అటక మీది మర్మం -5 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం -5

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-5 వ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. కానీ ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని అమ్మటానికి మార్చ్ ను ఒప్పించి వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్ముతుంది. అదేసమయంలో స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు యింటి వద్ద ఉన్న నాన్సీకి ఎఫీ ఫోను చేసి ఉన్నపాటున బయల్దేరి రమ్మని, రాత్రి జరిగిన విషయం చెప్పాలని చెబుతుంది. ఆ కబురు విన్న నాన్సీ ప్లెజెంట్ హెడ్జెస్ కి బయల్దేరుతుంది. అఘమేఘాలమీద అక్కడకు చేరుకొన్న నాన్సీకి ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించే నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. తిరిగి రాత్రి నాన్సీ అటకమీద అడుగుపెట్టగానే, ఆమె చేతిలో వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోయింది. తరువాత. . . ) 
@@@@@@@@@@@@
నాన్సీ అటకమీదకు చేరగానే ఆమె చేతిలో కొవ్వొత్తి ఆరిపోయింది. వెంటనే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ చీకటిలో తనకు దగ్గరలో ఎవరూ లేరు కదా! ఎవరూ లేకపోతే తన చేతిలోని కొవ్వొత్తి ఎలా ఆరిపోయింది? నిజంగా ఎవరైనా ఉంటే ఈపాటికే తనపై దాడి చేసేవారు కదా! ఆ ఆలోచనతో ఆమె తనలోని భయాన్ని దులిపేసింది.
"మధ్యాహ్నం వచ్చిన తుఫానుకి అటక మీద మూలనున్న అద్దం పగిలిపోయింది కదా! బహుశా దానిలోంచి గాలి రావటం వల్ల కొవ్వొత్తి ఆరిపోయి ఉంటుంది" అనుకొంటూ మరొక అగ్గిపుల్లతో కొవ్వొత్తిని మళ్ళీ వెలిగించింది. కొవ్వొత్తిని కుడిచేత్తో పట్టుకొని మెల్లిగా అటక లోపలికి అడుగుపెట్టింది. కొవ్వొత్తి మంట వేగంగా ఊగిసలాడి మరొకసారి ఆరిపోబోయింది. అదే సమయంలో తన ముందు ఎవరో అడ్డంగా వెళ్ళినట్లయింది. మరొకసారి ఆమె త్రుళ్ళిపడింది. కొద్ది క్షణాలాగి కొవ్వొత్తి వెలుతురులో తేరిపార చూసింది. కొవ్వొత్తి మంట ఊగిసలాడుతూంటే, తన నీడే తన ముందు కదులుతున్నట్లు కనిపించింది.
"ఈ చిన్న వెలుతురులో నా నీడ ఎంత విచిత్రంగా కనిపిస్తోంది" అనుకొంటూ దూరంగా గోడకి ఆనుకొని ఉన్న పెద్ద బట్టల బీరువాను చూసింది.
"ముందుగా దాంట్లో వెతుకుతాను" అంటూ అటకకు అడ్డంగా నడిచి ఆ బీరువాను చేరుకొంది. నిజానికది అరలున్న బీరువా కాదు. బట్టలను హాంగర్లకు తగిలించి, లోపల అడ్డంగా అమర్చిన రాడ్ కు (కమ్మీకి) వాటిని వేలాడదీసే వార్డ్ రోబ్. చేతిలోని కొవ్వొత్తిని నేలపై ఉంచి, బీరువాకున్న పిడి(నాబ్)ని పట్టి లాగింది.
"లోపలేముందో?" అనుకొంది. దాని తలుపు తెరుచుకోలేదు. అదే సమయంలో ఎక్కడినుంచో కిర్రుమన్న ధ్వని వినిపించింది. నాన్సీ మరొకసారి త్రుళ్ళిపడింది. నేలమీద కొవ్వొత్తిని తీసి తన చుట్టూ చూసింది. ఏమీలేదని మనసులో అనుకొన్నా, ఆ శబ్దానికి ఆమె మనసులో ఏర్పడిన భయాన్ని పూర్తిగా అదుపుచేయలేకపోయింది.
కొవ్వొత్తిని తిరిగి నేలపై ఉంచి బీరువా తలుపుకున్న పిడిని పట్టుకొని మరొకసారి గట్టిగా లాగింది. వెంటనే తలుపు వేగంగా తెరుచుకొంది. అదే సమయంలో ఒక అస్తిపంజరపు చేయి వేగంగా వచ్చి నాన్సీ గొంతుని తాకింది. అది అలా తాకగానే నాన్సీ భయంతో అప్రయత్నంగా అరిచింది. భయంతో బీరువానుంచి రెండడుగులు వేగంగా వెనక్కి వేసింది. నేలమీద కొవ్వొత్తి భీకరంగా చలించింది.
"దూరంగా జరుగు. . .దూరం. . .అది నిన్ను పట్టుకొనేలోపే. . .దూరంగా జరుగు" వెనుకనుంచి ఎవరో కీచుగొంతుతో అరిచినట్లనిపించింది. వెనక్కి తిరిగిన నాన్సీకి ఎఫీ భయంతో వణికిపోతూ కనిపించింది.
నిన్నరాత్రి ఆగంతకుణ్ణి చూసినప్పటినుంచి ఎఫీ మనసులో ఏదో శంక చోటుచేసుకొంది. తమతో పాటు అజ్ఞాతవ్యక్తి ఎవరో ఆ యింట్లో తిష్ట వేశాడేమోనని ఆమె భయం. చీకట్లో అటక మీదకి వెళ్ళవద్దని ఆమె చెప్పినా, నాన్సీ వినకుండా పైకి ఎక్కింది. నాన్సీకి ఏ హానీ జరగకుండా తోడు ఉండాలనే సదుద్దేశంతోనే ఎఫీ ఆమెను అనుసరించింది.
"అది అస్తిపంజరం మాత్రమే! మరేమీ కాదు" అంటూ ఎఫీతో గంభీరంగా మాట్లాడుతున్నా, నాన్సీ గొంతులో వణుకు తగ్గలేదు.
"అది తన ఎముకల చేతితో నిన్ను కొట్టింది. ఆగంతకుడు. . అస్తిపంజరం. . అమ్మో! ఈ రాత్రే నేను యిక్కడినుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ జన్మలో వెనక్కిరాను తల్లోయి!" ఎఫీ వణికిపోతూ కంగారుగా మెట్లవైపు పరుగుతీసింది.
నాన్సీ క్షణికమైన తన భయాన్నుంచి తేరుకొని వేగంగా వెళ్ళి ఎఫీని పట్టుకొంది.
"క్రిందకెళ్ళి పాపను భయపెట్టకు తల్లీ!' అంటూ ఆమెను బ్రతిమాలింది. "ఇంతకూ యిక్కడ నువ్వు స్పష్టంగా ఏమి చూశావు?"
"అస్తిపంజరం నీపై దాడి చేసింది."
"ఎఫీ! అదికాదు. అది ఆ బట్టలబీరువాలో వేలాడదీయబడింది. దాని చేతిని లోపల తలుపుకున్న కొక్కానికి తగిలించినట్లున్నారు. నేను తలుపుని బలంగా గుంజటం వల్ల తూలి, దాని చెయ్యి బయటకొచ్చింది. దాని వేళ్ళు నా గొంతుని తాకాయి."
నాన్సీ లోపలికెళ్ళి తెల్లని దాని చేతి ఎముకలను తడిమింది.
"ఏమైనప్పటికీ, అది యిక్కడ ఏమి చేస్తోంది?" ఎఫీలో భయం కొంతవరకూ తగ్గింది. "నాకిది నచ్చలేదు."
నాన్సీ బదులిచ్చేలోపే మెట్ల దగ్గర పాదాల అలికిడి వినిపించింది.
"ఏం జరిగింది? ఎవరో అరిచినట్లు వినిపించింది" అటక మెట్ల దగ్గరనుంచి మార్చ్ కేకవేశాడు. వెంటనే నాన్సీ అటకలో నుంచి మెట్ల దగ్గరకు వచ్చింది.
