మనసా వాచా ....
-పెమ్మరాజు అశ్విని
తెల్లవారి వీధి గుమ్మం లో ముగ్గు పెడుతున్న సుందరి గారికి పొగ మంచు లోంచి ఆకుపచ్చ పసుపు చుడిదారి లో నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి కనిపించింది ,ఈ అమ్మాయి ఎవరా అని అనుకుంటుండగా మరుక్షణం లో వచ్చింది తన అక్క కూతురు అవంతి అని పోల్చింది ,అమ్మలు అవంతి ఏంటి రా ఇలా మేము గుర్తొచ్చాము అంటూ ఆట పట్టించింది ,తాను ఎంత నవ్వుతు అన్నా కూడా అవంతి లో స్పందన లేకపోవడం తో ఎదో తేడా ఉందని అర్ధమైంది.
ఇంతలో తెల్లవారే ఎవరితో మాట కలిపావోయ్ నాకు కాఫీ ఇచ్చేది ఉందా అంటూ గుమ్మం లోకి వచ్చారు గోపాలం గారు ఇంత లో అవంతి ని చూసి హే అమ్మాయి వస్తే గుమ్మము లో నే కబుర్లా అంటూ లోపలి కి తీసుకెళ్లి అమ్మాయి అల్లుడుగారు రాలేదా అంటూ అడిగారు ,లేదు బాబాయ్ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చి పిన్ని నీ చేతి కాఫీ తాగి ఎన్నో రోజులైంది ఇవ్వవు అని అడిగింది , "అయ్యో నా మతి మండ నిన్ను చుసిన సంబరం లో మర్చిపోయా వుండు వస్తా అఅంటూ వంట గది లోకి వెళ్లి ముగ్గురికి పొగలు కక్కుతున్న వేడి కాఫీ పట్టుకొచ్చారు . కమ్మటి కాఫీ తాగి పిన్ని నేను పడుకుంటా రాత్రి బస్సు లో నిద్ర లేదు అంది అవంతి ,నేను అలా వాకింగ్ పోయివస్తానోయ్ అంటూ బయల్దేరారు గోపాలం గారు .
అమ్మలు టిఫిన్ తినేసి పడుకో పొట్ట లో తిండి పడితే నిద్ర హాయిగా పడుతుంది నీకు ఇష్టమైన దోశలు వేసిస్తా కొబ్బరి పచ్చడి తో అంది "హయ్ దోసలే అయితే నేను సిద్ధం " అంటూ చిన్న పిల్లలాగా గారాలు పోయింది. స్నానం టిఫిన్ లు ముగించి కాసేపు పడుకుంది అవంతి ఇంత సేపటి నుంచి తన మొగుడి గురించి గాని మెట్టినింటి గురించి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త పడింది అవంతి. కానీ దాని వెనక ఎదో సమస్య దాగివుందని ఇట్టే పసిగట్టేసారు గోపాలం దంపతులు.
ఇంతలో సుందరి గారి ఫోన్ లో అల్లుడుగారు అనే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది,
"అత్తయ్యగారు అవంతి ......... ఏమైనా అక్కడికి ...... వచ్చిందా " అంటూ మెల్లిగా అడిగాడు వెంటనే సుందరి గారు అవంతి ఇక్కడే వుంది ఏమి అల్లుడుగారు మీకు చెప్పి రాలేదా తాను. అంటూ అడిగింది కంగారుగా "లేదు అత్తయ్యగారు నిన్న రాత్రి ఆఫీస్ పార్టీ వుంది కొంచెం లేట్ అవుతుంది అని మెసేజ్ పెట్టాను ,మీ ఇష్టం మీకు నచ్చింది చేస్కోండి అంటూ రిప్లై ఇచ్చి ఆ తర్వాత ఫోన్ ఆన్సర్ చేయలేదు ఎదో అలిగింది లే ఇంటికొచ్చి బుజ్జగించొచ్చు అనుకుని పదకొండు ఇంటికి వచ్చి చుస్తే ఇల్లు తాళం పెట్టి వుంది తన ఫ్రెండ్స్ కి తన తల్లితండ్రులకు,తమ్ముడు కి ఫోన్ చేసి అడగలేక అడిగాను వాళ్లకు తెలియలేదు కానీ అత్తయ్యగారు బహుశా మీ ఇంటికి వచ్చి ఉంటుందేమో అని ఇక్కడికి కాల్ చేశా ,తాను ఇక్కడ లేని పక్షం లో పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటూ ఆఖరి ప్రయత్నం గా మీకు కాల్ చేశా అంటూ బాధ తో చెప్పాడు.
