అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) -3 వ భాగం
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు తెలుగు సేత)
గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
(జరిగిన కధ : కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యం విషయంలో న్యాయవాది కర్సన్ డ్రూ వద్దకు వచ్చిన ఫిలిప్ మార్చ్ అగంతకుడు విసిరిన రాయి వల్ల గాయమై, వైద్యుడి సలహాపై న్యాయవాది యింట్లోనే ఉండిపోతాడు. మరునాడు ఉదయం రేడియోలో తన కుమారుడు వ్రాసి స్వరపరచిన పాట ప్రసారమవటం గమనించి ఉద్వేగానికి లోనవుతాడు. ఒకప్పుడు బాగా బ్రతికిన అతను మరణించిన తన కుమారుడు, కోడలి జ్ఞాపకంగా మిగిలిన తన మనవరాలిని పోషించాలంటే, తన కుమారుడి సాహిత్యాన్ని అమ్మి బ్రతకాలి. అలాంటి సాహిత్యాన్ని ఎవరో దొంగిలించారనగానే అతనిలో నిరాశ ఆవహించింది. న్యాయవాది కుమార్తె 18 ఏళ్ళ నాన్సీ తన స్నేహితురాళ్ళతో కలిసి మార్చ్ నివాస గృహానికి వస్తుంది. వారికి అతను తన వంశప్రతిష్టను చెబుతూ విశాలమైన తన భవంతిని చూపిస్తాడు. వారు రాత్రికి అక్కడే ఉండిపోయి ఆ భవంతిని మాయమైన సాహిత్యం కోసం జల్లెడపడతారు. ఎక్కడా ఫలితం గానక చివరి ప్రయత్నంగా అటకమీద వెతకటానికి వెళ్ళబోతారు. అదే సమయంలో వారికి ఎవరో తలుపులు బ్రద్దలు కొడుతున్న చప్పుడు వినిపిస్తుంది. తరువాత . . . )
"ఏమిటది?" బెస్ కంగారుగా అడిగింది.
"ఎవరో తలుపులు కొడుతున్నట్లు వినిపిస్తోంది" జార్జ్ బదులిచ్చింది.
ఏమిటో చూద్దామన్న నాన్సీ మాటలు మార్చ్ కి వినబడలేదు. తన ధోరణిలో అతను ఉన్నాడు.
"నేను వెడతాను. ఈలోపున మీరు అటకమీద వెతకండి. ఇదిగో! కొవ్వొత్తిని వదిలి వెడుతున్నాను" అని చెప్పి మార్చ్ వెళ్ళిపోయాడు.
ముగ్గురమ్మాయిలు పైకి ఎక్కి అటకలోపలకు వెళ్ళారు. పైకి ఎక్కినవారికి మొదట్లో అక్కడంతా మసకమసకగా కనిపించింది. నాన్సీ కళ్ళు అక్కడ చీకటికి అలవాటు పడ్డాక చేతిలోని కొవ్వొత్తి వెలుతురులో, చిందరవందరగా ఉన్న అటక మీద తడుముకొంటూ ముందుకెళ్ళింది.
"నిజంగా యీ అటక చూట్టానికి చాలా ఆసక్తికరంగా ఉంది" తన స్నేహితురాళ్ళతో చెప్పిందామె.
అక్కడ కలగాపులగంగా, గుట్టలుగా పడి ఉన్న అట్టపెట్టెలు, ట్రంకులలో నాన్సీ వెతకసాగింది. ఆమె తన స్నేహితురాళ్ళిద్దరినీ పిలిచి, అక్కడ ఒక మూలగా ఉన్న పాతబల్లను చూపించింది. బల్ల చూడటానికి పాతగా ఉన్నా, ఏ మాత్రం దెబ్బతినలేదు.
"మార్చ్ ఆ బల్లను అమ్మేయొచ్చు. ఈ పాత తరహా పెట్టెలను చూడండి" అంటూ, అక్కడ ఉన్న కార్డ్ బోర్డ్ పెట్టెల గుట్టలోనుంచి ఒక పెట్టెను పైకి లాగింది. దానిపై పురాతనకాలంనాటి అమెరికా గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే బొమ్మ ఉంది.
"ఏదీ? నన్ను చూడనీ!" అంటూ బెస్ ఆమె వద్దకు ఉరుకున వచ్చింది. నాన్సీ చేతిలోని ఆ పెట్టెను ఉత్సాహంగా తీసుకొని, దానిపై ఉన్న దుమ్మును నోటితో ఊదింది.
