ఈ దారి మనసైనది -3
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీక్షిత.)
'మాతో అన్నయ్య వస్తాడు. నువ్వు యింట్లోనేవుండు దీక్షా! ఇక ముందు నీ చేతులు కొడవళ్లని, కలుపు మొక్కలను పట్టుకోకూడదు. పుస్తకాలనే పట్టుకోవాలి. మాలాగ ఎండకి, గాలికి తిరకూడదు. నీడపట్టునేవుండాలి' అంటూ దీక్షిత తలనిమిరింది తల్లి.
తమకోసం రెక్కలు ముక్కల్ని చేసుకుంటున్న తల్లిదండ్రులకి పొలం పనుల్లో కాస్త ఆసరాగా వుండాలన్నదే ఆమె ఆలోచన.
"ఆర్మీలో వుండే మీ మామయ్య ఇక్కడ కొంత పొలాన్ని కొని, మనల్ని సాగుచేసుకోమని చెప్పినప్పటి నుండి మన పరిస్థితి బాగానే ఉంది దీక్షా ! నువ్వు మా గురించేం ఆలోచించకు". అన్నాడు తండ్రి ఆమెను అర్థం చేసుకున్నట్లుగా.
'సరే’ అని, తలవూపి ఆ రోజు నుండి వేసవి సెలవులు అయిపోయేంత వరకు ఇంట్లోనే కూర్చుని ఆ ఊరిలో వున్న చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి చదువంటే వాళ్లకి యింకా ఇంటరెస్ట్ కలిగేలా చేసింది.
ఇంటర్లో ఎం.పి.సి తీసుకోవాలా? బై.పి.సి తీసుకోవాలా అనిసందిగ్ధంలోపడింది. అనుభవజ్ఞల సూచనల మేరకు, తనకి కూడా ఇంట్రస్ట్ వున్నందువల్ల ఎం.పి.సి తీసుకోవాలని నిర్ణయించుకొని...
హన్మకొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజిలో ఎం.పి.సి. గ్రూప్ తీసుకొని ఇంటర్లో జాయిన్ అయింది.
ఇప్పడామె మనసు కొత్తగా రెక్కలొచ్చిన విహంగమే అయింది. కానీ అంతవరకు అక్కడున్న అనుభవజ్ఞలైన లెక్చరర్స్ ఆ సంవత్సరమే ట్రాన్స్ఫర్ అయ్యారని, అదీ-మహబూబాబాద్ లో వుండే తన పాత కాలేజికేనని తెలిసి నివ్వెరపోయింది. వెంటనే తన సీనియర్ అమ్మాయి మహతి సూచనల మేరకు తిరిగి తను మహబూబాబాద్ కి వెళ్ళింది. కానీ ఆ కాలేజిలో ఎం.పి.సి.లో వేకెన్సీ లేక పోవడంతో అక్కడున్న ప్రిన్సిపాల్, లెక్చరర్స్ ఆమెను అదే కాలేజిలో వుంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎం.పి.సి గ్రూప్ నుండి బై.పి.సి గ్రూప్ లోకి మార్చారు.
గ్రూప్ మారటంతో దీక్షిత్రకి అగమ్యగోచరంగా అయ్యింది. తను వెనకబడ్డ క్లాసులన్నీ నేర్చేసుకుంది. అలాగే ఫిజిక్స్,కెమిస్త్రీ, బాటనీ కూడా లెక్చరర్స్ సహాయంతో క్లాసులో ముందు నిలిచింది.
ఆమె తండ్రి ఎప్పడు చూసినా ఆయన పడ్డ కష్టాల గురించే చెప్పటం వల్ల, ఆస్తికూడా లేనందువల్ల, ఇంటర్ మీడియట్ అయిన తర్వాత డబ్బులు బాగా ఖర్చవుతాయని లోలోన భయపడున్నా కూడా, ఆమె డాక్టర్నికావాలన్నఆశయంతో అందరూ నిద్రపోయినా, రాత్రులు ఒంటరిగా కూర్చుని చదువుతుంటే ఆమె పట్టుదల చూసి ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డి ఆమెకు కావలసిన ఎంసెట్ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహించాడు.
ఇంటర్ ఫస్టియర్ లో 440కి గాను 420 మార్కులు తెచ్చుకొని ఆ కాలేజిఫస్ట్ వచ్చింది. మిగతా మార్కులు తెలుగు విూడియం అవటం వల్ల లాంగ్వేజ్లో పోయాయి.
