యువకళా విపంచి - కీబోర్డ్ సత్యా - అచ్చంగా తెలుగు

యువకళా విపంచి - కీబోర్డ్ సత్యా

Share This
యువకళా విపంచి - కీబోర్డ్ సత్యా
మధురిమ 

రెండున్నర ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాడిని చంటి పిల్లాడు అనే సంబోధిస్తాం..వచ్చి రాని మాటలతో వాడు చిన్న చిన్న పద్యాలు చెప్తూ ఉంటే వాడి  ముద్దు ముద్దు మాటలకు  మురిసిపోతాము.కాని ఓ రెండున్నర ఏళ్ళ పిల్లాడు ఆకాశవాణిలో పాడితే...లేత తమలపాకుల్లాంటి తన చిట్టి చిట్టి చేతులతో ఓ పాశ్చాత్య వాయిద్యాన్ని అవలీలగా వాయించగలిగితే ఆ పిల్లవాడిని మనం ఏమనుకుంటాం..  సాక్షాత్తు సంగీత సరస్వతీ వరప్రసాదం అనుకోము......అలాంటి ఓ బాలమేధావి...సంగీతామ్మతల్లి ముద్దుబిడ్డ,సంపూర్ణ సరస్వతీ అనుగ్రహ పరిపూర్ణుడు,పాశ్చాత్య వాయిద్యమైన కీబోర్డ్ పై సరిగమల సవారీని 16 సంవత్సరాలుగా చేస్తున్న వ్యక్తి  వేరెవరో కాదు "కీబోర్డ్ సత్యా" గా యావత్ భారత దేశంలోనే కాక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారుడు శ్రీ కీబోర్డ్ సత్యనారయణ్.
ఫిబ్రవరి 1వతేదీ 1995 వ సంవత్సరంలో శ్రీమతి లలిత, కృష్ణాబాబు పుణ్య దంపతులకు జన్మించాడు ఈ కళాకారుడు. శ్రీమతి లలిత మద్రాస్ నగరంలో అప్పటికే ఓ నేపధ్య గాయని.ఆమె తండ్రిగారు అంటే సత్యనారయణన్ యొక్క తాత గారు సంగీత కళాభూషణ్ శ్రీ ఎంబార్ సడగోప్పన్ గారు కూడా చెన్నై నగరంలో గొప్ప సంగీత ఉపాధ్యాయులు.మేనమామ  ఎంబార్ కణ్ణన్ ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు.ఈ విధంగా సంగీతం విరాజిల్లే ఓ ఇంట్లో జన్మించడం వలన ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అన్నట్లుగా సంగీతం పై మక్కువ సాధారణమే కదా అని అనిపించినా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఈ బాలమేధావి అతని తల్లితండ్రులు అహోరాత్రాలు పడిన కష్టం అనితర సాధ్యం.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఇంగ్లీషు పద్యాలు చెప్పే వయసులో (సుమారు 3సం..) వయసులో చెన్నై దూరదర్సన్ కేంద్రంలో "కణ్మణి పూంగా" అనే బాలల కార్యక్రమంలో అద్భుతంగా తమిళ సుప్రసిద్ధ కవి అయిన శ్రీ సుబ్రమణ్య భారతి గారి దేశభక్తి పాటలను అలవోకగా ఆలపించాడుట.
సత్యా చాలా చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు అతని తండ్రిగారి స్నేహితురాలు ఒక కీబోర్డ్ బొమ్మ కొని ఇచ్చా రట.బ్యాటరి వేసి మీటగానే శబ్దం వచ్చే ఆ బొమ్మ సత్యా కి ఆ వయసులో ఓ పెద్ద ఆకర్షణ గా అనిపించిందిట.
