శ్రీధరమాధురి – 48
(ఇతరులను
విమర్శిస్తూ మాట్లాడడం గురించి పూజ్య గురుదేవుల అమృత వచనాలు)
మీ బుద్ధిని గురించి అప్రమత్తంగా
ఉండండి. అది ద్వంద్వాల ఆటలు ఆడుతుంది. అది మిమ్మల్ని ఉన్నతమైన ఆదర్శాల గురించి,
సూత్రాల గురించి మాట్లాడేలా చేస్తుంది. అలా మాట్లాడేలా చేసాకా, బుద్ధి మీ
ఇంద్రియాలను రేకెత్తించి, మీరు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా
చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండడం అలవర్చుకోండి. మీ బుద్ధిని గమనించండి.
మీ వ్యక్తిగత అంశాలకు విలువ ఇవ్వండి. వాటిని అందరితో చర్చించకండి.
అందరితో స్నేహంగా ఉండండి, కాని దీనికి అర్ధం అందరికీ మీ వ్యక్తిగత విషయాలను చెప్పాలని కాదు.
మీ విచక్షణను వాడండి.
మీ
వ్యక్తిగత జీవితం గురించి, మీకు వారిపై ఖచ్చితమైన నమ్మకం ఉంటే తప్ప మాట్లాడకండి.
మీ వ్యక్తిగత జీవితం, మీ ఉద్వేగాలు, మీ భావాలు నమ్మదగని వారికి వెల్లడి చేసేంత
చవకైనవి కావు. అందరూ చర్చించుకుని, వాదించుకోడానికి మీ వ్యక్తిగత జీవనం రామాయణం
కాదు.
మీరొక
గొప్ప డాక్టర్ కావచ్చు, లేక సాఫ్ట్వేర్ ఉద్యోగి కావచ్చు, పెద్ద ప్రొఫెసర్ కావచ్చు,
కాని ఆ పై తొడుగులు అన్నీ తీసివేసి, ఇంట్లో మీ వారితో మీ వ్యక్తిగత జీవితాన్ని
ఆస్వాదించండి. మీ చుట్టాలతో మీ వృత్తిని గురించి ఏమీ మాట్లాడకండి, చర్చించకండి. మధ్యలో
ఎప్పుడైనా విరామం తీసుకుని, మీ కుటుంబంతో సెలవలను ఆనందంగా గడపండి. ఆఫీస్ లో చాలా పనుందని, సెలవలు దొరకవని సాకులు చెప్పకండి.
మనసుంటే మార్గం ఉంటుంది.
మీరు
బుద్ధి నుంచి మాట్లాడితే, వినడం మంచిది, హృదయం నుంచి మాట్లాడితే, విని ఆకళింపు చేసుకోవడం
మంచిది. ఒక జ్ఞానికి మాత్రమే ఇది తెలుసు, ఆయనే దీన్ని అభ్యసించగలరు.
బుద్ధి ఏమీ తెలియకుండానే స్పష్టంగా
మాట్లాడగలదు.
కాని...
హృదయం దానికి అంతా తెలిసినా కూడా ఏమీ
మాట్లాడలేదు.
హృదయం చాలా పవిత్రమైనది, స్వచ్చమైనది, బహుశా మౌనమైనది.
విలువల వ్యవస్థ గురించి వారితో మాట్లాడినప్పుడు
ఒక అవధూత మిమ్మల్ని చూసి నవ్వుతారు.
ఎవరు
బుద్ధితో మాట్లాడతారో, ఎవరు హృదయంతో మాట్లాడతారో నాకు తేలిగ్గా తెలుస్తుంది.
కొన్నిసార్లు మీరు బుద్ధి నుంచి మాట్లాడడం చూసి నేను మనసారా నవ్వుతాను. ‘వేషధారి’
అనుకుంటాను.
గురువు
దైవమనే భావనను తీసుకుని, ‘దైవత్వాన్ని’ గురించి మాట్లాడతారు.
