స్వీయ రక్షణ
ఆదూరి హైమవతి
"అమ్మా! ఎక్కడున్నావ్!"అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది శ్రావ్య స్కూల్ నుంచీ .
"ఏమ్మా! శ్రావ్యా ! ఇక్కడే వంటగదిలో ఉన్నాను. నీకోసం ఉప్మా చేస్తున్నాను."అంటూ హాల్లోకి వచ్చింది శ్రావ్య తల్లి సరస్వతి, చేత్తో ఉప్మాప్లేట్ పట్టుకుని.
తానూ ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కుని తుడుచు కుంటూ, డైనింగ్ టేబుల్ దగ్గర కొచ్చింది శ్రావ్య.
తల్లి అక్కడుంచిన టిఫిన్ ప్లేట్ ముందు కూర్చుని టిఫిన్ తినసాగింది. ఆమె ముఖం ఆలోచనలతో ,ఉండటం తల్లి సరస్వతి గమనించింది . ఏమి చెప్తుందో చూద్దామని మౌనంగా కూర్చుంది పక్కనే ఉన్న కుర్చీలో సరస్వతి.
శ్రావ్య స్థానిక మునిసిపల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. చాలాతెలివైంది. విషయమైనా చాలా సులువుగా , త్వరగా గ్రహిస్తుంది. పరిస్థితులను చాలా బాగా ఆకళింపు చేసుకుంటుంది. శ్రావ్య నాన్నగారు ఇంజనీరు. ఆయనకు ఎక్కువగా క్యాంపులుంటాయి. ఒక్కోమారు రాత్రులు కూడా రాలేకపోతారు. అప్పుడు శ్రావ్య, తల్లి మాత్రమే ఇంట్లో ఉంటారు వంటరిగా. ఐతే అది ప్రభుత్వ భవనం కనుక గేటువద్ద కాపలా ఉంటుంది. భయం ఉండదు.
సరస్వతి చాలా సాంప్రదాయకుటుంబం నుంచీ వచ్చిన మహిళ. భక్తిపరురాలు. చేతనైనంతవరకూ దానధర్మాలుచేస్తూ ఉంటుంది. సద్గ్రంధ పఠనం చేస్తూ, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. పల్లెటూర్లో పుట్టిపెరిగింది. కల్లా కపటం తెలీని అమాయకురాలు. ఎంతో వినయంగా ఉంటుంది. అందర్నీ ఆదరిస్తుంది.
శ్రావ్య, ఉప్మాతినడం పూర్తవడంతో ఆమెకు పాలు తెచ్చేందుకై సరస్వతి వంటగదిలో కెళ్ళింది. డోర్ బెల్ మోగింది. శ్రావ్య కాస్త ఆలోచించి , కిటికీలోంచీ చూసి, తలుపు తెరిచింది. అప్పుడే హాల్లో కొచ్చిన సరస్వతి,
" రండి అన్నయ్యగారూ !"అంటూ లోపలికి వచ్చిన వ్యక్తిని ఆహ్వానించింది.
సరస్వతి " రా! శ్రావ్యా !ఎదురింటి నాగరాజ్ అంకుల్. నాన్నగారితో పనుందిట, నిన్న వచ్చి పరిచయం చేసు కున్నారు." అంటూ శ్రావ్యకు చెప్పింది. శ్రావ్య తల ఊచి పాల గ్లాస్ తీసుకుని తన గదిలో కెళ్ళింది.
"శ్రావ్యా! అంకుల్ కు మంచినీళ్ళు తెస్తావా!"అంది సరస్వతి .
"లేదమ్మా! అక్కర్లేదు. ఇంటి నుంచే వస్తున్నాను. మీవారు ఇంకా రాలేదా!"అని అడిగాడు నాగరాజ్.
"లేదు అన్నయ్యగారూ! క్యాంప్ కెళ్లారు. వచ్చేసరికి పొద్దుపోవచ్చు," చెప్పింది సరస్వతి.
"అలాగా! క్యాంపులు ఎక్కువగా ఉంటాయామ్మా!"
