శ్రీ దేవి దశమహావిద్యలు - 9 - అచ్చంగా తెలుగు

శ్రీ దేవి దశమహావిద్యలు - 9

Share This
శ్రీ దేవి దశమహావిద్యలు - 9
8.భగళాముఖి

శ్రీ దేవి దశమహావిద్యలలో ఎనమిదవ విద్య శ్రీ భగళాముఖి దేవి. సృష్టలో పరమాత్మ యొక్క సంహార శక్తికి ప్రతిరూపమే భగళాముఖి దేవి. ఆమ్మవారి జపము, స్మరణము, సాధన, ధ్యానము ఇవన్ని శత్రుబాధలనుండి మనలని రక్షించి వారిని జయించే శక్తినిస్తాయి. అమ్మవారి సాధనా తంత్రాన్ని 'పీతాంబర విద్య' అంటారు. అందకే అమ్మవారి సాధనలో పసుపు రంగు పూలు, వస్తువులు, పసువు రంగు దండ, పసుపు రంగు వస్త్రం అత్యంత శ్రేష్ఠమైనవి.
సుధాసముద్రము మధ్యలో మణిమయ మండపములో సింహాసనముపై కూర్చొని పసుపు రంగు మాల, పూలు, వస్త్రాలు ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మ.  ఒక చేత దుష్ట రాక్షసుల నాలుకను పట్టుకొని మరోచేత ముద్గరను పట్టుకొని దర్శనమిస్తుంది అమ్మ. 
స్వతంత్ర తంత్రంలో అమ్మవారి కథ చెప్పబడి ఉంది. సత్యయుగంలో లోకాలన్నింటినీ నాశనము చేసే ఒక భయంకర తూఫాను ఉత్పన్నమయిందట. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియని దేవతలు, మునులు, జనులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా ఆయన కూడా ఏమీచేయలేక సౌరాష్ట్ర దేశంలోని హరిద్ర సరోవరానికి చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికై తపస్సు ప్రారంభించాడు నారాయణుడు. అప్పుడు ఆదిశక్తి ఆ హరిద్రసరోవరం నుండి విష్ణు తేజంతో భగళాముఖిగా అవతరించి ఆ ఘోరవిపత్తును స్తంభింపచేసింది. మంగళవారంతో కూడిన చతుర్దశి నాటి అర్థరాత్రి సమయంలో అమ్మ జన్మించింది. విష్ణు తేజం వలన అవతరించింది కాబట్టి అమ్మవారు వైష్ణవి అయింది.
అమ్మ సృష్టిలోని అన్ని పదార్థాలలో స్తంబన, అస్తంబన శక్తిగా పృథ్వీరూపమై కొలువుతీరింది. ఆ శక్తి వల్లే ఆదిత్యమండలం, స్వర్గము మొదలైనవన్ని నిలబడి ఉన్నాయి. సమాజములోని దుఃఖాలను, పాపాలను, అన్యాయ అధర్మాలను పారద్రోలే మంత్రాలలో భగళాముఖి మంత్రానికి సమానమైనది లేదు. కుండలి తంత్రంలో అమ్మవారి జపానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది.
ముండమాలా తంత్రంలో అమ్మవారి సాధనకు నక్షత్రగ్రహాది కాలశోధనము అవసరమే లేదని శ్రద్ధాభక్తులు ముఖ్యమని చెప్పబడి ఉంది. అమ్మవారు తన మంత్రంలో ఐదు స్వరూపాలుగా మనకు కనిపిస్తారు. 
1) బడవాముఖి
2) జాతవేదముఖి
3)ఉల్కాముఖి
4) జ్వాలాముఖి
5) బృహత్భానుముఖి.

మొట్టమొదటగా సృష్టికర్త అయిన బ్రహ్మ అమ్మవారి సాధన చేసాడట. ఆ తరువాత ఆ విద్యను సనకాది మునులకు ఉపదేశించగా సనత్కుమారులు నారదుడికి, నారదుడు సాంఖ్యునికి, అలా సాంఖ్యుడు పదహారు అధ్యాయాలు కల 'భగళా తంత్రాన్ని' రచించాడు. అలా అది బ్రహ్మండమంతా వ్యాప్తి చెందింది. ఈ విద్యని పరశురాముడు ద్రోణాచార్యుడికి కూడా ఉపదేశించాడు.
***

No comments:

Post a Comment

Pages