మార్పు-తీర్పు - అచ్చంగా తెలుగు
మార్పు-తీర్పు
పారనంది శాంత కుమారి

ఆమె...
తనబాల్యంలో,కన్నతండ్రి లాల్యంలో గడిపింది. 
నాన్నగుండెలో ఒదిగింది,నాన్నముద్దులో ఎదిగింది
నాన్న చేయిపట్టి అడుగులేసింది,
నాన్న మురిపెంతో మాటలునేర్చింది.
అప్పటివరకు ఆమెకు నాన్నేలోకం,నాన్నేసర్వం 
అన్నీనాన్నే,అన్నిటికన్నా నాన్నేమిన్న.
అంతలో వింతగా... 
ఆమెను యవ్వనం స్పృశించింది,
అదిఆమెను కొత్తగాసృజించినది.

దాంతో....
ఆమె తీరుమారింది,ఆమె దారిమారింది.
ఆమె ఆలోచన మారింది,ఆమె అనుసరణ మారింది.
కళలు మొదలయ్యాయి,కలలు ముదిమయ్యాయి.
కలలు కవ్వించసాగాయి,ఊహలు ఊరించసాగాయి,
కొత్తఆశలు ఆమెలో చిగురులుతొడిగాయి,
సరికొత్తబాసలు ఆమెను చేరువకమ్మని అడిగాయి. 
అంతే!

ఇన్నాళ్ళుగా నాన్నకు కొలువైన హృదయం 
ఇప్పుడు అతనికి నెలవైంది.
ఇన్నేళ్ళుగా నాన్నసన్నిధిని కోరుకున్నఆమె,
ఇప్పుడు అతనిని తన పెన్నిధిగా భావిస్తోంది.
అనివార్యమైన మార్పు ఆమెమనసును స్పందించింది,
ఆవయసుకు సహజమైన తనతీర్పును ఆమెకందించింది.
ఆమె నాన్నను మరిచింది,అతనిని వలచింది.
నాన్నని విడిచింది,అతనిని చేరింది.
నాన్నకళ్ళలో నీరు ఆమెను ఆపలేకపోయింది.
నాన్నగుండెల్లో వేదన ఆమెనిర్ణయాన్ని మార్చలేకపోయింది.
ఈ మార్పును నాన్నహృదయం తట్టుకోలేకపోయింది,
విధిచెప్పిన ఆతీర్పు నాన్నగుండెను ఆగేలాచేసింది. 
***

No comments:

Post a Comment

Pages