అతని పరిస్థితి చూసి అయ్యో అల్లుడుగారు అవంతి ఇక్కడే క్షేమంగా వుంది మీరు ఇక్కడికి రండి ఆ తరువాతి సంగతి తరువాత చూద్దాం అని చేపి ఫోన్ పెట్టేసి టూకీగా విషయం అంతా గోపాలం గారికి చెప్పింది ,అప్పుడు గోపాలం గారు "నిజమే సుందరి పొద్దునుంచి అమ్మాయి పరాకు గా వుంది మునుపు వుండే చలాకీతనం లేదు రెండు మూడు సార్లు అడిగినా మాట దాటేసింది అవంతి చాల చురకైనది చక్కటి కనుముక్కు తీరు ,చలాకి మాటకారితనం,చదువులో ఎప్పుడు ముందుండేది ,తనంత తానె సొంతంగా ఉద్యోగం తెచ్చుకుంది ,ఆ మాట కొస్తే మన ఇంట్లో తాను ఇంటర్ చదివిన రెండు సంవత్సారాలు ఎంత కలివిడి గా అలవాటైందంటే నువ్వు నేను కూడా మన అమ్మాయి రాధి ని ఒక్కోసారి మర్చిపోయి అవంతి అని సంబోధించే వాళ్ళం ,దాంతో రాధి అలిగి కూర్చునేది గుర్తుందా."
ఆ మాట విని సుందరి "హా అవును ఇద్దరు ఒక ఈడు వాళ్ళే బావగారి ట్రాన్స్ఫర్ రీత్యా అవంతి మన రాధి తో నే చదువుకుంది ఇంటర్మీడియట్ , రాధి బీఎస్సీ చేస్తే అవంతి బీకామ్ చేస్తూ సీఏ పూర్తి చేసింది హైదరాబాద్ లో నే ఒక మంచి కంపనీ లో ఉద్యోగం అక్కడే సుధీర్ పరిచయం ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు నిండా మూడు సంవత్సరాలు కాలేదు ఇంతలోనే ఇలా కొట్టుకుని ఏంటండీ ఇదంతా ,పోనీ రాధి ని రమ్మని చెపుదామా అని అడిగింది "
"వద్దు సుందరి సుధీర్ ని రాని అసలు విషయం తెలిసాక చూద్దాం ,అయినా మనం ఉండేది గుంటూరు దగ్గర వినుకొండ రాధి ఉండేది బెజవాడ అంత గా అవసరం అయితే మూడు నాలుగు గంట ల్లో వచ్చేస్తుంది గా ఇప్పుడు మళ్ళి రాధి వచ్చేస్తే వాళ్ళాయన కృష్ణ కి ఇబ్బంది ,సుధీర్ ని హైదరాబాద్ నుండి రాని అప్పుడు చూద్దాం అంత వరకు నువ్వు అవంతి నేమి అడగకు ".
ఇంతలో పిన్ని ఇంకో రౌండ్ కాఫీ ఇస్తావా అంటూ హాలు లోకి వచ్చింది అవంతి "అలాగే మహారాణి తమరి ఆజ్ఞ కె వేచి వున్నాం అంటూ నాటక ఫక్కీ లో చెప్పేసి నవ్వుతు కాఫీ పెట్టి ఇచ్చింది ,పిన్ని ఇవాళ వంట నేను చేయనా అంటూ అడిగింది అవంతి "ఇద్దరం కలిసే చేద్దాం రా మరి ఇంకాసేపు ఆగితే మీ బాబాయ్ ఆకలి అంటూ ఇల్లు పీకి పందిరి వేస్తారు అసలే కిష్కిందా పురి అగ్రహారీకులాయే "అంటూ గోపాలం గారి మీద చమత్కార బాణం వేసింది ఆవిడ. వారి ఇద్దరి సరసాలు చూసి అవంతి కి ముచ్చటగా అనిపించింది..
