దస్తావేజులు
-కౌండిన్య (కలవల రమేష్ )
బయట చల్లటి వాతావరణానికి బస్సు సీటులో కునుకుపాట్లు పడుతున్నాడు. ఉలిక్కిపడి లేచాడు. కిటికీ అద్దాలకు పట్టిన చెమ్మను హడావుడిగా తుడుచి, బయటకు చూస్తూ, ఎక్కడున్నాడో అర్థం కాక లేచి సరాసరి కండక్టర్ కూర్చున్న దిశగా నడిచి “ఈడుపుగల్లు వెడిపోయిందా?” అని కంగారుగా అడిగాడు గోపాల్రావు.
అతని పరిస్తితి కండక్టర్ కు అర్ధమయ్యింది.“ఊరు దాటబోతున్నం, ఏంటి దిగుతారా?” అంటూ లేచి వెంటనే బెల్లు కొట్టాడు. అనుకోని చోట ఆపమనడంతో డ్రైవర్ ఒక్క సారి వెనుక్కి తిరిగి చూసి విసుగు ప్రదర్శిస్తూ బస్సుని ఆపాడు. గోపాల్రావు హడావుడిగా కిందకు దిగాడు. సరిగా దిగాడో లేదో చూసి ఆ కండక్టర్ “రై రై” అనగానే రోడ్డు మీద ఉన్న నీళ్ళు ఇరు వైపులా చిందిస్తూ ఆ బస్సు కనుమరుగయ్యింది.
జోరుగా వర్షం పడుతోంది. ఊరు శివార్లలో పచ్చికబైర్లు వాన నీటికి తడిసి పచ్చగా కనపడుతున్నాయి.కొత్త ప్రదేశం. ఆ చుట్టూరు ఓ సారి చూసి దగ్గరలో షెల్టర్ లాగా కనపడగానే అటు పరుగెత్తి దానికింద తల దాచుకొని, చేతిలో బ్యాగు తడిసిందేమోనని ఓ సారి చూసుకున్నాడు. అటు ఆకాశంలో కమ్ముకున్న దట్టమైన కారుమబ్బులు మరొక సారి పరికించి చూసి ఇపుడల్లా తెరిపించేలా లేదు అనుకున్నాడు.
సాయంత్రం మూడు గంటలు కావస్తోంది. వర్షం వల్ల ప్రయాణం కూడా ఆలస్యం అయ్యింది. నిద్రలోకి జారుకున్నందుకు తనను తాను మరో సారి ధూషించుకున్నాడు., పైన షెల్టర్ కన్నంలోంచి బొట్టు బొట్టు కారడం చూసి కొంచెం పక్కకు జరిగాడు. ధైర్యం చేసి వెడదామా అనుకుంటే తడిసి ముద్దయ్యేలాగా ఉన్నాడు. తన ధ్యాసంతా తన దగ్గరున్న దస్తావేజుల గురించే. తనకు ఇక్కడకి వచ్చేముందు ఎన్నో జాగ్రత్తలు చెప్పే పంపించారు ప్రకాశం గారు. ఈ ఒక్క పని సక్రమంగా చేయకుండా వెడితే గోపాల్రావు కు ఆయన దగ్గర మొహం చెల్లదు.
ప్రస్తుత పరిస్తితులలో తను చేసేది ఏమీ లేక ఆ ఊరి దిశలో వెళ్ళబోతున్న వాటినన్నింటినీ గమనిస్తున్నాడు. అదే తను ఊరిలో గనుక దిగి ఉంటే కనీసం ఏ రిక్షా అతనో తను చేరవలిసిన చోటికి తీసుకెళ్ళేవాడు. సమయం కొంత వృధా అయినా సరే వర్షం తగ్గేదాకా కదిలే ప్రసక్తి లేదని నిశ్చయించుకున్నాడు గోపాల్రావు.
