శ్రీమద్భగవద్గీత-18 - అచ్చంగా తెలుగు
                                              శ్రీమద్భగవద్గీత-18 
రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు

ఏడవ అధ్యాయము
విజ్ఞానయోగము

బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్మాం ప్రపద్యతే
వాసుదేవస్సర్వమితి
సమహాత్మా సుదుర్లభః
19 వ శ్లోకం
అనాది కాలము నుండి జీవుడు బహు అనగా లెక్కకు అందనంత ఎక్కువగా జన్మలనెత్తుచు సంసార చక్రమున పరిభ్రమించుచు చావుపుట్టుకలలో తగుల్కొనుచు క్రిమికీటకాది జన్మలనెత్తుచు భగవంతుని కరుణవలన మానవజన్మను పొందుచున్నాడు.అట్లు జన్మించిన మానవులందరూ ముక్తికొరకై ప్రయత్నించుటలేదు.ఏ కొద్దిమంది పుణ్యాత్ములో ప్రయత్నించుచున్నారు.అట్లు ప్రయత్నించినవారిలో ఏ ఒకానొక ధీరుడో తరించుచున్నాడు అనేక జన్మల యెక్క అనుభవము వలన మనుజుడు జ్ఞానవంతుడై విశ్వమంతయు భగవంతుని విభూదియను సద్భుద్ధిగలిగి నన్ను పొందుచున్నాడు.ప్రతి జన్మయందు జీవుడు కొంత కొంత పుణ్యమును సంపాదించుతూరాగా కడకు ఏ ఒకానొక జన్మయందో తీవ్రతర ఆధ్యాత్మిక సాధనలచేతను,పరమేశ్వరుని అనుగ్రహము చేతను అతనికి జ్ఞానముదయించును. అపుడు సమస్తమును భగవన్మయముగ, ఆత్మమయముగ, వాసుదేవమయముగా గాంచును. అట్లు సర్వాత్మ దృష్టిగలవాడై జ్ఞానముతో భగవత్సాక్షాత్కారము పోందుచున్నాడు. ఎన్నియో జన్మలపుణ్యఫలము చేతను పురుషప్రయత్నము చేతను, సాధనాబలము చేతను,జీవునకట్టి మహత్తరపదవిచేకూరి జ్ఞానవంతుడగు భాగ్యముగలుగును జ్ఞనవంతులగు మహాత్ములు లోకములో చాలా అరుదు. అందుచే భగవానుడు సుదుర్లభః అని చెప్పినాడు.ఇంకనూ అనేక జన్మలైన పిదప జ్ఞానము సంపాదించవచ్చునని సోమరితనము వహించరాదు. ఇంతవరకు గడిచిన జన్మలన్నియు 15 కోట్ల జన్మలని భావించి ఈ జన్మయందే జ్ఞానము సంపాదించ తీవ్ర ప్రయత్నమాచరించవలెను.జ్ఞానము పొందినదలేనిది తెలిసికొనుటకై చక్కని పరీక్షను భగవానుడు ఏర్పరిచినాడు.అంతయూ వాసుదేవమయముగా కనపడుచున్నదా ? లేదా యని సాధకుడు పరిక్షించుకొనుచుండవలెను. జ్ఞానప్రాప్తికి గుర్తు "సర్వం ఖల్విదం బ్రహ్మ". ఏ క్షణమున జ్ఞానమును పొందునో ఆ క్షణముననే మోక్షము లభించగలదు.ఏ విత్తనపుగింజైనా సరే బాగుగా వేయించిన పిదప భూమిలో విత్తిననూ మొలకెత్తదు.
అవ్యక్తం వ్యక్తి మాపన్నం 
మన్యంతే మామ బుద్ధయః
పరంభావ మజానంతో 
మమావ్యయమనత్తమమ్
24 వ శ్లోకం
నాశరహితమైనట్టియు, సర్వోత్తమమైనట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడనగా నన్ను పాంచభౌతిక దేహమును పొందినవానిగా తలంచుచున్నారు. భగవంతుడు వాస్తవముగా నిరాకారుడు,సర్వవ్యాప్తి,అనంతుడు,నాశరహితుడు, లోక కళ్యానార్థమై అతడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపనకై దేహమును ధరించుచున్నాడు.మాయను స్వాధీనపరుచుకొనినవాడు కనుక దేహమును గ్రహించుటకు త్యజించుటకు శక్తికలిగియున్నాడు. బంధరహితుడు నామరూపాత్మకమగు దేహము ఆతని పరిపూర్ణ రూపము కాదు భక్తులననుగ్రహించుటకొరకు తాత్కాలికముగా గ్రహించినదేయగును.