"ఔను అన్నయ్యగారూ! ఆయన ప్రభుత్వ సివిలింజనీరు కదా! జిల్లా అంతా తిరగాలి. "
" మరి ఇంట్లో మీరిద్దరే ఉంటారా ! రాత్రులు భయంలేదా!"అన్నాడతడు.
"ఔను అన్నయ్యగారూ ! భయం ఎందుకూ!అందరినీ కాపాడే భగవంతుడే ఉన్నాడు కదా!"
"ఔననుకోండీ! మన జాగ్రత్త కూడా ఉండాలిగా!"
"మేమూ జాగ్రత్తగానే ఉంటాము అన్నయ్యగారూ! పైగా గేట్ వద్ద సెక్యూరిటీ ఉండనే ఉందాయె!".
పాలగ్లాస్ సింక్ లో వేయను బయటికొచ్చిన శ్రావ్యను చూసి, నాగరాజ్ "రామ్మా! శ్రావ్యా! వచ్చికూర్చో" అన్నాడు తనపక్కనే సోఫామీద చోటు చూపిస్తూ. శ్రావ్య తల్లిపక్కనే కూర్చుని, రెండు నిముషాలు కాగానే ,” నాకు హోం వర్క్ ఉందమ్మా! నీ హెల్ప్ కూడా కావాలి."అంది తల్లితో.
"నేనేమైనా హెల్ప్ చేయగలనా!"అన్నాడు నాగరాజు.
"లేదండీ ! నాకు మా అమ్మే హెల్ప్ చేయడం అలవాటైంది."అంటూ తల్లికేసి చూసింది. నాగరాజును వెళ్ళిపొమ్మనే సూచనగా. సరస్వతి లేచి, "సరే అన్నయ్య గారూ ! శ్రావ్యకు హోం వర్క్ లో హెల్ప్ కావాలిట. మావారు రాగానే చెప్తాను. మీ ఫోన్ నెం. ఇస్తే ఆయనే చేస్తారు."అంది .
"ఎందుకులేమ్మా! రేపు వస్తాగా!"అంటూ లేచాడతను.
అతడెళ్ళాక తలుపుపేసి వచ్చి" ఏంటి శ్రావ్యా ! అలా అనవచ్చా! పెద్దలను గౌరవించాలి కదా!" అంది సరస్వతి. "ఏంటమ్మా! ముక్కూ మొహం తెలీని వారిని ఇంట్లోకి తెచ్చి ఇలా కూర్చోబెట్టవచ్చా! పైగా నాన్నతో పనుంటే ఆఫీసుకు వెళ్ళాలి కానీ, మనం వంటరిగా ఉండగా ఇలా ఇంట్లోకి రావడం ఏమీ బాగా లేదమ్మా! " అంది శ్రావ్య. . "ఏంటే శ్రావ్యా! నీకీమధ్య బాగా అనుమానాలు ఎక్కువై పోతున్నాయి. పక్కింటి వారినీ, ఎదురింటి వారినీ కూడా అనుమానిస్తే ఎలా బతుకుతామమ్మా! మానవులం సంఘజీవులం కదమ్మా! పైగా పెద్ద మనిషిలా ఉన్నాడు." "ఔనమ్మా!బామ్మ చిన్న తనంలో 'పెద్దమనుషు'లనే సినిమా గురించీ చెప్పింది .అలాంటి పెద్దమనిషేమో ఎవరికి తెల్సు?"
"ఏంటో శ్రావ్యా! నీకు వయసుకు మించిన ఆలోచనలే! ఇంట్లోకి వస్తే ఎలా వద్దంటామమ్మా!"
"వద్దన వద్దమ్మా !'ఆఫీసుకెళ్ళి మాట్లాడండి ', అని చెప్తే సరి. అసలు మొదటిరోజే ఆమాట చెప్పి ఉండాల్సింది. ఎందుకోగానీ నాకు అతడి మీద మంచి అభిప్రాయం కలగడం లేదు."అంది శ్రావ్య .
