పుష్యమిత్ర - 24 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 24
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని  ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.   శ్రీహరికోట పై దాడిని భారత అధికారులు ధృవపరచగా పాక్ అధ్యక్షుడు దాన్ని ఖండిస్తాడు. హిమాలయాలపై భయంకర మంచుతుఫాను రాబోతున్నదని జనం సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్ళే తరుణంలో పుష్యమిత్రుడు బాబాజీ ద్వారా ఉపదేశం పొంది మళ్ళీ జ్ఞాన సమాధిలోకి వెళ్తాడు. బాబాజీ ఆ గుహలోకి ప్రవేశించి ఒక పేటికను సిద్ధం చేశాడు. పుష్యమిత్రుడు బాబాజీ ఆదేశాలమేరకు లోపల పవళించాడు. ఒక మెరుపుతీగ వంటి కాంతి పుంజం దానిపైబడి పేటిక మొత్తం ఒక నాళికలా తయారయింది.  ఆ నాళిక గాలిలో తేలుతూ హిమాలయాలవేపుకు సాగిపోయింది.  (ఇక చదవండి)
వర్తమానంలో:  ఐ.సీ.యు చేరుకున్న డాక్టర్ల బృందం  అలాగే కళ్ళు తెరుచుకుని పై కప్పుకేసి నిశితంగా చూస్తున్న ఆకారం కేసి చూడ సాగారు.  ఐదు నిముషాల అనంతరం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ...ఆ ఆకారం  "నేనెక్కడ ఉన్నాను? ఇది స్వర్గ లోకమా? మీరు దేవతలా?" అని ప్రాచీన సంస్కృతం లో అడిగాడు. అర్ధం కాక అందరూ సంస్కృత పండితుని కుమారుడైన  డా.ప్రశాంత్ చతుర్వేది వైపు చూసారు. చతుర్వేది "లేదు ఇది భూలోకమే! మీరు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో ఉన్నారు"  అన్నాడు. అర్ధం కాని ఆ ఆకారం "సరిగ్గా చెప్పండి.. మీ మాటలు నాకు అవగతం అవడం లేదు" అని అనగానే మళ్ళీ సంస్కృతం లో టైం క్యాప్స్యూల్ దొరికిన దగ్గర నుండి ఇప్పటి వరకూ క్లుప్తంగా వివరించాడు. డా.చతుర్వేది ఓ రొండు నిముషాలు ఆగి... "మీ నామ ధేయం ఏమిటి?"  అని అడిగాడు ఆ ఆకారాన్ని.  దానికి జవాబుగా ఆవ్యక్తి "పుష్యమిత్రుడు" అన్నాడు. చతుర్వేదితో బాటూ అందరూ ఆగదిలో ఒక్కసారి డైనమేట్ పేలినట్టుగా.. ఉలిక్కిపడ్డారు.  ఎవరికీ నోట మాటలేదు. నిశ్చేష్టులై నిలబడిపోయారు.. ఏ పుష్యమిత్రుడు? క్రీస్తు పూర్వం 180 - 149 సంవత్సరాలకు చెందినవాడా? అని సంభ్రమాశ్చర్యాలతో అలోచిస్తూ ఉండగా...ఆ ఆకారం మళ్ళీ   " అవును! నేను పుష్యమిత్రుడనే!" ఈ దేశాన్ని పరిపాలించిన పుష్యమిత్రుడినే! మౌర్య చక్రవర్తులచే పాలింపబడి అణగారిపోయిన హిందూ మతాన్ని పునరుద్ధరించిన పుష్యమిత్రుడను!  మౌర్య వంశంలో కడపటి రాజైన బృహద్ధ్రధ మహారాజు తర్వాత పరిపాలించిన శుంగవంశానికి చెందిన  చక్రవర్తిని... అనగానే అక్కడ ఉన్న ఓ ఐ.యే.ఎస్ అఫీసర్ ఉండబట్టలేక.. "బృహద్ధ్రధుడిని సంహరించి సింహాసనం అధిష్టించిన పుష్యమిత్రుడు మీరేనా?" అన్నాడు సంస్కృతం లో తన పరిజ్ఞానం ఉపయోగిస్తూ "ష్ష్!!"..అలా మాట్లాడకు అన్నాట్టు సైగ చేసాడు డా.చతుర్వేది.  "మరి ఇన్ని వేల సంవత్సరాలు ఈ పేటికలో ఉన్నారా?" అన్న డా.చతుర్వేది ప్రశ్నకు చిరునవ్వు నవ్వి పుష్యమిత్రుడు "అంతా దైవేఛ్చ" అన్నాడు. ఇంతలో భారత ప్రధాన మంత్రి అక్కడకు వచ్చారు. మందీ మార్బలాన్ని దూరంగా ఉంచి దగ్గరగా వచ్చి పుష్యమిత్రుడిని గమనించాడు.