"ఇక్కడ బట్టలబీరువాలో అస్తిపంజరం కనిపించింది. దాన్ని చూసి మేము ఉలికిపడ్డాం" పైనుంచి పెద్దాయనకు ఆమె బదులిచ్చింది.
మార్చ్ ఓపిక చేసుకొని మెల్లిగా అటకమెట్లు ఎక్కి తెరచి ఉన్న వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్ళాడు.
"ఇదా?" అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకొన్నాడు. "నేను దీని గురించే మరిచిపోయాను. ఫిప్ దీన్ని యీ బట్టలబీరువాలో పెట్టినట్లు నాకు తెలీదు."
తరువాత అతను ఫిప్ బంధువైన ఒక యువ వైద్యవిద్యార్ధి యీ అస్తిపంజరాన్ని తెచ్చినట్లు చెప్పాడు.
"ఈ కుర్రాళ్ళు ఎలాంటివాళ్ళో చూశావా?" అంటూ ముసిముసిగా నవ్వుకొన్నాడు.
"ఈ అస్తిపంజరాన్ని హలోవీన్ ఉత్సవంకోసం తెచ్చి, దాన్ని తిరిగి తీసుకుపోలేదు."
(ఇక్కడ పాఠకులకు చిన్న వివరణ - క్రైస్తవులకు క్రిస్మస్ తరువాత అతి పెద్ద పండుగ హలోవీన్. దీన్ని అమెరికా, కెనడా దేశాల్లో జరుపుకొంటారు. అక్టోబరు 31 రాత్రి పిల్లలంతా భూతాలు, దెయ్యాలు, మంత్రగాళ్ళ వేషాలను వేసుకొని యింటింటికీ వెళ్ళి కాండీ(ఆంగ్లేయుల స్వీట్) అడుగుతారు. అది యివ్వకపోతే వారిమీద మాయను ప్రయోగిస్తామని సరదాగా బెదిరిస్తారు. ప్రజలు పిల్లలకు స్వీట్లను పంచిపెడతారు.)
"మీ అబ్బాయే దీన్ని యిందులో పెట్టాడని ఖచ్చితంగా చెప్పగలరా?" నాన్సీ అడిగింది.
"ఆ పని ఇంకెవరు చేస్తారు?"
నాన్సీ బదులీయలేదు. మౌనంగా ఆమె బట్టలబీరువాపై తన పరిశోధనను కొనసాగించింది.
'ఇంట్లో వాళ్ళు తప్ప బయటవాళ్ళను భయపెట్టడానికే ఫిప్ స్వయంగా యీ వింతవస్తువును యిక్కడ పెట్టి ఉండవచ్చు. అలా బయటవాళ్ళను భయపెట్టాలనుకోవటంలో అతని ఉద్దేశం ఏమై ఉండాలి? ఈ బీరువా తెరచి తన సాహిత్యాన్ని వాళ్ళు దొంగిలించకూడదని యిలా చేశాడా?' ఆ ఆలోచన ఆమెను ఉత్తేజపరిచింది. వెంటనే ఆమె ఆ పాత బీరువాని శోధించటానికి కొవ్వొత్తిని ఎత్తి పట్టుకొంది. హడావిడిగా చూసిన ఆమెకు దానిలో దుమ్ము, సాలెగూళ్ళే కనిపించాయి. బీరువాలో యిరుప్రక్కలా, క్రింద, మీద ఏమైనా రహస్య అరలు ఉన్నాయోమోనని చేతితో తట్టి చూసింది. అలాంటివేమీ కనబడలేదు.
ఆమె కోసం ఎదురుచూసి అలిసిపోయిన ఎఫీ, నాన్సీని బాగా పొగిడి క్రిందకు వెళ్ళటానికి ఒప్పించింది. మార్చ్ కూడా తన మనవరాలిని విడిచి చాలాసేపైనందున క్రిందకు వెడదామన్నాడు. తన అన్వేషణను అర్ధంతరంగా ముగించటం నాన్సీకి యిష్టం లేకపోయినా, పెద్దాయన మాటపై గౌరవంతో అయిష్టంగానే వాళ్ళతో రెండవ అంతస్తుకి అనుసరించింది.
