ప్రేమతో నీ ఋషి – 36
-
యనమండ్ర
శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో
పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి,
అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన
‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్
ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు
మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం
ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ముంబైలో
ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి
మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో
దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని
తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ మృణాల్ శవం కనిపిస్తుంది స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు
తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి
వెళ్లి, అక్కడ మృణాల్, అప్సరను ఎవరో కాల్చి చంపడం చూస్తాడు ఋషి. తమ చుట్టూ ఎవరో
ఉచ్చు బిగిస్తున్నారని తెలుసుకున్న ఋషి, స్నిగ్ధ
జరిగినవన్నీ శర్మ గారికి చెప్తారు. కాని, ఆయన, మహేంద్ర
కలిసి ఋషిని తాము చెప్పినట్లు చెయ్యమని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇక చదవండి...)
కొద్ది నిముషాల పాటు ఋషి, శర్మ గారు
మాట్లాడుకోలేదు. మిష్టర్ శర్మ, తన ఏర్పాట్లు చేసుకునేందుకు బయలుదేరుతూ,
“ఋషి, ఇంతవరకు మేము నీపట్ల చాలా మృదువుగా
ఉన్నాము. కాని, మహేంద్రకున్న సర్కిల్ ఎంత విస్తృతమైనదంటే, నువ్వీ గదిని వదిలి వెళ్ళినా,
ఆ నిఘా నిన్ను వదలదు. అతి తెలివితేటలు చూపకు. అనవసరంగా నీ ప్రాణాలు కోల్పోవాల్సి
ఉంటుంది. అప్పుడు ఈ వరుసలో ప్రాణాలు కోల్పోయిన
నాలుగొవ వ్యక్తివి నువ్వే అవుతావు. మొదటిది ప్రాజెక్టు ప్రారంభంలో విశ్వామిత్ర
పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్, ఆ తర్వాత మృణాల్, అప్సర. వాళ్ళు మహేంద్రను మోసం
చెయ్యాలని ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయారు. నువ్వు వాళ్ళు చేసిన పొరపాటునే నువ్వూ
చేస్తావని భావించట్లేదు. ఏమీ చెయ్యకుండా, ఊరికే అలా ఉండు, మా సూచనల కోసం నిరీక్షించు.
నేను రేపటికల్లా ధృవీకరణ పూర్తి చేసి, హైదరాబాద్ వెళ్తాను. ఆ తర్వాత ఏం చెయ్యాలో
నీకు చెప్తాను.” ఇలా అని, ఆయన
వెళ్ళిపోయారు.
ఋషి అసహాయంగా అదే కుర్చీలో కూర్చుని
ఉండిపోయాడు. కొద్ది నిముషాల తర్వాత, స్నిగ్ధ లోపలికి వచ్చింది. ఏం జరుగుతోందో,
వారు ఋషితో ఏం మాట్లాడారో తెలియదు కనుక, ఆమె చాలా దిగులు పడుతోంది.
***
“ఇవన్నీ మహేంద్ర చేసాడని ఇంకా నాకు
నమ్మకం కలగట్లేదు,” గత 24 గంటల్లో స్నిగ్ధ చాలా సార్లు ఇదే మాట అంది. తమ
చర్చల గురించి ఋషి ఆమెకు క్లుప్తంగా చెప్పాడు, ఆమెకు వీడియో క్లిప్పింగ్స్ కూడా
చూపాడు.
మిష్టర్ శర్మ తో మాట్లాడి వచ్చాకా, ఋషి
కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత స్నిగ్ధకు అన్నీ చెప్పాకా, మార్మికమైన మౌనంలోకి
వెళ్ళిపోయాడు.
“నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు.ఇది మనకు
కష్టకాలమని నాకు తెలుసు. కాని, నువ్విలా నిరాశ పడిపోతావని నేననుకోలేదు. నీ
స్వాభావిక పద్ధతిలో ధైర్యంగా ఉండు, మనం ఏదైనా చెయ్యగలమేమో. కనీసం, మనం నోరు తెరిచి
బయటపడే వరకైనా, మనల్ని ఎందులోనూ ఇరికించరని నాకు తెలుసు. కాబట్టి, ప్రస్తుతానికి
శర్మ గారు చెప్పినట్లే చేద్దాము,” స్నిగ్ధ ఋషిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తోంది.
“కాని, ఇదంతా నీకు ఆ విశ్వామిత్ర
పెయింటింగ్ పట్ల ఉన్న ఉత్సుకత వల్లనే జరిగిందని నేను అనక తప్పదు. ఆ పెయింటింగ్ లో
నిన్ను కట్టి పడేసేది ఏమిటో నాకు తెలీదు. కాని, అది ఖచ్చితంగా మన జీవితాలను నాశనం
చేసేసింది. మనం ఆ పెయింటింగ్ ను స్టోర్ లో పెట్టేసి, దానివంక అసలు తిరిగి చూడకూడదని
నేను భావిస్తున్నాను. అది చాలామంది జీవితాల్ని బలి తీసుకుంది...” ఋషి కనులు
మూసుకుంటూ ఉండగా స్నిగ్ధ చెప్పసాగింది.
“.... నా తండ్రి కౌండిన్యతో సహా”, ఋషి
నెమ్మదిగా అన్నాడు.
మొదట స్నిగ్ధకు అర్ధం కాలేదు. కాని, ఆమె
విన్నది ఏమిటో ఆమె గుర్తించి, నెమ్మదిగా అతని వద్దకు వచ్చి, అతని మొహంలోకి
చూసింది. అతను కన్నీటితో నిండి ఉన్నాడు.