పుష్యమిత్రుడికి వారు ఈదేశాధిపతి ప్రధానమంత్రి అనగానే పుష్యమిత్రుడు.."మరి రాజు ఎవరు?" అని అడిగాడు. ప్రధానమంత్రి నవ్వి "ప్రస్తుతం రాజుల కాలం అంతరించింది. ప్రజా పరిపాలనలో ఉన్నాం" అని ప్రశాంత్ చతుర్వేది వేపు చూసి "అన్నీ వివరంగా చెప్పండి. నేను మళ్ళీ కలుస్తాను" అని నిష్క్రమించాడు. పుష్యమిత్రుని ఏకసంధాగ్రహతను అర్ధంచేసుకున్న వారు ఆయనకు అన్ని విషయాలు చెప్పసాగారు.
పుష్యమిత్రుడు అతి కొద్ది కాలంలో గీర్వాణభాష ద్వారా హిందీ భాషను సులభంగా నేర్చుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలు అన్ని వివరాలు చెప్పారు. ప్రపంచ దేశాల గురించి, సమీప దేశాల ఉగ్రవాద చర్యలు అన్నీ విశదపరచారు. కొద్దికాలం పాటు పుష్యమిత్రుని ఉనికిని దానికి సంబంధించిన వార్తా పత్రికలలో, మీడియాల్లో రాకుండా చూడమని కోరాడు ప్రధానమంత్రి. పుష్యమిత్రునికి ఆ నగరం చూడాలని కోరిక కలిగింది. వెంటనే ఒక పెద్ద ఓపెన్ కార్లో దిల్లీ నగరం మొత్తం చూడడానికి ఏర్పాట్లు చేశారు. పుష్యమిత్రుడు తన రధాల కాలానికి ఇప్పటి అతివేగంగా వెల్లే కార్లు, రైళ్ళు మొదలైనవి చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.
పుష్యమిత్రుడు హిందీ భాష బాగా అధ్యయనం చేసిన మీదట, వార్తా పత్రికలను, దూరదర్శనులను చూడడం ద్వారా అన్ని విషయాలను ఆకళింపు చేసుకో గలిగాడు. ఒకసారి ప్రధానమంత్రిని కలవాలని కోరాడు. వెంటనే పుష్యమిత్రుడు విడిది చేసిన భవంతిలోనే ఆ ఏర్పాట్లు చేయబడ్డాయి.
ప్రధాన మంత్రి రాగానే గౌరవపూర్వకంగా పుష్యమిత్రుడు వందనం చేసి నిల్చున్నాడు. పీ.ఎం. "పుష్యమిత్రా! ఇంకా నాకు కలా నిజమా అనిపిస్తున్నది" అంటూ కరచాలనం చేశాడు. పుష్యమిత్రుడు కొంతసేపు మౌనం వహించి "నేను పాకిస్తాన్ (ఒకప్పటి మయూర సామ్రాజ్యం) గురించి మాట్లాడాలనుకొంటున్నాను" అన్నాడు.

