రుక్మిణీ కల్యాణం - అచ్చంగా తెలుగు

రుక్మిణీ కల్యాణం

Share This
రుక్మిణీ కల్యాణం 
బి.హరిత 

ఉపోద్ఘాతం
అనగనగనగా ఒకసారి దేవతలు, రాక్షసులు అమృతంకోసం క్షీరసాగరమథనం చేస్తున్నారు. ముందుగా విషమొచ్చింది, దాన్ని శివుడు తాగాడు. నీలకంఠుడు అయ్యాడు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. అయితే ఇందులో ఎవరికీ తెలియని కథ ఒకటి ఉంది. క్షీరసాగరమథన సమయంలో వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసులు కొట్టుకుంటుంటే విష్ణువు మోహినీ రూపంలో వచ్చి నేను పంచుతాగా. మీకు తగువు ఎందుకు అంటూ అమృత భాండాన్ని తీసుకుని తెలివిగా దేవతలకు మాత్రమే అమృతాన్ని పోస్తూ పోస్తూ ఉండగా ఒక అమృతపు చుక్క జారిపోయింది. కాదు కాదు జార్చేశాడు ఆ జగన్నాటక సూత్రధారి. ఆ జారిన అమృతపు చుక్క కాస్తా వెళ్ళి వెళ్ళి వెళ్ళి అప్పటి ఏకశిలానగరం, ఇప్పటి వరంగల్లు దగ్గర్లో ఉన్న ఒక పల్లెటూరిలో ఒక గంటం మీద పడింది.  ఆ గంటం చాలా శతాబ్దాల పాటు తననెవరు ఎత్తుకుంటారా అని ఎదురుచూసిందట. 

చూడగా చూడగా దాని నిరీక్షణ ఫలించి, దాన్ని ఎత్తాడట. ఎవరు? మన పోతన్న. 
మరి అమృతంలో తడిసిన ఆ గంటం నుండీ వచ్చిన కవిత్వమంతా అమృతతుల్యం కాకుండా ఎలా ఉంటుంది? 
అంతటి అమృతమయ కవిత్వాన్ని రాసిన కవి చిరంజీవి కాకుండా ఎలా ఉంటాడు?
అదీ మన పోతన మందార మకరంద మాధుర్యమయాలైన పద్యాల వెనుక ఉన్న కథ. 

మధురమధురాలైన పోతన భాగవత పద్యాలను చదివి పరవశించిపోయి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు అంటారు,

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో 
నద్దితివేమొ గంటమ్ము మహాకవిశేఖర! మధ్యమధ్య; య
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో 
పద్దెములందు ఈ మధుర భావము లెచ్చటి నుండి వచ్చురా

ఇంకు పెన్నును ఇంకులో ముంచి రాసినట్టు, పోతన కచ్చితంగా తన గంటాన్ని పంచదార పాకంలో ముంచి భాగవతం వ్రాసుంటాడు. లేకపోతే ఆ పద్యాలకు అంత తియ్యదనం ఎలా వచ్చుంటుంది? అని ఆయన ఊహ.

తెలుగులో భాగవత రచన చేసిన పోతన గురించి ఒక్క ముక్క చెప్పుకున్నాం. ఇక దానికి మూలమైన సంస్కృత భాగవతాన్ని రచించిన వ్యాసుడి గురించి కూడా ఒక్క చిన్న మాట అనుకుని కథలోకి వెళ్ళిపోదాం

