శ్రీరామకర్ణామృతం -27 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం -27

Share This
శ్రీరామకర్ణామృతం -27
 సిద్ధకవి
 డా.బల్లూరి ఉమాదేవి.


తృతీయాశ్వాసం.
51.శ్లో:సింహాసనస్థం సురసేవితవ్యం
రత్నాంకితాలంకృత పాదపద్మం
సీతాసమేతం శశిసూర్యనేత్రం
రామం భజే రాఘవ రామచంద్రమ్.
భావము:సింహాసనమందున్నట్టియు దేవతలకు సేవించదగినట్టియు రత్నములచేత నలంకరింపబడిన పాదపద్మములు గలిగినట్టియు సీతతో గూడినట్టియు చంద్రసూర్యులు నేత్రములుగా గలిగినట్టియు రఘువంశరాజులను సంతోషింససయు చంద్రుడైనట్టియు రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:ఘనసింహాసనసంస్థితున్ దివిజ సంఘాతార్చితున్ రత్న కాం
 చన సందీపిత పాదుకాంఘ్రి కమలున్ క్ష్మాపుత్రికా సంయుతున్
వనజాతాప్త శశాంక నేత్రు గరుణావర్పిష్ణు రామున్ సనా
తను దాసాంగణ కల్పక ద్రుమము సద్భక్తిన్ బ్రశంసించెదన్.

52.శ్లో:సుగ్రీవ మిత్రం సుజనానురూపం
    లంకాహరం రాక్షసవంశ నాశం
    వేదాశ్రయాంగం విపులాయతాక్షం
    రామంభజే రాఘవ రామచంద్రమ్.

భావము:సుగ్రీవునకు స్నేహితుడైనట్టియు,యోగ్యుల కనుకూలుడైనట్టియు లంకను సంహరించినట్టియు రాక్షసవంశమును నశింప చేసినట్టియు వేదముల కాధారమైన దేహము గలిగినట్టియు రాఘవ రామచంద్రుడైన రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

మ:సుజనానందకరున్ విశాలనయనున్ సుగ్రీవ సన్మిత్రునిన్
రజనీ సంచర వంస వంశ దహనున్ రాజేంద్రు లంకాహరున్
విజయశ్రీ లసితాంగు రామవిభు పృథ్వీ పుత్రికా నాయకున్
భజియింతున్ నిరతంబు రాఘవ పరబ్రహ్మంబు నిష్టాప్తికిన్.

53శ్లో:అనంత కీర్తిం వరదం ప్రసన్నం
       పద్మాసనం సేవక పారిజాతమ్
      రాజాధిరాజం రఘువీరకేతుం
      రామంభజే రాఘవ రామచంద్రమ్.

భావము:అంతము లేని కీర్తి కలిగినట్టియు వరములనిచ్చునట్టియు శాంతుడైనట్టియు పద్మములవంటి మొగము గలిగినట్టియు భక్తులకు పారిజాతవృక్షమైనట్టియు రాజులకు రాజైనట్టియు రఘువంశ రాజులకు ప్రధానుడైనట్టి రఘురామచంద్రుడైన రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

చ:అనుపమ కీర్తిసాంద్రు నిరతాశ్రిత స్వర్మ మహిజంబు విశ్వమో
 హనుని సహస్ర పత్రకమలాసను రాజలలాము రాఘవున్
ఘను రఘువీర కేతనఘఘస్మరునిన్ వరదున్ పరాత్పరున్
 జననుత రామ భూవిభు బ్రసన్నునిగా భజియింతు నెమ్మదిన్.

54శ్లో:పద్మాసనస్థం సురసేవితవ్యం
       పద్మాలయానంద కటాక్ష వీక్ష్యమ్
        గాంధర్వ విద్యాధర గీయమానం
        రామంభజే రాఘవ రామచంద్రమ్.