పెరిగింది పల్లెటూరైనా గోపాల్రావు చదివింది పట్నంలోనే. పట్నంలో పనిచేసే విధానానికి అలవాటు పడిన గోపాల్రావు కు ఇక్కడ పనులు అయోమయంగా అనిపిస్తాయి. అందరికీ గోపాల్ అని పరిచయం చేసినా చిన్నప్పటి నుండి అలవాటైన పేరుతో గోపాల్రావు అనే పిలుస్తారు. చదువులు పూర్తి అయిన తరువాత అక్కడే కొన్నేళ్ళు ఉద్యోగం చేసి, తండ్రి పోరు పడలేక అది కాస్తా మానేసి, ఆ సొంత ఊర్లేనే ఏదోకటి చేద్దామని నిశ్చయించుకొని తిరిగి వచ్చాడు.తీరా వచ్చిన తరువాత మళ్ళీ అంత చిన్న ఊర్లో ఇమడగలడా లేదా అన్న సందేహంతో చిన్నా చితక పనులు తప్పా ఏ పని సక్రమంగా మొదలు పెట్టనే లేదు. ఇంతలో తన దూరపు చుట్టం ప్రకాశం గారికి అనివార్య కారణాల వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి, గోపాల్రావు తన తండ్రి సలహాపై ఆయన బదులుగా ఈ పని కోసం బయలుదేరి రావాల్సి వచ్చింది.
ఈడుపుగల్లు ఓ చిన్న ప్రదేశం. ఆ ఊర్లో చాలా కాలంగా నివసిస్తున్న కుందనమ్మ గారంటే అందరికీ పరిచయమే. కొన్ని రోజులుగా కష్టాలతో మునిగి తేలుతూ ఉండటం మూలానా ఆమె ఇంటి తాలూక దస్తావేజులు తిరిగి ఇచ్చేయమని పంపారు. ఉన్న కష్టాలలో కుందనమ్మ గారిని ఉదారస్వభావులైన ప్రకాశం గారు ఇంకా ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు. ఆవిడ ఎలాగూ తీర్చలేని పరిస్తితి, అదీ కాక ఈ మధ్య ఆరోగ్య పరిస్తితులు కూడా బాలేదని కూడా విన్నారు, ఆవిడ కాగితాలు ఆవిడకు అప్పచెబితే తన ఇల్లుని అమ్ముకొన్నా ఎంతోకొంత భారం తగ్గుతుందేమోనన్న సహృదయంతో వాటిని తిరిగి ఇచ్చి రమ్మని పంపారు ఆయన.
ఉన్న చోటే గంటకు పైగా నించున్నందుకు గోపాల్రావు కు అలసటైతే లేదు కానీ కడుపులో ఆకలి మాత్రం బాగా వేస్తోంది. దారిన అటు వచ్చే పోయే ఎడ్లబండ్లను, మనుషులను చూస్తూ, ఈ సారి ధైర్యం చేసి తను వెళ్ళవలసిన ప్రదేశం గురించి అడిగి తెలుసుకుందామని అనుకున్నాడు. ఎప్పుడయితే అలా నిశ్చయించుకున్నాడో అటు బొత్తిగా ఎవ్వరూ రావడం మానేసారు, ఒకరో ఇద్దరో అటు వెళ్ళినా గోపాల్రావు అరుపులు పట్టించుకున్న వాళ్ళు లేరు. సహనం కోల్పోతూ చేసేది లేక అక్కడే నించొని ఉన్నాడు.
కొంత సేపటికి దగ్గరలోంచి ఓ ఎద్దులబండి వెడుతుంటే గట్టిగా వినపడే లాగా అరిచాడు. ఏ మనిషి అవసరంలో ఉన్నాడోనని బండి అతను ఆపాడు. అతనితో ”కుందనమ్మ గారి ఇల్లు ఎక్కడో తెలుసా?” అని అడిగాడు. సరిగా వినబడినట్లు లేక మళ్ళీ కొంచెం గొంతుచించి అరిచాడు.
అది విన్న అతను “అటే ఎల్తన్నా బాబు వస్తారేంటి” అన్నాడు
“వొద్దులే తడిసి పోతాను. నడిచే దూరమేనా” అని అడిగిన దానికి.
“కాదు బాబు కాసిన దూరం ఎళ్ళాలి” అంటూ జవాబు ఇచ్చి అతను బయలు దేరాడు.