ఐతే 3 సంవత్సరాల వయసులో ఈ బాలమేధావి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆ బాలుని దశని మార్చడమే కాదు దిశా నిర్దేశం కూడా చేసింది. సత్యా మేనమామ కణ్ణన్ గారికి, సత్యా తండ్రిగారైన కృష్ణబాబు గారు ఓ కీబోర్డ్ కొనిచ్చారట కారణం ఆయన విద్వాంసులైనా ఎన్నో పాటలని స్వరపరిచేవారు కూడా..కానీ కణ్ణన్ గారు చాల పెద్ద విద్వాంసులవ్వడం వలన అసలు కచేరీలతో తీరిక లేకుండా ఉండడం వలన ఆ కీబోర్డ్ వాడకుండా అలాగే ఉండేదిట.ఓ రోజు సరస్వతి పూజ నాడు దానికి పూజ చేసినప్పుడు దాన్ని మన చిన్నారి సత్యనారయణన్ చూసాడు. బొమ్మ కీబోర్డ్ పై ఆడుకునే మన సత్యా కి ఈ పెద్ద కీబోర్డ్ పెద్ద గొప్పగా వింతగా కూడా అనిపించలేదు.అదే నలుపు తెలుపు మెట్లతో కాస్త పరిమాణంలో పెద్దగా ఉండే ఆ కీబోర్డ్ చూడగానే మీటాలి అని మాత్రం అనిపించిందిట.అప్పటినుంచీ అటువెళుతూ పోతూ ఉన్నప్పుడు దాన్ని నొక్కుతూ ఉండడం ఇది ఇలా ఉండగా వీరి పక్కవాటాలో ఉండే ఓవ్యక్తి యొక్క కారు బయటకి తీసేటప్పుడు వచ్చే "హ్యాపీ బర్థ్ డే టూ యూ"అన్న పాట కూడా సత్యా చెవులలో నిరంతరం మోగుతూ ఉండేదిట.
ఓరోజు అనుకోకుండా  తండ్రిగారైనటువంటి కృష్ణబాబు గారు అదే పాట ఇంట్లో వినబడుతూ ఉంటే పక్కింటాయన కారు తీస్తున్నాడు అనుకున్నారుట కాని అది సత్యా వాయించడం వలన వినిపిస్తోందని గ్రహించేసేరికి ఆనందంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురయ్యారు కారణం అప్పుడు సత్యా వయస్సు కేవలం మూడేళ్ళు.
ఈవాయిద్యం లో తర్ఫీదు ఇప్పించాలనే ఉద్దేశ్యంతో  ఇళయరాజా గారి వయొలినిస్ట్  అయిన విద్యాధర్ అనే ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళారు. ఈయన సత్యా కి చిన్న చిన్న రైంస్(పాటలు) నేర్పించాక  సత్యాని శ్రీమతి "మాసిలామణి" అనే పియానో ఉపాధ్యాయురాలి దగ్గరికి తీసుకెళ్ళమని సూచించారు.
మాసిలామణి గారు పియానో ఉపాధ్యాయురాలు.అయితే కీబోర్డ్ వేరు,పియానో వేరు.మూడున్నరేళ్ళ సత్యా కనీసం పియానో మెట్లను కూడా అందుకునే స్థితిలోలేడు సరికదా అతని ని చూసి నేను ఇంత చి న్నవాడికి ఎలా చెప్పగలను అని ఆవిడ తిరిగి ప్రశ్నించిందట??అదే సత్యా మొదటి సారి పియానో ని చూడడం కూడా.. తండ్రిగారైనటువంటి కృష్ణబాబుగారు "అమ్మా ఒక్కసారి మీరు వాడి వాయిద్యం వింటే బావుంటుంది"అని అర్దించగా ఆవిడ ఒప్పుకోవడంతో అప్పుడే మొదటిసారి చూసిన పియానోపై విద్యాధర్ గారు నేర్పించిన కొన్ని పాటలను వాయించగా  ఆవిడ ఆ బాలుని వాయిద్య నైపుణ్యానికి ఎంతో సంతోషించి సత్యా ని తన శిష్యునిగా అంగీకరించారు.
