నెల 'వంక' - అచ్చంగా తెలుగు
నెల'వంక '
కంభంపాటి రవీంద్ర 

నేను హైదరాబాద్ వచ్చి పదేళ్లవుతూంది. యూఎస్ నుంచొచ్చి చెన్నై లో ఉద్యోగం వెలగబెడుతూంటే , చుట్టాలందరూ ఆ తమిళాళ్ల మధ్యన ఏముంటావ్ .. ఎక్కడ  చూసినా సాంబార్ కంపు తప్ప హాయిగా హైదరాబాద్ వచ్చేద్దూ అంటూంటే హైదరాబాదులో ఉద్యోగం రాగానే సామాన్లన్నీ సర్దేసుకుని వాలిపోయేను .
హైదరాబాద్ ఎప్పుడొస్తావు అన్న చుట్టాలెవ్వరూ నన్ను కలవడానికి ఎప్పుడూ రాలేదు గానీ , నా కాలేజి  ఫ్రెండొకడు 'మియాపూర్ లో ఉంటున్నాను , ఇక్కడికైతే మీ ఆఫీసు దగ్గరవుతుంది , నువ్వూ ఇక్కడికొచ్చేయి ' అంటే వాడుంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే ఫ్లాట్ తీసుకున్నాను .  మా ఆవిడా , పిల్లలు స్కూలు పరీక్షలు మార్చి లో అయ్యాక, హైదరాబాద్ వచ్చేలా ప్లానేసుకున్నాం .
సరే వచ్చి హైదరాబాద్ లో పడ్డాను కానీ , మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక్కడూ తెలుగు మాటాడేవాడు కాదు . సగం జనం హిందీ వాళ్ళు , తమిళం గట్రా , మిగతా సగం తెలుగు . ఈ మిగతా సగం బ్యాచి ఉందే ..అక్కడే అసలు చిక్కు ఉండేది . 'ఏమండీ బావున్నారా ?' అని ఎవరినైనా పలకరిస్తే చాలు , చిరాగ్గా మొహమెట్టుకుని 'యా ఫైన్ ' అనేసి , వచ్చీ రాని హిందీలో ఆ హిందీ వాళ్ళ వెంటపడేవారు. ఇంక ఇవన్నీ ఒకెత్తయితే , చుట్టుపక్కల ఎక్కడా ఉదయాన్నే సరైన హోటలన్నది లేదు , దగ్గర్లో దగ్గర ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న కూకట్ పల్లి కి వెళ్ళాలి. పోనీ అక్కడేమైనా సరైన తిండి దొరుకుతుందా అంటే ఏదీ పెద్ద రుచిగా ఉండే హోటళ్లే లేవు ! సరిగ్గా ఈ విషయంలోనే చెన్నై ని మిస్సవ్వడం మొదలెట్టేను . అప్పటికీ మా ఫ్రెండొకడు మాంఛి తెలుగు భోజనం దొరుకుతుందని చట్నీస్ అనే హోటల్ కి తీసికెళ్ళేడు . ఓహో.. రకరకాల చట్నీలుంటాయనుకుంటే చిన్నప్పుడు మా మామ్మగారు కొబ్బరి కోరు తీస్తూ , మాక్కొంచెం పందార కలిపెట్టేవారు , అలాంటి కొబ్బరికోరు పందారా కలిపి ఓ చెట్నీ, వేరుశెనగ చెట్నీ , టమాటో చెట్నీ , అలాగే మొక్కజొన్న గింజలతో ఓ చెట్నీ (దీన్ని స్టయిల్ గా కార్న్ చెట్నీ అంటాడు ) ఉన్నాయి తప్ప హమ్మయ్య ఇది మన తెలుగువాళ్ళ హోటల్ అనే భావం మటుకు రాలేదు . ఈ ఊరొచ్చి పదేళ్లయినా అలాంటి అచ్చ తెలుగు హోటలేదీ చూడలేదు మరి ..అంటే రాయలసీమ రుచులు  లాంటివి ఉన్నా , నేను నాన్ వెజ్ తినను మరి .
సరే అసలు సంగతేంటంటే మా మియాపూర్ హైవే పక్కన ఓ పాక హోటల్ పెట్టాడొకడు . పేరు కోనసీమ టిఫిన్స్ ! ఓసారి ఆఫీసునుంచొస్తూ ఆ బోర్డు చూసి , 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ..ఈనాడే ఎదురౌతూంటే ' అని పాడుకుంటా ఇంటికెళ్లి రాత్రంతా 'ఇంకా తెలవారదేమీ .. ఈ చీకటి విడిపోదేమీ ' అని సూర్యుణ్ణి మొత్తుకుని ఉదయాన్నే ఆ హోటల్ కి వెళ్లి బెంచీ మీద కూర్చుని 'ఒక పెసరట్టుప్మా , ఆ తర్వాత ఒక రవ్వ దోశ ' అన్నాను . 'అవేం లేవ్ .. జర వెయిట్ చేస్తే ఇడ్లి పెడతం ' అన్నాడు . వీడేమిటీ కోనసీమ అన్నాడు , తెలంగాణా యాస మాట్లాడుతున్నాడు అనుకుని 'పోనీలెండి .. ఆ ఏదుంటే అదే ' అన్నాను .
ఓ ప్లేటులో ఇడ్లి పెట్టి , 'చాయ్ గావాల్నా ?' అన్నాడు ఒద్దని చెప్పాను .
సరే ఆ కుర్రాడికి బిల్లు డబ్బులు ఇస్తూ కోనసీమ లో మీరెక్కడ్నుంచేమిటి ? అని అడిగితే , 'మాది జహీరాబాద్ ' అన్నాడు .
'మరి కోనసీమ అని పేరెట్టేరు ?' అని అడిగితే 'కూకట్ పల్లి గోదావరి టిఫిన్స్ లో పన్జేసేటోన్ని .. మా ఓనర్ సెప్పిండు .. "పేరు మంచిగుంటే జనం మస్తుగొస్తరే అని " గందుకే గీ పేరు పెట్టిన ' అన్నాడు
'మరా గోదావరి టిఫిన్సాయనాది ఏ వూరు' అని అడిగితే 'గా సార్ నిజామాబాద్ నుంచొచ్చిండు ' అనేసెళ్లిపోయేడు !
***

No comments:

Post a Comment

Pages