"ఈ అట్టపెట్టె వల్ల తప్పకుండా పెద్దాయనకు కొంత సొమ్ము వస్తుంది. ఇలాంటిదే ఒక పెట్టె వేలంలో చాలా డబ్బుకు అమ్ముడుపోయిందని మా అమ్మ నిన్ననే చెప్పింది" ఉత్సాహంగా చెబుతున్న బెస్ వైపు చూసింది జార్జ్.
"అలాంటి పెట్టెలు యిక్కడ డజను వరకూ ఉన్నాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి" అంటూ జార్జ్ వాటిని చూపింది. నిజంగానే ఆ పెట్టెలపై గద్దలు, పువ్వుల బొమ్మలే గాక అమెరికా చరిత్రను తెలిపే వివిధ రకాల డిజైన్లు కూడా ఉన్నాయి. వాటిలో రెండు పెట్టెలనిండా యీకలతో చేసిన ఆభరణాలు, ఊదారంగులో ఉన్న ఆడవాళ్ళ టోపీలు కనిపించాయి.
"ఈ అటకే ఒక విలువైన భాండాగారంగా కనిపిస్తోంది" నాన్సీ చెప్పింది.
"మనం మాయమైన ఫిప్ సాహిత్యాన్ని కనుక్కోలేకపోయినా, ముసలాయన అమ్ముకోడానికి చాలా ఖరీదైన వస్తువులనే కనిపెట్టాం" జార్జ్ అందుకొంది. " ఇప్పుడు. . ." ఆమె చెప్పబోతూండగా క్రిందనుండి ఎవరిదో ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వెనకనే తమను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. వెంటనే జార్జ్ చెప్పటం ఆపేసింది. నాన్సీ పరుగున లోనుంచి అటక మెట్లవద్దకు వచ్చి, చెవినొగ్గి వింది. మార్చ్ యువ గూఢచారిని పేరెట్టి పిలుస్తున్నాడు.
"త్వరగా రండి. మీ సాయం కావాలి."
నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు అటకమీద వెతకటం ఆపేసి, కంగారుగా మెట్లు దిగారు. బెస్ ది కొద్దిగా భారీకాయం గనుక కంగారుగా మెట్లు దిగటానికి ఆయాసపడింది.
"ఏం జరిగిందో?"
"ఆయన ఎక్కడైనా పడి గాయపడి ఉండొచ్చు" అడిగిన బెస్ కు నాన్సీ బదులిచ్చింది.
"త్వరగా అతన్ని చూడాలి" జార్జ్ అంది.
ఆ ముగ్గురికి రెండవ అంతస్తులో కానీ, మొదటి అంతస్తులో కానీ మార్చ్ కనిపించలేదు. దానితో మరింత కంగారుపడి భూతలానికి( గ్రౌండ్ ఫ్లోరుకి) చేరుకొన్నారు. అక్కడ హాలులో అతను నడివయసు స్త్రీతో మాట్లాడుతూండటం చూసి ముగ్గురమ్మాయిలు తేలిగ్గా గాలి పీల్చుకొన్నారు.
"ఈమె పేరు ఫ్రెంచ్. సుశాన్ని చూస్తున్న స్నేహితురాలు యీమెనే!" అమ్మాయిలకు ఆమెను పరిచయం చేస్తూ చెప్పాడతను.
"ఈమె నా మనవరాలు తీవ్రంగా జబ్బు పడిందని చెబుతోంది" అంటూ వాళ్ళకు ఆ హాల్లో ఒక కుర్చీలో ముడుచుకు కూర్చున్న పాపను చూపించాడు. వారికి పాప చాలా నీరసంగా కనిపించింది. జ్వరం వల్ల ఎర్రబడ్డ ముఖం, చింపిరిజుట్టుతో ఉందామె.
"అది నా తప్పు కాదు. నేను మీ మనవరాలిని స్వంతకూతురిలాగే సాకాను. కానీ ఆమె ఉన్నట్లుండి ఎందుకనో క్రుశించిపోతోంది" ఫ్రెంచ్ చెప్పింది.
"పాప ఆరోగ్య విషయంలో నిన్ను తప్పుపట్టడం లేదు" నాన్సీ ఫ్రెంచ్ తో అంటూ మెల్లిగా ఆ పాప దగ్గరకెళ్ళింది.