భావము:పద్మాసనమందున్నట్టియు దేవతలకుసేవింపదగినట్టియు లక్ష్మియొక్క ఆనందముతో కూడిన క్రేగంటిచే చూడదగినట్టియు గంధర్వులచే విద్యాధరులచే గానము చేయబడుచున్నట్టియు రాఘవరామచంద్రుడైన రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

మ:అమరస్తోమ నతాంఘారి పద్మయుగ సాహస్రార మధ్యస్థితున్
గమలానంద కటాక్షవీక్షణ పరున్ గంధర్వ గానప్రియున్
విమలున్రాఘవరామచంద్రు వరదున్ విశ్వాత్ము విశ్వంభరున్
సుమకాండాయుత సుందరున్ గొలిచెదన్ శుద్ధాంతరంగంబునన్.

55శ్లో:అచింత్య మవ్యక్త మనంత రూప
        మద్వైత మానంద మనాది గమ్యమ్
        పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం
       రామంభజే రాఘవ రామచంద్రమ్.

భావము:ఊహింప శక్యము కానట్టియు స్ఫుటము కానట్టియు అంతము లేని రూపము కలిగినట్టియు రెండవ వస్తువు లేనట్టియు ఆనందస్వరూపుడైనట్టియు మొదటినుండియు పొందశక్యము కానట్టియు పుణ్యరూపము కలిగినట్టియు పురుషోత్తముడను పేరుగల రాఘవరామచంద్రుడగు రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

చ:అనఘు నచింత్యు నవ్యయు ననంతు నమేయు ననాది గమ్యు బా
 వన సుచరిత్రు నద్వయు నవాజ్ఙ్మయు నచ్యుతు పుణ్య రూపునిన్
 ఘను బురుషోత్తమున్ బరమ కారుణీకున్ రఘురామచంద్రు స
జ్జన నుతు రాఘవున్ వరదు సంతత మెంతు హృదంతరంబునన్.

56శ్లో:మందస్మితం కుండల గండ భాగం
       పీతాంబరం భూషణభూషితాంగమ్
     నీలోత్పలాంగం భువనైక మిత్రం
      రామంభజే రాఘవ రామచంద్రమ్.

భావము:చిరునవ్వు గలిగినట్టియు కుండలములు గండస్థలములందు గలిగినట్టియు పచ్చని బట్ట గలిగినట్టియు అలంకారములచే నలంకరింపబడిన దేహముగలిగినట్టియు లోకములకు ముఖ్య స్నేహితుడైన రాఘవరామచంద్రుడగు రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:

చ:దరహసితాననాంబురుహు దప్త సువర్ణ వినూత్న రత్నవి
  స్ఫురిత కిరీట కుండల విభూషణ భూషితు భవ్యకాంచనాం
బరు గుముదాభగాత్రు మునివందితునిన్ భువనైక మిత్రు సు
స్థిర సుచరిత్రు రామవిభు చిన్మయు రాఘవు నాశ్రయించెదన్.

57శ్లో:డిండీరహాస మణికుండల చారుకర్ణ
      దోర్దండ శౌర్యజిత భండన శౌర్యధీర
      కోదండ కాండ పరిమండిత పార్థివేంద్ర
      వేదండ యాన జయ రాఘవరామచంద్ర.

భావము:నురుగు వంటి నవ్వు గలవాడా మాణిక్య కుండలములచే సుందరమైన కర్ణములు కలవాడా భుజపరాక్రమముచే జయింపబడిన యుద్ధము గలవాడా శౌర్యముచేత ధైర్యము కలవాడా దనుర్దండముచే నలంకరింపబడినవాడా రాజశ్రేష్ఠుడా ఏనుగు నడక కలవాడా రాఘవ రామచంద్రా సర్వో త్కృష్టుడవగుము.

తెలుగు అనువాదపద్యము:

చ:ఘనమణి కుండలోల్లసిత కర్ణు శరాసన కాండమండితున్
జనవరు గుంభిరాడ్గమను శారద ఫేనపటీర హాసు దు
ర్జనమదగర్వ నిర్హరణ చారు భుజాబల శౌర్య ధుర్యు స
జ్జన నుతచర్యు రాము ననిశంబు నుతించెద నిష్టసిద్ధికిన్.