ఆవిడ దగ్గర నేర్చుకుంటున్న రోజుల్లో "ట్రినిటీ కాలేజ్ లండన్"వారిచే నిర్వహించబడే పరీక్షలకు హాజరవ్వమని ఆవిడ సూచించడం గ్రేడ్1 పరీక్షకు హాజరయ్యి ఉత్తీర్ణుడయ్యాడు.అప్పుడు సత్యా వయసు కేవలం నాలుగేళ్ళు. అయితే ఇంట్లో కీబోర్డ్ అయితే ఉంది కానీ పియానోలేదు..కృష్ణబాబుగారికి చెన్నై లో ఉండే గొప్ప హోటళ్ళైనటు వంటి పార్క్ షెరటన్ వంటి వాటితో  సంబంధాలు ఉండడంవలన వారానికోరోజు అక్కడికి తీసుకువెళితే అక్కడ పియానో సాధన చేసుకునేవాడుట.ఇంట్లో కీబోర్డ్ వాయించుకునేవాడుట.అయితే ఇది అంత వెసులుబాటుగా ఉండకపోవడంవలన సత్యా మిగిలిన గ్రేడ్లను కీబోర్డ్ పై పూర్తి చెయ్యలని నిర్ణయించుకున్నాడు.ఆవిడ సత్యాని శ్రీ ఆల్ఫొన్సో గారి దగ్గరకు పంపించడం అక్కడ సత్యా కీబోర్డ్ పై నేరుగా రెండవ గ్రేడ్ పూర్తి చేసి ఆ తరువాత నేరుగా నాలుగవ గ్రేడ్  పూర్తి చెయ్యడం జరిగింది.అప్పటికి సత్యా 6ఏళ్ళ వాడే కావడంతో గ్రేడ్ 4  పాస్ అయిన అతి చిన్న బాల భారతీయునిగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఇలాగే సత్యా  8 ఏళ్ళ కే గ్రేడ్ 8 పాస్ అయిన అతి చిన్న బాల భారతీయుడు.
ఈ బాటలో ఇలా వెష్ట్రన్ మ్యూసిక్ నడుస్తూ ఉండగా   శాస్త్రీయ సంగీతం  మార్గంలోకూడా ఆయనను తాత గారు నడిపిస్తూ ఉండేవారు..చిన్న సత్యాకు రైల్వే స్టేషన్ కు వెళ్ళి  రోజు రైలుబండి చూడడం అంటే చాలా ఇష్టం... సత్యాను సైకిలుపై కూర్చోబెట్టుకుని తాతగారైనటువంటి ఎంబార్ సడగోప్పన్ గారు నడిపించుకుంటూ వెళుతూ వివిధరాగాలు పాడుతూ తీసుకెళ్ళేవారు...ఓ పది రైళ్ళు చూసాక తిరిగి వచ్చేటప్పుడు అవే రాగాలని ఇంకోవిధంగా పాడి వాటిని గుర్తించమంటే ఎంతో చక్కగా సత్యా గుర్తించేవాడట లేకపోతే తాత మర్నాడు రైలు చూపించడేమో అన్న భయం...కానీ అది దైవ వర ప్రసాదంగా వచ్చిన సంగీత జ్ఞానమని తాతగారు గ్రహించారు. తాతగారు సత్యా యొక్క అపూర్వ ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి వయొలిన్ విద్వాంసుని గా తయారు చెయ్యాలనే ఉద్దేశ్యంతో వయొలిన్ లో శిక్షణ తీసుకోమన్నారు..అప్పటికి ఆయన కుమారుడూ, సత్యా మేనమామ కణ్ణన్ గారుకూడా ఓస్థాయిలో ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు.