వారం క్రితం ఆ రోజు స్కూల్లో తెలుగు టీచర్ గారు చాలా విషయాలు అమ్మాయిలందర్నీ ఒక గదిలోకూర్చోబెట్టి చెప్పారు. ఆ మాటలన్నీ మరలా మరలా మనస్సులో మననం చేసుకోసాగింది శ్రావ్య.
ఆ రోజున ఏడుస్తూ క్లాస్ లోకి వచ్చిన వనజను దగ్గరికి పిలిచి అడిగారు తెలుగు టీచర్. వనజ ఏడుస్తూనే ఉందికానీ ఏమీ చెప్పలేదు. లంచ్ అవర్లో వనజను తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడిన తెలుగు టీచర్ ఆరోజు చివరి పీరియడ్ లో తామందరినీ కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పారు.అబ్బ తెలుగు టీచర్ ఎంత మంచివారు! ఆమెకు మేమంటే ఎంత ప్రేమ !.
"పిచ్చి తల్లుల్లారా! సమాజంలో అంతా మంచివారే ఉండరమ్మా! అందర్నీ నమ్మకూడదు, నమ్మినట్లే ఉండాలి కానీ నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మృగాలు ఏ దిక్కునుంచైనా దాడి చేయవచ్చు. అడవిలో గడ్డిమేసే జింకలు , ఆవులు, గేదెలు, అంతెందుకు ఏనుగులు సైతం నలుదిక్కులా చూసుకుంటూ, గడ్డి మేస్తూనే, తమ విరోధి మృగాలను చుట్టూతా నలుదిక్కులా గమనిస్తుంటాయి. ఎల్లప్పుడూ, ప్రతిక్షణం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకునే మార్గం చూసుకుంటూ ఉండాలమ్మా! మీరు చిన్న పిల్లలు, ఇప్పుడిప్పుడే వికసించే పుష్పాలు. ఎవరైనా కోయను రావచ్చు, సమాజమంతా మంచిదే అనుకోరాదు. భిక్షమడిగిన రావణుని నమ్మి సీతమ్మ అతడి చేతుల్లో చిక్కి, బందీ ఐపోయింది. తనను తాను రక్షించుకోలేక పోయింది. రాముడు దేవుడు గనుక ఎలాగో కపిసైన్యం సాయంతో రావణుని సంహరించి సీతమ్మను తెచ్చాడు. అన్నవరుసైన సైంధవుని నమ్మి ద్రౌపది అతడి చేతిలోపడింది. పాండవులు వీరులు గనుక వెంటనే కాపాడ గలిగారు. ఈకలి యుగంలో మీకు మీరే సైనికుల్లా ఉండాలి. ఒకరి నొకరు కాపాడు కోవాలి. పరిస్థితులను ధైర్యంగా, ఎదుర్కోవాలి. ఈరోజు వనజ విషయం చూడండి. తాత గారినని చెప్పుకుని వచ్చే ఒక వ్యక్తి ఆమెను ఒళ్ళోకూర్చోబెట్టుకుని ఆడపిల్లలను తాకకూడని శరీర ప్రాంతాల్లో తాకాడుట. మన జాగ్రత్తలో మనం ఉండాలి.
చదువుతోపాటుగా మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకునే లాగా తయారవ్వాలి. శరీర భాగాలను ఇతరులెవ్వరిని తాకనివ్వకూడదు. పెద్దయ్యాక ఆడపిల్లలను తండ్రి కూడా బుగ్గల మీద ముద్దు పెట్టుకోరు, కేవలం చేత్తో ముచ్చటగా తడతారు ప్రేమ ఎక్కువైనప్పుడు. ఇహ మన లోపలి భాగాలను ఎవ్వరూ తాక కుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ఎవరైనా అలా ప్రవర్తిస్తే వెంటనే మీ అమ్మా నాన్నలకో, స్కూల్లో ఐతే మాకో చెప్పండి. చదువు కంటే మీ భద్రత ముందు మీరు తెల్సుకోవాలమ్మా! 'అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పారు. అందరికీ బాగా అర్ధమయ్యే లాగా ఇంకా చాలావిషయాలు , జాగ్రత్తలు చెప్పారు. టీచర్ గారు నిజంగా దేవత!’ అవన్నీ విన్నప్పటి నుంచీ శ్రావ్య చాలా జాగ్రత్తగా ప్రతివిషయం ఆచి తూచి గమనించసాగింది.