"ఆ వార్డ్ రోబ్ ని మరొకసారి చూడాలి. ఏదో గొప్ప రహస్యం దానిలోనే ఉందని మనసు పదేపదే చెబుతోంది" అంటూ నాన్సీ తనలో అనుకొంది.
రెండు గంటలపాటు పెద్దాయనతో కూర్చుని తన రేడియోని విందామె. కానీ తన కొడుకుదని గతంలో పెద్దాయన చెప్పిన పాట మళ్ళీ రాలేదు. పదిగంటలకు ముసలాయన లేచి నాన్సీని చూసి నవ్వాడు.
"నిద్ర వస్తోంది. ఇంతవరకూ నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతలు."
"త్వరలోనే రహస్యాన్ని భేదిస్తాం" భరోసా యిస్తూ ఆమె లేచింది.
ఆమె తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళింది కానీ నిద్రపట్టటం లేదు. ఆమె బుర్రనిండా అస్తిపంజరం, ఎఫీ చెప్పిన ఆగంతకుడి ఆలోచనలే మసలుతున్నాయి. ఇంట్లోనుంచి, బయట ఖాళీ ప్రదేశాలనుంచి వినిపించే విచిత్రమైన శబ్దాలకు మగతనిద్రనుంచి అప్పుడప్పుడు త్రుళ్ళిపడి లేస్తోంది. చివరగా నాన్సీ మేలుకొనేసరికి బాగా తెల్లవారిపోయింది.
"ఎనిమిదవుతోంది!" నాన్సీ తన చేతివాచీని చూసుకొని విస్తుపోయింది. "నేను కొద్దిసేపే నిద్రపోయి ఉంటాను. ఇంటికి త్వరగా వెళ్ళి నాన్న ఆఫీసుకి వెళ్ళేలోపున, ఆయనతో టిఫిన్ చేయాలి" అనుకొంటూ హడావిడిగా మంచం దిగింది.
మార్చ్ తో మళ్ళీ వస్తానని చెప్పి కారులో తన యింటికి బయల్దేరిందామె. తను యిల్లు చేరేసరికి డ్రూ సూక్ష్మదర్శిని(మైక్రోస్కోప్) క్రింద ఏదో వస్తువుని పరిశీలిస్తున్నాడు. చేస్తున్న పనిలోంచి తలెత్తి కూతుర్ని పలకరిస్తూ ముద్దాడాడు.
"నువ్వు వచ్చి ఈ ముసలితండ్రితో కూర్చుని తింటావనుకున్నాను. రాత్రి అద్భుతాలేమన్నా జరిగాయా?"
"లేదు. ఒక అస్తిపంజరం నాకు ఆత్మీయంగా దగ్గరవటం తప్ప."
"ఏమిటీ?"
నాన్సీ నవ్వుతూ జరిగిందంతా తండ్రికి వివరంగా చెప్పింది.
"ఎందుకో ఆ వార్డ్ రోబ్ ని మరింతగా శోధించాలనిపిస్తోంది."
"ఆ అటక ఒక అద్భుత ప్రదేశంలా ఉందే!" డ్రూ వ్యాఖ్యానించాడు. తరువాత తనకొచ్చిన సమస్య గురించి చెప్పాడతను.
"నువ్వు రావటం నాకు ఆనందంగా ఉందిరా! లేదంటే నేనే అక్కడకు వచ్చేవాణ్ణి."
"ఏదైనా సమస్యా? "
"నిజం చెప్పాలంటే కాదనుకో! కానీ తికమక పెడుతోంది. వీటిని చూడు" అంటూ తన బల్లవైపు చూపించాడు. ఆ బల్లపై ఆడవాళ్ళు మెడచుట్టూ వేసుకొనే రెండు తెల్లటి పట్టు కండువాలు ఉన్నాయి. అవి రెండూ పోలికలో ఒకలాగే ఉన్నాయి.
"వాటితో మీరేం చేయాలనుకొంటున్నారు?" నాన్సీ అడిగింది.
"ఇది మరో కేసు" నవ్వుతూ చెప్పాడతను. "మరొకసారి వాటిని జాగ్రత్తగా చూడు. ఆ రెంటినీ ఒకే మూలపదార్ధంతో తయారుచేసినట్లు లేదూ?"