సమ్మర్ హాలిడేస్ అయ్యాక...
ఇంటర్ సెకండ్ యియర్ స్టార్ట్ అయింది.
దీక్షిత్ర చదువులో ముందు వుండడంతో ... ప్రిన్సిపాల్ ఆమెకు మెస్ లీడర్ గా బాధ్యతల్ని అప్పగించారు.
మెస్లో ఉదయం టిఫిన్, మద్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, రాత్రికి డిన్నర్. ఇది షెడ్యూల్.
దీక్షిత పిల్లల్ని క్యూలో నిలబెట్టి, క్రమశిక్షణగా వుండేలా చూస్తూ, తినేటప్పడు భోజనం క్రింద పడకుండా శుబ్రత పాటించేలా చూస్తూ, మెస్ లో క్యాలిటీవుండేలా జాగ్రత్త పడేది.
మెస్ లో ఏది తగ్గినా పిల్లలు అడగటం... తను వెళ్లి వార్డన్ తో గొడవ పడడం... లెక్చరర్స్ కి కంప్లెంట్స్ ఇవ్వటం ... ఇలాంటి వ్యవహారాలు ఎక్కువై చదువులో వెనకబడి పోయింది. దీక్షిత.
మల్లారెడ్డి సార్ ఒక రోజు దీక్షితను పిలిచి,
“ఎందుకిలా జరుగుతుంది? చదువులో ఎందుకు వెనకబడి పోతున్నావ్?నీ ఆశయమేంటి ? నీ లక్ష్యం ఏంటి? నువ్వు ఎటువైపువెళ్తున్నావ్? అని ఆమెను మోటివేట్ చెయ్యడంతో ఆమె తన తప్పును తెలుసుకుని, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మెస్ బాధ్యతలు చెయ్యనని చెప్పింది.
అప్పుడా ప్రిన్సిపాల్ ఆమె మాటల్ని ఆమోదించి వెంటనే ఆమెను ఆ బాధ్యతల నుండి తొలగించారు.
*****
రోజులు గడుస్తున్నాయి.
ఎగ్హామ్స్ నోటిఫికేషన్ రావడంతో చదువుతో కుస్తీ పడింది దీక్షిత. చదువు తప్ప ఆమెకు యింకేం గుర్తు రావడం లేదు. చదువే ఆశ, చదువే శ్వాస అయింది.
పరీక్ష రాసే సెంటర్ వేరే కాలేజిలో పడింది. ఆమె దగ్గర డబ్బు లేక పోవడం గమనించి ఆటో చార్జీలు మల్లారెడ్డి సార్ ఇచ్చి పంపారు.
పరీక్షలన్నీబాగా రాసింది దీక్షిత.
పరీక్షలు రాయడం పూర్తి కాగానే, అంతటితో ఆ కాలేజీకి తనకి బంధం తెగి పోయినట్లు అన్పించి, బాధపడి అక్కడున్న లెక్చరర్స్ని పలకరించి, ప్రిన్సిపాల్ దీవెనలు తీసుకొని, చివర్లో ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డిని కలవటానికి ఆయన ఇంటికి వెళ్లింది.
ఆయన ఆ రోజు పేపర్ అడ్వటయిజ్మెంట్ చూపిస్తూ
‘ఇందులొ షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ ప్రభుత్వం కల్పిస్తున్నట్లు సమాచారం వుంది. ఒకసారి చూడు' అంటూ దీక్షితతో అన్నాడు.
దీక్షిత ఆ పేపర్నిచేతిలోకి తీసుకొని చూసింది. ఆ అడ్వటయిజ్ మెంట్ ఆమెలో డాక్టర్నికావాలని వున్న కోరికకు జీవం పోసింది.
మల్లారెడ్డి లెక్చరర్ సహాయంతో ఎంసెట్ కోచింగ్ కి అప్లై చేసింది. దానికి సంబందించిన మిగతా బాధ్యతల్ని ఆ లెక్చరర్ కే అప్పజెప్పి పాకాల వెళ్లింది.
ఒక వేళ తనకి ఎం.సెట్లో మంచి ర్యాంక్ రాకపోతే అన్న ఆలోచనతో ... వేదనతో.. తండ్రి వద్దకు వెళ్ళింది దీక్షిత.
(సశేషం)
No comments:
Post a Comment