“అవును స్నిగ్ధా, కౌండిన్య , అంటే ఈ
విశ్వామిత్ర పెయింటింగ్ వేసిన వారు నా తండ్రి. ఆయన హైదరాబాద్ లో ప్రఖ్యాత
చిత్రకారులు. నేను UK లో ఉండగా, ఆయన ఈ పెయింటింగ్ పునఃసృష్టి కోసం తనకు వచ్చిన ఏదో
ప్రాజెక్ట్ గురించి చెప్పేవారు. ఈ ముసలి వయసులో, తన ప్రతిభకు తగ్గ గుర్తింపు
వచ్చిందని, ఆయన అమితానందం చెందారు. సుమారు ఆరు నెలలు దీనిమీదే గడిపారు. ఆ సమయానికి,
నేను ఎం.బి.ఎ పూర్తి చేసి, బాంక్ ప్రైమ్ సూయిస్ లో ఉద్యోగంలో చేరాను. ప్రతి రోజూ,
ఈ పెయింటింగ్ వేసేందుకు తాను ఎంత కష్టపడ్డానో, ఆయన నాతో చెప్పేవారు.”
స్నిగ్ధ ఇదంతా విని, షాక్ కు గురయ్యింది.
ఋషికి ఆ విశ్వామిత్ర పెయింటింగ్ పట్ల ఉన్న గుప్తమైన ఆసక్తిని ఇప్పుడామె మరింత
స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతోంది.
“కొన్నాళ్ళ తర్వాత, ప్రతి వారం ఆయన నాతో
మాట్లాడే సమయంలో, హఠాత్తుగా కలతగా ధ్వనించే వారు. నాతో ఆయన ఫోన్ లో చెప్పగలిగింది,
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం వారు తనను
వేధిస్తున్నారని, ఆయనకు సాయం చేసేందుకు నేను హైదరాబాద్ రావాలని, మాత్రమే. నాకు
పెయింటింగ్స్ పట్ల అసలు ఆసక్తి లేకపోవడంతో, నేను ఈ విషయాన్ని అంత తీవ్రంగా
పరిగణించలేదు. ఒక రోజున ఆయన కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారన్న దురదృష్టకరమైన వార్తను
వినేదాకా.”
స్నిగ్ధ కూడా కన్నీరు కార్చసాగింది.
ఆమెకు ఇప్పుడు ఆ ఆక్సిడెంట్ వెనుక ఉన్న కారణం అర్ధమయ్యింది.
“నేను వెంటనే ఇంటికి హడావిడిగా వెళ్లాను.
అదీ దహనకాండ పూర్తయ్యాకా, నేను ఆయన డైరీలో ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని చూసాను,
కాని అందులో ఉన్న వివరాలు నాకు స్పష్టం కాలేదు. వాటినుంచి నాకు తెలిసింది ఏమిటంటే,
ఆ పెయింటింగ్ ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం కోసమని, మిష్టర్ శర్మ ఆయనను సంప్రదించిన వ్యక్తని.
ఇంట్లో నేను ఆ పెయింటింగ్ కోసం వెతికాను, కాని ఎక్కడా కనిపించలేదు. ఆయన్ను చంపే
ముందే దాన్ని ఇంట్లో నుంచి తీసివేసినట్లుగా ఉంది. ఈ గుట్టు విప్పేందుకు ఆలోచిస్తూ
నేను UK వచ్చాను. అప్పుడే నేను మిష్టర్ శర్మను కలిసాను. ఆపై నిన్ను, మహేంద్రను,
చివరికి మా నాన్న వేసిన పెయింటింగ్ ను చేరాను!!!”
ఋషి హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు.
స్నిగ్ధ అతన్ని మృదువుగా హత్తుకుంది. ఒక అపరాధ భావన ఆమె మనసును ఆక్రమించుకుంది.
ఋషికి ఆ పెయింటింగ్ పట్ల ఉన్న ఆసక్తి గురించి అపార్ధం చేసుకున్నందుకు ఆమె ఇబ్బంది
పడసాగింది.
ఆమె తన ప్రవర్తనకు సిగ్గుపడింది. అతని
వీపు తట్టడం ద్వారా అతడిని ఓదార్చే ప్రయత్నం చేసింది.
“స్నిగ్ధ, ఈ వెధవలను ఆపే శక్తి నాకు
లేకపోవడంతో నేను అసహాయుడిలా అనుభూతి చెందుతున్నాను. వాళ్ళు మా నాన్నను చంపారు,
దేశాన్ని మోసం చేస్తున్నారు. నేను వీటికి ముగింపును పలకాలి. కాని ఎలా?”
హఠాత్తుగా ఋషి మొహంలో మార్పు
కనిపించింది. అతనిప్పుడు మరింత కోపంగా ఉన్నాడు. “మిష్టర్ శర్మ నీకు ఆడిట్ ప్రక్రియ
పూర్తి చేసి, ధృవీకరణ ఇచ్చాడా?” అని అడిగాడు.
“అవును, ఆయన మధ్యాహ్నం భోజన సమయం దాకా
నాతోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మహేంద్రతో కలిసి, మధ్యాహ్నం ఫ్లైట్ కి ముంబై, ఆపై
హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు.”
“అయితే ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్ లో ఉండి
ఉంటారు, నాతోరా, మనం వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేద్దాము.”
(సశేషం)
No comments:
Post a Comment