అయితే ఈవిధంగా కీబోర్డ్ పై వెస్ట్రన్ మ్యూసిక్ (పాశ్చాత్య సంగీతం) వాయించే సత్యనారయణన్ కి ఆ కీబోర్డ్ పై శాస్త్రీయ కర్ణాటక సంగీతం వాయించాలి అన్న అలోచన ఎలా వచ్చిందంటే?? దానికి ఓ కథ ఉంది.సంగీతానికి పేర్లు వేరేమోకాని అన్ని రకములైన సంగీతాలకీ ఆధారం ఆ మూలాధార షడ్జ్యమమే..ఏబాణి అయినా ఆ సప్తస్వరాలలో ఒదిగిపోయేదే..తన గ్రేడ్ పరిక్షలలో భాగంగా న్యాయనిర్ణేతలు పాడే పాట యొక్క స్వరాన్ని తిరిగి పాడడం దాన్ని కీబోర్డ్ పై వాయించడం అలవాటైన మన చిన్నారి సత్యాకి ఓసారి అమ్మ పాడుతున్న "ఎన్నత్తువం సెయిదనయ్" అనే శాస్త్రీయ సంగీత కృతి వింటూ దాన్ని  కీబోర్డ్ పై వాయించే ప్రయత్నం చెయ్యడం కృష్ణ బాబుగారి మనసులో ఓ అలోచనా బీజాన్ని వేసింది.  
పాశ్చాత్య సంగీతం పలికే ఈ వాయిద్యం పై తన కుమారుడు అలవోకగా శాస్త్రీయ సంగీతాన్ని పలికించడం చూసి ఇందులో అతనికి శిక్షణ ఇప్పిస్తే బావుంటుంది అని తన అలోచన కుటుంబ సభ్యులతో అనగా మేనమామ కణ్ణన్ గారు,తాతగారైనటువంటి సడగోప్పన్ గారిదగ్గర ప్రస్తావించినప్పుడు సడగోప్పన్ గారు సత్యా ని నాదోపసనా శ్రీనివాసన్ గారిదగ్గర శిక్షణ ఇప్పించమన్నారుట.ఈయన దగ్గర ఒక ఆరు నెలలు  నేర్చుకున్న మన చిన్నారి సత్యనారయణన్ అతని ఆధ్వర్యంలో కేవలం ఆరున్నర సంవత్సరాల వయసులో అరగంట కచేరి చేసాడుట..అదే తన జీవితంలో కీబోర్డ్ పై కర్ణాటక సంగీతం వాయించిన మొదటి కచేరి కూడా.
ఈవిధంగా కీబోర్డ్ పై శాస్త్రీయ సంగీతం వాయించే మహా ప్రస్థానం మొదలైంది...ఓ మహోజ్వల యజ్ఞానికి అంకురార్పణం జరిగిందని కూడా చెప్పవచ్చు.
సంగీతానికి శ్రవణం అంటే వినే గుణం చాలా ముఖ్యం...కేవలం వినడమే కాదు విన్నదాన్ని తిరిగి యధాతధం గా పునరుత్ప్పత్తి చెయ్యడం సత్య యొక్క విశిష్టత.ఇందుకు ఇంకో ఉదాహరణ ఓసారి తన తల్లితండ్రులతో రైలు లో ప్రయాణిస్తున్నప్పుడు సత్యా వాళ్ళ నాన్నగారు ఏది పాడితే అది తన బొమ్మ కీబోర్డ్ పై వాయించాడు ట.ఇది విని పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు కూడా ఒక పాట పాడగానే దాన్ని కూడా అలవోకగా కీబోర్డ్ పై వాయించడంతో అందరు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారుట.
