అభినందనలు(విషేస్)! - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!
అభినందనలు(విషేస్)!

పిల్లలూ, స్కూల్లో మీ ఫ్రెండ్స్ తమ పుట్టినరోజుకి చాక్లెట్లిస్తారు కదా. మీరు కూడా అలాగే ఇస్తారనుకోండి. వాళ్లకి మీరు "హాప్పీ బర్త్ డే, మెనీ హాప్పీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అని బర్త్ డే విషేస్ కూడా చెబుతారు కదూ. ఎవరికైనా తమ పేరును, తమ బర్త్ డే ని చాలా ఇష్టపడతారు. అందుకని మీకెవరన్నా పిల్లలు కనిపిస్తే, మీ ఇంట్లో పనిచేసే వాళ్ల పిల్లలు, ఊరెళ్లేప్పుడు రైల్లో, బస్సులో మనతో ప్రయాణించే పిల్లలు, చుట్టాల పిల్లలూ ఎవరైనా సరే పరిచయం అయితే వాళ్ల బర్త్ డేట్ అడిగి తెలుసుకుని ఒక పుస్తకంలో రాసి పెట్టుకోండి. అవి జాగ్రత్తగా ప్రతిరోజూ గమనిస్తూ, వాళ్ల బర్త్ డే వచ్చినప్పుడు, పర్సనల్ గానో, ఫోన్ ద్వారానో, ఫేస్ బుక్ ద్వారానో విషేస్ చెప్పి చూడండి, వాళ్లు ఎంత హాప్పీగా ఫీల్ అవుతారో. వాళ్లని మీరు మర్చిపోనట్టే, మిమ్మల్ని వారూ మర్చిపోలేరు. మనం పెద్దవుతున్నకొద్దీ మన స్నేహితుల సంఖ్య పెద్దదవుతుంటుంది.
ఒక్క బర్త్ డే అనే కాదు మంచి మార్కులు తెచ్చుకునేవాళ్ళని, స్పోర్ట్స్ లో గెలుపొందిన వాళ్లనీ, డ్రాయింగ్ లో విన్ అయిన వాళ్లనీ.. ఇలా ఏ సబ్జెక్ట్ లో అయినా చక్కటి ప్రతిభ చూపే వాళ్లని అభినందించి చూడండి. వీలుంటే బ్లాక్ బోర్డ్ మీద వాళ్ల పేరు రాసి కంగ్రాట్స్ చెప్పండి. మీరంటే వాళ్లు ఎంత అభిమానం చూపిస్తారో చూడండి. స్నేహితుల్ని సంపాదించుకునే పద్ధతి ఇదే! మనకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం పడితే అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనకు అదే కదా కావలసింది.
చాలామంది తమ అభిమాన నటులకు, ఆటగాళ్లకూ ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వారా శుభాకాంక్షలు చెబుతారు. ఏం లాభం. వాళ్లు చూడను కూడా చూడరు. చూసినా వేల మందిలో మనల్ని గుర్తుపట్టరు కదా! అదే మన దగ్గరగా ఉన్నవాళ్లని సందర్భం వచ్చినప్పుడు అభినందించినప్పుడు, శుభాకాంక్షలు చెప్పినప్పుడూ వాళ్లు మనని మర్చిపోరు. మర్చిపోలేరు.
మనవల్ల ఏదైనా పొరబాటు జరిగినప్పుడు అసంకల్పితంగా, మొట్టమొదటగా మన నోటినుంచి వచ్చే పదం సారీ’. అలాగే ఎదుటి వారిని విష్ చేయడమూ అలవాటు చేసుకోవాలి.
మన గురించి మనం చెప్పుకోవడం ఏమంత గొప్ప కాదు. మంచివాళ్ల గురించి, ఏదైన ఘనతను సాధించిన వాళ్ల గురించి చెప్పడమే గొప్ప. అది ఉత్తమలక్షణం.
ఇహనుంచి మీరు కూడా మీ తరగతిలో, ఇంటి చుట్టుపక్కల ఉండే స్నేహితుల్ని వాళ్లు సాధించిన దానికి అభినందనలు అందిస్తారు కదూ.
ఉంటానర్రా మరి.
మీ

సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages