీరది తాగి నేలకొరిగారట. నేను ఏడుస్తుంటే.. పాపయ్య నన్నే అనుమానంగా  చూడసాగాడు. కాకులు కలవడం ( సంయోగం) మీ నాన్న  చూసాడు. కీడు తగిలింది.. కింద పడిపోయాడు. ఎవరైన బంధువులు వచ్చి ఏడిస్తే కీడు తొలగి పోతుంది. లేపితే లేచి  కూర్చుంటాడని మాట మార్చి పాపయ్యకు చెప్పాను.   
ఎలా తెలిసిందో ఏమో..! సావిత్రమ్మ, సత్తయ్యలు వచ్చి ఏడుస్తున్నారు. కాసేపటికి పాపయ్య  మీ మీద కప్పిన గుడ్డ లాగాడు. మీరు   చటుక్కున లేచి కూర్చునేసరికి  దయ్యమనుకొని దడుసుకుని గట్టిగా కేక వేసా..” అని చెబుతుంటే ఆశమ్మ కళ్ళల్లో నుండి సన్నగా కన్నీరు కారసాగింది. 
చంద్రయ్య గుండె జారిపోయింది. నెమ్మదిగా దిండు కిందున్న   బీడీల కట్ట అగ్గిపెట్టె తీసి   ఒక బీడీ వెలిగించాడు. తుపుక్కున  గోడకు ఉమ్మేసి.. “నిజంగా పాపయ్యను పైకి పంపుదామని నీమనసులో వుందా..?” అంటూ అడిగాడు చంద్రయ్య. ఆశమ్మ మౌనంగా వుండి పోయింది.  
“ఆశమ్మా.. దొరికిన కాడికి తిని మనసు  తృప్తి చేసుకోవాలి గాని.. అయినదానికీ.. కానిదానికీ ఇలా తప్పుగా ఆలోచిస్తూ.. అందని ద్రాక్ష పండ్లకు  అర్రులు చాచడం అవివేకం. దేనికైనా ప్రారబ్ధముండాలి. నిన్ను చూస్తుంటే నా ప్రాణమంతా  ఆవిరై పోతోంది” అనుకుంటూ.. బీడీ మరో  దమ్ము లాగాడు.“నీ మనసు కష్ట పెట్టుకోకు. నువ్వన్నట్లే ఒకసారి  పట్నం పోదాం.. అడగందే అవ్వైనా బువ్వ పెట్టదన్నట్టు మనింట్లో మనముంటే నీవనుకున్నది జరగదు. ఒక సారి  సావిత్రమ్మను.. సత్తయ్యను కూర్చోబెట్టి విచారిద్దాం.. మనకష్టాలు చెప్పుకుందాం. ఆపైన ఆపరమాత్ముడున్నడు” 
ఆశమ్మ ముఖం ట్యూబులైటులా వెలిగింది. ఇన్నాళ్ళకు మొగడు నా మీద దయ తలచాడని ఎంతగానో మురిసీ పోయింది. రెక్కలు గట్టుకొని పోయి సత్తయ్య కాళ్ళ మీద వాలుదామన్నంత సంబరపడింది. ఇంటి పాచిపని  చిటికెలో  చేసుకోవాలని లేచి గోచి పెట్టింది.
వాకిట్లో పందిరి మీద  కాకులు కావు.. కావుమంటున్నాయి. 
మొగ్గంనేయాలనే ప్రయత్నంలో నేత చాపుతున్న చంద్రయ్య కాకులరావం వింటూ... “ఆశమ్మా.. కాకులు అరుస్తున్నాయి.. చుట్టాలొస్తారా..” అనుకుంటూ..  ఆరిపోయిన బీడీని చెవి సందులో దోక్కోని తెరలు.. తెరలుగా..  ముసి, ముసి నవ్వలొలకించసాగాడు.
“ఇంటికి పెద్దచుట్టం.. గద్దలా  మన పాపయ్య వుండంగా మనింటికిచుట్టాలెవరొస్తారు..! అయినా మనమే కొంచెంసేపైతే బయటపడదామాయే..” అని మునికాళ్ళ మీద నడుచుకుంటూ ఇంటి వెనకాలకు పరుగుదీసింది. వాకిలి  చిమ్మాలని చీపురు చేతులోకి తీసుకుంది.  
వీధిలో కారాగిన చప్పుడయ్యింది.