గోపాల్రావు కు ఓపిక సన్నగిల్లింది, తప్పేది లేక ఉన్న చోటే చతికిల పడి కొంత సేపటికి ఎవరో వస్తున్నట్లుగా వినబడగానే అప్రమత్తం అయ్యి లేచి నించున్నాడు. చూడటానికి గుర్రపుబండి లాగా ఉంది, దగ్గరకు రాగానే గట్టిగా పిలిచాడు, ఇక లాభంలేదని మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదేమోనని ధైర్యం చేసి బ్యాగు తడవకుండా శరీరం అడ్డుపెడుతూ పరిగెత్తాడు. అతనితో మాట్లాడి లోపలకి ఎక్కాడు,
అదే గుర్రపు బండి లోపల ఇంకొక ఆవిడ కూర్చొని ఉంది..పరిచయం ఉన్న వ్యక్తి లానే అనిపించి మరొక సారి ఆమె ముఖం చూసాడు. ఈ మధ్యనే చూసిన ఆమెలా ఉన్నా, తనకు ఎక్కడ చూసాడో సరిగా గుర్తు రావడం లేదు. తనది బాగా తెలిస్తే కానీ పలకరించే స్వభావం కాదు. ఇలా మనుషులు కనపడటం తను వారిని సరిగా గమనించకపోవడం సహజమే గోపాల్రావు కు. ఎక్కడ చూసాడో దాని గురించి తల బద్దలుకొట్టుకుంటుంటే “బాబుగారు, కుందనమ్మ గారి ఇల్లు ఇదే” అని వినిపించగానే తేరుకున్నాడు.
ఆమె కూడా దిగింది సరాసరి ఆ బంగళాలోకి నడిచింది. గోపాల్రావు జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. ఆ గుర్రం బండి అతను డబ్బులు తీసుకొని “ఈ ఇంట్లోకి వెడుతున్నారు. జాగ్రత్త బాబు గారు” అన్నాడు. అతను అన్న మాటలేమీ పట్టించుకోలేదు. ఆమె కూడా అదే ఇంట్లోకి వెళ్ళడంతో తన ధ్యాస ఆమె మీద ఉండి వెనకాలే తను కూడా లోపలకు నడిచాడు..
తలుపు తీసి ఉండటంతో లోపలికి మెల్లిగా నడిచి ముందు గదిని పరిశీలిస్తున్నాడు. ఇంతలో లోపల నుండి వయసుపడిన ఆవిడ వస్తూ పలకరించింది. ఈవిడే కుందనమ్మ గారు అయ్యఉంటారని అనుకున్నాడు గోపాల్రావు..
“మీరు?” అని అడిగింది..
“ప్రకాశం గారు నన్ను పంపారు, ఆయన మీకు మీ ఇంటి దస్తావేజులు తిరిగి ఇచ్చి రమ్మన్నారు” అన్నాడు. ఆమె కళ్ళలో సంతోషం కనపడింది.
“కూర్చోండి బాబు. మంచి నీళ్ళు తెస్తాను” అంటూ లోపలినుండి నీళ్ళు తెచ్చి అందించింది.
“ప్రయాణం బాగా జరిగిందా? మీరు అలసటగా కనిపిస్తున్నారు” అంది
“వర్షం వల్ల రావడం కొంచెం ఆలస్యం అయ్యింది” అన్నాడు.
“ప్రయాణం ఆలశ్యం అయ్యింది. భోజనం చెయ్యడానికికుదరలేదు దగ్గరలో హోటల్ ఏమైనా ఉందా?” అని అడిగాడు
“హోటలు ఎందుకు బాబు, మీరు తయారయ్యేలోగా నేనే ఏర్పాటు చేస్తాను“ అంది కుందనమ్మ గారు మళ్ళీ
“పొద్దుపోయింది. మీకు బస్సు రేపటి వరకూ లేదు” అంది
“అవునా? ఈ ఊర్లో దిగిగానే తిరుగు ప్రయాణం గురించి కనుక్కుందామని అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏవి అనుకున్నట్లుగా జరగలేదు” అంటూ
“ఫర్వాలేదు, నేను బయట ఎక్కడోక్కడ వసతి ఏర్పాట్లు చేసుకుంటాను” అన్నాడు ఆ పెద్దావిడ కు ఇబ్బంది కలిగించే ఆలోచన లేక.
అది విని కుందనమ్మ గారు “మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే ఈ రోజుకు ఇక్కడే ఉండిపోవచ్చు” అంది.
గోపాల్రావు ఒక్క సారి ఆలోచించాడు. తను ఉన్న పరిస్ధితిలో ఆవిడ అన్నది చెవులకు సొంపుగా వినిపించి మరోమాట మాట్లాడకుండా సరే నన్నాడు. ఈలోగా తినేందుకు ఏదోకటి తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది. అల్పాహారాలతో ముందుగా కనీసం ఆత్మారాముడైనై శాంతిస్తాడని మనసులో అనుకొంటూ ఆవిడ తెచ్చినవి శుభ్రంగా తినేసాడు.
“రండి బాబు, మీకు మీ గది చూపిస్తాను” అంది కుందనమ్మ గారు
ఆమె వెనకాలే నడిచాడు.
