‘రజని’ అనే బాలాంత్రపు
రజనీకాంతరావు
పోడూరి శ్రీనివాసరావు
బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త... లలితసంగీతమంటే గుర్తుకు వచ్చే ప్రథమ వ్యక్తి... శ్రీ
బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆకస్మిక మరణానికి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నాను.
*****
తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరిగా, పాటల రచయితగా, వాటికి అందమైన
బాణీలు కట్టి, మధురంగా ఆలపించే గాయకునిగా, ఆకాశవాణి
కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా, మహోన్నతమూర్తిగా
ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారే.
రజనీకాంతరావు 1920 జనవరి 29న నిడదవోలులో కవిరాజహంస శ్రీ
బాలాంత్రపు వెంకటరావు, శ్రీమతి వెంకటరమణమ్మ దంపతులకు
జన్మించారు. శ్రీ బాలాంత్రపు నళినీ కాంతారావు గారు వీరి అన్నగారు. వీరి తండ్రిగారు
సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరిసిన, జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన ‘కవిరాజహంస’ బాలాంత్రపు వెంకటరావు. బాలాంత్రపు వెంకటరావు గారు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల
సంస్థాపకులు, నిర్వాహకులు. తల్లి వెంకటరమణమ్మ సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. ఇంటిలో
ఎల్లపుడూ సాహితీ సౌరభాలు వెల్లివిరుస్తూ ఉండేవి.ఎందఱో సాహితీ ప్రముఖుల
ఇష్టాగోష్టులతో సంభాషణలతో ఆ ఇంటి వాతావరణం సాహితీ గుబాళింపులు వెదజల్లుతూ ఉండేది. దానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాల కోసం వస్తూ పోతూ
వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతుండేది.
శ్రీ బాలాంత్రపు
రజనీకాంతరావు బాల్యం పీఠాపురంలో గడిచింది. బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ దగ్గర
భక్తిసంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు.
కాకినాడలో పి.ఆర్.కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు.
రజని 1937-1940 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) లో ఎం.ఏ. తెలుగు చదివారు.
పింగళి లక్ష్మీకాంతంగారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.
1940 వ
సంవత్సరంలో ఎం.ఎ పట్టభద్రులైన శ్రీ రజనీకాంతరావు గారు 1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం
ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళారు.
కర్సియాంగ్ నుండి డిల్లిలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు
వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరుగా ఉండేవారు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో
గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల
తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠండైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకుఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు
1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి నెహ్రూ
""Our tryst with destiny" ప్రసంగం తర్వాత రజని రచించి స్వరపరిచిన "మాదీస్వతంత్రదేశం" అనే గీతం ప్రసారమయింది.
1972లో రజనీ రచించి స్వరపరిచిన "కొండ నుండి కడలి దాకా"
రూపకం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీనికి జపాన్ నుంచి
"నిప్పాన్హోసోక్యొకాయ్" బహుమతి లభించింది
- కృష్ణశాస్త్రిగారి 'అతిథిశాల' సంగీతరూపకానికి పర్షియన్ సంగీతం ఆధారంగా కూర్చిన సంగీతానికి చాల పేరు వచ్చింది.
- 1981లో మేఘసందేశ రూపకానికి బెంగుళూరులో ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది.
- ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమం ప్రారంభించారు.
- ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమం ప్రారంభించారు.
- మధురగాయకుడు ఘంటశాలను ఆకాశావాణికి పరిచయం చేసింది శ్రీ రజనీకాంతరావు కారే.
రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని దోహదం చేశారు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు
రజని రసమధురంగా రచించారు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. ఇతర రచయితల గీతాలకి కూడా స్వరరచన
చేశారు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించారు.
స్వరకర్తగా, గేయకవిగా, సినీ
గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. భానుమతి, రజని
కలిసి పాడిన పాటలు చిత్రసీమలో గణన కెక్కాయి. స్వర్గసీమ, గృహప్రవేశం
ఇత్యాది చిత్రాలకు పాడారు. ప్రసిద్ధ బహుముఖాప్రజ్ఞాశాలి భానుమతితో కలసిపాడిన పాటలు
చిత్రసీమలో ప్రాచుర్యం పొందాయి.
వీరి
రచనలు కోకొల్లలు – సుమధురమైనది ,అత్యంత ప్రజాదరణ పొందినవి. అందులో ప్రముఖమైనవి:
- శతపత్ర సుందరి గీత సంపుటి. 200పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది)
- 1964లో ప్రచురితమైనవిశ్వవీణ రేడియో నాటకాల సంకలనం.
- ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. (దీనికి 1958లో తెలుగు భాషా సమితి పోటీ బహుమతి లభించింది)
- తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో 'Alone with spouse divine' అనువాదం
- క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం 'Amourse of the Divine Cowherd' (కేంద్ర సాహిత్య అకాడమీవారికి)
- అదే విధంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారికి క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు కూడా రచించి ఇచ్చారు.
- 'రజనీ భావతరంగాలు' - ఆంధ్రప్రభలో శీర్షిక నిర్వహించారు.
- క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో)
ఇవి
కాకుండా జేజిమామయ్య పాటలు, మువ్వగోపాలపదావళి, త్యాగరాజు, శ్యామశాస్త్రి
జీవితచరిత్రలు, ఏటికి ఎదురీత (కవితలు), చతుర్భాణీ
(4 సంస్కృత
నాటకాలకి తెలుగు అనువాదం),ఆన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం – ఇలా ఎన్నో
రచనలు శ్రీ రజనీకాంతరావు గారి కలం నుంచి జాలువారాయి.
రజనీకాంతరావు
రచించిన గేయసంపుటిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్,మద్రాసు వారు 1954 ప్రచురించారు.
