వేమన పద్యాలు - అచ్చంగా తెలుగు
బాలగేయాలు
- టేకుమళ్ల వెంకటప్పయ్య

పిల్లలకు “ట్వింకిల్ ట్వింకిల్” అనే రైంస్ తప్ప చక్కని నీతి శతకాలు, దైవభక్తి శ్లోకాలు గీతాలు చెప్పడానికి పెద్దవారికి గానీ వినడానికి పిల్లలకు గానీ తీరిక లేని రోజులివి. అస్తమానం టీవీ లో వచ్చే కార్టూన్ సినిమాలు, సెల్ఫోను గేంస్ తప్ప ఒక మంచిమాట పలుకు లేని రోజులివి. అందువల్ల మనం నీతి శతకాలను రోజుకు ఒక పద్యం చొప్పున చెప్పి వాళ్ళకు నేర్పిస్తే జీవితాంతం గుర్తుంటాయి. కనుక చెప్పడం నేడే ప్రారంభించండి. ఈ మాసం రెండు వేమన పద్యాలు చూద్దాం.
01. అనువుగాని చోట అధికులమనరాదు 
కొంచెముందుటెల్ల కొదువకాదు 
కొండ యద్దమందు కొంచమై ఉండదా 
విశ్వదాభిరామ వినురవేమ 
ఎవరైనా ఎంత శక్తిమంతుడైనా సమయా సమయాలు గమనించి మాట్లాడాలి. నీటిలో ఉన్న మొసలికి పట్టు ఎక్కువ. దానికి అనువైన ప్రదేశం కనుక ఏనుగునైనా నీటిలోకి లాగగలదు. అదే మొసలి నీటిలోనుండి బయటకు వస్తే కుక్కలు కూడా లెక్కచేయవు. అలాగే మనకు ఎంత విద్వత్తు ఉన్నా సభలలో గానీ, అడగకుండా ఉచిత సలహాలు ఇవ్వడం గానీ తగదు. అణిగిమణిగి ఉన్నవారికే విలువ ఎక్కువ అంటున్నాడు వేమన. ఎంత పెద్ద కొండ అయినా అద్దంలో చూస్తే చిన్నదిగానే కనిపిస్తుంది కానీ వాస్తవం అది కాదు కదా! ఈ విష్యం పిల్లలకు ఉదాహరణ సహితంగా చెప్పవలసి ఉన్నది.

02. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను 
సజ్జనుండు పలుకు చల్లగాను 
కంచు మోగినట్లు కనకంబు మోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ! 

ఒక చెడ్డవాడు పెద్దవారిని లెక్క చేయక ఏదో వాగినంత మాత్రాన పెద్దవారికి పోయేదేమీ ఉండదు కదా! కంచు గంటలు గణ గణ మని పెద్దగా మ్రోగినంత మాత్రాన బంగారం విలువ ఆ లోహానికి వస్తుందా? పాండవులు రాజసూయానంతరం శ్రీకృష్ణునికి అగ్రతాంబూల మివ్వగా శిశుపాలుడు ఎగిరెగిరి పడి శ్రీకృష్ణుని తూలనాడి మృత్యువును కొని తెచ్చుకున్నాడు. ఆ కధ పిల్లలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఇలాగే పెద్దలు తమ జీవితానుభవంలో జరిగిన విషయాలు అనుభవసారం ద్వారా చెబితే పిల్లలు విని వారి మార్గం తప్పైతే మార్చుకునే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Pages