అయితే కర్ణాటక సంగీతం యొక్క విశిష్టత దాని గమకంలో ఉంది.గమకంలేని గానం జీవంలేని శరీరం లాంటిది,సంధ్యాదీపం లేని వాకిలి లాంటిది.సదాశివునికి నమక చమకాలతో అర్చన చేస్తే ఎంత ప్రీతో సరస్వతీమాతకి గమకంతో స్వరార్చన చేస్తే అంతప్రీతి.మరి కీబోర్డ్ పై సరిగమలు పలికిస్తున్నాడుకానీ అవి పొడి పొడి గా మాత్రమే పలుకుతూ ఉండేవి...మరి గమకం ఎలా తీసుకురావాలి?? శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన పట్టిన తాతగారు కూడా జీవం లేని ఈ సంగీతం ఆ నారయణుని పాదాలను అర్చించగలిగే పుష్పం కాదనడంతో...గమకం అనే సత్యశోధన పై దృష్టి పెట్టాడు మన సత్యశోధకుడైన సత్యనారయణుడు.ఇక్కడే మొట్టమొదటి శోధన ఆరంభం అయ్యింది.
ఆ శోధనకి తన సాధనతో సమాధానాన్ని కూడా కనుక్కున్నాడు సత్యా. కీబోర్డ్ లో బెండెర్  అనే ఒకదాని ద్వారా గమకాన్ని తెప్పించవచ్చు. అయితే ఇదే సమయంలో అప్పుడు అనుకోకుండా పల్లడం వెంకటరమణా రావు అనే గొప్ప హార్మోనియుం విద్వాంసులను కలవడం జరిగింది.ఆయనకు ఇలా బెండెర్ ద్వారా గమకాన్ని చూపించినప్పుడు ఆయన ఏమనారంటే "నువ్వు గమకం పలికిస్తున్నావు బావుంది కానీ రెండు స్వరాలకి అంతర్లీనంగా ఉండే గమకాన్ని కూడా పలికించగలగాలి"అన్నారుట.
ఈ అవరోధాన్ని కూడా దాటడానికి చాలా కసరత్తు చేసి "కోర్గ్" అనే సంస్థ  తయారుచేసే కీబోర్డ్ ల లో ఉండే పోర్టమెంటో,లెగటో అనే రెండు ప్రత్యేకమైన "స్విచ్" ల వంటి వాటి సహాయంతో ఒక వీణ ,వయొలిన్ ల పై పలికే గమకాన్ని కీబోర్డ్ పై యధాతధంగా పలికించే స్థాయికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు మన సత్యా.
ఈవిధం గమక పూరితమన,శ్రావ్యమైన శాస్త్రీయ కర్నాటక సంగీతాన్ని తాతగారైన సడగోప్పన్ గారికి వినిపించిన వెంటనే ఆయన ఎంతో సంతోషించి గమకాన్ని పలికించగలిగే వాయిద్యమైనప్పుడు నువ్వు దీనిలో సాధన చెయ్యి ఏ వాయిద్యం అయితే ఏంటి...భక్తి తో సమర్పించినప్పుడు ఏ సాధారణమైన  పువ్వయినా పూజా పుష్పం అవుతుంది అని  తన పెద్ద మనసుతో మనవడిని మనస్పూర్తి గా ఆశీర్వదించి ముందుకు వెళ్ళమని వెన్నుతట్టడం తో ఇక సత్యా వెనక్కి తిరిగి చూడలేదు.
ఇలా ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకి సహాయకులుగా ఉత్తమమైన గురువులను ఎప్పటికప్పుడు తన వెంట ఆ భగవంతుడు నిలుపుతూ వచ్చాడు. వారి ఆశీర్వాదం, తన తల్లితండ్రుల ప్రోత్సాహం,సహకారం శ్రేయోభిలాషుల శుభాకాంక్షలవల్లనే ఈ మార్గంలో నడవగలుగుతున్నాను అని చెప్తూ నిండుకుండ తొణకదు అన్న నిజాన్ని ఎదిగిన కొద్ది ఒదగడం మహాత్ముల లక్షణం అని నిరూపిస్తున్నాడు సత్యనారయణన్.
