జర్నీ ఆఫ్ ఏ టీచర్ -3
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
1982 జూన్ మాసంలో నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్‍గా ఎన్నికయ్యాను. మాది మొదటి బ్యాచ్.
నన్ను నాన్ లోకల్ కోటాలో సెలెక్టు చేసి ఆంధ్ర ప్రాంతానికి పంపించారు.
శ్రీకాకుళం జిల్లా లోని శ్రీకొండ డిగ్రీ, జూనియర్ సంయుక్త కాలేజీలో జాయినయ్యాను. అది చాలా పెద్ద కాలేజీ. మంచి పేరున్న కాలేజీ. వొకేషనల్ తరగతులూ ఉన్నాయి. టీచింగ్. నాన్ టీచింగ్ స్టాఫంతా కలిసి దాదాపు వంద మందిదాకా వుంటారు.
మ్యాథ్స్ డిపార్టుమెంటులో ఎనిమిది మందిమి. నేనే అందరికంటే పిన్న వయస్కుణ్ణి.
ఆ కాలేజీలో సీటు దొరకడం చాలా కష్టం. విపరీతమైన రద్దీ. మ్యాథ్స్ గ్రూపులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో నాలుగేసి సెక్షన్స్. సెక్షన్‍కు నూటపది మంది విద్యార్థులను చేర్చుకున్నప్పటికీ దాదాపు సెవంటీ పెర్సెంట్ వద్ద కటాఫ్ అవుతుంది.
అలాంటి తెలివితేటలున్న విద్యార్ధుల క్లాసుకు వెళ్ళాలంటే నాకు భయమేసేది. తెలుగు మీడియమంటే కాస్తా ఫరవాలేదు గాని ఇంగ్లీష్ మీడియమంటే మరింత జంకే వాణ్ణి. సమస్యల వివరణ కోసం పదాలు వెదుక్కోవాల్సి వచ్చేది. ఎంతగా ప్రిపేర్ అయినా ముందు జాగ్రత్తగా పేపర్‍పై ఆపూటకు సరిపడే లెక్కలు చేసుకొని జేబులో పెట్టుకొని క్లాసుకు వెళ్ళే వాణ్ణి. అదీ అప్పటి నా పరిస్థితి.
ఒక్కోసారి కొందరి పిల్లల సాధనలు నా సాధనల కంటే మెరుగ్గా కానబడేవి. వారి సాధనాలనే తిరిగి పిల్లలందరికీ వివరించే వాణ్ణి.
గురువారం నాకు నాలుగు పీరియడ్స్ ఉండేవి. సరిగ్గా ప్రిపేర్ గాకుంటే అ రోజు సెలవు పెట్టే వాణ్ణి.
మా డిపార్టుమెంటులో విజయకుమార్ లెక్చరర్‍కు టీచింగ్‍లో మంచి పేరుంది.
నేనొక రోజు మాష్టారు పర్మిషన్ తీసుకొని క్లాసులో కూర్చొని విన్నాను. అతడి బోధన నన్ను ఆకట్టుకుంది. చాలా ప్రభావితుడిని చేసింది. మంత్రముగ్ధుణ్ణయ్యాను. బోధనలో మెళకువలు తెలుసు కోవాలనే ఆరాటం నాలో పెరిగింది.
అదే రోజు సాయంత్రం విజయకుమార్ ఇంటికి వెళ్లాను.
కాలింగ్ బెల్ కొట్టే సరికి ఒక అమ్మాయి తలుపు తీసింది.
రండి.. కూర్చోండి.. అన్నట్లుగా సోఫా వంక సైగ చేసి లోనికెళ్ళింది. బహుశః అమ్మాయి విజయకుమార్ కూతురనుకుంటాను..
మెరుపు తీగలా వచ్చి వెళ్ళింది.. కనీసం పలుకరించ లేదు.. ఎంత గర్వం?.. అని మనసులో గొణుక్కున్నాను.. ఈ కాలపు పిల్లలే అంత అని సరిపెట్టుకున్నాను.
ఇంతలో విజయకుమార్ రావడం చూసి “నమస్కారం మాష్టారూ” అంటూ లేచి నిలబడ్డాను.