గదిలోకి ప్రవేశించాడు. తెరిచి ఉన్న కిడికీ తలుపులు గాలి ఉదృతానికి పటపట కొట్టుకుంటున్నాయు.. వెళ్ళి వాటిని మూసి తన బ్యాగు అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టాడు.
ఆ షెల్టర్ లో నించొన నించొని కాళ్ళు లాగడం మూలాన ఆ గదిలో పడక మంచం కనపడగానే నడుము వాల్చాడు.అలసట వల్ల తను ఎపుడు నిద్రలోకి జారుకున్నడో తనకే తెలియదు.
అర్థ రాత్రి వేళ మళ్ళీ కడుపులో ప్రేగులు అరవడంతో మెలుకువ వచ్చింది. తన తలుపు దగ్గర ఏదో శబ్థమయ్యింది, వెళ్ళి చూసాడు. తనతో ఇందాకా లోపలకు నడిచిన ఆమె నిలబడి నిరీక్షస్తోంది “మీరు” సంకోచిస్తూ అన్నాడు..
“మీరు భోంచేయకుండా పడుకున్నారు” అంది. ఇంకేమీ ఆలోచించకుండా ఆ నిద్ర మత్తులో తనవెంటే నడిచాడు
ఆమె అన్నీ తనకోసమే అమర్చినట్లుగా ఉంది. ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు. ఆమె అతన్నే చూస్తూ పక్కనే కొంచెం సేపు నించొని ఉంది. మళ్ళీ తనకు మొహమాటమేసి”మీరు శాంతంగా తినండి” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. గోపాల్రావు సుఖంగా భోజనం చేసి తన గది వైపుకు నడిచాడు.
మళ్ళీ పక్క మీద నడుం వాల్చాడు. చుట్టు పక్కలా నిర్మానుషంగా ఉండి కప్పలు అరుస్తున్నాయి, చినుకులు పడటం వినిపిస్తూనే ఉంది. నిద్ర పట్టక అటు ఇటు దొరలుతూ, తన కోసం అంత పొద్దు పోవడం వరకు కూడా మెలుకువ ఉన్న ఆమె వైపుకు ధ్యాస మళ్ళింది. ముందుగా సంకోచించినా తనను పలకరించి ఆమె వివరాలు తెలుసుకుందామని బయలు దేరాడు.
మిగతా గదులవైపు చూసాడు, ఓ గదిలోంచి వెలుతురు కనపడుతోంది.బహుసా ఆమె గది అయ్యి ఉండవచ్చునని తలుపుని చిన్నగా తోసాడు.
దీపం కాంతిలో ఆమె కిడికీ లోనుండి సూన్యం లోకి చూస్తొంది. అతను రావడం గమనించి కళ్ళతో ఆహ్వానం పలికింది. లోపలకు నడిచి చొరవ చేసుకొని “మీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియడం లేదు” అన్నాడు.
“ఫర్వాలేదు” అంది గాలికి మొహం మీద పడుతున్న ముంగురులను తీసి చేతి వేళ్ళతో వెనక్కి నెడుతూ.
“మీ పేరు తెలుసుకోవచ్చా?” అని అడిగాడు
“కుందన” అంది
“బావుంది. ఈ ఇంట్లో అందరి పేర్లు ఒకటేనా?” అన్నాడు నవ్వుతూ
“అయితే, మీకు కుందనమ్మ గారు ఏమవుతారు?” అని అడిగాడు
తను ఏమీ మాట్లాడలేదు. దీపం దగ్గరగా వచ్చి కొంచెం పెద్దది చేసింది. నొసట సన్నటి తిలకం బొట్టుతో కళ్ళలో బెరుకుతనం కనపడింది
“పోనీ చెప్పద్దులేండి” అన్నాడు..
“మిమ్మల్ని ఇంతకు మునుపు ఎక్కడో చూసాను” అన్నాడు తన భావం వ్యక్తపరిచాడు..
“ఒకే పోలికలు ఉన్న వారుంటారు లేండి” అంది నవ్వుతూ.
“అంతే అంటారా?” అన్నాడు
అతన్ని ఎన్నో ప్రశ్నలు వేదిస్తున్నాయి. తన గురించి ఎంతో తెలుసుకోవాలని ఉంది గోపాల్రావు కు.
“మీరు నించొనే ఉన్నారు” అంది.
తనకు కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పాలని ఉన్నా మనసు మార్చుకొని
“బాగా పొద్దు పోయింది, మీరు విశ్రాంతి తీసుకోండి” అంటూ తన గది వైపుకు నడిచాడు. తన పక్క మీద వాలి ఆమె ఆలోచనలతో కునుకు పట్టేసింది..