ప్రధాన మంత్రి అక్కడ ఉన్న అనుచరులను బయటికి వెళ్ళమని సైగ చేశాడు. వాళ్ళు బయటికి వెళ్ళగానే "చెప్పండి" అన్నాడు. "అకారణంగా వాళ్ళు ఎందుకు మనపై కాలు దువ్వుతున్నారో అర్ధం కావడంలేదు. వాళ్ళ దేశం వాళ్ళు పరిపాలించుకొంటున్నారు. మనదేశం మనది. వాళ్ళు జలాంతర్గాములను పంపి మన దేశ వినాశనానికి ఎందుకు పాల్పడుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.
ప్రధాని నవ్వి "పుష్యమిత్రా! పూర్వం మీ రాజుల కాలంలో కూడా అశ్వమేధ యాగాలు చేసి ఇతర రాజ్యాలవారందరూ తమకు కప్పం కడుతూ సామంతులుగా ఉండాలనుకున్నారు కదా! ఇదీ అలాంటిదే! దీనికి అగ్రరాజ్యాలైన అమెరికా లాంటి దేశాలు వాళ్ళను మనపైకి ఉసిగొల్పుతుంటారు. కానీ ఈమధ్య వారి ప్రవృత్తి అర్ధం చేసుకుని ధనసహాయం నిలుపుదల చేశారు. అయితే మనకూ వారికీ మధ్యన రావణ కాష్టం కాశ్మీర్ సమస్య" అని ఆగాడు.
"ఆ సమస్య కొంచెం వివరంగా చెప్పండి" అన్నాడు.
"కాశ్మీరు వివాదం  అన్నది భారత  పాకిస్తాన్ మరియూ కొంతమేరకు చైనాల మధ్యనున్న ప్రాదేశిక వివాదం. కాశ్మీరు ప్రధాన అంశంగా భారతదేశం, పాకిస్తాన్ల నడుమ 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, కార్గిల్ యుద్ధము జరిగాయి. అంతేగాక భారతదేశం, పాకిస్తాన్ లు సియాచిన్ గ్లేసియర్ పై పట్టుకోసం పలు ఘర్షణలు చేశాయి. భారతదేశం జమ్ము కాశ్మీర్ మొత్తంపై తన హక్కును ప్రకటిస్తూండగా, దాదాపు 43శాతం భూభాగాన్ని నియంత్రిస్తోంది. భారతదేశం జమ్ము, కాశ్మీర్ లోయ, లడాఖ్, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలను పరిపాలిస్తోంది. భారతదేశపు హక్కును పాకిస్తాన్ వివాదపరుస్తోంది, పాకిస్తాన్ దాదాపుగా 37 శాతం కాశ్మీర్ను, ఆజాద్ కాశ్మీర్, గిల్గిత్ బాలిస్తాన్ ల పేరుతో నియంత్రిస్తోంది. చైనా ప్రస్తుతం డెమ్చోక్ జిల్లా, షాక్స్ గమ్ లోయ, అక్సాయ్ చిన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. 1962 నాటి భారత్ చైనా యుద్ధం నాడు చైనా ఆక్రమించిననాటి నుంచీ భారతదేశం ఈ ప్రాంతంపై చైనా అధికారాన్ని వ్యతిరేకిస్తోంది. అంతెందుకు ఐక్యరాజ్య సమితిలో మనం స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో  చైనాకు శాశ్వత సభ్యత్వం వచ్చేట్టు చేశాం. ఈనాడు వాళ్ళే మన సభ్యత్వానికి వ్యతిరేకంగా అడ్డుపడుతున్నారు. కాశ్మీరీ చొరబాటుదారులు, భారత ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ వివాదానికి మూలకారణం స్థానిక స్వయంప్రతిపత్తి అని ఒక వాదన. 1970 దశకం చివరి నుంచి 1988 వరకూ తప్ప ప్రజాస్వామ్య స్థితిగతులు నెలకోలేదు. 