పుష్యమిత్ర - 26
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
(జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు. బాబాజీ గుహలోకి ప్రవేశించి ఒక పేటికను సిద్ధం చేశాడు. పుష్యమిత్రుడు బాబాజీ ఆదేశాలమేరకు లోపల పవళించాడు. ఒక మెరుపుతీగ వంటి కాంతి పుంజం దానిపైబడి పేటిక మొత్తం ఒక నాళికలా తయారయింది. ఆ నాళిక గాలిలో తేలుతూ హిమాలయాలవేపుకు సాగిపోయింది. భారత ప్రభుత్వం వారు పుష్యమిత్రుని పేటికను తెరచి బయటకు తీసి ఆయనకు హిందీ మొదలైన భాషలను నేర్పిస్తారు. క్రమంగా మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. భరతఖండంలో ధనానికి సమస్యలేదని పుష్యమిత్రుడు అనడంతో ఆర్ధికసూత్రాల ప్రకారం బంగారం నిల్వల ప్రకారమే నోట్లు ముద్రించాలని చెప్పిన ప్రధాని మాటలకు అలోచనలో పడతాడు. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర. (ఇక చదవండి)
కొన్ని వేల మణుగుల బంగారం భూగర్భంలో ఉన్న విషయం విన్న ప్రధానికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఒకవేళ ఆ విషయం నిజమై బంగారం బయటపడితే భారతదేశం అన్ని విషయాల్లోనూ సుసంపన్నం అవుతుంది. ఏవిధంగా నైనా ఆ బంగారాన్ని వెలికిదీయాలి అనుకుంటూ నిద్రించాడు.
మరునాడు ఉదయాన్నే ఆర్ధిక మంత్రిని పిలిచి విషయం చెప్పగానే ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచాలని, పుష్యమిత్రుడిని తీసుకుని ఒక హెలికాప్టర్ సహాయంతో వెదక వచ్చునన్న సలహాకు అంగీకారం తెలుపుతాడు ప్రధాని. పుష్యమిత్రునితో కేవలం ప్రధాని, ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ మాత్రమే వెళ్ళాలని ఆ యాత్ర కేవలం విహార యాత్రగా ప్రకటించలని నిర్ణయం తీసుకుంటారు.
"రండి పుష్యమిత్రా! నేను మీతో ఆంతరంగికంగా మాట్లాడాలనే మీకు కారు పంపాను" అన్నడు ప్రధాని పుష్యమిత్రుడు రావడంతో లేచి స్వాగతిస్తూ. అది ప్రధాని రహస్య సమావేశ మందిరం. "శుభం" అంటూ కూర్చున్నాడు.
"సూటిగా విషయం మాట్లాడుకొందాం. నాకు గంట తర్వాత క్యాబినెట్ సమావేశం ఉంది" అన్నాడు ప్రధాని. మౌనంగా వింటున్నాడు పంచాపకేశన్.
"చెప్పండి".
"మీరు రహస్యంగా దాచిన బంగారం మనం వెలికిదీయగలిగితే మన భరతఖండం సుసంపన్నమౌతుంది"
"నిజమే! అన్నివేల సంవత్సరాల క్రితం దాచిన గుహ ఎక్కడుందో వెదకడం అంత సులువు కాకపోవచ్చు. పైగా పాకిస్తాన్ దేశం విడిపోయింది. ఆ భూభాగంలో ఉన్న గుహ అయితే మనం ఏమి చెయ్యాలో కూడా ఆలోచించుకోండి" అన్న మాటతో అవాక్కయ్యారు ఇద్దరూ. అవును. పూర్వం రెండు దేశాలు ఒకటిగానే ఉండేవి.
"అయితే మొదట మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని గుర్తించి రాగలిగితే మనం కలిసి వెళ్ళవచ్చు" అన్న ప్రధాని మాటలకు అంగీకారంగా తలవూపుతూ "ఇప్పటి దిల్లీ నగరానికి సుమారుగా 600 మైళ్ళు ఉత్తరదిశగా ప్రయాణించి మరలా పశ్చిమదిశగా 400 మైళ్ళ దూరంలో ఉన్న కనుమలలో ఉన్న గుహ అది. లేదా ఇప్పటి సాంకేతిక వున్న వాహనంలో వాయవ్య దిశగా 600 మైళ్ళు ఉండవచ్చు అన్నమాటకు ఉలిక్కిపడ్డారు. "అది తిన్నగా లాహోర్ పట్టణానికి దారితీస్తుంది" అన్నాడు ఆర్ధిక మంత్రి తేరుకుని. "ఏమో నేను చెప్పలేను. అక్కడ ఇనుప లోహంతో చేసిన పెట్టెలలో నేను అశ్వమేధయాగం తో సంపాదించిన అనేక వేల బంగారం వెండి లోహాల మూటలను అక్కడి లోయలలో గల ఒక గుహలో దాచిపెట్టే ఏర్పాటు చేశాను". "మనం కొంత వరకూ మాత్రమే వెళ్ళగలం, ఆ తర్వాత బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు మన హెలికాప్టర్ ను వెళ్ళనివ్వరు. బాంబింగ్ చేసి మనలను చంపించినా చంపించవచ్చు. ఆ మార్గం సరి కాదు" అన్నాడు ప్రధాని.
"ఈక్వలైజర్ గన్ తో మనం 12 వేల అడుగుల పైన ఉన్నా ఈజీ గా కాల్చేస్తారు వాళ్ళు." అన్నాడు ప్రధాని. "అంటే దాదాపు రెండు మైళ్ళ ఎత్తు ఉన్నా హెలికాప్టర్ను పేల్చి వేయగలరా అన్న ఆర్ధిక మంత్రి ప్రశ్నకు చిరునవ్వుతో "అవును" అని సమాధానమిచ్చాడు ప్రధాని.
"కొంచెం కొంచెం గుర్తుకొస్తోంది. అక్కడ భారతఖండంలోనే పెద్దవైన లవణం (ఉప్పు) గనులు ఉన్నాయి. అక్కడకు కొద్ది దూరంలో ఉన్న ఒక నది పక్కన ఒక పెద్ద కొండ గుహ వుంది. దానిలో పెట్టి ఆ గుహను శాశ్వతంగా రాళ్ళతో మూసేసాము" అన్నాడు పుష్యమిత్రుడు.
ప్రధాని వెంటనే సెక్రెటరియెట్ కు కాల్ చేసి భారీ ఉప్పుగనులున్న కనుమలు దగ్గరగా ఎక్కడ ఉన్నాయని అడిగాడు. వారు "సర్! పాకిస్తాన్ లో లాహోరు పట్టణానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖెవ్రా గనులు ప్రపంచంలోనే పెద్ద్ద ఉప్పుతో గూడిన గనులు మరియూ గుహ సార్" అనగానే మళ్ళీ ఆవేదనతో తలపట్టుకుని విషయం వారికి చెప్పాడు.
"ఇంకేమైనా గుర్తులు చెప్పగలరా! బాగా ఆలోచించుకోండి. "
"అప్పట్లో బౌద్ధ క్షేత్రం ఒకటి అక్కడ ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు, ఎందుకంటే ఆ విహారాలన్నీ నేనే మా సైనికులతో కూలత్రోయించాను. నా కుమారుడు అగ్నిమిత్రుడు మరలా వాటిని పునరుద్ధరించాడని తెలిసింది తర్వాత" అన్నాడు.
"ఐతే ఒక గూఢచారి తో కలిసి మీరు వెళ్ళి ఆ ఉప్పు గనులు లోయలు చూసి రండి. మీరు ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టగలిగితే ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం" అన్నాడు ప్రధాని.
* * *
ఈవిషయలన్నీ సీక్రెట్ ఉంచాలనుకున్న ప్రధాని ఆశలు అడియాశలే! పంచాపకేశన్ అక్కడనుండి క్యాబినెట్ మీటింగు కు వెళ్ళి వచ్చిన అనంతరం తన బంగళాకు వచ్చి, కలకత్తా లోను ముంబైలోను, తమిళనాడులలో ఉన్న తన సంపదను కాపాడే బినామీలతో టెలికాంఫరెన్సు పెట్టాడు.
"అందరూ జాగ్రత్తగా వినండి. కొన్ని లక్షల కోట్ల విలువ గలిగిన బంగారు నిధి విషయం ఒకటి బయటపడింది. కానీ మన దురదృష్ట శావత్తూ అది ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో లాహోరు కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది."
"ఆశ్చర్యం సార్!"
"నమ్మలేకుండా ఉన్నాం సార్!"
"ఇప్పుడేమి చెయ్యాలంటారు"
రకరకాల రెస్పాన్సు వచ్చింది వారి నుండి.
"మీరు త్వరగా మంచి తెలివైన ఏజెంట్లను దిల్లీకి తక్షణం పంపండి. ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను" అన్నాడు.
* * *
ప్రధాని పుష్యమిత్రుడిని భారతదేశం నుండి యాత్రికుడిగా పంపాలని, అతనితో మంచి నమ్మకస్తులైన ఇద్దరు సీ.బీ.ఐ ఆఫీసర్లను మారువేషంలో పంపడానికి ముహుర్తం నిర్ణయించాడు. ఆ నిధుల విషయం ఆర్ధిక మంత్రి రెండు మూడు సార్లు ప్రధానితో ప్రస్తావించగా "మనం తొందర పడకూడదు. కొద్ది రోజులు ఆగండి" అని మాత్రం చెప్పాడు. అతనికి ఉన్న కోటానుకోట్ల బినామీ ఆస్థుల వివరాలు తెలిసిన ప్రధాని. కానీ పంచాపకేశన్ సామాన్యుడు కాదు. సీ.బీ.ఐ తో మంచి లింకులే ఉన్నాయి అతనికి.
* * *
దిల్లీ లో ఒకరోజు ఒక కర్మాగారం నుండి రసాయనిక విషవాయువు లీకై జనజీవనం అతలాకుతలమైపోయింది. అందరూ భయభ్రాంతులవుతున్నారు. ఈ విషయం తెలిసిన పుష్యమిత్ర టీ.వీ లో విషయం తెలిసి ప్రధానికి ఫోను చేశాడు.
"ప్రధాని గారూ! నమస్తే.. వారికి వైద్య సదుపాయం కలిపించారా?"
"లేదు అందరూ ఆసుపత్రులలో మ్రగ్గుతున్నారు. ఎలా వైద్యం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రధమ చికిత్స మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ వూపిరి తిత్తులు బాగా దెబ్బతిన్నాయి."
"నన్ను వెంటనే శ్రీలంకలో ఉన్న అనూరాధపురం తీసుకెళ్ళగలరా?"
" వెళ్ళడానికి సమస్య ఏమీ లేదు. కానీ... ఎందుకు?"
"చెప్తాను. మరో 8-10 గంటలలో మనం వెళ్ళి రాగలగాలి. వాళ్ళు ఒక్కరోజు కంటే ఎక్కువ బ్రతుకలేరు. వైద్యానికి సంబంధించిన చెట్టు అక్కడ ఉన్నది. ఎటువంటి విషవాయువు పీల్చినా ఆ చెట్టు ఆకుల పసరు ముక్కులో పోస్తే చాలు. చచ్చిన మనిషైనా లేచి కూర్చుంటాడు. ఆ ఆకులను మనం రెండు మూడు బస్తాలలో తేగలిగితే అందరూ బ్రతికి బయటపడతారు. "
"హా! నిజమా! పుష్యమిత్రాజీ! వెంటనే ఏర్పాట్లు చేస్తున్నా!.. నేను రావచ్చా!"
"రండి కల్సి వెళ్దాం" (సశేషం)
* * *
No comments:
Post a Comment