ప్రేమతో నీ ఋషి – 35 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి35
-      యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.  ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని  చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ  మృణాల్ శవం కనిపిస్తుంది  స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి వెళ్లి, అక్కడ మృణాల్, అప్సరను ఎవరో కాల్చి చంపడం చూస్తాడు ఋషి. తమ చుట్టూ ఎవరో ఉచ్చు బిగిస్తున్నారని తెలుసుకున్న ఋషి, స్నిగ్ధ  జరిగినవన్నీ శర్మ గారికి చెప్తారు. కాని, ఆయన మాటలు వేరే అర్ధాన్ని ధ్వనింపచేస్తాయి. ఇక చదవండి...)
వాళ్లకు ఈ పెయింటింగ్ చరిత్ర తెలిసినట్లయితే, మమ్మల్ని మోసగించేందుకు వారు ప్రయత్నించేవారు కారేమో! ఒక డిజిటల్ కాపీ ని సృష్టించి, నకిలీ దాన్ని మాకు అమ్మడం ద్వారా వాళ్ళు మమ్మల్ని మోసం చెయ్యాలనుకున్నారు. వారికి అంత తప్పనిసరి ఆర్ధిక అవసరాలు ఏమున్నాయో నాకు తెలీదు కాని, వారు మమ్మల్ని మోసం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇటలీ నుంచి మృణాల్ విశ్వామిత్ర పెయింటింగ్ కొన్నాడని, మహేంద్ర గమనించిన మరుక్షణం, ఆ పెయింటింగ్ ప్రామాణికతను ఖాయం చేసుకోవాలని అతడు అనుకున్నాడు.”
“చివరికి అసలైన పెయింటింగ్ “గార్డెన్ హోటల్” లో వెలుగు చూస్తుందని, అప్సర, మృణాల్ అసలు ఊహించి ఉండరు.” ఋషి మిష్టర్ శర్మ చెబుతున్న వారి పధకాన్ని పూర్తి చేసాడు.
వారి ఊహా సత్యమే. కాని, ఉగ్రవాద దాడి వలన అసలైన విశ్వామిత్ర చిత్రం వెలుగులోకి వచ్చింది. లేకపోతే అప్సర, మృణాల్ ల పధకం ప్రకారమే  అంతా సవ్యంగా జరగాల్సింది. ఆ పెయింటింగ్ తాలూకు ప్రమాణ పత్రాల విషయంలో కూడా వారు స్నిగ్దను తేలిగ్గా మోసం చేసి ఉండేవారు. స్నిగ్ధ కనుక వారిని నమ్మినట్లయితే, మహేంద్ర తదుపరి వివరాల్లోకి వెళ్లి ఉండేవాడు కాదు. గార్డెన్ హోటల్ లో బయల్పడిన సత్యం వారి ఆటను కట్టించింది.”
“అయితే, మిష్టర్ శర్మ, ఇప్పుడు నాకు పూర్తి కధ అర్ధమయ్యింది. కాని, ఒక్క విషయం ఇంకా మీనుంచి తెలియాల్సి ఉంది, మీ పధకాన్నంతా స్పష్టంగా నాకు వివరించడానికి కారణం ఏమిటి? ఇది నేను మరెవరికైనా చెప్పవచ్చని మీకు అనిపించలేదా?” సూటిగా అడిగాడు ఋషి.
మిష్టర్ శర్మ నవ్వి, “ఋషి, ఈ మొత్తం ఆట నడపడానికి ఇంత ప్రణాలికను సిద్ధం చేసిన నేను నీకు మూర్ఖుడిలా కనిపిస్తున్నానా?” అని అడిగారు.