మరునాడు మళ్ళా నాగరాజ్ అంకుల్ అనే అతడు అదే సమయంలో వచ్చాడు. కొంతసేపు కూర్చుని వెళ్ళాడు.
అలా మూడు రోజులయ్యాక మళ్ళా అదే సమయంలో వచ్చినపుడు శ్రావ్యే తలుపు తీసింది. కూర్చున్నాడు. "మానాన్న గారిని కలవాలంటే ఆఫీసుకెళ్ళండి అంకుల్ తప్పక మాట్లాడవచ్చు. మీరు ఈ సమయంలో ఇంటికి వస్తే ఎలా ఉంటారు? ఆఫీస్ అవర్స్ కదా! "అంది శ్రావ్యే.
"ఇంట్లో ఐతే నిదానంగా మాట్లాడవచ్చని వచ్చానమ్మా! నీకెందుకో నామీద కోపంగా ఉన్నట్లుంది."
"నాకెందుకు కోపం అంకుల్!మీరు రోజూ రావడం నాన్నగారు లేకపోడం మీకు ఇబ్బందికదా! పైగా రోజూ ఇలా రావడం వల్ల మీ పనులన్నీ ఆగిపోతాయి కదా!"అంది శ్రావ్య.
"నీవు చాలా తెలివైన దానవమ్మా! భలే కనిపెట్టేస్తావ్! ఇలారా !మా అమ్మాయి కూడా ఏడో క్లాస్ చదువు తున్నదిలే!" "ఎక్కడ అన్నయ్యగారూ!మా శ్రావ్య చదివే స్కూల్లోనేనా!"అంది సరస్వతి. "కాదమ్మా! అది ఇంటర్ నేషనల్ స్కూల్లో చదువుతున్నది. రోజంతా స్కూల్లోనే ఉదయం ఏడు గంటలకెళితే రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది. పిల్లతో మాట్లాడాలన్నా కుదరదు. అందుకే మీ అమ్మాయిని చూస్తే నాకూతుర్ని చూసినట్లే ఉంటుంది. నిజానికి నిన్ను చూడాలనే వస్తున్నానమ్మా శ్రావ్యా!" "భలేవారు అంకుల్ !వాళ్ల స్కూల్ కెళ్ళి ఆమెనే చూడండి. నన్ను చూస్తే ఆమెను చూసినట్లు ఎలా ఉంటుందీ! పైగా ఇదే ఊరుకదా! మీరు ఇప్పటివరకూ మీకో అమ్మాయి ఉందనీ ఏడోక్లాస్ చదువుతున్నదనీ కూడా చెప్పలేదే!" అంది శ్రావ్య .. "అదేంటి శ్రావ్యా అంకుల్ అంత ప్రేమగా చూడను వస్తే!"
"రామ్మా శ్రావ్యా! నా పక్కన కూర్చో!"
"నాకు అలాకూర్చోడం ఇష్టం ఉండదు అంకుల్. కొత్తవారి పక్కన ఎలాకూర్చుంటాం!"అంది శ్రావ్య.
"ఇన్నిరోజుల నుంచీ చూస్తున్నావ్ కదమ్మా! కొత్తేముందీ!రా ! “ అంటూ చేయిపట్టి బలంగా లాగిపక్కన కూర్చోబెట్టుకుని, భుజం మీద చెయ్యేశాడు. ముళ్ళ కంప పక్కనే కూర్చున్నట్లుంది శ్రావ్యకు. చాలా చిరాకుగా ఉంది. తెలుగు టీచర్ గారు చెప్పిన మాటలన్నీ మళ్ళా మననం చేసుకుంటున్నది మనస్సులో.