“భలేవారే.. నిల్చుండిపోయారెందుకూ.. కూర్చోండి మాష్టారూ..” అంటూ ఆహ్వానపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు, ప్రతినమస్కారం చేస్తూ.
“ఏంటి మాష్టారూ ఒక్కరే వచ్చారు.. మీ మిసెస్‍ను కూడా తీసుకురావాల్సింది”
“ఆమె డెలివరీకి వెళ్ళింది మాష్టారూ..”
“ఎన్నో డెలివరీ ఏంటి..” అంటూ చిన్నగా నవ్వుతూ అడిగాడు. నేనూ అతడి నవ్వులో శృతి కలుపుతూ..
“పెద్ద వాడు బాబు, తరువాత పాప.. ఇది మూడవ డెలివరీ మాష్టారూ..”
“అవునూ..మీరు వేసెక్టమీ ఆపరేషన్ ఇక్కడికి వచ్చాకే చేయించుకున్నారు కదూ..” అంటూ కాస్తా ఆశ్చర్యంగా చూసాడు.
“నిజమే మాష్టారూ.. అప్పటికే నా వైఫ్ క్యారీయింగ్..”
“ఓ..! బెస్టాఫ్ లక్.. మాష్టారూ” నా చేయికలుపుతూ అన్నాడు.
“మాష్టారూ.. మీ టీచింగ్ చాలా బాగుంటుంది.. ఆ కిటుకులేవో తెలుసుకుందామని వచ్చాను ” అన్నాను ఆత్రుతగా.
విజయకుమార్ పెదవి దాటని నవ్వు నవ్వి..
“అదేముంది మాష్టారూ.. రెండు సంవత్సరాలు చెబితే మీరూ నాలాగే తయారవుతారు.. మొదట్లో నేనూ తడబడ్డవాడినే. అనుభవంతో రాటుతేలుతాం.. ఇంత అనుభవం గడించినా నేనూ ప్రతీ రోజు క్లాసు కోసం ప్రిపేర్ అవుతూనే వుంటాను. అలా అవ్వాలి.. అదే అసలు రహస్యం. ప్రిపేర్ గాకుండా క్లాసుకు వెళ్ళొద్దు.
ప్రశ్నలో వున్న పేర్లను గాకుండా ఆప్రాంతపు పేర్లు, ఆయా తరగతి విద్యార్థుల పేర్లు వాడుతూ పాఠం చెబితే పిల్లలకు థ్రిల్లింగ్ అవడమే గాకుండా బాగా గుర్తుండి పోతుంది” అంటూ “రోజీ ఇటురామ్మా.. అత్తయ్యను బావను కూడా రమ్మను..” హాలు గుమ్మం వైపు చూస్తూ పిలిచాడు.
ఇంతకు ముందు గుమ్మం తెరిచిన అమ్మాయి.. ఆమె వెనకాలే నడివయస్కురాలు విధవరాలుగా కనబడింది. ఆమె వెనకాలే ఒక యువకుడు వచ్చాడు.
“మాష్టారూ.. నా కూతురు రోజారాణి. ఆమె నా అక్కయ్య శాంత .. ఆ బాబు నా మేనల్లుడు మహేష్ ..” అంటూ పరిచయం చేసాడు.
“శాంతా.. మాష్టారు సూర్యప్రకాష్.. కొత్తగా మా కాలేజీలో ఈమధ్యనే చేరారమ్మా” అంటూ నన్నూ పరిచయం చేసాడు.
మాష్టారు భార్య లేదా.. అని ఆలోచిస్తున్నాను..
వారంతా లోనికి వెళ్ళగానే “నా సతీమణిని పరిచయం చేస్తాను రండి మాష్టారూ..” అంటూ నన్ను వారి బెడ్‍రూం లోనికి తీసుకెళ్ళాడు.
మంచం మీద ఎముకల గూడుపై బట్టలు కప్పినట్లున్న మేడంను చూడగానే ఝల్లున వణికాను. భయమేసింది. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కర్చీఫ్ తీసి కళ్ళు వొత్తుకున్నాను.
“పద్మా.. వీరు మా కాలేజీకి కొత్తగా వచ్చిన మాష్టారు.. సూర్యప్రకాష్..” అంటూ నన్ను పరిచయం చేసాడు.
మేడం ఏదో చెబ్తోంది.. నాకేమీ అర్థం కావడం లేదు.