“మిష్టర్ శర్మ ఒక జీనియస్ అని ఈ పాటికే నువ్వు అర్ధం చేసుకుని ఉండాలి. నీ ద్వారా మీ బ్యాంకులో మహేంద్ర తెరిచిన ఖాతాలన్నీ నిర్వాణా ప్లస్ ఉద్యోగుల కోసం, వాస్తవానికి ఆ ఉద్యోగులే లేరని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా?” కొత్త  స్వరం ఎక్కడి నుంచి వస్తోందా అని చూసేందుకు ఋషి వెనుదిరిగాడు, అది మహేంద్ర గొంతు. ఋషి తన కళ్ళను తానే  నమ్మలేకపోయాడు. మహేంద్ర బాహాటంగా ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడతాడని అతను అసలు ఊహించలేదు.
“ఏది మంచో, ఏది చెడో చర్చించుకునే కంటే, మనం త్వరగా జరగాల్సింది చూడడం ముఖ్యమేమోనని నాకు అనిపిస్తోంది. ఈ దశలో నీకిక వేరే దారి లేదని నీకు అర్ధమయ్యి ఉంటుందని నమ్ముతున్నాను.” మహేంద్ర కూర్చుంటూ అన్నాడు.
ఇదంతా దేనికి దారి తీస్తోందో ఋషికి అర్ధం కాలేదు.
“ఇక నిన్ను ఇంకా తికమక పెట్టదల్చుకోలేదు. నువ్వు చెయ్యల్సింది చాలా సులభమైన సాయం, అయినా ఇదే మాకు కీలకమైనది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్విస్ బ్యాంకులోని మంత్రుల ఖాతాలకు సంబంధించి వచ్చే అభ్యర్ధనలను నువ్వు మాకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ అభ్యర్ధనలు మీ బ్యాంకు మన్నించినట్లయితే, నువ్వు వెంటనే ఆయా మంత్రుల ఖాతాల్లో ఉన్న డబ్బును నిర్వాణ ప్లస్ ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ చెయ్యాలి. అక్కడి నుంచి మేము, ఇండియాలో ఉన్న నిర్వాణా సంస్థ ట్రస్ట్ అకౌంట్లలోకి దాన్ని బదిలీ చేసుకుంటాము.” శర్మ కొనసాగించారు.
“నీ ఈ సాయానికి ఘనమైన పారితోషకం నీకు అందుతుంది,” మహేంద్ర సంభాషణ ముగించాడు.
ఋషి ధైర్యంగా ఇలా అన్నాడు,” ఇదంతా నేను చెయ్యలేనని అంటే, ఇవన్నీ పోలీసులకు చెప్తానని అంటే, మీరేం చెయ్యగలరు?”
మహేంద్ర టీవీ ఆన్ చేసాడు. అందులో ఒక వీడియో ప్లే అవసాగింది. అది చూసి ఋషి తడబడిపోయాడు.
అందులో స్నిగ్ధ మహేంద్ర ఆఫీస్ లోకి అడుగు పెడుతూ ఉండగా, ఆమె మృణాల్ హత్య చెయ్యబడి ఉండడం చూసిన సి.సి.టీవీ ఫుటేజ్ లు ఉన్నాయి.
“కాని, ఈ క్లిప్పింగ్ తర్వాత కూడా మృణాల్ సజీవంగా ఉన్నాడు. నేనతన్ని నా కళ్ళారా చూసాను.”ఇది పనిచేస్తుందో లేదో తెలియకపోయినా, ఋషి ధైర్యంగా పలికాడు.
“అది కేవలం నిన్న నువ్వు అప్సర ఇంటికి వెళ్ళే వరకే. ఇప్పుడు అప్సర, మృణాల్ ఇద్దరూ చనిపోయారు. ఇది నీక్కూడా బాగా తెలుసని భావిస్తున్నాను.” అన్నారు మిష్టర్ శర్మ నింపాదిగా.