ఇక శ్రీ రజనీకాంతరావు గారు రచించిన నృత్య, సంగీత
రూపకాల విషయానికివస్తే- చండీదాసు, మేఘసందేశం, సంధ్యాదీపకళిక, మధురానగరిగాథ, సుభద్రార్జునీయం, గ్రీష్మఋతువు, శ్రీకృష్ణశ్శరణం
మమ, మేనకావిశ్వామిత్ర, క్షీరసాగర
మథనం (స్వరరచన), విప్రనారాయణ (స్వరరచన),దివ్యజ్యోతి(బుద్ధుడు), విశ్వవీణ (ఓర్ఫియస్), కళ్యాణశ్రీనివాసం, నమోస్తుతే
హరిమొదలైన సృత్య, సంగీత రూపకాలు రచించారు. వీరు బాణీ కట్టిన స్వర
రచనలు కృష్ణశాస్త్రిగారి అతిథిశాల (ఉమర్ ఖయ్యూం) (స్వరరచన) - పర్షియన్ బాణీలో
కూర్చిన సంగీతం. దీనికి చాలా పేరు వచ్చింది.
వీరు
సాధించిన పురస్కారాలు, వీరికి ప్రదానం చేసిన బిరుదులు అనేకం.
- రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీఠాగూర్ అకాడమీ రత్న ప్రదానం చేసింది.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం 1981 లో బహుకరించిన కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన కళారత్నఅవార్డు పురస్కారం, 1961లో ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి - అమెరికాలోని అప్పజోస్యులవిష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం, మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ వారి నాథ సుధార్ణవపురస్కారం, పుంభావ సరస్వతి బిరుదు,‘ నవీన వాగ్గేయకార’ బిరుదు – ప్రధానమైనవి.
క్లుప్తంగా
చెప్పాలంటే నేటికీ తెలుగు ప్రజలకు మేలుకొలుపు పాడుతున్న ఆకాశవాణి భక్తిరంజని
కార్యక్రమానికి రూపకర్తగా, నవీన వాగ్గేయకారులుగా, రచయితగా, స్వరకర్తగా, బహుముఖ
ప్రజ్ఞాశాలిగా 1947 ఆగష్టు 15న, భారతదేశం
స్వాతంత్యం సముపార్జించిన వెంటనే ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసి, తొలుతగా తొలిప్రధాని
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జాతినుద్దేశించి ప్రసింగించిన అనంతరం వెంటనే ఆలపించిన
దేశభక్తి గీతం ‘మోగించు జయభేరి’ శ్రీ రజని గారే వ్రాసి కంపోజ్ చేయడం ఒక విశేషం అయితే ...గాయని
టంగుటూరి సూర్యకుమారి గారు ఆ పాట పాడడం మరో విశేషం. అదే విధంగా ఎంతో ప్రాచుర్యం
పొందిన, ఎందరినో ఉత్తేజపరిచిన టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించిన మరో దేశభక్తి
గీతం ‘మాదీస్వతంత్రదేశం ...మాదీస్వతత్ర జాతి’ కూడా శ్రీ
రజనీకాంతరావు గారే స్వరపరచారు.
అలాగే
ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ‘భక్తిరంజని’ ప్రవేశపెట్టి
1956లో ‘శ్రీ సూర్య నారాయణా...మేలుకో హరి సూర్య నారాయణా’ బంతి
భక్తిగీతాలను అత్యంత శ్రావ్యంగా తెలుగు శ్రోతలకు వినిపించిన ఘనత శ్రీ బాలాంత్రపు
రజనీకాంతరావు గారిదే.
పుట్టిన
రెండేళ్లకే తల్లి కన్ను మూయడంతో పిఠాపురం లోని చిన్న అమ్మమ్మ వద్ద పెరిగారు.
రజనీకి తండ్రి నుంచి సాహితీ వారసత్వం,తాతగారైన బాలాంత్రపు వెంకట నరసింహంగారి వద్ద నుంచి సంగీత వారసత్వం వచ్చాయి.
రజనీది సంగీత
సాహిత్య సమ్మిళిత జీవితం. లలిత సంగీతంలో ఆయన ముద్ర అజరామరం. 8దేల్లకే కల్యాణి
రాగాన్ని ఆలపించిన శ్రీ రజనీ, తన 16 ఏటతొలిపాట రాసి, బాణీ కట్టి
పాడారు.
‘స్వర్గసీమ’లో భానుమతి
పాడిన ‘ఓహో పావురమా!’ మొదలు ‘రాజమకుటం’సినిమాలో ‘ఊరేదిపేరేది ఓ చందమామ...’ వరకు ఎన్నో
గీతాలను రజనీ తెలుగు సినిమాకు అందించారు. ఏడెనిమిది సినిమాలకు పాటలు స్వరపరచారు.
98 ఏళ్ల వయసులో
ఆ మహనీయుడు 22.04.2018 వ తేదీ తెల్లవారుఘామున తన ముగ్గురు కుమారులను, ఇద్దరు
కుమార్తెలను, అశేష సంగీతాభిమానులను శోకసముద్రంలో ముంచి, దివికేగారుశ్రీ
బాలాంత్రపు రజనీకాంతరావుగారు. ఆత్మీయులంతా ‘రజనీ’అని ముద్దుగా
ప్రేమగా పిలుచుకునే శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు సరస్వతీమాతకు ముద్దుబిడ్డ.
సంగీత, సాహిత్య స్రష్ట అయిన ఆ మహానుభావునికి నా వంతు నివాళి ఈ వ్యాసం.
***
రజని గారి గురించి చక్కగా తెలియజేసారు👌👌,ధన్యవాదాలు
ReplyDelete