గోపాల్రావు లేచే సరికే బాగా పొద్దు ఎక్కింది. హడావుడి గా తన గది లోనుండి బయటకు నడిచాడు.కుందనమ్మ గారు కనిపించి “పెరట్లో నీళ్ళు ఉంచాను. మీరు తయారై రండి” అంది.
గోపాల్రావు తయారయ్యి వచ్చాడు. కుందనమ్మ గారు ఫలహారాలు తయారు చేసింది.
“మీరు అలసటతో రాత్రి భోజనం చెయ్య లేదు” అంది
రాత్రి భోజనం చేసిన సంగతి నోటి వరకూ వచ్చింది, మళ్ళీ ఆలోచించాడు. కుందన ప్రస్తావన తీసుకువచ్చి సహాయం చేసిన వ్యక్తికి ఇబ్బంది కలగజేయ దలుచుకోలేదు. తలదించుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు.
గోపాల్రావు తింటూ ఒక వైపు తన కళ్ళతో ఆమె కోసంవెతుకుతూనే ఉన్నాడు. అది గమనించి ఎవరి కోసం బాబు వెతుకుతున్నారు” అని అడిగింది కుందనమ్మ గారు.
“అబ్బే అదేం లేదండి” అని మాట మారుస్తూ తనకు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
“మీకు ఇవ్వాల్సినవి దస్తావేజులు తీసుకొస్తాను” అంటూ లేచి తన గదికి బయలుదేరాడు. వెళ్ళి బ్యాగులో పేపర్లు కోసం వెతికాడు. కనపడ లేదు. సరిగా చూడలేదేమో నని తన బట్టలన్నీ తీసి మరీ వెతికినా కనపడక, ఆ తీసిన బట్టలు మళ్ళీ లోపల కూరేసి, ఆ బ్యాగుతో హడావుడగా బయటకు వచ్చాడు.
రాత్రి వెళ్ళిన ఆమె గది తలుపు తోసాడు. ఎవ్వరూ కనిపించలేదు. లోపలకు ప్రవేశించి ఆమె కోసం అంతా గాలించాడు. వాటిని కుందన ఏమైనాతీసి ఉంటుందా? లేక తను పొరపడుతున్నాడా? పోనీ,తను వచ్చేలోగా ఆ గదిలో చూస్తే? ఆఉద్దేశంతో అన్నీ అరలు హడావుడిగా వెతుకుతున్నాడు.గది బయట అలికిడి విని అటు చూసాడు. ఎదురుగా కుందనమ్మ గారు నించున్నారు.
“ఈ గదిలో వెతుకుతున్నారు ఏంటి బాబు??” అంది ఆవిడ.
“మీకు ఇవ్వాల్సిన దస్తావేజులు నా బ్యాగులో కనపడటం లేదు” అన్నాడు
"మీరు రాత్రి పడుకున్నది ఈ గదిలో కాదు కదా బాబు" అంది
వేరే గదిలోకి ప్రవేశించి చిందర వందర చేయడం చూసి కుందనమ్మ గారికి అనుమానం వేసింది. గోపాల్రావు అయోమయంతో గది బయటకు నడిచాడు. కుందనమ్మ గారు కూడా అతని వెనకాలే నడిచారు.
“క్షమించండి ఏదో పొరపాటు జరిగింది” అన్నాడు ఉద్రేకంతో.
కుందనమ్మ గారు ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా బయలు దేరాడు.
"వాటిని తీసుకొని మళ్ళీ వస్తారా బాబు మీరు?" అని బాధగా అడిగింది.
తన మీద తనకే అసహ్యం వేసింది.బయటకు నడిచాడు.సన్నగా వాన జల్లు కురుస్తోంది. కాళ్ళు ఈడుస్తూ నడవటం మొదలుపెట్టాడు.
తన మనసులో అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి. దస్తావేజులు కుందనమ్మ గారికి అందజేయ లేదన్నసంగతి ప్రకాశం గారికి తెలిస్తే తన పరిస్తితి ఏమిటి? దస్తావేజులు ఖచ్చితంగా బ్యాగు లోపల పెట్టుకున్నాడో లేదో కూడా తెలియని పరిస్తితి. పొద్దున్న ఎంత వెతికినా కుందన కనపడలేదేంటి? కుందనమ్మ గారికి అసలు ఆమె ఏమవుతుంది? తను ఆ ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు? తన మనసులో ఇన్ని ఆలోచనలో మునిగి తేల్తున్నాడు తన కడుపులో విపరీతమైన ఆకలి వేస్తోంది, ఏదో ఓ రోజంతా ఉపవాసం ఉన్నవాడిలా. అసలు నిన్నంతా భోజనం చేసానా? అన్న సంశయం కలిగింది.