తనను అంత సమీపంగా వారు వెంటాడారని తెలుసుకున్న ఋషి షాక్ కు గురయ్యాడు. మారిన వీడియో క్లిప్పింగ్ లు అతని ఆలోచనలను మళ్ళించాయి. నకిలీ బయో మెట్రిక్స్ తో వారు ఆఫీస్ గదిని తెరవడంతో సహా, మహేంద్ర ఆఫీస్ లో జరిగిన వాటన్నింటినీ ఆ కెమెరా రికార్డు చేసింది. అందులో ఋషి రహస్యంగా అప్సర ఇంట్లోకి వెనుక దారిలో ప్రవేశించడం కూడా ఉంది. గత రాత్రి అప్సర ఇంట్లో తన కదలికలకు సంబంధించిన వీడియో కూడా ఈపాటికి సిద్ధమవుతూ ఉంటుందని అతనికి ఖచ్చితంగా తెలుసు.
“కాబట్టి ప్రియ మిత్రుడా ! ఇది పోలీసులు తెల్చిపారేసేందుకు చాలా సులువైన కేసు. అంతకు ముందు రోజు తనను వేధించాడు కనుక స్నిగ్ధ మృణాల్ ను చంపిందని పోలీసులు ఊహించుకుంటారు. ఈ ఊహను నకిలీ బయో మెట్రిక్ ల ద్వారా మీరు మహేంద్రను మోసగించాలని చూడడం నిర్ధారిస్తుంది. మహేంద్ర బాల్యమిత్రుడు, మాంచెస్టర్ సిటీ హాస్పిటల్ డాక్టరు అయిన వశిష్ట పోలీసులకు దీన్ని నిర్ధారించి చెప్తాడు. సి.సి.టీవీ ఫూటేజ్ తగని వేళలో మహేంద్ర ఆఫీస్ లో మీ కదలికల్ని తెలియజేస్తుంది. చివరగా, అప్సర హత్య సమయంలో ఆమె ఇంట్లో నీవు ఉండడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఇక్కడ నేను మేనేజ్ చేస్తున్న ఒకేఒక్క విషయం మృణాల్ మృత దేహాన్ని మహేంద్ర ఆఫీస్ కు తరలిస్తున్నాను, మనం మాట్లాడుతూ ఉండగా, అదీ జరిగిపోతుంది.” మిష్టర్  శర్మ అన్నారు.
తనను అన్ని వైపులా నుంచి టార్గెట్ చేసారని ఋషికి ఇప్పుడు పూర్తిగా అర్ధమయ్యింది. మహేంద్రతో, శర్మతో జాగ్రత్తగా వ్యవహరించడం తప్ప, అతనికిక వేరే మార్గం లేదు.
“విశ్వామిత్ర పెయింటింగ్ పట్ల నీకున్న గుప్తమైన ఆసక్తి, చివరికి నువ్వు ఊహించనంత పెద్ద ఆపదలో నిన్ను పడేసింది,” ఋషిని చూసి నవ్వుతూ అన్నాడు మహేంద్ర.
“ అందుకే మరింత రిస్క్ తీసుకోకుండా, మిష్టర్ శర్మ చెప్పినట్లుగా చెయ్యి. లేకపోతే, నువ్వు దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందే ఆలస్యం అయ్యింది, ఇక నేను దీన్ని త్వరగా పూర్తి చెయ్యాలి. మిష్టర్ శర్మ ఈ ప్రక్రియకు సంబంధించిన పత్రాలన్నీ సక్రమంగా ఉండేలా చూసి, దాన్ని ప్రభుత్వానికి అందిస్తారు, అది వారి రికార్డులలోకి వెళ్తుంది. మిష్టర్ శర్మ చెప్పినట్లు చేసినన్నాళ్ళూ, నీ జీవితాంతం, నువ్వు విలాసవంతంగా గడపచ్చు. నువ్వు తెలివైన నిర్ణయం తీసుకుంటావని నాకు ఖచ్చితంగా తెలుసు.” ఇలా చెప్పి, మహేంద్ర వెళ్ళిపోయాడు.
(సశేషం) 

No comments:

Post a Comment

Pages