"సుశాన్ని పైన పడకగదిలోకి తీసుకెళ్ళి డాక్టరుకి ఫోను చేద్దాం" తన స్నేహితురాళ్ళతో చెబుతూ పాపను ఎత్తుకొని మేడమీదకు తీసుకెళ్తోంది నాన్సీ. మిగిలిన యిద్దరమ్మాయిలు ఆమెను అనుసరించారు.
సుశాన్ తనను ఎత్తుకొన్న నాన్సీ వైపు యిబ్బందిగా చూసింది. "నాకు ఒంట్లో బాగులేదు."
"నువ్వు మంచం మీద పడుకొన్నావనుకో! అదే బావుంటుంది"నాన్సీ పాపను ఊరడిస్తున్నట్లు చెప్పింది.
"పాపం చిన్నపిల్ల" బెస్ గొణిగింది.
కళ్ళు మండుతున్నాయి" పాప ఏడుపు మొదలెట్టింది. "ఒళ్ళంతా మంటగా ఉంది."
పాప మాటలకు నాన్సీకెందుకో అనుమానం వచ్చింది. వాళ్ళు ఆ పాపతో గదికి చేరుకోగానే గదిలో ఉన్న లైటు వేసి, సుశాన్ వైపు చూశారు.
పాప ఒంటినిండా ఎర్రటి పొక్కులు కనిపించాయి.
"అమ్మవారు. . .దీనినే తట్టురోగం అని కూడా అంటారు" అంది నాన్సీ. "నాకు వచ్చినప్పుడు అనుభవించానుగా! అవే లక్షణాలు"
"పాపం మార్చ్! అతనేం చేయగలడు?" జార్జ్ గుసగుసలాడింది.
'ఈ పరిస్థితుల్లో తన మనవరాలికి నర్సుని పెట్టే స్థోమత కూడా లేదు. ఫ్రెంచ్ వెళ్ళిపోతుంది. ఈ పాపను తనతో తీసుకెళ్ళదు ' నాన్సీ ఆలోచిస్తోంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక యువతి గుర్తుకొచ్చింది. ఆమె వయసు తమకన్నా నాలుగైదు సంవత్సరాలు మాత్రమే పెద్దది.
"ఎఫీ గుర్తుందా?" నాన్సీ స్నేహితురాళ్ళను అడిగింది.
"మీ యింట్లో కొన్నాళ్ళు పని చేసిన అమ్మాయా? గొప్ప తలతిక్క మనిషి" జార్జ్ నవ్వుతూ అంది. "అమెనెవరు మరిచిపోగలరు?" జార్జ్ మాటలకు నాన్సీ నవ్వింది.
"గందరగోళంలో పడనంతవరకూ బాగానే పని చేస్తుంది. ఆమెను పిలిస్తే యిక్కడకు వస్తుందనే అనుకొంటున్నాను."
"ఈ పాత యింటి పరిసరాలు గందరగోళంగానే ఉన్నాయిగా!" జార్జ్ వ్యాఖ్యానించింది.
"ప్రస్తుతం యీ యింటిసమస్యలకు 'ఎఫీ'యే పరిష్కారమని నాకు అనిపిస్తోంది. మార్చ్ కూడా ఆమె రాకకు అభ్యంతరం చెప్పకపోవచ్చు" నాన్సీ అంది.
బెస్, జార్జ్ లను పాప దగ్గరే ఉండమని తను మార్చ్ కోసం మెట్లు దిగి కిందకెళ్ళింది. సుశాన్ జబ్బు గురించి నాన్సీ చెప్పగా విన్నాడతను.
"ఈ రోగం యింత కన్న అధ్వాన్నం కాకపోతే సంతోషిస్తాను" నిరాశగా అన్నాడతను. ఫ్రెంచ్ కూడా అతనికి ధైర్యం చెబుతూ మాట్లాడింది.
"డాక్టర్ ఐవర్స్ కి ఫోను చేస్తాను. కానీ సుశాన్ త్వరగా నిద్రపోతుంది. నేను, నా స్నేహితురాళ్ళు యీ రాత్రంతా ఆమెను జాగ్రత్తగా చూసుకొంటాం" నాన్సీ చెప్పింది.