కొంత దూరం నడిచిన తరువాత వెనుక నుండి తనను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఆగి వెనక్కు తిరిగి చూసాడు. ఆయాస పడుతూ కుందన వస్తోంది. తనతో ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉండి గోపాల్రావు దగ్గరకు రొప్పుతూ చేరుకుంది.
“మీతో నన్ను కూడా తీసుకొని వెళ్ళరూ??” అని అడిగింది. గోపాల్రావు ధ్యాస ఎక్కడో ఉంది, ఆమె అడిగిన ప్రశ్నకు గోపాల్రావు దగ్గర జవాబు లేదు.
“మీరు ఏమీ అనుకోక పోతే ఒకటి అడుగవచ్చా?” అన్నాడు. కుందన పదే పదో వెనక్కు తిరిగి చూసుకుంటోంది.
”నేను ఇక్కడికి ఓ పని మీద వచ్చాను. రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత పొద్దున్న కుందనమ్మ గారికి ఇవ్వదలుచుకున్న దస్తావేజులు నా బ్యాగు లోచూస్తే కనపడటం లేదు రాత్రి. ఎవరైనా తీసారేమో తెలియడం లేదు? అంటూ
“నాకు తెలుసు మీరు తీసుండరని.” అన్నాడు ఆమె వైపుకు చూస్తూ.
“మీరు ఏ పని మీద వచ్చారో నాకు తెలియదు. ఇది వాస్తవం” అంది దీనంగా చూస్తూ.
అదీ నిజమేనని అనిపించింది.
గోపాల్రావు కు అయోమయ పరిస్తితి ఏర్పడింది. ఆమె తనతో వద్దామని ఎందుకు నిశ్చయించుకుందో అర్థం కాక “ మీరు నాతో ఎందుకు వద్దామనుకుంటున్నారో తెలియడం లేదు?
“నేను మీకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఇలా మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళడం సబబు కాదు” అంటూ ముందడుగు వేసాడు. కుందన చేతులు పట్టుకు ప్రాధేయ పడింది. విదిలించుకునే ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నాడు గోపాల్రావు.
“మన పరిచయం కొన్ని గంటలు మాత్రమే, మీరు ఎవరో నాకు తెలీదు. ఇలా మీరు నాతో వస్తాననడం అస్సలు భావ్యం కాదు” అన్నాడు మళ్ళీ. జారుతున్న పైటను సర్దుకొని అతని చేయ్యి పట్టుకొంది ప్రాధేయపడుతోంది. గోపాల్రావు బలవంతంగా ఆమె చెయ్యిని విదిలించుకున్నాడు. తిరిగి చెయ్యి పట్టుకుంది, ఆ ప్రయత్నంలో ఏం జరిగిందో తనకు సరిగా తెలీదు, నేల మీద పడ్డాడు, ఆమె బలంగా అతని మీద పడుతూ, అరుస్తూ నిప్పులు చిందిస్తున్న కళ్ళతో తన కళ్ళలోకి చూసింది. గోపాల్రావు కు ఏం జరిగిందో తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది. నిమిషంలో తను రోడ్డు పక్కన పడి ఉన్నాడు, కొంత సేపటికి కానీ తేరుకోలేక పోయాడు..
తన శరీరం ఆధీనం లోకి రాగానే చుట్టూరూ ఆమె కోసం గాలించాడు కానీ కుందన ఎక్కడా కనిపించలేదు. తన ఒంట్లో పరిస్తితి అదోలా ఉంది. ఆమె మాత్రం దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో కానరాని వింత అనుభవం, ఎన్నడూ తనకు అలాంటి అనుభూతి కలగలేదు.
ఆ ప్రదేశం నుండి ఎంత త్వరగా వెడిపోదామా అన్న ఆలోచనలో ఉన్నాడు. ఎదురుగా వస్తున్న వారిని బస్సు గురించి అడిగి, అక్కడకు చేరుకొని బస్సు రాగానే ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంటికి చేరుకున్నాడు. జరిగినదంతా ఓ పీడ కలలాగా జరిగిపోయింది.