భారతాన్ని, పద్దెనిమిది పురాణాలను రచించి, వేదాలను విభజించిన వేదవ్యాసుడికి ఒకసారి  విశేషమైన నిర్వేదం--ఒక విధమైన బాధ కలిగిందట. అప్పుడు నారద మహర్షి వచ్చి ఇప్పటి దాకా నువ్వు వేదాలను విభజించావు, పురాణాలను చెప్పావు, దైవనామస్మరణం చేశావు, బాగానే ఉంది కాని దైవభక్తుల కథలు చెప్పలేదు. నువ్వు భక్తుల కథలతో భాగవతాన్ని రచించు. నీకున్న అశాంతి తొలగిపోయి విశేషమైన ఆనందం కలుగుతుంది అని చెప్పాడట. 
       అంటే ఇందులో మనం తెలుసుకోవలసినదేమిటి?  దేవుడికి తన పేరు చెప్పడం కంటే తన భక్తుల పేరు చెబితే ఎక్కువ ఆనందం కలుగుతుంది అని. అంతేనా? ఇప్పుడు ఎవరినన్నా పెద్దాయనను మంచి చేసుకోవాలనుకున్నారనుకోండి, వెళ్ళి నేరుగా ఆయనను పొగడడం కంటే ఆయన కూతురునే కొడుకునో లేక మనవరాలినో కాసింత పొగిడితే - మీ మనవరాలంత చక్కని చుక్క మరి లేదండీ. అబ్బ ఎంత తెలివైనదండీ అన్నామో ఇంక ఆయన భుజాలు గజాలు చేసేసుకుని మీకు కావలసింది చేసి పెడతాడు. 
                   కనుకనే మనం భక్తాగ్రేసరులైన పోతనామాత్యుడి గురించి, వ్యాసుడి గురించి నాలుగు ముక్కలు చెప్పుకున్నామో ఇంక ఆ పైనుండే ఆయన మురిసి మూర్ఛపోవడం ఖాయం....

మన కథలోకి వస్తే, నారదుడు అలా ఒక చిన్న సూచన అందివ్వగానే, వ్యాసుడు ఇక విజృంభించి, మహాభాగవత రచన పూర్తి చేశారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రుక్మిణీ కళ్యాణ సత్కథ అందులో ఒక భాగమే. ఈ కథలో నాయికా నాయకులు సుప్రసిద్ధులు, ఒక విధంగా నేటి సినిమా నాయికా నాయకులకు పూర్వరూపంగా చెప్పుకోదగ్గవారు. తనకు నచ్చినవాడిని వలచి వలపింపజేసుకున్న జాణ రుక్మిణి అయితే “నీ ఊరొస్తా, నీ నట్టింటికొస్తా, నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని ఎత్తుకుపోతా” అనే నేటి తరం కథానాయకుడికి ఆదర్శ పురుషుడు ఆ నల్లనయ్య. వీరిద్దరి ప్రేమ కథే ప్రస్తుత కథాంశం.

ఇంక మనం అసలు కధ లో కి వెళ్దామా?

కథ
అనగనగా ఒక దేశం. ఆ దేశం పేరు విదర్భ. ఆ దేశాన్ని పాలించే రాజు పేరు భీష్మకుడు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. భీష్మకుడు మహా భక్తుడు. ఆయన కొలువుకి చాలా మంది ఋషులు వస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ శ్రీకృష్ణుడిగుఱించి చెప్తూ ఉండేవారు. ఏమని?
నల్లని వాడు.. పద్మనయనంబుల వాడు…
కృపారసమ్ము పై జల్లెడు వాడు, 
మౌళిపరిసర్ఫిత పింఛము వాడు
నవ్వు రాజిల్లెడు మోము వాడు..
అని..

మామూలుగానే యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలు ఎప్పుడెప్పుడు మనసు పారేసుకుందామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక అదే పనిగా ఒక జగన్మోహనాకారుడిగురించి, ఒక జగదేకవీరుడిగురించి, ఒక మానినీమనోహారుడిగురించి చెబుతుంటే ఏ మగువ మాత్రం మనసివ్వదు? మరులు గొనదు? పాపం రుక్మిణి కూడా అదే పనిగా కృష్ణుని మనస్సులో ఆరాధించటం మొదలెట్టింది. భీష్మకుడు కూడా రుక్మిణిని కృష్ణుడికిచ్చి వివాహం చేయడంపట్ల అనుకూలంగా ఉండేవాడు. 

ఇక్కడ మన కిట్టయ్య విషయానికి వస్తే.. మీ అమ్మాయిలే అంత గడుసువారైతే మేమేమైనా తక్కువా అని ఆయన కూడా రుక్మిణి అందచందాలు, గుణగణాల గురించి విని ఆమే తన భార్య అని మనసులో తీర్మానించుకుని విరహగీతాలు పాడుకుంటూ ఉన్నాడట.

అయితే అంతా బాగానే ఉంటే మన కథ ముందుకెలా సాగాలి? 

