పుష్యమిత్ర - 25
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు. బాబాజీ గుహలోకి ప్రవేశించి ఒక పేటికను సిద్ధం చేశాడు. పుష్యమిత్రుడు బాబాజీ ఆదేశాలమేరకు లోపల పవళించాడు. ఒక మెరుపుతీగ వంటి కాంతి పుంజం దానిపైబడి పేటిక మొత్తం ఒక నాళికలా తయారయింది. ఆ నాళిక గాలిలో తేలుతూ హిమాలయాలవేపుకు సాగిపోయింది. భారత ప్రభుత్వం వారు పుష్యమిత్రుని పేటికను తెరచి బయటకు తీసి ఆయనకు హిందీ మొదలైన భాషలను నేర్పిస్తారు. క్రమంగా మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. భరతఖండంలో ధనానికి సమస్యలేదని పుష్యమిత్రుడు అనడంతో ఆర్ధికసూత్రాల ప్రకారం బంగారం నిల్వల ప్రకారమే నోట్లు ముద్రించాలని చెప్పిన ప్రధాని మాటలకు అలోచనలో పడతాడు. (ఇక చదవండి)
ప్రధాని మరలా పుష్యమిత్రుని చూడడానికి వస్తాడు. " ప్రధానిగారూ మొన్న మీరు దేశంలో నాణెముల, నోట్ల ముద్రణకు బంగారానికి ఏదో సంబంధం ఉందని అన్నారు. వివరంగా చెప్పలేదు" అనగానే ప్రధాని చిరునవ్వు నవ్వి.."పుష్యమిత్రా! మీ కాలానికి కొంత కాలం ముందు వస్తుమార్పిడి జరిగింది. అనంతరం వచ్చిన మొగలాయీ రాజులు తదనంతర చక్రవర్తులు బంగారు, వెండి నాణేలను, కొంతమంది తోలు నాణేములను ముద్రించడం జరిగింది. అంతెందుకు? ఇదిగో చూడండి అలెగ్జాండర్ మనదేశానికి దండయాత్ర వచ్చాక మనదేశంలో ఆయన బొమ్మతో ఉన్న బంగారు నాణేలు చలామణిలోకి వచ్చాయి. మీ కాలంలో కూడా వెండి, కంచు నాణెములను ముద్రించడం జరిగింది కదా! అంటూ కొన్ని నాణేల బొమ్మలను ఎదురుగా ఉన్న ఐప్యాడ్ అంతర్జాలంలో చూపించాడు. ప్రస్తుతం అన్ని దేశాల వారు కాగితం నోట్లను ముద్రిస్తున్నారు. ఇది మేము అత్యంత రహస్యంగా గోదావరి నది జన్మించే ప్రాంతం అంటే ఇప్పటి నాసిక్ అనే పట్టణం వద్ద ముద్రిస్తునాము. అయితే ప్రపంచంలో ఉన్న బ్యాంకింగ్ కార్యకలాపాల చట్టాల ప్రకారం మేము ముద్రించే నోట్లు దేశంలో ఉన్న బంగారం నిల్వలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మేము మా నోట్లపై ఎవరైనా ఆ కరెన్సీ నోటు వద్దని బంగారం అడిగితే అందుకు సమానమైన విలువగల బంగారాన్ని వారికి ఇవ్వవలసి ఉంటుంది ఆ విధంగా ప్రమాణం చేస్తూ మాదేశ రిజర్వు బ్యాంక్ గవర్నర్ కరెన్సీ నోట్లపై ఒక ప్రమాణపూర్వక పై సందేశం రాస్తాడు." అంటూ ఒక కరెన్సీ నోటు తీసి "చూడండి. ఇది రెండువేల రూపాయల విలువగల నోటు. ఎవరైనా దీనిని వద్దని అన్నవారికి మా రిజర్వు బ్యాంక్ వారు దీనికి సమానమైన బంగారాన్ని ఇవ్వాలి. ఆవిధంగా ప్రమాణపూర్వక ఒప్పందం దీనిపై ఉంటుంది" అని చూపాడు.
మీకు ఇంకా కొంచెం వివరంగా చెప్తాను. కాగితంపై ముద్రించే ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం లేదా కరెన్సీ అంటారు. భారతదేశంలో ఈ పద్ధతి 19వ శతాబ్దంలో మొదలైంది. మొదట దీన్ని చైనాలో ప్రారంభించారు. ఇందులో 3 రకాలుంటాయి.
1) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: ఈ ద్రవ్యం బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. 19వ శతాబ్దంలోని స్వర్ణ ప్రమాణంలో ఈ సౌలభ్యం ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో 1944-1971 మధ్య ఉన్న బ్రిటన్వుడ్స్ పద్ధతిలో అమెరికన్ డాలర్లను బంగారంగా మార్చుకునే సౌకర్యం ఉండేది.
2) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు నోట్లను బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకునే వీలుండదు.
3) శాసనపు ద్రవ్యం: అత్యవసర పరిస్థితుల్లో జారీచేసే కరెన్సీని శాసనపు ద్రవ్యం అంటారు. దీన్ని పరిమిత పరిమాణంలోనే జారీ చేస్తారు.
అయితే బంగారాన్ని ప్రామాణికంగా తీసుకొని కరెన్సీ నోట్లను ముద్రించడం, ద్రవ్యం యూనిట్ విలువ, నిర్దేశిత బరువుగల బంగారం విలువకు సమానంగా చూసే పద్ధతిని మనం ఇంతకు ముందు అనుకున్నట్టు “స్వర్ణ ప్రమాణం” అంటారు. ఈ స్వర్ణ ప్రమాణాన్ని 1957లో రద్దు చేశారు. కరెన్సీ నోట్ల జారీలో రిజర్వ్ బ్యాంక్ 1956 నుంచి ‘కనీస నిల్వల పద్ధతి’ని అనుసరిస్తోంది. ప్రస్తుతం ఈ పద్ధతే అమల్లో ఉంది. ఈ పద్ధతిలో 1957 నుంచి రూ.200 కోట్ల కనిష్ట నిధిని నిర్ణయించారు. దీనిలో రూ.115 కోట్లు బంగారం రూపంలో, రూ.85 కోట్లు విదేశీ మారకం రూపంలో నిల్వ ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ కరెన్సీని జారీ చేస్తుంది. అంతే కాక మా రిజర్వు బ్యాంకు విదేశీ మారక నిల్వలను కూడా పరిరక్షిస్తుంది. ఇతర దేశాల కరెన్సీతో మన దేశ కరెన్సీ మారకపు రేటును స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని క్రమబద్ధం చేస్తుంది. దీన్లో ఇంకా చాలా లొసుగులు, ఉపయోగాలు అర్ధం కాని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ వీలువెంబడి చెప్తాను." అన్నాడు సుదీర్ఘ ఉపన్యాసం అనంత్రం ప్రధాని. "అయితే భూగర్భంలో దాచిపెట్టిన పాత బంగారాన్ని వెలికిదీసి మీకు చూపిస్తే దానికి సమానంగా నోట్లను ముద్రించడం వీలవుతుందా? అప్పుడు భరతఖండం సస్యశ్యామలం అవుతుంది కదా! " అని అడిగాడు పుష్యమిత్రుడు. ఆ ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ప్రధాని ఆయన ఆంతరంగిక కార్యదర్శి. "అర్ధంకాలేదు. ఇంకో సారి చెప్పండి" అన్నాడు ప్రధాని. దానికి జవాబుగా పుష్యమిత్రుడు "నాకు ఈదేశంలో అలెగ్జాండర్ దండయాత్రల అనంతరం, మన ద్రవ్యం అన్యాక్రాంతం అవకుండా కొన్ని వేల మణుగుల (ఒక పుట్టి) బంగారాన్ని మేము భూగర్భంలో ఒక ఎడారి ప్రాంతంలో దాచి పెట్టాము. ఆప్రాంతాలు ఇప్పుడెలా ఉన్నాయో తెలీదు. వాటిని మీకు చూపించాలనుకుంటున్నాను" అనగానే ప్రధాని ఆశ్చర్యపోయాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతి పుష్యమిత్రుడు బయట పెడుతున్నాడు. ఆశ్చర్యం.
