పిల్లికి చెలగాటం
పెయ్యేటి రంగారావు
చెంగయ్య మండుటెండలో తాటాకు గొడుగు కింద కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ బతుకు బండి లాగిస్తున్న ఒక బడుగు జీవి. ప్రభుత్వాలు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇస్తామని, వడ్డీ లేకుండా ఋణాలు ఇప్పిస్తామని చాలా ప్రకటనలు చేస్తూ వుంటారు. కాని చెంగయ్యకు ఎవరిని సంప్రదించాలో, ఎలా లభ్ధి పొందాలో తెలీదు. అతడి భార్య దినసరి కూలిపనికి వెళ్ళి ఇంతో అంతో సంపాదిస్తూ వుంటుంది. వారికి ఒక మగపిల్లవాడు. అతడి పేరు కెనెడీ. అతడు పుట్టినప్పుడు ఒక ఫాదర్, అమెరికా అధ్యక్షుడంతటి వాడవుతాడు, వీడికి కెనెడీ అని పేరు పెట్టమంటే చెంగయ్య సంతోషంగా ఆ పేరే ఖాయం చేసేసాడు. తనలాగ తన కొడుకు మండుటెండలో కష్టపడకూడదని, వాడిని ఎలాగయినా మంచి చదువులు చదివించాలని చెంగయ్య దృఢంగా నిశ్చయించుకున్నాడు. అప్పటినించి మరింత కష్టపడుతూ నాలుగు రాళ్ళు కూడబెడుతూ వుండసాగాడు. అనుకున్నట్లే కెనెడీకి అయిదో ఏడు రాగానే వాడిని ప్రభుత్వపాఠశాలలో చేర్చాడు. కెనెడీ చాలా చురుకైన కుర్రాడు. ఏకసంథాగ్రాహి. ఉపాధ్యాయులు ఏమి చెప్పినా చటుక్కున గ్రహించేసే వాడు. వాడి తెలివితేటలు చూసి ఉపాధ్యాయులు కూడా అబ్బురపడి, వాడి మీద ప్రత్యేక శ్రధ్ధ కనపరిచేవారు. అలా వాడు ఒక్కొక్క తరగతిని దాటుకుంటూ టెన్త్ క్లాసులోకి వచ్చాడు. వాడి ధ్యాసంతా చదువు మీదే. ఏమయినా సరే, స్టేట్ ఫస్ట్ రావాలని వాడి కోరిక. అహోరాత్రాలు కష్టపడి చదివి పరీక్షలు రాసాడు. పరీక్షా ఫలితాలు రేపు పత్రికలలో వెలువడతాయనగా, గార్గేయకళాశాల వారు వచ్చి, చెంగయ్యకు లక్షరూపాయలు ఇచ్చి, కెనెడీ ఫొటో తీసుకుని వెళ్ళారు. మర్నాడు స్టేట్ ఫస్ట్ వచ్చిన కెనెడీ తమ కళాశాలలోనే చదివాడని పూర్తి పేజి ప్రకటన అన్ని వార్తాపత్రికలలోను పడింది.
అక్కడినించి అతడి చదువు అప్రతిహతంగా సాగి, జె.ఎన్.టి.యూ. లో సీటు దొరికి, 'ట్రిపుల్ ఇ' ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ఫైనల్ ఇయర్ చదువుతూండగా, క్యాంపస్ సెల్క్షన్స్ లో సెలెక్ట్ అయి మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. చెంగయ్య, అతడి భార్య యాదమ్మ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. వాళ్ళు చాలా మురిసిపోయారు. ఇంకా చదువు పూర్తి కాకుండానే ఉద్యోగం ఆఫర్ రావడంతో వాళ్ళ సంతోషానికి హద్దు లేదు. చర్చికి వెళ్ళి ఏసుప్రభువుని ప్రార్థించుకుని వచ్చారు.
కెనెడీ ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా చక్కగా రాసేసాడు. ఇంక ఫలితాలు రాగానే ఉద్యోగంలో చేరడమే తరువాయి. అప్పుడు అజయ్ దేభ్యా అనే ఒక బడా పారిశ్రామిక వేత్త కారులో వారింటికి వచ్చాడు. చెంగయ్య కంగారు పడిపోయాడు, అంత కోటీశ్వరుడు మురికివాడలోని తన ఇంటికి రావడమేమిటా అని. విషయమేమిటంటే దేభ్యా తన ఒక్కగానొక్క కూతుర్ని కెనెడీకిచ్చి వివాహం చేసి ఇల్లరికం తీసుకెడతాడట. కెనెడీ ఒప్పుకోలేదు. కాని, చెంగయ్య, యాదమ్మ అతడిని శతవిధాల ఒప్పించి ఆ పెళ్ళికి అంగీకరించేలా చేసారు. అజయ్ దేభ్యా తన పలుకుబడితో అనేక బ్యాంకులకు టోపీ వేసి కోట్లు కోట్లు ఋణాలు తీసుకుని ఎగవేసిన ఘరానా మనిషి. అతడు చెంగయ్య చేతిలో ఇరవయి అయిదు లక్షలకి చెక్కు రాసి ఉంచాడు. చెంగయ్య అంత మొత్తం చేతులోకి వచ్చేసరికి, నిర్ఘాంత పడి, బిక్కమొహం వేసి 'ఏందయ్యా ఇది?' అని అడిగాడు. అజయ్ దేభ్యా చిరునవ్వు నవ్వి, 'ప్రస్తుతానికి ఇది ఉంచు చెంగయ్యా. పెళ్ళి ముందు మరొక కోటి రూపాయలు నీకు కట్నంగా ఇస్తాను.' అన్నాడు.
చెంగయ్య యాదమ్మ మొహం కేసి చూసాడు. ఆమె మొహంలో భావాలను ఇట్టే చదివాడు. ఎంతయినా యాదమ్మ తన భార్య అని ఆనందపడ్డాడు. ఆ చెక్కుని తిరిగి దేభ్యా చేతిలో పెడుతూ, 'ఏమనుకోకండయ్యా, మా బాధ్యత కనుక కష్టపడి కెనెడీని చదివించి ప్రయోజకుడిని చేసాము. అంతేగాని లాభాన్ని ఆశించి కాదయ్యా. వాడిని సంతలో పశువుని అమ్మినట్లు అమ్ముకోలేము. వాడి భవిష్యత్తుని దృష్టిలో వుంచుకుని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము. వాడు సుఖంగా వుంటే మాకంతే చాలయ్యా.' అన్నాడు కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతూండగా.
చెంగయ్య, యాదమ్మలు ఏసుప్రభువుకు ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంక కొద్దిరోజులే! కెనెడీ మంచి ఉద్యోగంలో చేరతాడు. కోటీశ్వరుడికి అల్లుడవుతాడు. అతడి భవిష్యత్తు అంతా ఇంక బంగారుమయమే!
***
దొంగా వీరానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు, బొగ్గుగనుల కాంట్రాక్టులు, బోఫోర్స్ తుపాకుల ఏజెన్సీ, ఇంకా మరెన్నో నల్లబజారు వ్యాపారాలలో ఇబ్బడి ముబ్బడిగా కోట్లు కోట్లు సంపాదించి విదేశాలలో ఉన్న బ్యాంకులలో కాతాలు తెరిచి అక్కడికి ఈ కోట్లన్నీ తరలిస్తూ వుంటాడు. అతడికి అన్ని పార్టీలవారితోను సత్సంబంధాలున్నాయి. ఎన్నికలొచ్చాయంటే అన్ని పార్టీల వారికి కోట్లలో విరాళాలు కురిపిస్తూ వుంటాడు. అందువల్ల అతడి జోలికి ఎవరూ పోరు. అతడి ఇంటినిండా, బ్యాంకు లాకర్ల నిండా బంగారం, వజ్రాలు, జమ అవుతూ వుంటాయి. అతడికి గధా వీరానీ అన్న కొడుకు, పాజీ వీరానీ అన్న కూతురు ఉన్నారు. వాళ్ళంటే అతడికి ఎంతో గారం. వాళ్ళకి పాకెట్ మనీ కింద నెలకి చెరొక లక్షరూపాయలు ఇస్తూ వుంటాడు. వాళ్ళు ఏ పార్టీలకి వెళ్తూ వుంటారు, వాళ్ళ స్నేహితులెవరూ అన్న విషయాలేవీ అతడు పట్టించుకోడు. వాళ్ళిద్దరికీ చెరొక కోటిన్నర పెట్టి మంచి లగ్జరీ కార్లు కొని ఇచ్చాడు. వాళ్ళు సరదాగా మాత్రమే కాలేజీలకి వెళ్తూ వుంటారు. సాయంత్రం అయ్యేసరికి స్నేహితులతో కలిసి పబ్ లకి, పార్టీలకి వెళ్తూ వుంటారు. అక్కడ వాళ్ళకి నెమ్మదిగా డ్రగ్స్ కూడా అలవాటు అయ్యాయి.
ఆరోజు గధా వీరానీ పుట్టినరోజు. ఇంట్లో చాలా ఘనంగా జరిగింది. సాయంత్రం తన స్నేహితులందరికీ ఘనంగా నోవాటెల్ హోటల్ లో పార్టీ అరేంజ్ చేసాడు. అందరూ మందు, మాంసంతో ఆనందంగా పార్టీ జరుపుకున్నారు. ఆ రోజు గధా వీరానీ కాస్త మందు ఎక్కువగానే సేవించాడు. పార్టీ పూర్తయినాక తన లగ్జరీ కారుని వంకర టింకరగా, విపరీతమైన వేగంతో నడుపుకుంటూ వెళ్తున్నాడు. చూపు సరిగ్గా ఆనటల్లేదు. అయినా వేగం తగ్గించలేదు. పొగరుగా నడుపుకుంటూ, నడుపుకుంటూ పోయి, స్టీరింగ్ మీద కంట్రోలు తప్పి, రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకి కారు పోనిచ్చేసాడు. అక్కడ ఒక గుడిసె మొత్తం ఛిన్నాభిన్నమై పోయింది. అందులో నిద్రిస్తున్న కెనెడీ మీదుగా కారు వెళ్ళడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. చెంగయ్యకు కాళ్ళు రెండూ తెగిపోయాయి. యాదమ్మకు కొద్దిపాటి దెబ్బలు తగిలాయి.
మర్నాడు పోలీసులు ఆ కారుని సీజ్ చేసారు. ఆ కారు నడిపిన వీరయ్య అనే డ్రైవర్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అతడి మీద కేసు నడిచి అతడికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. అతడు జైలు జీవితం గడిపి, బయటకు వచ్చి దొంగా వీరానీ ఇచ్చిన రెండు లక్షల రూపాయలతో జల్సా చేసుకున్నాడు.
టి.వి.లో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు సందేశం ఇస్తున్నారు. బడుగు వర్గాల అభ్యున్నతికే మా పార్టీ కట్టుబడి వుంది. దేశంలోని నల్లధనాన్ని మొత్తం మేము బయటికి లాగి, ఆ సొమ్ము పేదవాళ్ళందరికీ పంచి తీరతాము. జై హింద్!, జై హింద్!! జై హింద్!!!
చెంగయ్య ఎప్పటిలా నడుచుకుంటూ కాక క్రచెస్ సాయంతో కుంటుకుంటూ పోయి తాటాకు గొడుగు కింద కూర్చుని చెప్పులు కుట్టే పని సాగిస్తున్నాడు. అతడి భార్య యాదమ్మ ఎప్పటిలాగే దినసరి కూలి పనులకి పోసాగింది.
***
No comments:
Post a Comment