కీరవాణి శతకము - గంగాధర కవి - అచ్చంగా తెలుగు

కీరవాణి శతకము - గంగాధర కవి

Share This
కీరవాణి శతకము - గంగాధర కవి
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:

కీరవాణి శతకకర్త గంగాధరకవి తూర్పుగోదావరి మండలంలోని పిఠాపురప్రాంత నివాసి. క్రీ.శ. 1860 ప్రాంతాలకు చెందినవాడిగా సతక చరిత్రకారుల నిర్ణయం. తలితండ్రులు రాజమ్మ-పట్టాభిరామయ్యలు. ఈతడు రెండుశతకములు రచించాడు. 1. కీరవాణి శతకము 2. శ్రీరమణీమనోహర శతకము. 
ఈశతకకర్త గురించి గతంలో పరిచయం చేసిన శ్రీరమణీమనోహర శతకంలో విపులంగా చర్చించుకున్నాము.

శతకపరిచయం.

"కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి" అనే మకుటంతో రచించిన ఈ శతకంలో నూరు సీసపద్యములు ఉన్నాయి. ఈశతకం శృంగార భక్తి శతకాల కోవలోనికి చెందుతుంది. అంత్యప్రాసనియమాలతో సాగే ఇ శతకంలో విరహిణి అయిన నాయిక కేశవుని మనమున భాసించి ఆతని లీలలను తలపోస్తూ, విరహానవేగిపోతూ తన చెలికత్తె అయిన ఖిరవాణి ని సంభోదించి కేశవుని తీసుకురమ్మని అదేశించినట్లుగా ఈశతకం తలపిస్తుంది. 

ముఖ్యంగా బాలకృష్ణుని లీలలు, యశోద కృష్ణిసంభాషణలు ఎంతో ఆహ్లాదంగా వర్ణించారు. 
ఈ క్రింది పద్యాలను చూడండి.

సీ. నందనందన శరదిందునిభానన ఇందీవరాక్ష గోవిందరార
కమనీయజలధర కాయసంకాశ రారా శారదాపతిఁగన్న జాణరార
గోపికాజనమనఃకుముదచంద్రమ రార మానినీజనలోకమదన రార
యక్షీణప్రావాధ్యక్ష మాధవ రార పక్షిరాడ్గమ శ్రీవక్ష రార

గీ. దండి యొసఁగెడు బంగారుకొండ రార కొండగొడుగెత్తి బ్రోచిన తండ్రి రార
యనుచు నందుని సతి పిల్వ మనము జెలఁగు కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి

సీ. నందకుమార గోవింద మందరధర సుందరతరచరణారవింద
కనకాచలసుధీర కనకసుందరచేల ఘనమునిజనపాల కలితసీల
జలధరసంకాశ జనపాలకాధీశ జయపరాక్రమకీర్తి సతినివేశ
వననిధిగాంభీర్యవైభవ ధీమంత వ్రజకామినీవనవ్రజవసంత

గీ రార నాపెన్నిధానమ రార యనుచు నందసతి బిల్వ వేడుకలందమొప్పఁ
గనుఁగొనగ నేఁగు యదుకులకల్పకంబు, కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి

సీ. రారా యోవనమాలి రార యోగుణశాలి రార యోప్రద్యుమ్న రారా కృష్ణ
యేర గోపికయిండ్ల కేఁగఁ బాడిర తండ్రి యింతుల మతులు నీ వెఱుఁగ వయయొ
విరహసముత్పన్న వేదనకోర్వక తమకుచగిరులచేఁ దరుచు నిన్నుఁ
బొడుతురు కెమ్మోవి నొడుతురు శయ్యకుఁ గడువడి దార్తురు గామికేళి

గీ. తమకు నిమ్మని తమకమొప్పఁ గాన నీవందుబోకుర గానలోల
యనుచు గోపమ్మ పలుక బెన్ ఘనత నమరు కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

సీ. సిరిచరపంజరచరరామచిలుక రా మహనీయతరరూపమదన రార
భక్తజలార్ణవప్రాభవసోమ రా నిరతిశయానంద నిత్య రార
ముఖజితశశిరార మఘవారిహత రార పాలిత యదుకులబాల రార
నా నోముఫలము రా నానిధానమ రార నాపుణ్యపరిపాకనటన రార

గీ. వెన్నఁ బెట్టెద రార నన్గన్నతండ్రి యెవ్వ రెవ్వరిగృహరాజి కేగినావొ
యనుచు గోపిక పిలిచెడు ఘనుఁడు వరుఁడు, కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