గోపాలరావు తన గదిలో నుంచి ఓ రోజంతా బయటకు రాలేదు. అక్కడ జరిగినవి నెమరేసుకుంటూ ఆ గుర్రం బండి అతను జాగ్రత్త అన్న విషయంతో పిచ్చిగా పట్టినట్లుగా ఉంది. ఆ ఆలోచనలతో తన మెదడు చితికి చిన్నదైనట్లుగా ఉంది గోపాల్రావు కు.
కొడుకు ప్రవర్తన అదోలా ఉండటం గమనించారు తండ్రి, అదీకాక ప్రకాశం గారి పని గురించి ప్రస్తావించడం లేదు. గోపాల్రావు ను అడిగి తెలుసుకునే ఆస్కారం కూడా తండ్రికి ఇవ్వడం లేదు.
ఒకటి రెండు రోజులు గడిచాయి. గోపాల్రావు మానసిక పరిస్తితి చూసి ఇంట్లో దగ్గరవాళ్ళు ఆందోళన చెందారు. బయట వారు కూడా డాక్టరుకు చూపించమని సలహా ఇచ్చారు తండ్రికి. కొందరేమో గోపాల్రావు కు పిచ్చి పట్టిందన్నారు, మరికొందరు దెయ్యం పట్టిందన్నారు. గోపాల్రావు తండ్రి ఊరిలో తెలిసిన వారిని సంప్రదిస్తున్నారు.
గోపాల్రావు ఆరోగ్యం చూస్తే ఒక్కో సారి మనిషి ప్రవర్తన బానే ఉంటుంది, మరో సారి తన చేష్ఠల మీద తన ప్రమేయం లేనట్లుగా అనిపిస్తుంది..
ఆ రోజు తండ్రి గోపాల్రావు ను కలిసినపుడు ఆ దస్తావేజుల సంగతి అడిగాడు. గోపాల్రావు కు నోట మాట లేదు.
“ప్రకాశం గారు ఈ రోజు తిరిగి వస్తున్నారు. ఏదోకటి సమాధానం చెప్పకపోతే ఎలాగరా నాయనా?” అంటూ ఒక వైపు ఆ పరిస్తితిలో కొడుకును వదలాలని లేక పోయినా. ఇక్కడ ఉంటే తను కోలుకోవడం సాధ్యం కాదనిపించింది.
“పోనీ కొన్ని రోజులు పట్నం వెళ్ళి రాకూడదు” అన్నారు.
ఆ రోజే సాయంత్రం తను సామన్లు సర్దుకొని పట్నం వెడిపోదామని నిశ్చయించు కున్నాడు. హడావుడిగా తన సూటుకేసు సర్దుకొని బయలు దేరాడు. ఆ అకస్మాత్తు పరిణామానికి తండ్రి ఆశ్యర్యంతో ఆ రోజే వెళ్ళవద్దని వారిస్తూ, గోపాల్రావు వెడుతుంటే ఆయన కూడా వెనుక బయలు దేరాడు. ఇద్దరూ బస్టాండుకు చేరుకున్నాడు.
తండ్రి ఆవేదనతో పక్కనే నించొని ఉన్నారు. బస్సు కోసం వేచిచూస్తున్నారు. గోపాల్రావు తండ్రి ఓ రోజు క్రితం కొడుకుకి మంత్రం వేయించాలని పిలిపించిన మనిషి వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అతను ఒక్క సారి గోపాల్రావు కళ్ళలోకి చూస్తూ వేప ఆకులతో వళ్ళంతా పైనుండి క్రింద వరకూ రాసాడు.
“నాకు ఇలాంటివి అంటే నమ్మకంలేదు” అంటూ చిరాకు పడుతూ కొంత దూరం జరిగాడు గోపాల్రావు.
“నువ్వు వద్దన్నా నీతో వచ్చేస్తానంది కదూ? “ అన్నాడు. ఆ మాటలు గోపాల్రావు ను ఆశ్చర్యచకితుడ్ని చేసింది.
“నీ వెంటపడి నీ మనసులోకి చొచ్చుకు పోయింది” అన్నాడు.
“నేను ఇలాంటి పల్లెటూరు పద్దతులేం నమ్మను. పట్నం వెళ్ళగానే డాక్టర్ చూపించు కుంటాను” అన్నాడు గోపాల్రావు.