యేషాం త్వన్తగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్
తేద్వన్ద్వమోహనిర్ముక్తా
భజన్తేమాం దృఢవ్రతాః
28 వ శ్లోకం
పరమాత్మను ధృఢవ్రతులై సేవించిన వారికే బంధవిముక్తి లభించును. కాబట్టియే అనేకులు దైవసాక్షాత్కారమునకై పెక్కువ్రతములు, నియమములు ఆచరించుదురు. పుణ్యకార్యతత్పరులగు ఏ జనులయొక్క  పాపము నశించిపోయినదో అట్టివారి ద్వందము నుండి విడివడి దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. పుణ్యకర్మలచేతను అనేక సన్మార్గములాచరించుట వలనను,నిష్కామకర్మ,యోగానుష్టానము చేతను జీవునిపాపమంతయు నశించిపోవును. సాధకుడు మొదట అనేక సత్కార్యములు,దాన ధర్మములు మొదలగు మంచి కార్యములు ఆచరించినందువలన అహంకారమణగి భగవంతునిపై భక్తి త్వరితగతిని అభివృద్ధియగును.
కేవలము అతీత స్థితియందుండు వానికి, ఇంద్రియమనంబులను దాటియున్నవానికి,నిశ్చలసమాధి నిష్టునకు పుణ్యము,పాపము లేవని చెప్పిన విషయము సామాన్యులగు సాధకులకు అనవయించరాదు.ఏలయనిన దానివలన ఆ సాధకులను చెడగొట్టినట్లగును.వారికి ఉభయ బ్రష్టత్వము కలుగజేసినట్లగును. తురీయస్థితి యందున్న జీవన్ముక్తులు కూడా మానవతా దృక్పథంతో నిష్కామకర్మాచరణ చేయుచునేయుందురు. ఆ కర్మ యోగముగా మారిపోవును. తద్వారా జీవన్ముక్తి లభించును.
జరామరణ మోక్షాయ
మీమాశ్రిత్యయన్తియే
తేబ్రహ్మతద్విదుః కృత్స్న
మధ్యాత్మం కర్మచాకిలమ్
29 వ శ్లోకం
జీవుడు సంసార దుఃఖ విముక్తికొరకు,పరమానంద ప్రాప్తికొరకు భగవంతుని ఆశ్రయించి తన లక్ష్య సాధనకైయత్నించుచున్నారు. జనన మరణములు, జరావ్యాధులు మొదలగువానితో కూడిన సంసార దుఃఖము అతి భయంకరమైనది.దాని నుండీ విడుదల పొందుటకు సర్వేశ్వరుని జనులాశ్రయించి ప్రయత్నశీలురగుచున్నారు. సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఇందుకొరకే ఏర్పడినవి.అట్లు సర్వేశ్వురుని ఆశ్రయించి ధ్యానాదియత్నములు సలుపువారు క్రమముగావారి యత్నములు పరిపక్వముకాగా,సాధనఫలవంతమైన పిమ్మటఅరూఢ స్థితి పోందినపుడు సమస్తకర్మలు,సమస్త జీవులు ప్రత్యగాత్మ స్వరూపములని తెలిసికొందురు.వారి దృష్టిలో బ్రహ్మమునకు వేరుగా యేదియు కానరాదు.
ఐతే ఇట్టి బ్రహ్మానుభూతి అందరికీ కలుగదు.ఎవరు మోక్షము కొరకు తీవ్రప్రయత్నము సలుపుదురో బంధవిముక్తికై సర్వేశ్వరుని ఆశ్రయించి, ధ్యానాదులను జరుపుదురో అట్టివారికే కలుగును.అపుడు తానే పరబ్రహ్మమగును.తనయందే విశ్వమంతయు విరాఢ్రూపముగా యున్నట్లును,సర్వజీవుల యెక్క ఆత్మ తానే అయినట్లును కనుగొనగల్గును.ఇదియే వేదవిహితమైన "అహంబ్రహ్మస్మి" అను మహావాక్యము యెక్క అనుభవము.భగవంతుడనుగ్రహంచిన త్రోవలో, యత్నశీలుడై తనమనస్సును తానే పరిశుద్ధమొనర్చుకొని బ్రహ్మానుభూతిని పొందవలెను.

No comments:

Post a Comment

Pages