“అదిగో... పాపయ్యను పట్టుకపోను అత్తగారొచ్చినట్లున్నారు” అనుకుంటూ  “పాపయ్యా లేవరా.. నీకోసం పోలీసులొచ్చారు.. రాత్రి ఏం ఘనకార్యం వెలగబెట్టావో.. ఏమో..!” చేతిలోని  చీపురు నేలకు కొట్టి  పాపయ్యను లేపసాగింది  ఆశమ్మ.
“దమాక్ ఏమైనా కరాబయ్యిండా.. పొద్దుపొద్దున్నే నా కోసం పోలీసులు రావడమేంటి” అని   బూతుల పురాణం చదువుకుంటూ..  దుప్పటి అంచు కాళ్ళ కింద తన్నిబట్టి మరింత పైకి  లాక్కోని తల కనబడకుండా సర్డుకున్నాడు పాపయ్య.
చంద్రయ్యకు చల్ల చెమటలు పోసాయి.. చేతిలోని నేత జారిపోయింది.  ఆశమ్మను తలుపు తీయబోతూంటే పిల్లికూనలా  ఆమె వెనకాలే నక్కి చూడసాగాడు. 
“అమ్మా.. నేను సత్తయ్యను.. తలుపు తీయి..” అనుకుంటూ తలుపు తట్టుడు శబ్దం వేగం పెరిగింది. 
“నీ నాలుక మీద మచ్చ ఉందేమో..! కాకుల అరుపులేమో గాని.. మీరన్నట్టే చుట్టాలొచ్చారు” సత్తయ్య పిలుపు  విని సంబరపడుతూ  తలుపు తీసింది ఆశమ్మ.
ఎదురుగా  సత్తయ్య.. సావిత్రమ్మ.  వంగి చంద్రయ్య, ఆశమ్మ కాళ్ళుకు నమస్కరించారు.  
సత్తయ్యను దగ్గరికి తీసుకొని నొసలు ముద్దాడింది ఆశమ్మ. నోట మాటరాక  కనుగుడ్ల నిండా కనీళ్ళు తిప్పుకుంది. 
“అక్కయ్యా.. బావగారూ.. అంతా కులాసాయేనా..” అంటూ  సావిత్రమ్మ కుశల ప్రశ్నలు కురిపించింది. 
“సత్తయ్యా.. నీకు  నిండా నూరేళ్ళ ఆయుష్షు కొడుకా..” అంటూ ఆశమ్మ దీవించగానే గోడమీద బల్లి పలికింది.. “క్రిష్ణ.. క్రిష్ణా.. ఇందాకనే మీ గురించి మాట్లాడుకుంటున్నాం.  సత్తయ్యను   చూడక చాలా  రోజులయ్యిందని మీనాన్నా.. నేను.. తలుచుకుంటున్నాం. ఇంతలో దేవునిలా  ప్రత్యక్షమయ్యావు.” అనుకుంటూ  కొస కొంగుతోని కన్నీళ్ళు తుడ్చుకోసాగింది ఆశమ్మ.
 “బావగారూ.. మీ ఆరోగ్యమెలావుంది” అడిగింది సావిత్రమ్మ. ఆశమ్మను చూసుకుంటూ “అక్కయ్యా.. నువ్వేంటి.. బొత్తిగా చిక్కి పోయావ్..” అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది.
 ముగ్గురూ  మాటల్లో పడ్డారు.
మాటలన్నీ వినుకుంటూ.. పోలీసులు  కాదని నిర్థారించుకున్నాడు పాపయ్య. ధైర్యంగా  కప్పుకున్న  దుప్పటి తొలగించుకుని లేచి  కూర్చున్నాడు. పాచి ముఖం  చూపించ బుద్ధిగాక ఇంటి వెనకాలకు పరుగెత్తాడు. గోలెం లోని నీళ్ళతో ఫ్రెషపై హాల్లోకి వస్తూ.. “తమ్ముడూ .. ఎంత సేపయ్యిందిరా వచ్చి.. చిన్నమ్మ కూడా వచ్చినట్లుంది..” సంతోషంగా పలుకరించాడు.
తిరిగి నేరుగా ఇంటి వెనకాలున్న  జల్ల కాడికి వెళ్లి   కోడిపుంజును పట్టుకున్నాడు. ఆదివారం నాప్రాణం మీదికి వచ్చిందని కోడి  అరుపు ‘కొయ్యక్..! కొయ్యక్..!!’అన్నట్లు వినవస్తోంది.   