“నమస్కరించడానికి చేతులు సహకరించడం లేదు.. మన్నించండి” అంటోంది.." అన్నాడు విజయకుమార్.
“మేడం.. నేను చిన్న వాణ్ణి. నన్ను దీవించండి” అంటూ నమస్కరించాను.
హృదయవిదారకమైన వాతావరణం.. నామది మూగబోయింది. గదిలో నిల్చోలేక పోయాను.
కుటుంబంలో ఒకరు అనారోగ్యంగా ఉంటే పడే బాధ వర్ణణాతీతం. నేనూ అనుభవించిన వాణ్ణే. ఎదుటి వారి కష్టాలు చూసినప్పుడే మన కష్టాలూ గుర్తుకు వస్తాయి..
పందొమ్మిది వందల డెబ్బది ఆరులో నేను ఎం.ఎస్సి. పాసయ్యాను. మెరిట్ బేసిస్ మీద నాకు పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగమొచ్చింది.
నా మనసులో డాక్టరేట్ చెయ్యాలని ఉన్నా.. మా నాన్న సైకిలుపై బట్టల మూట పెట్టుకొని ఊరూరూ తిరిగి అమ్ముతూ నన్నింత వరకు చదివించడమే గొప్ప. ఇక నాన్నకు విశ్రాంతినివ్వాలని ఉద్యోగంలో చేరక తప్పలేదు.
అప్పటికే మా నాన్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోయింది. ‘నా కళ్ళముందు పెళ్లి చేసుకో.. ఉద్యోగమూ ఉంది కదా..’ అని నాన్న.. మరో వైపు అమ్మ బలవంతంగా ఒప్పించి నా వివాహం చేసారు.
రెండేళ్ళకు బాబు పుట్టాడు. దురదృష్టవశాత్తు మూడేళ్ళ ప్రాయంలో పోలియో బారినపడ్డాడు. అప్పుడు నాసతీమణి నేను పడ్డ వేదన అంతా ఇంతా కాదు. పొద్దంతా వాడికి సేవలు చేస్తూ రాత్రంతా వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడ్చే వాళ్ళం.
డాక్టర్ల సలహా ప్రకారం బాబుకు వ్యాయామాలు చేయిస్తూ.. వ్యాధి పీడితమైన నడుం, కాళ్ళను మాలిష్ చేయిస్తూ.. బలానికి టానిక్కులు తాగించే వాళ్ళం. చివరికి మా మొర దేవుడాలకించాడనుకుంటాను.. మేము పడ్డ శ్రమ ఫలించింది.. బాబు మరో ఏడాదిలోగా మళ్ళీ తప్పడడుగులు వేయడమారంభించాడు.. మా సంతోషానికి అవధులు లేవు..
చీకటి వెలుతురులాగా.. సుఖదుఃఖాలూను..
“మాష్టారూ.. పదండి అలా హాల్లో కూర్చుందాం..” అని విజయకుమార్ అనేసరికి కన్నీళ్ళ పర్యంతమైన నా కళ్ళు కర్చీఫ్‍తో తుడ్చుకున్నాను.
ఇద్దరం తిరిగి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాం.
“మాష్టారూ..రోజీ పుట్టగానే నా సతీమణి అనారోగ్యం పాలైంది. రోజీకి మాటలు రాక పోవడం ఆమెను మరింత కుంగదీసింది. మనో వేదనతో మంచం పట్టింది” నేను నిర్ఘాంతపోయి వినసాగాను. “అసలు విషయం ఈ మధ్యనే తెలిసింది. గర్భ సంచికి కేన్సర్ సోకిందని. తొలగించారు.. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడటం లేదు..”
“దేవునిదయ వల్ల కోలుకుంటుంది మాష్టారూ మీరేమీ దిగులు పడకండి” అంటూ ధైర్యవచనాలు పలికాను. మా మధ్య కాసేపు మౌనం నిండుకుంది.
మౌనాన్ని చేదిస్తూ..“బావగారు ఈమధ్యనే కాలం చేసారు. అక్కయ్యను ఒంటరిగా ఆ ఊళ్ళో ఉంచడం నాకు మనస్కరించలేదు. తనకు ఒక్కడే కొడుకు. వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇద్దరినీ నాకు సాయంగా పిలిపించుకున్నాను అన్నాడు విజయకుమార్.