"అమ్మా! చెల్లెమ్మా!కాస్త మంచి తీర్ధం ఇస్తావా!" అన్నాడు నాగరాజు. ఆమెలోని కెళ్ళగానే ,శ్రావ్య బుగ్గలమీద ముద్దు పెట్టుకుని, బుగ్గలు కొరికి , ఆమెను మీదకు లాక్కుని గుండెలకు ఆనించుకున్నాడు గట్టిగా. శ్రావ్య ఒక్క విసురున అతడిని పక్కకు నెట్టేసి తన గదిలోకెళ్ళింది. సరస్వతి మంచి నీళ్ళు తెచ్చింది.
నాగరాజు త్రాగేసి , "సరే వస్తానమ్మా!మీవార్ని కలవడం మాత్రం కుదరడం లేదు."అన్నాడు లేచి. " ఒకపని చేయండి అన్నయ్యగారూ!మీ పనేంటో చెప్తే ఆయన్నడిగి ఎప్పుడు రమ్మంటారో చెప్తాను. " అంది సరస్వతి.
"ఎందుకులేమ్మా! నీకు శ్రమ , నేనే వచ్చి మాట్లాడతాను"అంటూ వెళ్లాడతను. తలుపేసి వచ్చాక తల్లితో, " అమ్మా! అతడ్ని రానివ్వకు మంచి వాడుకాదనిపిస్తోంది. నాబుగ్గ మీద ముద్దుపెట్టుకున్నాడు. గుండెలకు ఆనించుకున్నాడు. నాన్న గారు కూడా ఊరికే చేత్తో తాకుతారు కానీ అలాముద్దు పెట్టుకోరు. అమ్మా! అతడు వస్తే తలుపుతియ్యకు. అసలు ఇతను వస్తున్నట్లు నాన్నగారికి చెప్తున్నావా!"అంది చిరాగ్గా.
"పోన్లేమ్మా! ఒక్కోరికీ ఒక్కో అలవాటు, తనకూతుర్ని అలా ముద్దుపెట్టుకుంటాడేమో! నిన్నుచూస్తే కూతుర్ని చూసి నట్లు ఉందని అన్నాడు కదా!"అంది సరస్వతి.
"అమ్మా! అసలతనికి కూతురుందో లేదో! అసత్యం చెప్తున్నాడేమో! నాన్నగారి కోసం వచ్చేవాడైతే ఆఫీసు కెళ్ళి అపాయింట్ మెంట్ తీసుకుని, వెళ్ళి కలవాలి. ఏమోనమ్మా! మా తెలుగు టీచర్ గారు మాకు చాలా విషయాలు చెప్పారు. ఎవ్వరినీ నమ్మరాదనీ, మన జాగ్రత్తలో మనం ఉండాలనీ, కొత్తవారినీ, అంకుల్ ,తాత అని చెప్పుకుని వచ్చేవారినీ ఇంట్లో నాన్న గారు లేనపుడు రానివ్వకూడదనీ ఇంకా చాలా చెప్పారమ్మా! ..”
"అంతా చెడ్డావాళ్ళే అనుకుంటే ఇహ మంచివారెవరమ్మా!మనల్నీఅలాగే ఇతరులు చెడ్డ వారని అనుకుంటారుగా !" "అనుకోనీ వారి జాగ్రత్త వారిది. ఏమోనమ్మా! అతడిని రేపు ఇంట్లోకి రానిస్తే నాకు కోపం వస్తుంది."
"నేను ఎవ్వరినీ చెడ్డవారని అనుకోలేనమ్మా శ్రావ్యా! నాకంతా మంచివారిలాగే ఉంటారు."
"ఔనమ్మా! నీది మాతెలుగు టీచర్ గారు చెప్పినట్లు’ ధర్మరాజు దృష్టి’. ఐతే ఈ రోజుల్లో ఆదృష్టి పనికి రాదుట.మనం అందర్నీ మంచివారని నమ్మకూడదు. ఏదైనా మనకు కీడు జరిగితే ఆతర్వాత మనం ఏమనుకున్నాలాభం ఉండదు కదమ్మా! " "ఏమోనే నాకు పెద్ద చిక్కొచ్చిపడింది."అంటూ లోపలికెళ్ళింది సరస్వతి.