మాండోలిన్ శ్రీనివాస్,డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వయొలిన్ విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి ఇలా ఎందరో మహానుభావులు సత్యనారాయణ్ ని తమ ఆత్మజునిగా స్వీకరించి తమంతట తాముగా ఓ సంగీతదీక్ష నిచ్చి మంత్రోపదేశం చేసినట్లుగా సంగీతోపదేశం చేస్తూ వచ్చారు.గురువుల దగ్గరికి శిష్యులు వెళ్ళడం లోకరీతి..కాని ఈ మేధావిని,వినయసంపన్నడినీ శిష్యునిగా స్వీకరిస్తే  మా విద్య పది తరాలకు ప్రాప్తిస్తుందన్న అభిలాషతో ఇతణ్ణి శిష్యుడిగా వారు స్వీకరించి ఆశీర్వదించారు.
ఈవిధంగా ఇలా కచేరిలు కొనసాగించడం మొదలుపెట్టిన సత్య రెండుపదుల పిన్నవయసులోనే ఎన్నో మైలురాళ్ళను దాటాడు.ఎందరో గొప్ప గొప్ప విద్వాంసులతో కచేరీలు చేసాడు.గ్రామీ పురస్కార గ్రహీత అయిన పండిట్ విశ్వమోహన్ భట్ట్ వంటి వారితో 15 ఏళ్ళ చిరుప్రాయంలో వేదిక పంచుకునే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది??అది ఎన్నిజన్మల సుకృతం??అలాగే డ్రమ్మర్ శివమణి, సుధా రఘునాథన్, అరుణ సాయిరాం, చిత్ర వీణా రవికిరణ్ గారితో ఇలా ఎందరో ప్రఖ్యాత విద్వాంసుల పక్కన వారితో పాటు వేదిక పంచుకుని వారు ఆశ్చర్యపోయేలా వాయించిన వ్యక్తి సత్యనారయణన్.
ఈవిధంగా కణ్ణన్ బాలకృష్ణన్ అనే వీణ విద్వాంసునితో చెన్నై పార్క్ హొటెల్ కచేరి వాయించే అవకాశం వచ్చిందిట.ఎందుకంటే అది తన జీవితంలో ఓ మరపురాని అనుభూతి అని వర్ణిస్తాడు సత్య. ఎందుకంటే ఆ కచేరి "యాని" అనే ఓ వ్యక్తి కోసం ఏర్పాటు చెయ్యబడినది..ఎవరీ యాని?? అంటే ఆయన గ్రీకు దేశస్తుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ అద్భుతమైన కీబోర్డ్ వాద్యకారుడు.పాశ్చత్య దేశాలలో యాని పేరు చెపితేనే తమని తాము మైమరచిపోతారు అక్కడి జనం.అలాంటి యాని మన సత్యాకి కూడా ఒక ప్రేరణే... అంతర్జాలంలో యాని యొక్క వీడియోలు చూస్తూ పెరిగిన సత్యాకి యాని ముందు వాయించడం ఒక వరం అనిపించిందిట..ఇక ఆ కచేరీలో యాని ముందర మన శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని వాయించిన సత్యా ఒక్కసారైనా యాని తనను అభినందిస్తే చాలు అనుకున్నాడుట..కాని అందరి కళాకారులను అభినందించిన తరువాత నేరుగా సత్యా దగ్గరకి వచ్చి ఈకీబోర్డ్ పై ఓ యువ యాని ని చూసాను అన్నాడుట..  ఆరోజునుంచి నాలో ఇంకో కొత్త ఉత్సాహం మొదలై "నా అలోచననే మార్చివేసింది..నా మనసు వినాలనుకున్నదాని కన్నా చాలా ఎక్కువే వినగలిగాను..ఇది ఈపాటికీ కలా నిజమా నాకు నమ్మసఖ్యం గా లేదు అంటారు మన సత్యనారయణన్".ఇలా కచేరీలు చేస్తూ నిరంతరం ఓ నిత్య విద్యార్ధిగా పెద్దల దగ్గర మెలకువలు అభ్యసిస్తూ  “సత్య సాధనకు తత్వ శోధనకు సంగీతమే ప్రాణము” అన్న వేటూరి వారి మాటలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ బాల గంధర్వుడు.