ఆపూటకు చుట్టాల విందు భోజనానికి సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యాడు పాపయ్య.  
***
ఆరోజు  మగ్గానికి సెలవు ప్రకటించాడు చంద్రయ్య.
తేప తేపకు ఆశమ్మ చేసే సైగలకు ‘భోంచేసాక అడుగుదాం.. కొంచెం ఓపిక పట్టు ’ అన్నట్లు తిరిగి సైగలతోనే సమాధానమివ్వసాగాడు చంద్రయ్య.  
ఆశమ్మమ్మ.. సావిత్రమ్మలు  వంటపనిలో మునిగిపోయారు..
మేఘాలు ఎక్కడో తమ ప్రతాపం చూపించినట్లుంది.. వాతావరణం చల్లబడి.. చల్లని గాలి తోలసాగింది.
వాకిట్లో మంచం వాల్చి దుప్పటి పరిచాడు చంద్రయ్య. సత్తయ్య, పాపయ్య నడుం వాల్చుకొని ఊరి ముచ్చట్లు ముచ్చటించుకోసాగారు. కాని సత్తయ్య ఉద్యోగం గురించి గాని.. జీతభత్యాల గురించిగాని  పాపయ్య అడగడం లేదు.. సత్తయ్య చెప్పడంలేదని..  వేపచెట్టు  గద్దెపై కూర్చున్న చంద్రయ్య  మనసులో ఆరాటం ఒక ప్రక్క.. చానాళ్ల తరువాత  సత్తయ్య.. సావిత్రమ్మ రావడం సంభ్రమాశ్చర్యాలు  మరో  ప్రక్క.. ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. 
 ఇంతలో భోజనానికి రండని పిలుపునిచ్చింది ఆశమ్మ. చంద్రయ్య  ఆలోచనలాగిపోయాయి.
ఆశమ్మ కొడుకులకు వడ్డిస్తుంటే.. చంద్రయ్య ముచ్చటగా చూడసాగాడు.
“సావిత్రమ్మా.. చెయ్యి కడుక్కో..” మురిపెంగ మూతిపెట్టి బతిమాలింది ఆశమ్మ. 
“మనిద్దరం తరువాత  భోంచేద్దామక్కయ్యా.. ” అన్నది సావిత్రమ్మ. 
ఇలాంటి తీయని మాటలు వినరాక చెవులు తుప్పు పట్టినై.. ఎన్ని యాడాదులు గడిచాయో..! అని మనసులకు రాగానే చంద్రయ్య కళ్ళల్లో ఆనందభాష్పాలు దొర్లాయి.   
భుజం మీదున్న  కండువాతో కళ్ళు తుడ్సుకోసాగాడు. ఇదంతా సత్తయ్య ఓరగంట కనిపెడుతూనేవున్నాడు.
***
అందరి భోజనాలయ్యాయి. వంటిల్లు సర్ది వచ్చి కూర్చున్నది ఆశమ్మ. 
చంద్రయ్య అడిగినా.. అడుగక పోయినా.. తాను మాత్రం అడిగి తీరాలని  గొంతు  సవరించుకుంటుంటే.. 
“అమ్మా.. మిమ్మల్ని ఒక వరం అడుక్కుందామని వచ్చాము” అంటూ విషయం కదిలించాడు సత్తయ్య.  ఆశమ్మ గతుక్కుమంది.. నోరు మూసుకు పోయింది.
సావిత్రమ్మ అడుగు  కొడుకా అన్నట్లు తల విసిరింది. 
చంద్రయ్య నిశ్చేష్టుడయ్యాడు.  పాపయ్య మనకెందుకులే.. అన్నట్లు ఇంటి వాసాలు లెక్కించసాగాడు.
“నేను చెప్పిందంతా విని.. కాదనమని ముందుగా నాకు మాటివ్వండి” అంటూ  సత్తయ్య బిచ్చగాడిలా చూసాడు చంద్రయ్యను.. అంజమ్మను.
‘ఎంత కష్టమొచ్చిందో కొడుక్కు’ అని మనసులో బాధ పడుతూ మాటిచ్చాడు చంద్రయ్య. వీడు మాకే ఎసరు పెట్టడానికై  వచ్చాడని.. ఆశమ్మ కళ్ళు నిలబడి పోయాయి. 
