అటక మీది మర్మం - 4 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 4

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-4 వ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. కానీ ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని అమ్మటానికి మార్చ్ ను ఒప్పించి వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్ముతుంది. అదేసమయంలో స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు యింటి వద్ద ఉన్న నాన్సీకి ఎఫీ ఫోను చేసి ఉన్నపాటున బయల్దేరి రమ్మని, రాత్రి జరిగిన విషయం చెప్పాలని చెబుతుంది. ఆ కబురు విన్న నాన్సీ ప్లెజెంట్ హెడ్జెస్ కి బయల్దేరుతుంది. ఆ తరువాత. . . . )
@@@@@@@@@@@@
నాన్సీ క్షణం ఆలశ్యం చేయకుండా, అఘమేఘాలమీద తన కారులో ప్లెజెంట్ హెడ్జెస్ ను చేరుకొంది. కారు దిగి భవనం వైపు వెడుతున్న ఆమెకు ఎఫీ గుమ్మంలోనే ఎదురైంది.
"పద! మనం బయట మాట్లాడుకొందాం. నా మాటలు ముసలాయన వినకూడదని కోరుకుంటున్నాను. అతను వింటే కంగారుపడి. . .వయసులో పెద్దాయన కదా. .ఏదైనా అనర్ధం జరగొచ్చు" ఎఫీ పరుగున నాన్సీకి ఎదురెళ్ళి మెల్లిగా గొణిగింది. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. మరుక్షణం ఆమె నాన్సీని భుజం పట్టుకొని యింటిముందు పచ్చిక బయలులో ఒక మూలకు తీసుకెళ్ళింది. తరువాత చుట్టూ ఒకసారి పరికించి మెల్లిగా జరిగిన సంగతి చెప్పసాగింది.
"నిన్న రాత్రి జరిగిందిది. రాత్రి కిర్రుమన్న శబ్దాలు వినిపించి నిద్ర పట్టలేదు. ఎంతకూ నిద్ర రాకపోవటంతో మంచం దిగి, నా పడకగది కిటికీలోంచి బయటకు చూస్తున్నాను. ఉన్నట్లుండి ఒక బలిష్టమైన వ్యక్తి ఈ పచ్చికబయలుకి అడ్డంపడి ఆ మూలనుంచి యిటువైపు వెడుతూ కనిపించాడు."
"అతను యింట్లోనుంచే వచ్చాడా?"
"వచ్చి ఉండాలి. అతను అటువైపునుంచి వచ్చి యిలా కారుషెడ్డు వైపు వెళ్ళాడు. తరువాత మరి కనబడలేదు. నాకిక్కడ నచ్చలేదు. సుశాన్ని తీసుకొని ఊళ్ళో ఉండలేమా?"
"అనారోగ్యంతో ఉన్న ఆమెను కదపకూడదు" నాన్సీ బదులిచ్చింది. "అతను ఖచ్చితంగా యీ యింట్లోనుంచే వచ్చాడో, లేదో నీకు తెలీదు. ఈ పాత యింట్లో దొంగిలించటానికి విలువైన వస్తువులేమీ లేవు కదా!"
"అదీ నిజమే!" ఎఫీ ఒప్పుకొంది. "అంతేకాదు! వెంటనే యింట్లో అన్ని కిటికీలు, తలుపులు పరిశీలించాను. నేను పడుకొనేముందు వాటిని ఎలా మూశానో అలాగే ఉన్నాయి."
"ఇప్పుడొకసారి మనం యిల్లంతా తిరిగి, రాత్రి ఏవైనా తలుపులు పగలకొట్టి తెరిచారేమో చూద్దాం. పొద్దున్న లేవగానే ఏ తలుపులు ముందు తెరిచావు?"
"భోజనాల గది, వంటిల్లు మాత్రమే!"
వాళ్ళిద్దరూ కలిసి భవంతి క్రిందభాగమంతా గాలించారు. మేడమీద మనుమరాలితో కబుర్లు చెబుతున్న మిలటరీ వానికి వీళ్ళ తనిఖీ గురించి తెలియదు. ప్రతి కిటికీని దుండగుడు తాకలేదని నిర్ధారించుకొన్నాక ఎఫీ తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది.