నేను ఆసక్తిగా వినసాగాను.
“ఇందులో నాస్వార్థమూ వుంది మాష్టారూ. మా కులంలో కట్న కానుకలు హెచ్చు.. ఆ మాటకేం గాని.. మొదలు అమ్మాయిని అర్థం చేసుకోవద్దూ..!
రోజీకి మనం మాట్లాడితే అర్థమౌతుంది కాని తిరిగి తను మాట్లాడ లేదు. అలాంటి అమ్మాయి కోసం ఈకాలంలో ఎవరు ముందుకొస్తారు చెప్పండి?.. అందుకే మహేష్ మా ఇంట్లోనే ఉంటే వారి మధ్య అవగాహన పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాను.
మహేష్. ఇంటర్ ఫైనలియర్.. మన కాలేజీలోనే చదువుతున్నాడు.
రోజీ ఇప్పుడు స్కూల్ ఫైనల్.. చదువులు పూర్తయ్యాక వారిరువురికి పెళ్లి చేయాలని మా అక్కయ్య నేను నిర్ణయం తీసుకున్నాం.”
రోజీ కాఫీ కప్పులతో ట్రే తీసుకొని వచ్చింది..
దేవుడు ఎంత నిర్దయుడు.. అని మనసులో నిందించుకున్నాను..
రోజీ నిజంగా రోజానే.. నాకళ్ళకు వికసించిబోయే రోజా మొగ్గలా కనబడుతోంది. అనవసరంగా అమ్మాయిని అపార్థం చేసుకున్నానని బాధ పడ్డాను.
కాఫీ తాగుతూ “మాష్టారూ.. మీ హృదయంలో ఇంత ఆవేదన పెట్టుకొని అంత అద్వితీయంగా పాఠాలు ఎలా చెప్పగల్గుతున్నారు?” అంటూ అడిగాను.
మాష్టారు కాఫీ తాగడం పూర్తీ చేసి ఖాళీకప్పును టీపాయ్‍పై పెడుతూ గొంతు సవరించు కున్నాడు.
“మాష్టారూ.. మనకు ‘మిల్క్ అండ్ బ్రెడ్’ ఇచ్చేది ప్రభుత్వం. ఆసంపాదనే లేకుంటే మన కుటుంబం ఎలా గడుస్తుంది?. మరి సంపాదన అనుభవిస్తూ విద్యార్థులకు ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసం?. మన బాధలు ఎదుటి వారికి తెలియకుండా ‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా..’ అనే గీతాన్ని మననం చేసుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్నాను” అంటూ చిరునవ్వు నవ్వాడు.
నేను అభినందించకుండా ఉండలేక పోయాను. ఉన్నఫళంగా లేచి మాష్టారి పాదాలను తాకాను. ఆశీర్వాదాలు కోరాను. మాష్టారు నన్ను లేపి తన హృదయానికి హత్తుకున్నాడు.
***
“ఇది మీకు నమ్మశక్యంగా లేక పోవచ్చు.. కాని వాస్తవం.. అలాంటి మహానుభావుల వల్లే మన జూనియర్ కాలేజీలు ఇంకా విలసిల్లుతున్నాయనుకున్న నాఉద్వేగమే అలా ఆతని పాదాలను స్పర్శించజేసింది.” అంటూ స్టాఫ్‍ను కలియ చూసాడు సూర్య ప్రకాష్.
అంతా ఊపిరి బిగబట్టి.. ఆసక్తిగా వింటున్నారు.. అని మనసులో అనుకొని తిరిగి చెప్పడమారంభించాడు.
(సశేషం)
***
మనం కలిసి కొన్ని సంవత్సరాలే ఉద్యోగం చేసినా నేటికీ మన స్నేహం చేరగా లేదు. ఆ చక్కని అనుభూతులను ఇక్కడ కథల రూపంలో వ్రాయడం ఆనంద దాయకం. ఉద్యోగం చేతప్పుడు ఉండే ఏ ఒక్క భావనను మర్చి పోలేదు.అభినందనలు.
ReplyDeleteగొట్టుముక్కుల బ్రహ్మానందము~విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు~వ్యక్తిత్వ వికాస ప్రేరణాత్మక ఉపన్యాసకుడు.