ఆమె వాటిని పరిశీలనగా చూసింది. "నాకేమీ తేడా తెలియటం లేదు."
"ఈ సూక్ష్మదర్శినితో పరిశీలించినా నాకూ తేడా కనపడటం లేదు" చెప్పాడతను.
నాన్సీ వాటిని చేతితో తాకి చూసింది. కర్సన్ డ్రూ ఆశ్చర్యంతో ఆకాశంలోకి చూస్తున్నాడు.
"అసలు సమస్య ఏమిటి?" ఆమె అడిగింది.
"చూట్టానికి ఒకేలా ఉన్నా, ఈ రెండు కండువాలను రెండు వేర్వేరు కంపెనీలు తయారుచేశాయి. నా క్లయింట్ "బుకర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ" అధ్యక్షుడు బుకర్. అతను యీ కండువాల తయారీలో తన కంపెనీ వాడుతున్న ప్రత్యేక మూలపదార్ధాన్ని తయారుచేసే ఫార్ములాను ఎవరో దొంగిలించి, తన వ్యాపారం పడిపోయేలా చేస్తున్నారని గోలపెడుతున్నాడు" డ్రూ కూతురికి వివరించాడు.
"ఆ రెండవ కంపెనీ పేరేమిటి?" ఆమె అడిగింది.
"ది లూసియస్ డైట్ కార్పొరేషన్."
"అదెక్కడుందో నాకు తెలుసు" నాన్సీ ఉత్సాహంగా చెప్పింది. "మిస్టర్ డైట్ కూతురు డయానె, నేను చదివిన పాఠశాలలోనే చదివింది. నా కన్న వయసులో కొంచెం పెద్దది. ఆమె తండ్రి ఈ ఫార్ములాను దొంగిలించాడంటారా?"
కూతురు మాటలకు న్యాయవాది కంగారుపడ్డాడు. "డయానె నీకు స్నేహితురాలా?" అడిగాడతను.
"లేదండీ! నేను ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆమె కొన్ని ప్రత్యేకమైన సమూహాలతోనే కలుస్తుంది. చాలా అందమైన అమ్మాయి. ఆమె తనకు తోచినట్లే చేసే మనిషి. ఒకరకంగా దారితప్పిన అమ్మాయి."
"ఆమె నీకు స్నేహితురాలు కాకపోవటం మన అదృష్టం" అంటూ తేలిగ్గా గాలి పీల్చుకొన్నాడు. "ఎందుకంటే ఈ విషయంలో నువ్వు చిన్న గూఢచర్యం చేయవలసి ఉంటుంది."
"గూఢచర్యం అంటే నాకు చాలా యిష్టం"
"అదే అనుకొంటున్నాను. మనం టిఫిన్ చేసేటప్పుడు, నిన్న సాయంత్రం బుకర్ నాకు చెప్పిందంతా చెబుతాను."
తండ్రీకూతుళ్ళు టిఫిన్ చేస్తూండగా డ్రూ విషయమంతా వివరించాడు.
"గతంలో తన ఫాక్టరీలో పనిచేసి మానేసిన ఒక వ్యక్తిని డైట్ కంపెనీ గూఢచారిగా బుకర్ అనుమానిస్తున్నాడు. అతని ఫొటో చూశాను. చూడటానికి మొరటుగా ఉంటాడు. తుప్పలా పెరిగిన నల్లటిజుట్టు" చెప్పాడతను.
"ఇంతకీ అతని పేరేమిటి?"
"ఇది అతని అసలుపేరు కాకపోవచ్చు. ముద్దుపేరనుకొంటా! బుషీట్రాట్."
"ఏమిటీ? బుషీట్రాట్! పేరు వింతగా ఉందే!" అంటున్న కూతురి తలపై ఆప్యాయంగా తట్టాడతను.
"తుప్పలా పెరిగిన జుట్టు. బుషీట్రాట్ పేరు. ఆ వాలకానికి తగ్గ పేరు" అంటూ చమత్కరించాడు.
(తరువాత కధ వచ్చే నెల సంచికలో. . .)

No comments:

Post a Comment

Pages