గురువు
మతమనే భావనను తీసుకుని, ‘భక్తితత్వాన్ని’ గురించి మాట్లాడతారు.
కాబట్టి,
గురువు, మతము లేక దైవం అనేవి కేవలం విషయాలు కావు, సారాలు.
ప్రతి
చోటా అంతా భరించడం గురించి, భరించలేకపోవడం గురించి మాట్లాడతారు. మనసారా
అంగీకరించడం గురించి ఎవరూ మాట్లాడుతూ కనిపించరు.
ఒకసారి
మీరు మీ స్వంత ఇష్టాలను గురించి మాట్లాడితే, శరణాగతి అన్న భావన సమసిపోతుంది,
కర్తృత్వం ఆటలోకి వస్తుంది. ఇప్పుడు దైవం, మీరు మనువు ప్రతిపాదించిన సూత్రాలను
పాటించాలని అంటారు. మీరా నియమాలను పాటిస్తే, సత్ఫలితాలను, పాటించకపోతే శిక్షలను
అందుకుంటారు. కర్తృత్వం వహించేవారిని గురించిన నిర్ధారణ కోసమే దైవం శనీశ్వరుడు,
ధర్మరాజు వంటి దేవతలను నియమించారు. నియామావళి పుస్తకంలో ఉన్న ధర్మాన్ని/క్రమశిక్షణను
మీరు పాటిస్తున్నారా లేదా అని వారు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఫలాలు లేక శిక్షలు
అనేవి ధర్మం అనే అంశానికి చెందుతాయి, వీటివల్ల మీరు ఆనందానికి లేక దుఃఖానికి
గురౌతారు. కాబట్టి, కర్త్రుత్వానికి దాని స్వంత లాభనష్టాలు ఉన్నాయి.
ఆమెకు
సహనం లేదు. ఆమె నాతో మాట్లాడాలన్న సందేశం పంపింది. నేను నా ప్రపంచంలో బిజీ గా
ఉన్నాను. ఆమె నేను స్పందించనేమో అనుకుంది. నాతో ఉండాలంటే, మీరు నా స్పందన కోసం
ఓపిగ్గా వేచి ఉండాలి. ఏదో ఒక అభిప్రాయానికి దూకకండి, ఆ అభిప్రాయాలు తిరిగి మీపైనే
దూకగలవు.
ఒక
విషయంపై మీరెంత ఎక్కువగా మాట్లాడితే, మీకా విషయం గురించి బాగా తెలుసని అర్ధం, మీకు
విషయం తెలుసని కాదు.
జ్ఞానం
ఉందన్న భ్రమలో అంతా మాట్లాడుతూ ఉండడం చాలా వినోదభరితంగా ఉంటుంది. ఒక సమూహం ఈ
భ్రమల్ని పొగుడుతూ ఉంటే, అది మరింత వినోదాన్ని కలిగిస్తుంది.
మీ
ప్రేమను, ఇతరుల పట్ల మీరు వహించే శ్రద్ధను గురించి మీరు పదేపదే చెప్పాల్సిన అవసరం
ఉందని నేను భావించట్లేదు. అదంతా మీరు మౌనంగా ఉంటూ కూడా చెయ్యవచ్చు. కాని, ఇతరులు
అర్ధం చేసుకోలేనప్పుడు, మీరు మీ ప్రేమను, శ్రద్ధను గురించి మాటల్లోనే చెప్పడం
మంచిది.
ఊహలు
సత్యం వైపుకు నడిపించలేవు. ఒక ఊహ మరొక ఊహకు దారి తీస్తుంది. చాలా సార్లు మనం
ఊహించుకుని, అవే నిజాలని భావించుకుని, మాట్లాడుతూ ఉంటాము. జ్ఞాని వారిని చూసి
నవ్వుతాడు.
No comments:
Post a Comment