వసంతకాలపు పువ్వులం
బాలగేయాలు
- వివరణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య
వసంత ఋతువు
భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరంను ఆరు ఋతువులుగా విభజించారు. అవి వసంత ఋతువు, గ్రీష్మఋతువు, వర్షఋతువు, శరదృతువు, హేమంతఋతువు, శిశిరఋతువు. వాటిల్లో ఆహ్లాదమైనది వసంతఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది.
చైత్ర, వైశాఖ మాసములు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలము. ఋతువుల రాణీ వసంతకాలం అంటారు. ఆ వసంత కాలం ప్రాముఖ్యత తెలియజేస్తూ రాసిన పాట.
వసంతకాలపు పువ్వులం
వానా కాలపు చినుకులం
నవ్వీ నవ్విస్తూ చిందులేస్తూ
నట్టింట తిరిగే పిల్లలం(2)
వసంతకాలపు పువ్వులం
వెనుక ముందు తరాల నడుమ
వెలిగే చిరు వేకువ రేకలం(2)
భవితవ్యపు బాటలలో
చీకటులను తొలగిస్తాం(2)
చీకటులను తొలగిస్తాం
వసంతకాలపు పువ్వులం
మహానీయులు మసలిన నేల-
మొలచినట్టి మొలకల మేము(2)
దేశ మాత ప్రగతి రథానికి
ఆశయాల పూలందిస్తాం(2)
ఆశయాల పూలందిస్తాం
వసంతకాలపు పువ్వులం
బాపూజీ చాచా నెహ్రూ
కలలుగన్న భరతావనిని(2)
సమత, మమత సందర్శించే
మానవతకు గుడిగా చేస్తాం(2)
మానవతకు గుడిగా చేస్తాం
వసంతకాలపు పువ్వులం
-0o0-
రచన: శ్రీ వారణాసి వెంకట్రావు గారు, విజయవాడ.
No comments:
Post a Comment