“నీ మనస్సును స్దిరంగా ఉంచు. నీ ఆలోచనలోనండి తనను వీడేలా చేసే బాధ్యత నాది” అన్నాడు
చేతిలోకి కుంకుమ తీసినుదుట పెట్టాడు, కొన్ని వేప ఆకులు తీసి ఒళ్ళంతా రాస్తూ, మంత్రాలు చదువుతూ, ఏదో లాగుతున్నట్లు ఉన్న అనుభూతి కలిగించాడు.
గోపాల్రావు కు తన శరీరంలో నుండి వేరే వ్యక్తి బలవంతగా వీడినట్లు అనిపించింది.
అతను అలానే చేస్తూ లాగుతూ తన చేతిలో ఉన్న బంధించినట్లుగా చేసాడు.
గోపాల్రావు కు భారం తగ్గినట్లు అనిపించింది. మామూలు మనిషి అయ్యాడని తనకే తెలుస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. జేబులోంచి హడావుడి గా డబ్బులు తీసి ఆ మంత్రం వేసిన ఆయనకు ఇచ్చి తండ్రిని కౌగలించుకొన్నాడు. ప్రకాశం గారు ఇటు దిగారు, అటు గోపాల్రావు ఎక్కాడు. ఆయన పలకరించినా గోపాల్రావు మాత్రం ఉలుకు పలుకు లేదు. క్షణంలో బస్సు కదిలింది.
గోపాల్రావు తండ్రి ప్రకాశం గారి సూటుకేసు అందుకొని “పదండి దారిలో నడుస్తూ అంతా వివరిస్తాను” అంటూ నడవటం మొదలు పెట్టారు. కొడుకు సంగతులు చెబుతూ ప్రకాశంగారి ఇంటికి చేరుకున్నారు.
కుందనమ్మ గారి ప్రస్తావన రావడంతో ఎదురుగా ఉన్న బల్ల మీద ఉంచిన దస్తావేజులను గోపాల్రావు ను తీసుకెళ్ళమని చెప్పినా, అవి ఇంకా అక్కడే ఉండటం గమనించారు.
“చూసారా దస్తావేజులు ఇంకా ఇక్కడే ఉన్నాయి, మీ వాడు ఇంతకీ తీసుకొని వెళ్ళి కుందనమ్మ గారికి ఇచ్చినట్లు లేదు” అన్నారు ప్రకాశం గారు.
“వాడు ఏ సంగతీ సరిగా చెబితే కదండి” అన్నారు గోపాల్రావు తండ్రి. కొన్ని రోజులుగా వేరే లోకంలో ఉన్నాడంటూ జరిగిందంతా వివరించాడు. ఇంతలో ప్రకాశం గారు గుమ్మం దగ్గర చప్పుడైయ్యింది. లేచి ప్రకాశం గారు అటు వెళ్ళి చూసి
“మీరు?” అని అడిగాడు.
“నన్ను కుందన అంటారు, నేను ఈడుపుగల్లు నుంచి వస్తున్నాను. కుందనమ్మ గారు పోయి రెండు వారాలు అయ్యింది. ఆ విషయం మీకు తెలియజేయమన్నారు” అంది ఆమె.
“మీరు లోపలకు రండి” అంటూ తన భార్యను పిలవడానికి లోపలకు వచ్చాడు.
ఆవిడ ఎంతకీ లోపలకు రావడం లేదని మళ్ళీ ఓ సారి బయటకు వెళ్ళి చూసారు. బయట ఎవ్వరూ కనిపించలేదు.
“ఇంతలోనే ఎలా అదృశ్యం ఎలా అవుతారు!” అనుకున్నాడు మనసులో.
గోపాల్రావు తండ్రితో పాపం కుందనమ్మ గారు ఇకలేరట. నేనే ఓ నెలలో వెళ్ళి స్వయంగా ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వస్తాను” అంటూ
“ఎలాగైనా ఈ పట్నం కుర్ర వాళ్ళకు పల్లెటూరు పద్దతులు నచ్చవు. మీ వాడు మళ్ళీ తిరిగి రావడం బహుసా కష్టమేమో” అన్నారు ప్రకాశం గారు
ఆ దస్తావేజులను తీసి జాగ్రత్తగా మళ్ళీ ఎదురుగా ఉన్న అల్మారాలో పెట్టారు.
“కుందనమ్మ గారి గురించి, ఆ ఇంటి గురించి అందరూ రకరకాలు గా చెప్పుకుంటున్నారు. ఇపుడల్లా ఆ ఇంటి గురించి మరిచిపోతేనే నయం” అంటూ సర్ది చెప్పారు గోపాల్రావు తండ్రి.
శుభం భూయాత్!
No comments:
Post a Comment