ఒకనాడు భీష్మకుడు తన పెద్ద కొడుకు రుక్మిని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నాడు,

భీష్మకుడు - “ఒరేయ్  నాయనా మన చిట్టి తల్లికి నేనొక సంబంధం అనుకుంటున్నాన్రా” అన్నాడు. 
రుక్మి - “మీరూ అనుకున్నారా నాన్నా? నేను కూడా ఒక సంబంధం అనుకున్నాను చెల్లాయికి. సరే మీరేమనుకున్నారో చూద్దాం. ముందు మీరే చెప్పండి” 
భీష్మకుడు - “నేను యదుసింహుడైన కృష్ణుడికి మన రుక్మిణిని ఇద్దామనుకుంటున్నాను. చూడగా రుక్మిణికి కూడా ఇదే అభిప్రాయం ఉన్నట్లుగా తోస్తోంది” .
రుక్మి - “ఏంటి? ఆ వెర్రి గొల్లవాడైన కృష్ణుడికి నా చెల్లాయినిస్తారా? ఎంత మాత్రమూ వీల్లేదు! నేను ఎప్పుడో నిశ్చయించాను. నా చెల్లికి ఛేది భూపాలుడైన శిశుపాలుడే సరైన జోడు. ఇది నా నిశ్చయం. ఇంక దీనికి తిరుగు లేదు” 
అని వెళ్ళిపోతాడు.
పాపం! ఆ ముసలి రాజు మాత్రం ఏం చేయగలడు? అడ్డాల్లో బిడ్డలుగాని గడ్డాలొచ్చాక బిడ్డలా? ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు.
కాని రుక్మిణి అలా ఊరుకోలేకపోయింది పాపం. తను అప్పటికే కృష్ణుడిని మనసంతా నింపుకుని ఉంది పాపం. 
ఇంతలో రుక్మి శిశుపాలునితో వివాహానికి ముహూర్తం పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి ఇక లాభం లేదని తనే రంగంలో కి దూకింది. తనకి చాలా ఆప్తుడైన అగ్నిజోతనుడు అనే బ్రాహ్మణుడిని పిలిపించి, తన మనస్సు విప్పి విషయం చెప్పి, ద్వారకకు వెళ్ళి, శ్రీకృష్ణునకు తన సందేశాన్ని వినిపించమంటుంది. అగ్నిజోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రుక్మిణీ దేవి పంపిన సందేశం అందిస్తాడు. ఏమని?

“స్వామీ, ఎవరి గుణాలు చెవులను సోకినంత మాత్రాన చెవులు ధన్యత చెందుతున్నాయో 
ఎవరి మనోహర రూపం ఒక్కసారి చూసినంతమాత్రాన కన్నులకు చూపుండడం వలన సార్థకత్వం లభిస్తుందో
ఎవరి పాదసేవ చేసినంతమాత్రాన అఖిలభూమండలానికి చక్రవర్తి పదవి పొందినట్లవుతుందో
ఎవరి నామం భక్తితో జపించినంతమాత్రాన దేహబంధాలు సడలిపోతాయో
అటువంటి మహానుభావుడవైన నిన్ను నేను మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. అయితే ఇలా చెప్పడంలో నాకేమీ సిగ్గుగా అనిపించటం లేదు. ఎందుకంటే నిన్ను ఒకనాడు కోరి కోరి ఆ మహాలక్ష్మియే వరించింది కదా! జగన్మోహనాకారుడివి, కారుణ్యసింధువువి, జగదేకవీరుడివి అయిన నిన్ను యే కన్యలు కోరరు. అటువంటి నిన్ను నేను కోరడంలో ఆశ్చర్యమేముంది? 

అయితే నీ ప్రతాపం తెలియక నీకు దక్కవలసిన నన్ను ఆ శిశుపాలుడు సొంతం చేసుకుందామనుకుంటున్నాడు. సింహానికి దక్కవలసిన సొమ్ము నక్క పొందాలి అనుకోవచ్చా స్వామీ?  కనుక నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు, అక్కడికి నేనెలా రాగలను అనుకుంటావేమో ఒక ఉపాయం చెబుతాను విను. మా కులాచారం ప్రకారం ఊరిబయట ఉన్న పార్వతీదేవి గుడికి నేను గౌరీపూజకై వస్తాను. ఆ సమయంలో వచ్చి నన్ను తీసుకెళ్ళావంటే నీకు పని తేలికవుతుంది. నువ్వే పరిస్థితుల్లో అయినా సమయానికల్లా రాకపోయినట్లైతే నిన్ను తలచుకుంటూ ప్రాణాలను వదిలేస్తాను కాని ఇంకొకరిని వివాహం చేసుకోను. ఇది మాత్రం నిజం. గుర్తుంచుకో”

ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే రుక్మిణి మాట తీరు. ఏ విధంగా మాటలతో ఆవిడ మహామాయగాడైన ఆ కృష్ణపరమాత్మనే వశం చేసుకుందో మనం గమనించాలి!! 