2003వ సంవత్సరంలో కేవలం 8ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికా,మారిషస్ వెళ్ళి 18 కచేరీలు ఇచ్చాడు.
2009 లో దోహా, ఖతార్ బహరేన్ లలో
2010 లో,2011లో  అమెరికా ,కెనాడాలో 19 కచేరీలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో
ఇప్పటి దాకా దాదాపుగా 25 అల్బంస్ తన సొంతంగా మరియు మోసెర్ బీర్ వంటి పెద్ద సంస్థల తో కలిసి విడుదల చేశాడు.
కర్ణాటిక్ ఆన్ కీబోర్డ్,సత్యాస్ సింథసిస్ ,భజన్,మధురం,మొహనం వంటివి కొన్ని మచ్చుతునకలు.
అయితే ఇతని విజయం వెనక గురువుల పాత్ర,తన స్వయంకృషి ఎంత ఉందో తన తల్లితండ్రుల ప్రోత్సాహం కూడా అంతే ఉంది అంటారు సత్యా..8ఏళ్ళ కుమారుడి సంగీత భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యడంకోసం తన  ఉద్యోగాన్ని కూడా వదిలి సత్యాతో ఊర్లు తిరుగుతూ తండ్రి ,ఇల్లు గడపడానికి నేపధ్యగానం చేస్తూ తల్లి ఎంత త్యాగం చేసారో అంటాడు తను..కాని వారి నోములు,పూజలే కాదు త్యాగాలు కూడా ఫలించి ఇంతింతై వటుడింతై అని ఎదుగుతున్న సత్యనారయణ సంగీత తేజస్సులో వారి ఆ కష్టాల చీకట్లు ఎప్పుడో పటా పంచలైపోయాయి. 
ఇక సత్యా పురస్కారాల విషయానికొస్తే.. ఐదు ఖండాలలో కలిపి ఇప్పటికి దాదాపుగా 1500 కచేరీలు చేసి ఇంకా ఆ యజ్ఞం అలా కొనసాగించడానికి ఋత్వికునివలే నిర్విరామంగా శ్రమిస్తున్నాడు.
కేవలం 15 సంవత్సరాల వయసులోనే భారతదేశం లో మొట్టమొదటి సారిగా చెన్నై  ఆకాశవాణి లో "ఏ" గ్రేడ్ కీబోర్డ్ కళాకారుడిగా ,హార్మోనియుం పై "బి" గ్రేడ్  కళాకారుణిగా రికార్డ్.
యువ కళాభారతి,యువ కళావిపంచి,బాల కళా రత్న,విద్వాన్మణి,మొదలగు పురస్కారలతో సన్మానం.
2006 లో "పోగో అమేజింగ్ కిడ్" పురస్కారం.
శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం.
చెన్నై నగరంలో ఉన్న సుమారు అన్ని గాన సభలయందు నిరంతర సన్మానాలు,సత్కారాలు ,కచేరీలు....
ఇలా కీబోర్డే కవనం గా నూనుగు మీసాలతో  ఈ 22 సంవత్సరాల ఈ యువకుడు మన దేశ కీర్తి ప్రతిష్టలని ఆచంద్రతారర్కం  ప్రజ్వలించే ఉదయభానుడనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు..
ఇప్పటికి తల్లి తండ్రి తన ప్రత్యక్ష దైవాలని  నమ్ముతూ చెరగని చిరునవ్వుతో కీబోర్డ్ పై ఆ సరిగమల సవారినీ అలా నిరంతరం కొనసాగించాలని ఆ శక్తిని,స్థైర్యాన్ని,భగవంతుడు ఈ యువకునికి ప్రసాదించాలని మనసారా భగవంతుడిని ప్రార్ధిద్దాము.

No comments:

Post a Comment

Pages