శ్రీమద్భగవద్గీత - 16
విజ్ఞానయోగము
ఏడవ అధ్యాయము
రెడ్లం రాజగోపాలరావు
మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తితత్వతః
- 3 వ శ్లోకం
వేలకొలది మనుజులలో ఏ ఒక్కరు మాత్రము మోక్ష సిద్ధికై యత్నించు చున్నారు అట్లు ప్రయత్నము చేయు వారిలో ఒకానొకడు మాత్రమే భగవంతుని వాస్తవముగా తెలుసుకొనుచున్నాడు ఈ అధ్యాయము పేరు విజ్ఞాన యోగము అనగా అనుభవ జ్ఞానము ఏ విషయము తెలుసుకున్న మనుజునకు ఇంకా తెలుసుకోవలసిన విషయముండదో అదియే విజ్ఞానము. మానవజన్మకు పరమార్ధము భగవంతుని తెలిసికొనుటయే ఈ విషయము తెలియువారు వేలలో ఒకరు. అట్టి జిజ్ఞాసువుల్లో ఒకానొకరు మాత్రమే గమ్యము చేరగలుగుచున్నారు.
చెట్టుకు యెన్నియోపూలు పూయును. అందు కొన్ని మాత్రమే పిందెలుగా మారును .ఆ పిందెల్లో కొన్ని మాత్రమే ఫలములగును. అట్లే ముముక్షువులకు భగవంతుని యందు భక్తి ఉదయింపవలెనన్న బహుజన్మ సుకృతముండ వలెను. ప్రకృతి ఆకర్షణలో అనేకులు కొట్టుకొని పోవుచుండ జన్మాంతర పుణ్యవశమున ఏ ఒకానొక ధీరుడో పరమాత్మను గూర్చి అన్వేషించి , ఎడతెరిపి లేని యత్నముచే, నిరంతర సాధనవల్ల సఫలీకృతుడగుచున్నాడు. బహుజన్మల పుణ్యఫలమువలన ఆధ్యాత్మ మార్గమున కొందరు ప్రయాణము ప్రారంభించినప్పటికీ, భగవత్సాక్షాత్కార లక్ష్యము చేరువరకు ప్రయత్నించువారు చాలా అరుదుగానుందురు.
ఆత్మానుభూతి మాటలవల్ల కలుగునదిగాదు, దానికి ఎంతయో మహత్తర ప్రయత్నమూ పట్టుదల, త్యాగబుద్ధి అవసరము. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమనము అవస్యకములు ముక్తి ధమమునకు బోవు మార్గములో అనేక పరీక్షలు జరుగును. నెగ్గినవారే పైకి పోవుదురు. పరిణామ క్రమములో మృగము మానవుడగుటకు చాల జన్మలు పట్టియుండినను మానవుడు మాధవుడగుటకు అంతకాలం అవసరము లేదు.
జనవరి నెలలో శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుచున్నవి. ఆ మహానుభావుని దివ్య జీవితములో కొన్ని విశేషములు మనము తెలుసుకుందాము వారు వ్రాసిన కృతులు సంగీత ప్రియులకు విందు భోజనములు ఈ సందర్బంగా మనం ప్రస్తావించవలసిన విషయం ఒకటుంది శ్రీ త్యాగరాజస్వామి వారు 98 కోట్ల పైచిలుకు రామనామ జపాన్ని పూర్తిగావించిన భక్తులు.32 వేల సంకీర్తనలు వ్రాయటంలో శ్రీ అన్నమాచార్యుల వారికి ఏ దివ్య ప్రజ్ఞ సహాయపడిందో శ్రీ త్యాగరాజస్వామి వారికి ఆ దివ్య ప్రజ్ఞ 98 కోట్ల రామనామ జప యజ్ఞానికి సహాయపడింది. కాకుంటే వీరిరువురి ఆధ్యాత్మిక ప్రగతి ఒకజన్మలో సాధ్యమయ్యేది కాదు. ప్రాపంచిక విషయవాసనలో తగుల్కొన్న మానవుడికి 98 కోట్ల రామనామజపము ఒక జన్మలో సాధ్యపడే విషయము కాదు. ఆహార , నిద్రాదులను లెక్కిస్తే ఒక జన్మలో అసాధ్యం. సర్వదా సర్వకాలేషు హరిచింతనం వారి ధ్యాసంతా భగవంతుడే.