“నన్ను పెంపకానికిచ్చినా.. మీ కొడుకునుగాకుండా పోను. మన రక్త సంబంధం తెగిపోయేదిగాదు. అందుకే ఈరోజు ఒక వరం  కోరుకుందామని మీ వద్దకు వచ్చాను. మిమ్మల్ని ముందుగా వేడుకుంటున్నాను.. నా కోరిక కాదనకండి” 
‘ఏమడుగేనూ.. ఏంటి..!..  కొడుకా..! శరణు.. శరణు.. అనుకుంటూ.. వాని దగ్గరికి పోదామనుకుంటే.. వాడే  ఇలా  వచ్చి  మమ్ముల్ని  వరాలడుగుతున్నాడని  ఆశమ్మ కోపంతో లోన కుత కుత లాడిపోతోంది. కోపాన్నంతా ఎదలో  అదిమి పట్టుకొని  నేల చూపులు చూడసాగింది. 
ఆశమ్మ మదిలోని ఆందోళను గమనించి  సత్తయ్య  సన్నగా  నవ్వుతూ..  
“మీ ఆశీర్వాదబలం వాళ్ళ నాకు బాగా చదువు అబ్బింది.. నాబ్రతుకును ఒక గాడిన పడేసింది. దేవుని దయవల్ల మంచి ఉద్యోగమూ వచ్చింది..  కంపెనీ వాళ్ళు నాకు కారుతో బాటు సకల సౌకర్యాలూ కల్పించారు. ఇప్పుడు నాకూ.. సావిత్రమ్మకూ.. మీ మీదనే ధ్యాస. ‘బిడ్డా.. వాళ్లనూ చేరదీయాలిరా..’ అంటూ ప్రతీరోజు సలహాలిచ్చేది. 
 నాన్నా... మీకోసం  మెన్ రోడ్డుకు ఒక మడిగె అద్దెకు తీసుకున్నాను. అందులో బట్టల షాపు పెట్టుకుందాం. అన్నయ్య, మీరు  దుకాణం నడపండి. 
మన కోసం ఒక పెద్ద ఇల్లు కొన్నాను. అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం.. కాదనవద్దు. వరమివ్వండి” అంటూ ఆశమ్మ, చంద్రయ్య కాళ్ళపై వాలిపోయాడు సత్తయ్య.
సావిత్రమ్మ కొంగు చాపి “అక్కయ్యా.. నాకెవ్వరున్నారు చెప్పండి.. మీరు తప్ప. అనాడు  కొంగు పరిస్తే దయతో సత్తయ్యను నాచేతుల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నా కొంగు పరిచి వేడుకుంటున్నాను..  మన కొడుకు కోరినన వరమే నేనూ కోరుకుంటున్నాను. మనందరం పట్నానికి పోదాం.. కాదనకండి” అనుకుంటూ కన్నీరుపెట్టుకోసాగింది.  
చంద్రయ్య ఆశ్చర్యపోతూ నోరు తెరిచాడు.
మళ్ళీ కలగంటున్నానా..  అన్నట్లు  ఆశమ్మ పిచ్చి సూపులు చూడసాగింది.
“అన్నయ్యకూ.. నాకూ పెళ్ళిళ్ళు మీచల్లని చేతుల మీదుగా  జరగాలి” అంటూ  సత్తయ్య  దీనంగా  తలెత్తి చూడసాగాడు.
చంద్రయ్య సత్తయ్య భుజాలు పట్టుకొని లేపి హృదయానికి హత్తుకున్నాడు.
“తమ్ముడూ.. చిన్న వాడివై పోయావురా.. లేకుంటే నీకాళ్ళు  మొక్కేవాణ్ణి ” అంటూ  కంటతడితో  పాపయ్య లేచి వస్తుంటే.. చంద్రయ్య ఒక చెయ్యి చాపి దగ్గరికి తీసుకున్నాడు. 
అలా  ముగ్గుర్ని చూస్తూ.. ఆశమ్మ ఎంతగానో ఉప్పొంగి పోయింది. 
సావిత్రమ్మ పరిచిన కొంగును రెండు చేతుల్తో కళ్ళకద్దుకుంది ఆశమ్మ. 
***        
  

1 comment:

  1. కథ బాగుంది. విమర్శించడం అనవసరం. లోటుపాట్లేవో రచయితకే తెలుసు, లేక తెలుస్తాయి.

    ReplyDelete

Pages