"ఆ మనిషి బహుశా యింట్లోకి వచ్చి ఉండడు" అనుకోగానే ఎఫీలో గూడు కట్టుకొన్న భయం పటాపంచలైంది. ఆమె వెంటనే తన యింటిపనిలో మునిగిపోయింది. ఎఫీలో భయాన్నయితే పోగొట్టగలిగింది గానీ నాన్సీ మాత్రం తనను తాను సమాధానపరచుకోలేకపోతోంది.
ఇంట్లోనుంచి నాన్సీ బయటకు వచ్చి మరొకసారి పచ్చికబయలు ఉన్న ప్రాంతమంతా తనిఖీ చేయసాగింది. మెత్తగా ఉన్న నేలపై కొత్తగా ఉన్న పాదముద్రలు చూసి త్రుళ్ళిపడింది. ఆ అడుగుజాడలు యింటిని ఒకసారి చుట్టుముట్టి, గతంలో పనివాళ్ళు ఉండేవాళ్ళని ముసలాయన చెప్పిన యిళ్ళవైపుకి వెళ్ళినట్లుగా గమనించింది.
"ఎఫీ నిజంగానే ఎవరినో చూసింది. అయితే ఒక దుండగుడికి యీ యింటిమీద అంత శ్రద్ధ ఏమిటి?" ఆలోచిస్తూ మరొకసారి పాదముద్రలను అనుసరిస్తూ భవనం చుట్టూ తిరిగింది.
"వాడి దగ్గర దొంగ తాళంచెవులు ఉండి ఉంటాయి" హఠాత్తుగా ఆమె బుర్రకు తట్టింది. వెనువెంటనే మరొక ఆలోచన కూడా ఆమె బుర్రలో చొరబడింది. 'బహుశా యితను వెలుగు చూడని ఫిప్ మార్చ్ సాహిత్యం గురించి వెతుకుతూండవచ్చు. తాము రేడియోలో విన్న పాటను యీ మనిషే దొంగిలించాడా?'
"తక్షణమే నా అన్వేషణను పునఃప్రారంభించాలి" నాన్సీ నిశ్చయించుకొంది.
వెంటనే అటక వద్దకు వెడుతూ, దారిలో తాతామనుమరాళ్ళు ఉన్న గదిలోకి తొంగిచూసి శుభోదయాన్ని చెప్పింది. ఆ పాప మంచంపై కూర్చుని తాత చెప్పే కధలను వింటూ బిగ్గరగా నవ్వుతోంది.
"నాన్సీ! నాకు చాలావరకు నయమైందని డాక్టరు చెప్పాడు. నేను త్వరగానే తిరగగలను. ఇక యీ యిల్లు వదిలి మరెక్కడికీ వెళ్ళను" పాప ఆనందంగా చెప్పింది.
మార్చ్ కళ్ళలో నీళ్ళు చూసి నాన్సీ అతని ఉద్దేశాన్ని గ్రహించింది. వెంటనే తన పర్సులోంచి చెక్కును తీసి అతనికి యిచ్చింది.
"నాకే?ఫేబర్ పురాతనవస్తువుల దుకాణం నుంచే?" ఆశ్చర్యపోయాడతను.
"అటక మీద మేము చూసిన పాతబల్ల, అట్టపెట్టెల ఖరీదు"
"వాటికి యింత విలువ ఉంటుందని నేను అనుకోలేదు. ఈ సొమ్ముతో కొంతకాలం నెట్టుకుపోవచ్చు."
"నేనిప్పుడు యింతకన్నా విలువైన వస్తువులు దొరుకుతాయేమో వెతకటానికి వెడుతున్నాను. . .ముఖ్యంగా ఫిప్ సాహిత్యాన్ని" నవ్వుతూ చెప్పిందామె.
"దొరకదు. దాన్నెవరో దొంగిలించారు" నిరాశగా చెప్పాడతను.
అతని ఊహ యించుమించు నిజమే కావచ్చునని ఆమెకు అనిపించింది. కానీ ఎఫీ చెప్పిన అపరిచితవ్యక్తి గురించి అతనికి చెప్పలేదు. కాకపోతే 'ఆశ పెట్టుకోవటంలో తప్పులేద'ని మాత్రం చెప్పింది. అతను రేడియో కార్యక్రమాల్లో మరిన్ని పాటలను గుర్తించగలిగితే యీ అన్వేషణ సులభమవుతుందని నాన్సీ తలపోసింది. కానీ అతనింట్లో టెలివిజను లేదు, ఉన్న రేడియో పనిచేయటం లేదు.
"రేపు నా చిన్నరేడియో తెచ్చి యిస్తాను. దాన్ని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. మీ అబ్బాయి వ్రాసిన మరి కొన్ని పాటలను వినే అవకాశం వస్తుంది."
"మంచి ఆలోచన."
సుశాన్ కూర్చున్న మంచంపై పక్కబట్టలు సర్ది, మూడవ అంతస్తులో తన అన్వేషణ ప్రారంభిస్తానని నాన్సీ చెప్పింది. "ఆ రోజు నా స్నేహితురాళ్ళతో అటక మీద సరిగా వెతకలేకపోయాను. మీ అబ్బాయి బాణీ కట్టిన పాటలు యీ యింట్లోనే ఉంటే, అక్కడే ఉండి ఉండాలి."
"నువ్వన్నదీ నిజమే! కానీ జాగ్రత్తమ్మా!"
నాన్సీ అటకమీదకు చేరుకొన్నాక చేతిలోని ఫ్లాష్ లైట్ వేసి, అన్వేషణ ఎక్కడనుంచి మొదలెట్టాలా అని చూసింది. ఆక్కడ యింతకుముందు చూసినదానికన్నా భయంకరంగా ఉంది. అటకంతా బూజువాసన వస్తోంది. ముందుకెళ్ళి అక్కడ ఉన్న కిటికీ తలుపు తెరవబోతూంటే, ఆమె నిలబడ్డ చెక్కలు మూలిగాయి.
నాన్సీ తన అన్వేషణను పాతభోషాణం నుంచి మొదలెట్టింది. దాని తలుపును పెకెత్తగానే పసుపురంగులో ఉన్న పెళ్ళిగౌను కనిపించింది. అది జరీపట్టుతో నేసిన చాలా ఖరీదైన వస్త్రం.
"ఈ పట్టుబట్ట బహుశా సుశాన్ నాయనమ్మదై ఉంటుంది" నాన్సీ అనుకొంది. ఆ పెళ్ళిగౌను ప్రక్కనే అరడజను వరకూ పాతకాలానికి చెందిన అందమైన చిత్రాలు కనిపించాయి. వాటిలో ఒకటి తనకు బాగా తెలిసిన చిత్రంగా ఆమె పోల్చుకొంది.
"ఇది కరియర్ అండ్ ఐవ్స్ చిత్రంలా ఉంది. నిజమే! ఇదిగో ఇక్కడ పేరుందిగా!"
ఇలాంటి పాతచిత్రాలను సేకరించేవారు ఎంత ఆనందిస్తారో అన్న భావనతో ఆమె మనసు ఉప్పొంగింది.
"ఎంత అదృష్టం? ఇక్కడ నాకు కనిపించినవన్నీ విలువైనవి, అమ్మదగినవే!"
నాన్సీ మనసు ఉబ్బితబ్బిబ్బయింది. ఈ ఆలోచనల మధ్యలో, తమ ప్రాంతంపైకి దూసుకొస్తున్న ఉరుములతో కూడిన గాలివానను కూడా గుర్తించలేదామె. ఉన్నట్లుండి అది ఆగ్రహంతో ఆ యింటిపై విరుచుకుపడింది.
"ఈ కిటికీని మూసేసి క్రింది అంతస్తుల్లోని వాటినన్నింటినీ మూసేస్తే మంచిదనుకుంటా!" అనుకొంటూ అడ్డంగా ఉన్న అట్టపెట్టెలను దాటుకొంటూ వెళ్ళి అటక మీద కిటికీని భద్రంగా మూసేసింది. పరుగున అటక మెట్ల దగ్గరకు వచ్చి, కంగారుగా క్రిందకు దిగుతుండగా ఏదో బద్దలైన శబ్దమైంది. వెంటనే ఏదో ఢీకొని కూలిపోతున్న శబ్దంతో ఆ భవనం మొత్తం ఊగిపోయింది. క్రింద ఉన్న ముగ్గురి అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ధ్వనించింది.
"నాన్సీ! నీకేమీ కాలేదుగా!" మార్చ్ తన గదిలోంచి కంగారుగా బయటకు వచ్చి అటక దిక్కుగా చూస్తూ అరిచాడు. ఆమె వేగంగా అటకమెట్లు దిగి వారి వద్దకెళ్ళింది. ఒకరినొకరు కళ్ళారా చూసుకొని, అందరూ క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించుకొన్నారు. కానీ సుశాన్ మాత్రం భయంతో వణికిపోతోంది. ఆమె మంచం మీదనుంచి దూకి, కంగారుగా హాల్లోకి పరిగెత్తుకొని వచ్చి నాన్సీని చుట్టేసింది.
"నేను ఒంటరిగా ఉండను. ఏదో నా గది కిటికీ మీద పడింది" అంటూ ఏడుపు లంకించుకొంది.
నాన్సీ ఆమె తలపై ఓదార్పుగా నిమురుతూ ' ఏం జరిగింద ' ని అడిగింది. అప్పటికే మొదటి అంతస్తుకి దిగటానికి మెట్ల దగ్గరకు చేరుకొన్న ముసలాయన పెద్ద పైన్ చెట్టేదో భవనంపై కూలి ఉండొచ్చునన్నాడు.
"పిడుగు పడి ఉంటుంది" ఎఫీ భయంతో వణికిపోతోంది.
"భయపడకు! అందరూ క్రిందకెళ్ళి ఏమి జరిగిందో చూద్దాం" ఎఫీకి ధైర్యం చెప్పిందామె.
సుశాన్ కి గౌను, చెప్పులు తొడిగాక అందరూ మార్చ్ వెనుక మొదటి అంతస్తుకి వెళ్ళారు. అక్కడ వారిని తన కుమారుడి సంగీతపుగదిలోకి తీసుకెళ్ళాడాయన. ఆ గది కిటికీలోంచి భవనంపైకి ఒరిగి ఉన్న పొడవైన పైన్ వృక్షాన్ని చూశారంతా. వాన తగ్గగానే నాన్సీ, పెద్దాయన బయటకెళ్ళి చెట్టు కూలటం వల్ల భవనానికి కలిగిన నష్టాన్ని చూశారు.
"భవనానికేం పెద్దగా నష్టం కలగలేదు. దుక్కగా కట్టిన యిల్లు కదా! చెట్టు కూడా దిట్టంగానే ఉందనుకో! నాన్సీ! అది నీ కారు మీద పడనందుకు సంతోషిస్తున్నాను" మార్చ్ అన్నాడు.
"నేనూ అదే అనుకొంటున్నా!" అంటూ బదులిచ్చిందామె. "మీరు అనుమతిస్తే యిక్కడకు దగ్గరగా ఉన్న మోటారుషెడ్డుకి వెళ్ళి కూలివాళ్ళను పిలుచుకొస్తాను. వాళ్ళు చెట్టును లాగి తాము వచ్చిన లారీలో తీసుకుపోతారు."
"అది మంచి ఆలోచనే! కానీ దానికి ఖర్చు. . ."అంటూ నీళ్ళు నమిలాడతను.
"నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు. అతను పెద్దగా డబ్బులు తీసుకోడు. అంతేగాక అటక మీద అమ్మకానికి పనికివచ్చే డజను పైగా చిత్రాలను చూశాను" చెప్పిందామె.
వెంటనే అటక మీదకెళ్ళి అక్కడ దొరికిన చిత్రాలను కట్టగట్టి తెచ్చి ముసలాయనకి చూపించింది.
"వీటిని గుర్తుపట్టారా? ఇవి అటకమీద భోషాణం పెట్టెలో దొరికాయి. వీటిని అమ్మితే బాగానే డబ్బులొస్తాయి."
"ఇవి అంత ఖరీదైనవా?"
"ఖచ్చితంగా! ఫేబర్ వీటిని చూస్తే సంతోషిస్తాడు. నేనింకా పరిశోధన ప్రారంభంలోనే ఉన్నాను. ముమ్మరంగా వెతికితే అమ్మకానికి విలువైన ఖజానాలే దొరుకుతాయక్కడ" నాన్సీ కళ్ళలో ఆశ తొణికిసలాడుతోంది.
"మా అబ్బాయి సాహిత్యం దొరకలేదా?"నిరాశగా అడిగాడతను.
"ఇంతవరకూ లేదు. రేపు మరొకసారి చూస్తాను" నాన్సీ మాట యిచ్చింది.
ఆమె తన యింటికి బయల్దేరుతూంటే ఎఫీ పరుగున వచ్చింది.
"నాన్సీ! ఈ రోజు నువ్వు వెళ్ళిపోవటం లేదు కదా! నువ్వు యీ రాత్రి లేకపోతే నాకిక్కడ ఊపిరి ఆగిపోతుంది" అంటూ ఎఫీ కన్నీళ్ళు పెట్టుకొంది.
"ఉదయాన్నే వచ్చేస్తాను" నాన్సీ ధైర్యం చెప్పింది.
"ఉదయమా?" పనమ్మాయి కీచుస్వరంతో అరిచింది. "నువ్వు లేకపోతే నేనొక్కక్షణం యిక్కడ నిలబడలేను. కీచురాళ్ళ శబ్దాలు, రాత్రిపూట తిరిగే దొంగలు. . .ఓ! నాన్సీ! నువ్వు రాత్రికి తప్పకుండా వచ్చి యిక్కడే పడుకోవాలి."
"ఆగంతకుడు నువ్వు చెప్పినంత భయంకరంగా ఉంటే నాకూ నిద్రపట్టదు" నాన్సీ చమత్కరించింది. తన మాటలకు ఎఫీ ముఖంలో మరింత భయం చోటు చేసుకొంది.
"సరే! రాత్రి రావటానికి ప్రయత్నిస్తా!" అంటు తన కారు వద్దకెళ్ళింది నాన్సీ.
మొదట లియొనార్డో గేరేజీకి వెళ్ళి ప్లెజెంట్ హెడ్జెస్ భవనంపై కూలిన చెట్టును తొలగించే పనిని పురమాయించింది. తరువాత ఫేబర్ దుకాణానికి వెళ్ళి పాతచిత్రాలను అమ్మి, పెద్దమొత్తంలో మార్చ్ పేరుమీద చెక్కును తీసుకొంది. చివరగా తండ్రి ఆఫీసుకెళ్ళి తన ప్రణాళికలు, మార్చ్ భవనంలో జరిగిన వింతల గురించి విపులంగా చెప్పింది.
"ఎఫీ రాత్రివేళ తిరుగుతున్న మనిషిని చూసిందా?" డ్రూ అడిగాడు.
"అవునండీ! నేను కూడా ఆ యింటిచుట్టూ ఉన్న పాదముద్రలు చూశాను" నాన్సీ బదులిచ్చింది.
"వద్దురా! నువ్వు తిరిగి ఆ భవనానికి వెడితే, అనవసరమైన ప్రమాదంలో యిరుక్కోవద్దు" తండ్రి కళ్ళల్లో భయాన్ని చూసి ఆమెలో అభిమానం పెల్లుబికింది.