వాళ్ళకి సాయపడాలని ఫ్రెంచ్ కి అనిపించింది. కానీ సుశాన్ సంరక్షణా బాధ్యతను మరొకరికి అప్పగించి విముక్తి పొందుతున్న భావనతో వెనక్కి తగ్గింది. నాన్సీ డాక్టరుకి ఫోను చేసి తగిన సూచనలను తీసుకొంది. తరువాత తన స్నేహితురాళ్ళతో పాటు రాత్రి అక్కడ ఉండిపోతున్నట్లు తండ్రికి తెలియజేసింది. కర్సన్ డ్రూ యీ విషయాన్ని బెస్, జార్జ్ ల తల్లిదండ్రులకు తెలియజేస్తానని చెప్పాడు.
ఫ్రెంచ్ వెళ్ళిపోయాక నాన్సీ పెద్దాయనతో కలిసి మేడమీదకు వెళ్ళింది. పాప తన గదిలో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటోంది. ఆమెను చూశాక వాళ్ళిద్దరూ హాలులోకి వచ్చారు.
"తట్టురోగం ప్రమాదకరమైనది కాదు. కాకపోతే కొన్నాళ్ళు పాప మంచం దిగకూడదు."
నాన్సీ మాటలకు నిస్సహాయంగా చూశాడతను.
"నేనేం చేయగలను? జబ్బుపడ్డ పిల్లలను నేనెప్పుడూ సాకలేదు. సుశాన్ ఎప్పుడూ హుషారుగా, ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు నాకేమీ పాలుపోవటం లేదు" అంటూ నిరాశతో భోరున ఏడ్చేశాడు.
పాపకు సంరక్షకురాలిగా "ఎఫీ"ని పెట్టమని చెప్పటానికి నాన్సీకి మంచి అవకాశం చిక్కింది. ఆమె చెప్పినది విన్నాక, ఎఫీకి యివ్వవలసిన జీతం గురించి మార్చ్ నిస్సహాయత వ్యక్తంచేశాడు.
"మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమొకటి చెబుతాను" నాన్సీ మందహాసంతో చెప్పింది.
"మీరు అటకమీద ఉన్న మమ్మల్ని పిలవటానికి ముందు, అక్కడ అమ్ముకోవటానికి వీలైన కొన్ని అట్టపెట్టెలను, ఒక బల్లను చూశాం. వాటిని అమ్మగా వచ్చిన డబ్బు కొంతకాలం మీకు ఉపయోగపడవచ్చు." ఆమె మాటలు విన్న అతని కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి.
"నువ్వు చాలా మంచిదానివి. సుశాన్ విషయంలో నీ సాయం పొందమని నా అదృష్టమే నన్ను మీ యింటికి నడిపించింది" అన్నాడు.
"ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డ మరుక్షణమే ఆ పాటల గురించి వెతుకుతాను" నాన్సీ మాట యిచ్చింది.
ముగ్గురు అమ్మాయిలు ఆ యింటిలో అందుబాటులో ఉన్న వనరులతోటే సుశాన్ కి ప్రాధమికచికిత్స చేశారు. ఆ రాత్రి చాలాసేపు మెలకువగా ఉండి, నాన్సీ పాపకు సపర్యలు చేసింది. మరునాడు ఉదయం టిఫిన్ కాగానే సుశాన్ బాధ్యతను తన స్నేహితురాళ్ళకి అప్పజెప్పి, తాను కారులో ఎఫీ యింటికి వెళ్ళింది.
ఎఫీకి దయాగుణమే గాక డ్రూ కుటుంబం పట్ల విధేయత కూడా ఉంది. అందుకే నాన్సీ అడగ్గానే ప్లెజెంట్ హెడ్జెస్ లో పనికి ఒప్పుకొని, ఆమెతో బయల్దేరింది. కానీ దెయ్యాలకొంపలా ఉన్న ఆ భవంతిని చూడగానే తన మనసును మార్చుకొంది.
"నన్నెక్కడ పెడుతున్నావమ్మా? వాలకం చూస్తే యిదేదో దెయ్యాలకొంపలా ఉంది. నేను యింటికిపోతాను" అంటూ కోపంగా చెప్పింది ఎఫీ.