వంట పని చేస్తూ ఇంతకీ మీ అత్తమామలు ఎలా వున్నారు ఎక్కడ ఉండేది మీ ఆడబిడ్డ ఉండేది కాన్పూర్ కదా ఈ మధ్యలో ఫేస్బుక్ లో చూసావా మంచి ఫోటోలు పెట్టింది ,ఇంతకీ నువ్వు అసలు ఈ మధ్య ఉలుకు పలుకు లేదు అంత బానే ఉందా ,ఇంట్లో ఒంట్లో ఉద్యోగం లో అంటూ అవంతి కేసి చూసింది సుందరి "
అప్పటికే అవంతి మొహం గంబిరంగా మారి పోయింది" హా ఎదో నడుస్తోంది లే పిన్ని ఎప్పుడు ఉండేదే నిత్యం గజిబిజి బతుకులు ఒకరి మొహం ఒకరి చూసుకునేది వీకెండ్ ఒకటే అది కూడా ఈ కార్పొరేట్ కల్చర్ దెబ్బకి వీకెండ్ లు పార్టీ ల పేరు చెప్పి ఆ కాస్త టైం కూడా ఏకాంతం ఉండదు పేరు కే వంటరి కాపురం. కనీసం ఉమ్మడి కుటుంబం అయ్యి ఉంటే ఒంటరి తనమైన పంచుకునే వారు వుంటారు . దీని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలైన అందరిలో బాగోదు అని సర్దుకోవడమో,లేకపోతె ఏ పెద్దవారో చుప్ మేమెలిగే పెంచామా మిమల్ని సర్దుకోవడం రాకపోతే ఎలాగ అని మందలిస్తే ఊరుకునే వారు ,ఇప్పుడు మాకు కొట్టుకోవడానికి బోలెడు సావకాశం అందుకే మా సంసారాలో కి స్మార్ట్ ఫోన్స్, సామాజిక మాధ్యమాలు ,కొందరు స్నేహితులు అత్తగారు ఆడపడుచు,తోడికోడళ్ల పాత్ర పోషిస్తున్నాయి అంటూ ముభావంగా చూసింది పిన్నికేసి .
అవంతి సమస్యేంటో టూకీగా అర్ధమైంది గోపాలం దంపతులకి ,"సరే ఈ సమస్య కి సూక్తిముక్తావళి పనిచేయదు ఎందుకంటే అవంతి సుధీర్ ఇద్దరు బాగా చదువుకుని మంచి విజ్ఞత కల వారు దంపతుల మధ్య అప్పుడప్పుడు కనిపించే ప్రేమరాహిత్యపు చిహ్నాల వల్ల ఏర్పడే ఖాళి వీరి మధ్య ఏర్పడినది కాబట్టి దీనికి మార్గం ఆ ఖాళి ని వారి ప్రేమతో నింపుకునే వీలు ఇస్తే సరి" ఏమంటావు సుందరి అని అడిగారు గోపాలంగారు. అవును అండి నిజం చెప్పారు ఎలాగూ నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ కదా అందుకే ఇద్దర్ని ఇక్కడే వుండమందాం మన ఇద్దరి తో ఉంటే వాళ్ళే సరిపెట్టుకుంటారు. "
ఆ రోజు సాయంత్రానికి సుధీర్ వచ్చాడు రాగానే దోషి లాగ తలదించుకుని వున్నాడు ,ఇటు సుందరి గాని అటు గోపాలం గాని ఏమి జరగనట్టే వున్నారు రండి అల్లుడుగారు అంటూ ఆధారంగా ఆహ్వానించారు ,సుందరి అల్లుడు కి నీ చేతి కాఫీ రుచి చూపించు అంటూ సుధీర్ కేసి తిరిగి పొగుడుతున్న అనుకోకపోతే అల్లుడు మీ అత్తగారి కాఫీ కి సాటి రాదూ తెలుసా నాకు ఇష్టమని ఎప్పటికప్పుడు ఫిల్టర్ తీస్తుంది అంటూ పొగడ సాగాడు ,ఇంతలో అక్కడి కి వచ్చిన అవంతి ని " అమ్మడు మీ ఆయనకి ఏమి ఇష్టమో చెప్పు చేద్దాం భోజనం లోకి రా "అంటూ చేయి పుచ్చుకు వంటింట్లోకి తీస్కెళ్లిపోయింది.
భోజనాల దగ్గర సుందరి గోపాలం గారికి కొసరి కొసరి వడ్డించి ఇద్దరు పరాచకాలు ఆడుకోసాగారు ,వాళ్ళని మురిపెంగా చూడసాగింది అవంతి అంతసేపు సుధీర్ అవంతి మధ్య చూపుల యుద్ధం జరుగుతోంది,ఇంతలో అల్లుడు నాలుగు రోజుల్లో సంక్రాంతి ఎలాగూ మా అమ్మాయి అల్లుడు కూడా వస్తారు కాబట్టి మీరు అవంతి పండగ ఇక్కడే చేస్కోండి మా ఊరిలో సంక్రాంతి మీ సిటీ లో లాగ కాదు అదిరిపోతోంది ఏమంటారు అన్నారు గోపాలం గారు, పెద్దవారి మాట కాదనలేకపోయాడు సుధీర్ .