1988 నాటికి పలు ప్రజాస్వామ్య సంస్కరణలు మళ్ళీ స్థానిక పరిస్థితుల కారణంగా వెనక్కిపోయాయి. మళ్ళీ తిరిగి కాశ్మీరులో అల్లకల్లోలం ప్రారంభమైంది. 1987లో జరిగిన వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల అనంతరం వేర్పాటువాదం పుంజుకుని, కొందరు రాష్ట్ర శాసన సభ్యులు తిరుగుబాటు దళాలను కూడా ఏర్పరుచుకున్నారు. జూలై 1988లో వరుసగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు, దాడులతో కాశ్మీరు కల్లోలం ప్రాంభమైంది. జమ్ము, కాశ్మీర్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమంది మరణించినా,  క్రమంగా ఇటీవలి సంవత్సరాల్లో వివాదంలో ప్రాణనష్టం తగ్గుతోంది. పాకిస్తాన్ మన దేశ భూభాగం కొంత వశపరచుకోవడం దాన్ని పాక్ ఆక్రమించిన కాశ్మీర్గా పరిగణిస్తున్నాం. ఈ సమస్య ఎలా తేలుతుందో అర్ధం కాని పరిస్థితి" అని తలపట్టుకుని కూర్చున్నాడు ప్రధాని.
"ఈవిషయమై ఇరుపక్షాల నాయకులు ఒక సారి కూర్చుని వివరంగా మాట్లాడుకుని మళ్ళీ ఒక నియంత్రణ రేఖను ఏర్పాటు చేసుకోవచ్చు కదా!" అన్న పుష్యమిత్రుని మాటలకు ప్రధాని నవ్వి "కాశ్మీర్ సమస్యపై నిరంతరాయ చర్చలు ప్రారంభించనున్నట్లు మన మంత్రి ఈ మధ్య ప్రకటించారు. ప్రభుత్వ తరుపు ప్రతినిధిగా చర్చల్లో పాల్గొనేందుకు ఒక గూఢచారి అధికారిని నియమించాం. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అంశాల పట్ల ప్రభుత్వం  సున్నితంగా వ్యవహరిస్తోంది. ''బుల్లెట్లతోనో, దూషణలతోనో కాకుండా కాశ్మీర్ ప్రజలను ఆలింగనం చేసుకోవడం ద్వారానో సమస్యను పరిష్కరిస్తాం'' అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు నేను చేసిన ప్రకటన జమ్మూ కాశ్మీర్ పట్ల తమ ప్రభుత్వ విధానాన్ని, ఉద్దేశ్యాలను స్పష్టం చేస్తున్నాయని జనం మెచ్చుకున్నారు కూడా!  ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్షనేత స్పందిస్తూ "కాశ్మీర్సమస్యను రాజకీయ స్వభావాన్ని గుర్తించకుండా బలప్రయోగమే మార్గమని భావించే వారికి ఇది పెద్ద ఓటమి అని వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరి వారిపట్ల ఇప్పుడు కొంచెం మారింది. ఇది చాలా సున్నితమైన సమస్య" అని అన్నాడు.
మనదేశానికి ధనం సమస్య లేదు కదా! మరిన్ని ఆయుధాలను బాంబులను తయారు చేసి వారిని భయపెట్ట వచ్చుకదా! అన్న మాటలకు ప్రధాని "నిజమే! కానీ ధనం మన ఇష్టం వచ్చినంత మేరకు ముద్రించుకోలేము దానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి. అవి నేను మళ్ళీ ఒకసారి మీకు మనవి చేస్తాను. ప్రస్తుతం నాకు ఓ సమావేశం ఉంది. మళ్ళీ కలుస్తాను" అని నిష్క్రమించాడు. (సశేషం)

No comments:

Post a Comment

Pages