నాన్సీ చాలాసేపు సముదాయించి, చివరికి ఎఫీని అక్కడ పనిచేయటానికి ఒప్పించింది. ఎఫీ పనిలో పడగానే ఆమెలోని భయాలన్నీ పటాపంచలయ్యాయి. నాన్సీ సహాయంతో ఆమె వంట చేసింది. నాన్సీని ఉండిపొమ్మని మార్చ్ కోరాడు గానీ ఆమె ఒప్పుకోలేదు.
"ప్రస్తుతానికి నేను చేయగలిగినంత సాయం చేశాను. డాక్టరు వస్తానని చెప్పారు. రాత్రి సరిగా నిద్రపోలేదు. మేము ముగ్గురం, యిళ్ళకెళ్ళి పడుకోవాలి" నీరసంగా చెప్పిందామె.
"సరేనమ్మా! మీరు ముగ్గురు చేసిన సాయానికి ఎలా ఋణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు" అన్నాడతను.
అమ్మాయిలు ముగ్గురూ అటకమీదనుంచి అట్టపెట్టెలు, బల్ల దించి నాన్సీ కారులో సర్దారు. తరువాత కారులో తన స్నేహితురాళ్ళను వాళ్ళ యింటివద్ద దించి, తాను యింటికి చేరుకొంది నాన్సీ.
"నువ్వు బాగా అలసిపోయావు" హన్నా ఆమెతో అంది.
"నేను యీ రోజు చాలాసేపు పడుకొంటాను. నిద్ర లేచాక ఫేబర్ పురాతన వస్తువుల దుకాణంలో మార్చ్ యింటినుంచి తెచ్చిన పాతసామానులు అమ్మాలి."
చెప్పినట్లుగానే నిద్రపోయి లేచాక, ఫేబరు దుకాణంలో సామానులు అమ్మి నాన్సీ చెక్కు తీసుకొంది. కూతురు చేసిన పనికి డ్రూ మెచ్చుకొన్నాడు. నాన్సీ తండ్రితో తను ప్లెజెంట్ హెడ్జెస్ లో చూసిన విషయాలన్నీ కూలంకషంగా వివరించింది.
"నాన్నా! పోలీసుల దగ్గరనుంచి ఏమైనా సమాచారం తెలిసిందా?"
కూతురి ప్రశ్నకు లేదన్నట్లు తలూపాడు. "మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు గనుక ఆ రాయి విసరినవాడి గురించి మరిచిపోవాలి."
నాన్సీ మరునాడు ఉదయం పెందరాళే లేచింది. ఆమె టిఫిన్ ముగిస్తుండగా హన్నా తనకు ఎఫీనుంచి ఫోను వచ్చిందని చెప్పింది.
"ఎఫీనుంచా?" నాన్సీ విస్తుపోయింది. "అక్కడేం కొంపలు ములగలేదు కదా!" అనుకొంటూ కంగారుగా నాన్సీ హాల్లోని ఫోను దగ్గరకు పరిగెత్తింది.
ఎఫీ ఉద్వేగంతో ఫోనులో చెబుతూంటే నాన్సీకి అంతా గందరగోళంగా అనిపించింది.
"ఎఫీ! నెమ్మది. నువ్వంత కంగారుగా చెబుతూంటే నాకు ఒక్కముక్క అర్ధంకావటం లేదు. సుశాన్ కి ఏమీ జరగలేదు కదా?"
"పాప బాగానే ఉంది" ఎఫీ బదులిచ్చింది. ఆమె మాటల్లో కంగారు కొద్దిగా తగ్గింది.
"మరేమిటి సమస్య?"
"ప్రతీదీ! నాకిక్కడ భయంగా ఉందమ్మా! నాకిక్కడ ఉండాలని లేదు!"
"ఏమి జరిగిందో చెప్పు."
"నిన్నరాత్రి. . ." చెబుతున్న ఎఫీ మధ్యలోనే ఆగిపోయింది.
"చెప్పు. ." నాన్సీ ఆమెను ప్రోత్సహించింది.
"ఇప్పుడు చెప్పకపోతేనే బాగుంటుందేమో! దయచేసి నువ్వు ఎంత త్వరగా యిక్కడికి రాగలవో అంత త్వరగా యిక్కడికి చేరుకోవాలి" అంటూ ఫోను పెట్టేసింది.
(ప్లెజెంట్ హెడ్జెస్ లో రాత్రి జరిగిందేమిటో తెలుసుకోవాలంటే ఒక నెల ఓపిక పట్టాలి.)
No comments:
Post a Comment