మర్నాడు రాధీ కృష్ణ కూడా వచ్చారు దానితో ఇల్లంతా పండగ వాతావరణం మగవాళ్ళు ముగ్గురు హాల్లో ,ఆడవారు కాసేపు వంట కాసేపు పేరంటం ఇలాగ పగలంతా గడిచిపోయింది అక్కడ వున్న నాలుగు రోజులు వారికి వాదించుకోడానికి కొట్టుకోడానికి ఆస్కారం లేదు,నెమ్మదిగా సుధీర్ కి తాను అవంతి ని చిన్న చిన్న సంతోషాల నుంచి ఎలా దూరం చేస్తున్నాడో తానూ ఎంత యాంత్రికంగా తయారయ్యాడో అర్ధమవ్వసాగింది అలాగే అవంతి కి కూడా భర్త ని ఎలా లాలించి బుజ్జగించాలో తన పిన్ని ప్రవర్తన వల్ల అర్ధమవసాగింది . పిన్ని ఎప్పుడు బాబాయ్ మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం లో అరవదు ,మెల్లిగా "మీరు ఊరుకోండి ఎదో అప్పటికి అలా చేసేసా ఈసారికి సర్దుకుందాం అంటూ నచ్చచెబుతుంది" . పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్టు వుంటారు పిన్ని చేసే పనుల్లో లోపాల్ని తన చతురత తో చెప్తాడు బాబాయ్ ,బాబాయ్ మీద చిరుకోపం వచ్చినా సర్దిపుచ్చుకుని సమయం చూసి చమత్కార బాణాల తో చురకలు వేస్తుంటుంది .
సంక్రాంతి రోజు ఊరిలో జరిగే జాతర దగ్గరకి వెళ్లి అంతా సరదాగా గడిపారు ,రాధి కృష్ణ కూడా మంచి జోడి ఒకరి మీద ఒకరి ఛలోక్తులు వేసుకుంటూ సరదాగా వుంటారు ,కనుమ రోజు అవంతి కోరిక మేరకు అందరు మంగళగిరి వెళ్లి పానకాల స్వామి ని దర్శించుకున్నారు అక్కడి నుండి రాధి కృష్ణ కూడా వారింటికి బెజవాడ వెళ్లిపోయారు. వీరు తిరిగి వినుకొండ వచ్చేసారు.ఆ రోజు రాత్రి అవంతి సుధీర్ ని ఒక దగ్గర ఉండేలాగా వదిలేశారు గోపాలం దంపతులు .
ఆ గది లో ఒక పావుగంట మౌనం నడిచింది చాలా సేపు తర్వాత "అవంతి నేను నిన్ను నెగ్లెక్ట్ చేశా కదా సారీ మా నువ్వు వాదించిన ప్రతిసారి నీ మాట లో అహం చూసాను తప్ప నీ బాధ లో లోతు గమినించలేదు గోపాలం మావయ్యగారిని చూసాక భార్యని ఎంత మురిపెంగా చూడాలో తెలిసింది ఇక మీదట పార్టీ లు అని ఫ్రెండ్స్ అని నిన్ను ఒంటరి దాని చేయను నన్ను క్షమించవు అంటూ మాట ముగించేలోపు అవంతి వచ్చి సుధీర్ ని హత్తుకుని " నన్నే క్షమించండి మీకు మంచి గా నా బాధ ఎలా చెప్పాలో తెలియక అరిచి సాధించేదాన్ని అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు " అలా అవంతి సుధీర్ ల మధ్య మనసులో దూరం కరిగిపోయింది .
ఇంతలో అమ్మాయి భోజనాలు చేద్దాం వస్తారా అంటూ కేకేసింది సుందరి గది లో నుంచి తేలిక పడిన మనసులతో చిరునవ్వుతో ఇద్దరు భోజనాల దగ్గరికి వచ్చారు .వారిని చూసి గోపాలం గారు సుందరి గారు తమలో తాము హమ్మయ్య తుఫాన్ తీరం దాటింది ఇక అన్ని నవ్వుల్ల విరిజల్లులే అనుకున్నారు.
***
No comments:
Post a Comment