ఆమె పల్లెటూర్లో పెరగటాన అంతా మంచే అనుకుంటుంది. అందర్నీ మర్యాదగా చూస్తుంది. మొహమాటం ఎక్కువ.
మరునాడు స్కూల్ కెళ్లగానే శ్రావ్య తెలుగు టీచర్ గారిని కలిసి అంతాచెప్పింది. తెలుగు టీచర్ గారు శ్రావ్య ఏం చేయాలో బోధించారు. ఆమె చెప్పినట్లే చేయాలని నిశ్చయించుకుంది శ్రావ్య .
మరునాడు యధాప్రకారం వచ్చాడు నాగరాజు. శ్రావ్యే తలుపు తీసింది.
" అమ్మ పనిలో ఉంది అంకుల్ !నాన్నగారు ఇంకారాలేదు..." అంటుండగానే, "శ్రావ్యా ! నిన్ను చూడనే వచ్చానమ్మా! మా అమ్మాయిని చూసినట్లే ఉంటుంది." అన్నాడు కూర్చుంటూ.
" రామ్మా దగ్గరికి , నా వళ్ళోకూర్చో" అన్నాడు.
"మీరు కొత్తవారు, నేనా పన్నెండేళ్ళ దాన్ని. మీ ఒళ్ళోకూర్చోడమేంటి అంకుల్! మీ అమ్మాయిని ఇలాగే ఒళ్ళో కూర్చో బెట్టుకుని ముద్దులు పెట్టుకుంటారా! మీ ఇంటికెవరైనా కొత్తవారువస్తే మీ అమ్మాయిని ఒళ్ళోకూర్చోమని చెప్తారా! వారు మీఅమ్మాయిని గండెలకు అదుముకుంటే ఊరుకుంటారా! ఏంటి ఇదంతా అంకుల్! అసలు మీ ఉద్దేశ్యమేంటీ!"అంది సూటిగా శ్రావ్య.
"అబ్బా! కనిపెట్టేశావన్నమాట. ఇహ దాపరిక మెందుకూ! రారా !నేను వచ్చింది మరొకందుకేలే!" అంటూ లేచి ఆమెను బలంగా వాటేసుకున్నాడు. వెంటనే శ్రావ్య భద్రంగా పెట్టుకున్న చువ్వతో తల మీద ఒక్కటిచ్చింది.
"అబ్బా! "అని అరిచాడు నాగరాజ్. ఇంతలో గదిలోంచీ శ్రావ్య నాన్నగారూ, తల్లీ, పోలీస్ ఇన్స్ పెక్టర్ జవాన్లూ అంతా వచ్చారు. అతడిని పట్టుకుని లాక్కెళ్ళి కటకటాల్లో వేశారు. అంతా చూసిన సరస్వతి, శ్రావ్యను గుండెలకు హత్తుకుంది ప్రేమగా. తర్వాత తెలిసిన విషయం వాడికి కూతురే లేదు. వాడో మోసగాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇలా పరిచయాలు చేసుకుని ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ణయించుకున్నాక ఇంట్లో దూరి, ఘోరాలు చేసి. దొరికిన కాడికి ధన, మాన, ప్రాణాలు దోచుకుపోయే రాక్షసుడు. వాడిని పట్టిచ్చినందుకు శ్రావ్యను అంతా మెచ్చుకున్నారు. శ్రావ్య తన తెలుగుటీచర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంది. ప్రభుత్వం శ్రావ్యకు సన్మానం ప్రకటించింది. ఐతే శ్రావ్య ఆసన్మానం తన తెలుగుటీచర్ గారికి జరగాలని పట్టుబట్టి చేయించింది. చదువేకాక ఆడపిల్లలకు నేర్పాల్సిన భద్రత, ఎరుక చెప్పినందుకు తల్లిదండ్రులంతా కూడా ఆ తెలుగు టీచర్ గారిని ఘనంగా సత్కరించారు .
********
అవును దాదాపు గా టీనేజ్ కి వస్తున్న ప్రతి ఆడపిల్ల ఇవి ఎదుర్కొనే సమస్యలే బాగా చెప్పారు
ReplyDelete