ఓ మనిషీ..... ఇకనైనా మేలుకో ! - అచ్చంగా తెలుగు

ఓ మనిషీ..... ఇకనైనా మేలుకో !

Share This
ఓ మనిషీ..... ఇకనైనా మేలుకో !
పరిమి నిర్మల


ఆకాశానికి చిల్లు పడిందా; 
నింగీ నేలా ఏకమయిందా
చెరువుల గుండెలు చెరువయ్యాయా; 
ఊళ్లే చెరువుల తలపించాయా
ఆశకు హద్దులు లేకున్నాయా; 
హద్దుల హద్దులు చెరిపేసారా
మానూ మాకూ మాయమయ్యాయా; 
మండే సూర్యుడు చేరువయాడా
గాలీ ధూళీ ఒకటయ్యేనా; 
స్వచ్ఛత శుభ్రత కనుమరుగేనా
నదులూ సరస్సులు కాల్వలనీరూ,
 సాగరగర్భము విషమయమేనా !?

ఔరా.....!
స్వార్ధం మనసును మాయ చేసెనా; 
మనుజుని నైజం వికటమాయెనా
మేధే మనిషికి శత్రువాయెనా; 
విజ్ఞతనేదే కొరవడివోయెనా
ప్రకృతినే మరి ధిక్కరించేనా; 
ప్రాణం విలువ శూన్యమాయెనా !?

ఔనా ......!
విలయం వృద్ధికి సమాధానమా; 
ప్రగతికి మూల్యం ప్రపంచనాశమా !?

అకటా..... !
చింతా చింతన మరచిన 
మనుజుని  చింతను ప్రకృతి  విలపించేనా
కరిగే కొండలు, రగిలే సూర్యుడు,
ఎగసే కడలి, కురిసే మొయిలూ
ప్రకృతి చింతకు అద్దం పట్టెనా !?
అలవిగాని ఆ ఆవేదనయే
ప్రళయమై మనల ముంచకమునుపే…
పెనుఉప్పెన రూపును దాల్చేలోపే…..
దావానలమై కాల్చేలోపే…….
కరువు తాండవం ఆడేలోపే………

ఓ మనిషీ !
ఇకనైనా నువు కనులు తెరువుమా
మేలుకొలుపునకు నాంది పలుకుమా
పచ్చదనానికి పీట వేయుమా
ప్రకృతి వనరుల పరిరక్షించుమా
జీవరాసిపై కరుణ చూపుమా

ఒక్క మాటలో.....
భావితరాలను బ్రతుకనివ్వుమా !
ఓ మనిషీ !
భావితరాలకు భవితనివ్వుమా !!

1 comment:

  1. Very apt. If only people wakeup from their slumber, to do something to protect mother earth

    ReplyDelete

Pages