పుష్యమిత్రా! తమరు చెప్పేది నిజమే భరతఖండంలో ధనం, బంగారం దేవాలయాల్లో దాచి ఉంచడం పరాధీనం కాకుండా చూడడం మన రాజులు చేసే వారు. మీకు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను వినండి. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీపద్మనాభ స్వామి ఆలయానికి చెందిన నిధుల్లో 769 బంగారు కుండల ఆచూకీ తెలియడం లేదు. వీటి విలువ సుమారు రూ.186 కోట్లు ఉంటుందట. ఈ విషయాన్ని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్రాయ్ సుప్రీంకోర్టులోఓ నివేదిక ద్వారా వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం రాయ్ నివేదికపై విచారణ జరపనుంది. వినోద్ రాయ్ నివేదిక ప్రకారం.. ఆలయ నిధుల్లో ఉన్న బంగారు కుండలన్నింటికీ వరుససంఖ్యలు ఉన్నాయి. జులై 2002 వరకు 1 నుంచి 1,000 సంఖ్యలు గల కుండలు ఉపయోగంలో ఉన్నాయి. అనంతరం తరవాత సంఖ్యలు గల కుండలను ఉపయోగించారు. 2011 ఏప్రిల్ 1న 1988వ సంఖ్య కలిగిన కుండ బయటపడినట్లు రాయ్ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే బంగారుకుండల సంఖ్య కనీసం 1988 ఉండాలి. వీటిలో 822 కుండలను ఆలయ అలంకరణకు బంగారం కోసం కరిగించగా.. ఇంకా 1,166 బంగారు కుండలు ఉండాలి. కానీ 397 వరకు సంఖ్యలు గల కుండలు మాత్రమే దొరికాయని నివేదిక చెబుతోంది. అంటే 769 బంగారుకుండల ఆచూకీ లభించడం లేదు. 2007 ఆగస్టులో ట్రస్టు నిధుల్లోని వస్తువులన్నిటినీ ఫొటోలు తీసి ఆల్బమ్ చేయించారని కానీ ఇప్పుడా ఆల్బమ్ కానీ, ఫొటోల ఆనవాళ్లు కానీ ఎక్కడా లేవని, దేవాలయం పాలన కమిటీ చాలా బలహీనంగా ఉందని, దాని స్థానంలో ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఆధ్వర్యంలో కొత్త కమిటీని నియమించాలని వినోద్ రాయ్ న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికీ దాని విషయం తెలియరాలేదు.
సోమనాధ ఆలయ ముట్టడి సగతి కూడా మీకు ఈ సందర్భంలో చెప్పదలచాను. క్రీ.శ.1024 సం.లో మొదటి భీముని పాలనలో టర్కిష్ రాజు మొహమ్మడ్ గజనీ సౌరాష్ట్ర దేవాలయం సోమనాధ పై దాడి చేసి జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాధ లింగాన్ని పెకలించి 20 మిలియన్ల దీనార్లను పట్టుకుని వెళ్ళాడు. ఈ ముట్టడిలో వేలమంది భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆదినుండి మనదేశం దురాక్రమణలకు, దండయాత్రలకు గురి అవుతూనే ఉంది. ఎవరెంత ప్రయత్నించినా హిందూ మతాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని చూసినా మన హిందూ మతం ప్రపంచ వ్య్పాతంగా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది అని నిట్టూర్చాడు ప్రధాని.
ఇందాక మేరేదో అన్నారు. ఆ వి షయం చెప్పండి అనగానే పుష్యమిత్రుడు "నేను ఈ భరతఖండాన్ని ఏలే రోజుల్లో కర్షపణాలనే నాణేలను వెండి, కంచు లోహాలతో ముద్రింపజేశాను. మరలా ఎక్కడ యవన రాజులు దండెత్తుతారో నన్న భయంతో కొన్ని వేల బస్తాల బంగారాన్ని భూగర్భ గుహలో దాచి ఉంచాను. వాటిని లోహపు పెట్టెలలో పెట్టి దగ్గర ఉన్న ఒక ఎడారిలో దాచాము. దాన్ని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత గుర్తించగలమో లేదో చూడాలి" అన్నాడు. కొన్నివేల బస్తాల బంగారం అనగానే ప్రధాని ఉద్వేగంతో "అవే దొరికితే భరతఖండం మంచి ధనవంతమైన దేశం అవుతుంది. తొందరలో మనం ఆ ప్రాంతాన్ని కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. సెలవ్ అని నిష్క్రమించాడు. (సశేషం)
No comments:
Post a Comment