58శ్లో:లోకాన్ సప్త నినాదయన్ హరిహయస్యాంతర్భయం వర్ధయన్
      సప్తానాం చ భువాం ప్రకంప ముదయన్ సప్తార్ణవాన్ ఘార్ణయాన్
      ఉన్మీలాని రసాతలాని జనయన్ సప్తాపి పృథ్వీధరాన్
     సుశ్రీ రాఘవ బాహుదండ విదళిత్ కోదండ చండధ్వనిః.

భావము:రాముని భుజాదండముచే బ్రద్దలైన ధనస్సుయొక్క తీక్షణమైన ధ్వని యేడు లోకములను ధ్వనింప చేయుచు నింద్రుని చిత్తమందు భయమును వృద్ధిచేయుచు సప్తభూములకు వణుకును బుట్టించుచు

ఏడుసముద్రములను గలచుచు పాతాళలోకములను సంహరించుచు సప్తకులపర్వతములను గదల్చుచు వ్యాపించెను.

తెలుగు అనువాదపద్యము:

మ:తతసప్తాంబుధులున్ ధరిత్రి ధరసంతానంబులున్ ఘూర్ణిలెన్
శతమన్యుండతిభీతి జెందె బ్రబలెన్ సప్తోర్ధ్వ లోకంబు లా
యత విభ్రాంతి నధోజగంబు జనముల్ వ్యాలోలతం జెందె భూ
పతి రామాధిప బాహుదర్పదళన ప్రధ్వంస చాపధ్వనిన్.

59శ్లో:బ్రహ్మాండం దళయన్ వియద్ విదళయన్ భగీశ భోగస్థలే
        సంత్రాసం జనయన్ సముద్ర పటలీ తోయం సముద్వేలయన్
   దిక్పాలానపి క్షోభయన్ కులగిరౌ దీర్ఘత్వ మాపాదయన్
   నక్షత్రాణి చ పాతయన్ విలసితో శౌరేర్ధనుర్జ్యారవః.

భావము:శ్రీరాముని వింటినారి యొక్క ధ్వని బ్రహ్మాండమును బ్రద్దలు చేయుచు ఆకాశమును పగుల గొట్టుచు శేషుని పడగలయందు భయమును పుట్టించుచు సముద్రముల నీటిని ఒడ్డు దాటునట్లుగా చేయుచు దిక్పతులను క్షోభపెట్టుచు కులపర్వతములను బ్రద్దలు చేయుచు చుక్కలను పడగొట్టుచు ప్రకాశించుచున్నది.

తెలుగు అనువాదపద్యము:

మ:తనకోదండగుణధ్వనిన్ పగిలె ఖ స్థానంబు బ్రహ్మాడమున్
వనధుల్ పొర్లె దిగీశ పంక్తి వణకెన్ వ్యాళేంద్ర భోగంబు లె
ల్లను సంత్రాసము నొందె పర్వతము లల్లాడెన్ మహిం డుల్లె గ్ర
క్కున నక్షత్రములట్టి రామవిభు కాకుత్ స్థున్ ప్రశంసించెదన్.

60.శ్లో:యశ్చండ గాంభీర్య ధనుర్విజేతా
భూమండలీపుణ్య కృతావతారః
అఖండలాద్వై రమరైరుపేతః
కోదండపాణిః కులదైవతం నః

భావము:ఏ రాముడు తీక్షణమగు గాంభీర్యముగల ధనస్సుచే జయించువాడో భూమండలము యొక్క పుణ్యము చేత చేయబడిన అవతారము గలవాడో ఇంద్రుడు మొదలగు దేవతలతో కూడుకొన్నవాడో అట్టి ధనుస్సు హస్తమందుగల రాముడు మా కులదైవము.

తెలుగు అనువాదపద్యము

ఉ:ఎవ్వడు ధాత్రిమండలి నహీన మహాసుకృతావతారకుం
 డెవ్వడు విల్లు చేగొని జయించు విరోధుల నిమ్నమానసుం
 డెవ్వడు బ్రహ్మ రుద్ర దివిజేంద్ర ముఖామర దేవ వేష్టితుం

డెవ్వడు చాపపాణి యుతు డెంచగ మత్కులదైవతంబగున్.

No comments:

Post a Comment

Pages