శ్రీ త్యాగరాజ స్వామి జీవిత చివరి ఘట్టంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, తిరుగు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో వారికవగతమైన విషయమేమంటే, జీవిత మజిలీలో చివరి ఘట్టంలో వున్నారని.100 కోట్లు పూర్తి చేయాలని త్వరత్వరగా నామజప యజ్ఞాన్ని జరిపించారు. కాని 98 కోట్ల పైచిలుకు మాత్రమే పూర్తయింది. ఇప్పటివరకు అన్నికోట్ల నామజపం చేసినవారు లేరన్నది ఆశ్చర్యకరము.
భూమిరాపోనలో వాయుః
ఖం మనో బుద్ధిరేవచ
అహంకార ఇతీ యంమే
భిన్నా ప్రకృతి రష్టధా
- 4 వ శ్లోకం
భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ది అహంకారము అని ఈ ప్రకారముగా ఎనిమిది విధములుగా ఈ ప్రకృతి విభజించబడింది ప్రకృతి జడము పురుషుడు చైతన్య స్వరూపము. ప్రక్రుతి దృశ్యము పురుషుడు దృక్కు. ప్రకృతి నశించును పురుషుడు శాస్వతుడు మనస్సు బుద్ది అహంకారము అనునవి పంచభూతములతో పంచభూతములతో సమానముగా పరిగణించబడినది పంచభూతములు జడములు మనోబుధ్యహంకారములు కూడాను జడములే చైతన్యము ప్రవేశించిన తోడనే అవి పనిచేయును. జడమగు వస్తువు చైతన్య వస్తువుపై ఆధిపత్యము చలయింపజాలదు. ఈ రహస్యమును తెలిసికొన్నచో మనస్సును నిగ్రహించుట సులభము. కావున నిగ్రహించుటకు ప్రకృతి పురుష స్వరూప విజ్ఞానము ఆవశ్యకమైయున్నది.
మత్తః పరతరం నాన్యత్కించి
దస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం
సూత్రేమణి గణాఇవ
- 7 వ శ్లోకం
ఓ అర్జున నాకంటే వేరుగా ప్రపంచమున మరియాయాతి లేనేలేదు దారమందు మానులవలె నాయందీ సమస్త ప్రపంచము కూర్చబడినది. నువ్వులందు నూనెవలె మానులందు దారమువలె పాలయందు వెన్నవలె పరమాత్మ ఈ జగత్తునందు అణువణువు వ్యాపించియున్నాడు. మణిహారం నందు స్థూల దృష్టికి మాములే కనిపించును. సూత్రీకరించిన దారమున కనబడవు అట్లే భగవంతుడు స్థూల దృష్టికి చర్మ చక్షువునకు గోచరించడు. జ్ఞాననేత్రమునకే గోచరించును.
అంతరంగమందు యపరాధములుజేసి
మంచివాని వలెనె మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా
విశ్వదాభిరామ వినురవేమ
మనము చేయు ప్రతిచర్య, ప్రతి సంకల్పము చివరికి మనము తీసుకున్న ఉఛ్వాస నిశ్వాసలు మనలోనున్న చైతన్యము లేకుండా ఏ క్రియ కూడా శరీరములో జరగదు. శివం విడిచిన తోడనే శరీరము శవంగా మారిపోతుంది. అందుకే వేమనగారు లోపల చెడు ఆలోచనలతో నుండి మంచివానిలా బాహ్య ప్రపంచంలో పరులెవరికి తెలియలేకపోయిన లోనున్న (చైతనయము) తెలుసుకుంటాడని తెలియజేసినాడు. కావున భగవంతుని కన్నుగప్పుట నెవ్వరికిని సాధ్యము కాదు పుట్టినదిమొదలు కడతేరు వరకు జరుగు ప్రతి కర్మయును చైతన్య స్వరూపుడగు పరమాత్మ సాక్షిభూతుడుగా గమనిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జ్ఞానులు సంపూర్ణ శరణాగతిని బడసి కర్మను భగవదర్పణ చేయుచున్నారు అట్టి కర్మ పరమాత్ముని ఆశీస్సులతో కర్మయోగంగా మారిపోవుచున్నది.
***
No comments:
Post a Comment