ఎందుకంటే అంతవరకు ఇలాంటి ఘట్టం - ఒక ఆడపిల్ల తనంత తానుగా ఒక అబ్బాయిని వరించి ప్రేమలేఖ పంపడం - చరిత్రలో ఎక్కడా కనివినీ ఎరుగము. కృష్ణుడు కాస్త డోలాయమానంలో ఉండి ఉండవచ్చు. ఒక ఆడపిల్ల తనంత తానుగా రమ్మని పంపితే ఊపుకుంటూ వెళ్ళిపోవడమేనా అని ఆయనకు ఎక్కడో ఒక మూల అనిపిస్తూ ఉండవచ్చు. ఆయనకూ ఆవిడంటే ఇష్టమే కాని లోకనిందకు భయపడి కృష్ణుడు కాస్త వెనకాడుతూ ఉండవచ్చు. అయితే ఈవిడ సందేశం విన్నతరువాత మాత్రం రెండో ఆలోచన లేకుండా కృష్ణుడు రంగంలోకి దూకేశాడు.

ఏం? ఈవిడేం చెప్పింది?

ముందుగా కృష్ణుడిని బాగా పొగిడి మంచి చేసుకుంది.
తరువాత నిన్నే లెక్క చేయకుండా శిశుపాలుడు నన్ను ఎగరేసుకుపోవాలనుకుంటున్నాడు. ఆ పై నీ ఇష్టం అంటూ అతడి పౌరుషాన్ని రెచ్చగొట్టింది. 
నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంతే కాని వేరొకడిని చేసుకోను అని బెదిరించింది.
అయితే కొత్త సినిమా కథానాయికల్లా ఆమె గొంతెమ్మ కోరికలేమీ కోరలేదు. మన పెళ్ళి మా వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. అయినా సరే వారినందరినీ ఒప్పించి, వాళ్ళంతా సంతోషంగా అక్షింతలేస్తుంటే నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలి అనో లేదా నా కోసం పేద్ద యుద్ధం చేసి నన్నెత్తుకుపోవాలి అనో కృష్ణుడిని ఆవిడ ఇబ్బంది పెట్టలేదు. 
తనను పెళ్ళి చేసుకోవడానికి సులువైన మార్గం చెప్పింది. 

ఇంత చెప్పాక, మనసైన మగువ కోరి వలచి, వరించి నన్నెత్తుకుపో అని అంటే ఏ మగాడు మాత్రం వెనకాడతాడండీ! అందులోనూ ఆయనేమైనా సామాన్యమైనవాడా? పురుష సింహం - ఆవిడే చెప్పింది కదా!

ఏమీ లేకుండానే చెలరేగిపోయి వీరంగమాడేస్తాడు మన కిట్టయ్య. మరి ఇంతగా రెచ్చగొట్టి వదిలేస్తే ఊరుకుంటాడా?  వెంటనే సిద్ధం చెయ్యి అని దారుకుడికి చెప్పి అతివేగంతో ప్రయాణించి ఒక్క రాత్రిలో చేరుకున్నాడు విదర్భ.  అయితే యువకులది ఉడికే రక్తం. వెనకాముందూ చూసుకోకుండా దూసుకుపోతూ ఉంటారు. మరి పెద్దవాళ్ళే కదా వెనకా ముందూ ఆలోచించాల్సింది. అందుకని తమ్ముడెక్కడ ఇబ్బందుల్లో పడతాడో అని బలరాముడు సైన్య సమేతంగా వెనకే బయలుదేరతాడు,

ఇవతల పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. రుక్మిణికి భయం భయంగా ఉంది. 

ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?
విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేయునో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?