బాలకృష్ణుని మనోహరరూప వర్ణనను సూచించే ఈ పద్యాలు గమనించండి

సీ. నాలవఋతునెలనడిమిదినంబున నొప్పెడుశశికళ నొప్పు మోము
మృగరాజమధ్యము సొగసును గెలిచెడు కడువిలాసము జూపఁబడెడునడుము
ఫుల్లారవింసంపూర్ణాభిరామంబుఁ గడువడి నిరసించు కన్నుదోయి
యిభపుంగవునియాన నభినుతింపమికైన వలనుమీఱినయట్టి కలిమినడక

గీ. గలిగి వేణువు చేఁ బూని కనకపటము పైని దూఁగాడ గోపికాపటలి గొలువ
నాలఁ గాచుచుఁ గానను గేళి సల్పు, కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

సీ. విమలవారితరంగకమనీయవిభవంబు నుడుమండలముబుపైఁ బొడవుఁ జూప
కాంచనసైకతకాంతివిలాసంబు పద్మబాంధవతేజపటిమ నమర
హేమసారసములయేపు సంధ్యారాగ సఔందర్యకళలతో సరసమాడ
బాలమారుతలీల కేలీగతులు జల్వ పుష్పగంధచయంబు బొల్పు లొప్ప

గీ. మదమరాళవిహారము కుదురు లమర ఘనత లొప్పెడునాకాశగంగఁ గన్న
చరణసారస మమరిన చక్రధరుఁడు, కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

ఇక శృంగారం విషయానికి వస్తే ఇందులో శృంగారంపాలు ఎక్కువే అని చెప్పాలి. 

సీ. చల్లమ్మ నొకగొల్ల పల్లవాధరి యేఁగి చల్ల చల్లో యని పెల్లుకేఁక
వేయంగ విని దానిడాయంగఁ జనుదెంచి యోయంగనా చల్ల బోయు నాకు
నని కుండ డించి యావనిత పయ్యెదచెంగు దొలఁగించి చనుదోయి గలయఁజూచి
యెంత ఖరీదు చన్బంతులు చెప్పవే యింతి నేగొందు బల్ సంతసమున

గీ. ననుచు మకరధ్వజునిక్రీడ కనువుజేసి గజిబిజి యొనర్చెఁ బంకజగంధి నపుడు
నంచు వింటిని నీవేగి మంచిగలుగు, కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

సీ. బోటిరో సౌందర్య మేటిరో రతనాల కోటిరో ముద్దుల మూటరావె
లేమరో వరగుణధామరో ముఖజితసోమరో పరిపూర్ణకామరావె
యింతిరో కంతుచేమంతిరో తేనియ దొంతిరో కీర్తిచేమంత్రావె
కొమ్మరో కలధౌతబొమ్మరో మనగాగ్ని జిమ్మవె కనులనెత్తమ్మిరావె

మానినీరావె మదగజయానరావె బాలవేరావె మరునిపూగోలరావె
యనుచు బిలిచెడు వనమాలి దనుజహరుడు కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

సీ. మన్మధా నీరూపు మంటపాలైపోను పవనుడా నిను త్రాచుపాము మింగఁ
గోయిలా నీకూఁత మాయమై నడుగంట జలజారి నిను రాహు వెలమి మ్రింగ
గీరమా నీరవ మారిసారి మడంగ మధుప నీగీతము మ్రానుగలవ
కేకి నీకేఁకల రాకడ నశియింప శారికా నీపల్కు బేరుద్రెంప

గీ. ననుచు విరహానలార్చుల ఘనత కోర్వలేక పల్కినభామను లోక మెఱుఁగ
నేలు వలరాజజనకుడు నీలవిభుఁడు కేశవుఁడు వానిఁ దేఁగదె కీరవాణి

ఇటువంటి శృంగార పద్యములు ఈశతకములో అనేకం. శతకంలో 53 వపద్యము నుండి 62 వ పద్యము వరకు కవి దశావతారవర్ణనము చేసినాడు. 

భక్తి శృంగారములు కలబోసిరాసిన ఈశతకం చదివేరికి ఎంతో మానసోల్లాసం కలిగిస్తుంది. సరళమైన భాష, ముద్దులొలికే తెలుగు భాషలో అంత్యప్రాస నియమంతో వ్రాసిన పద్యాలు ఆనందం కలగజేస్తాయి. ప్రతిపద్యము ఒక రత్నమే. ప్రతిభావము మనోహరమే. ఆ ఆనందం చదివి అనుభవించవలసినదే.
మీరు చదవండి మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages