సుబ్బుమామయ్య కబుర్లు!
కాపీ
పిల్లలూ, మీకు కాపీ అంటే తెలుసా! ఒకరిని చూసి అనుకరించడాన్ని, అనుసరించడాన్ని కాపీ కొట్టడం అంటారు! పరీక్షల్లో పిల్లలు మరొకరి పేపర్లోకో,
దొరికిన సమాధానపు కాగితపు ముక్కనో (చిట్టీ) చూసి రాయడాన్ని కాపీ అంటారని
మీకు తెలుసు. కాపీ కొట్టడం అనేది మంచిది కాదర్రా! మన గుణాల మీద నల్లటి మచ్చ అది. అన్నీ
కష్టపడి రాసి, ఏ ఒకటో రెండో చూసి రాస్తే, ‘కాపీ కొట్టి రాసి మార్కులు తెచ్చుకున్నాడు’ అని ఎవరైనా అంటే ఎంత బాధ కలుగుతుందో
కదా? కాపీ అనేది మనకు విద్యార్జన పట్ల బద్దకం కలిగిస్తుంది. సంవత్సరం
అంతా చదవకుండా సరదాగా గడిపి, పరీక్షల్లో కాపీ కొట్టే అవకాశమే
లే(రా)కపోతే పిచ్చెక్కి పోతుంది. ఆ విద్యా సంవత్సరం కోల్పోతారు. మాస్టార్లు,
తల్లిదండ్రులతో సహా అందరూ తిడతారు. వాళ్లు తిట్టినందుకు కాదు గాని,
అసలు మనకు ఎలా అనిపిస్తుంది? బాధగా కదూ. ఇంకోసారి
అలా చెయ్యకూడదనుకుంటాం కూడా.
అసలు
మనం కాపీ ఎందుకు కొట్టాలి? మహాత్మగాంధీని వాళ్ల మాస్టారు కాపీ కొట్టమన్నా,
కొట్ట లేదట. తెలుసుకదా!(తెలియకపోతే ఆ కథ మీ మాస్టారిని అడిగి తెలుసుకోండి).
మీకో
విషయం తెలుసా? అనుభవజ్ఞులైన మాస్టార్లకి మనం కాపీ కొట్టి రాసిన విషయం
ఇట్టే తెలిసిపోతుంది. అయితే పిల్లల భవిష్యత్తు పాడౌతుందని చూసీ చూడనట్టుంటారు. అంతే.
కాపీ కొట్టి, అది ఎవరికీ తెలియలేదనీ, మనను
ఎవరూ చూడలేదని అనుకోవడం పొరబాటు. అదేం ఘనకార్యం కానేకాదు. కాపీకొట్టి మంచి మార్కులు
తెచ్చుకున్నా, మన మనసు మనకి చెబుతూనే ఉంటుంది, తప్పు చేసి తెచ్చుకున్న మార్కులు అవని.
అందుచేత
కష్టపడి చదవండి. పరీక్షలు రాయండి. మంచి మార్కులు తెచ్చుకోండి. అప్పుడు అందరి అభినందనలూ
అందుకోవడమే కాదు, పెద్దయ్యాక జీవితంలో ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ చూసుకున్నా,
నిజాయితీతో ఉత్తీర్ణత (పాస్) పొందినందుకు గర్వంగా ఉంటుంది.
మీరు
కాపీ కొట్టరు. మంచి పిల్లలు కదా! మరి ఉంటాను.
మీ
సుబ్బుమామయ్య
***
No comments:
Post a Comment