అని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. ఇంతలో ఆవిడకు ఎడమ కన్ను, ఎడమ భుజం అదిరాయి.  తల తిప్పి చూసేసరికి తను పంపిన బ్రాహ్మణుడు కనిపించాడు. ప్రశాంతవదనంతో చిరుమందహాసంతో ఉన్న ఆయనను చూసేసరికి ఈవిడకు కృష్ణుని సమాధానం వేరే అడగాల్సిన పని లేకపోయింది. ఆయన జరిగింది చెప్పి, కృష్ణుడు విదర్భకు వచ్చాడని, ఎవరడ్డమొచ్చినా ఆమెను తీసుకుని పోతాడని చెప్పి దీవించి వెళతాడు. ఆమె “అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే” అని పాడుకుంటూ అప్పటిదాక మొహం వేలాడేసుకుని ఉన్నది కాస్తా సిగ్గుతో తుర్రున లోపలికి పారిపోయింది.

ఇంతలో సుముహూర్తం రానే వచ్చింది. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలో ఉన్న గౌరీ ఆలయానికి వచ్చింది.
గుడికి వచ్చిందే కాని ఆవిడ మనసంతా కృష్ణుడు వస్తాడా? రాడా? వచ్చినా ఇందరు చూస్తుండగా నన్నెలా తీసుకెళతాడు? ఇదే ఆలోచన. భక్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంది. ఏమని? 

నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్
మిమ్ము పురాణదంపతుల మేలు భజింతు కదమ్మ మేటిపె
ద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయు మమ్మ నిన్
నమ్మినవారి కెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ

ఆ విధంగా గౌరీ పూజ పూర్తి చేసుకుని తిరిగి రుక్మిణి బయటకు వస్తుంది. అక్కడ బయట నానాదేశాల రాజులు ఆమె అందచందాలను చూసి సమ్మోహితులై అలా ప్రతిమల్లా నిలబడిపోయి ఉంటారు. అయితే రుక్మిణి చూపులు మాత్రం తన మనసులో తిష్ఠవేసుకు కూర్చున్న ఆ నల్లనయ్య కోసమే వెతుకుతున్నాయి. ఆమె చూపులను తన చూపులతో కట్టిపడేసి, ఆ నల్లనయ్య ఆమెను ఒక్క ఉదుటున రథం మీదకు లాగేసుకుని , అక్కడ ఉన్న అందరూ ఏం జరిగిందనేది అర్థం చేసుకునే లోపలే రథంలో మైలు దూరం తీసుకుపోతాడు. తేరుకొని శిశుపాలుడు, అతనికి సహాయంగా వచ్చిన తక్కిన రాజులు శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు బలరాముడు మొదలైన వాళ్ళంతా ఆ రాజులమీద దాడి చేసేసరికి వారు శిశుపాలుడిని చూసి “నాయనా! బతికి ఉంటే కదా భార్య, ప్రస్తుతానికి బ్రతికావు అదే ఎక్కువనుకో. భార్య మాట దేవుడెరుగు. ముందు కాళ్ళకు బుద్ధి చెప్పు” అని పారిపోతారు.. 

అందరూ వెళ్ళిపోతారు కాని రుక్మి మాత్రం అలా ఊరుకోలేకపోతాడు! తన ఊరొచ్చి, తన చెల్లికి తాను వేరొకడిని నిశ్చయించి ఉండగా, అందరు రాజులు చూస్తుండగా తన చెల్లిని కృష్ణుడు తీసుకుపోయాడనే రోషంతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడిని ఎదిరిస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు పోనిలే బావ కదా అని ఓర్చుకుని ఓర్చుకుని ఇక లాభం లేదని ఎదురుదాడి చేసి చంపుదామనుకునేసరికి రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడిని అన్నను క్షమించి వదిలెయ్యమని బ్రతిమాలుతుంది. ఎంత చెడ్డా అన్న కదా! ఆ అభిమానమెక్కడకు పోతుంది ఆడపిల్లకు. ప్రియురాలు నోరు తెరిచి అడిగిన మొదటి కోరిక. ఎలా కాదనగలడు? శ్రీకృష్ణుడు శాంతిస్తాడు. కాని బావగారికి తగిన సన్మానం చేయకుండా వదిలిపెడితే ఎలా?  దా బావా దా అని, ఆప్యాయంగా పట్టుకుని తల, మీసం సగం సగం గొరిగి వదిలిపెడతాడు. 

ఆ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకొని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.

శ్రీమద్రమారమణ గోవిందో హరి!
***

No comments:

Post a Comment

Pages