"అలాగే నాన్నా!" అంటూ లేచి వెళ్ళి తండ్రిని చుట్టేసింది.
తండ్రి కార్యాలయం నుంచి యింటికెడుతూ దారిలో సుశాన్ కోసం ఆటబొమ్మలు కొంది. వాటన్నిటినీ మూటగట్టి, కొంత కిరాణా, పోర్టబుల్ రేడియో, తను కట్టుకోవటానికి కొన్ని బట్టలను సూటుకేసులో సర్దుకొంది. త్వరగా రాత్రి భోజనం ముగించి, కారులో ప్లెజెంట్ హెడ్జెస్ కి బయలుదేరింది.
"అమ్మయ్య! నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చింది." నాన్సీని చూసిన ఎఫీ ఆనందంతో పొంగిపోయింది. నాన్సీ రేడియోలో ప్రజాదరణ పొందిన పాటలను వేసే స్టేషను పెట్టి ముసలాయనకు యిచ్చింది.
"పాటలను జాగ్రత్తగా వినండి. ఇదివరకు మీరు విన్న పాటను వాళ్ళు మళ్ళీ వేయవచ్చు. ఆ పాట మళ్ళీ వస్తే రేడియోస్టేషను పేరు, వాద్య సహకారం అందించినవారి వివరాలు, ఒకవేళ చెబితే, సంగీత దర్శకుడి పేరు కాగితంపై వ్రాసి పెట్టండి" నాన్సీ చెప్పింది.
"ఆ మోసగాణ్ణి బయటపెట్టే విషయం తప్ప నాకేదీ యిష్టం లేదు. అది ఫిప్ వ్రాసిన పాటగా ప్రపంచానికి బహిర్గతం కావాలి" ఉద్రేకంగా చెప్పాడతను. పెద్దాయన రేడియో పట్టుకొని పై అంతస్తుకి వెళ్ళాడు. ఈలోపున నాన్సీ అటకమీద వెతకాలనుకొంది. దురదృష్టవశాత్తూ ఫ్లాష్ లైట్ బాటరీ అయిపోవటంతో, ఆమె కొవ్వొత్తి కోసం వంటింటివైపు వెళ్ళింది.
"పగటివేళ ఈ యిల్లు అంత ప్రమాదకరమైంది కాదు. కానీ చీకటి పడితే చాలు, ఏవో నీడలు మనవైపు దొంగచూపులు చూస్తాయి" ఎఫీ గొణుగుతోంది.
"అర్ధంలేని మాటలు" నాన్సీ నవ్వుతూ అంది. ఆమె అక్కడ ఉన్న పెద్ద అలమార తెరచి, పెద్ద కొవ్వొత్తిని తీయటం ఎఫీ చూసింది.
"ఇప్పెడేమి చేయాలనుకొంటున్నావు?" అడిగిన ఆమెకు విషయం చెప్పింది నాన్సీ.
"అటక మీద లైట్లు లేవు కదా! నా ఫ్లాష్ లైట్ బాటరీ అయిపోయింది."
"నువ్వు యిప్పుడు ఆ పైకి వెళ్ళొద్దు" ఎఫీ కంగారుగా చెప్పింది.
"ఎఫీ! నాకేమీ జరగదనే అనుకొంటున్నాను. పెద్దాయనకి నేను చేయగలిగినంత సాయం చేయదలిచాను."
ఆమె మాటలకు ఎఫీ అయిష్టంగానే భుజాలెగరేసింది. నాన్సీ కొవ్వొత్తిని స్టాండ్ లో అమర్చి, రెండవ అంతస్తులోని అటకమీదకెళ్ళే మెట్ల దగ్గర ఆగింది. అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి చేతితో ఎత్తి పట్టుకొంది. జాగ్రత్తగా అటకమెట్లను ఎక్కసాగింది. తీరా ఆమె అటక మీదకు చేరుకోగానే కొవ్వొత్తి ఆరిపోయింది.

(తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే వచ్చే నెలవరకూ ఆగవలసినదే!)

No comments:

Post a Comment

Pages