ఈ దారి మనసైనది -5
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. ఇక చదవండి. )
ఇద్దరు ఒకేసారి ఆ ల్యాబ్లోకి వెళ్లారు.
ల్యాబ్లో అప్పటికే ల్యాబ్ టెక్నిషియన్స్ .... మైక్రో స్కోప్స్ ని స్లైడ్స్ ని రెడీ చేసి వుంచారు.
ప్రొఫెసర్ మేడం గారొచ్చి ఆ రోజు గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ గురించి చెప్పారు.
దీక్షిత, అనురాగ్ తోటి సూడెంట్స్ వారి వారి మైక్రో స్కోప్స్ తీసుకొని స్లైడ్స్ ను ఫోకస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అనురాగ్ మాత్రం దీక్షిత పక్కన నిలబడి మైక్రోస్కోప్ ని చేతిలోకి తీసికొని....
‘స్లైడ్ ని ఇలా ఫోకస్ చెయ్యాలి అంటూ ఒకస్లైడ్ ని ఫోకస్ చేసి చూపిస్తున్నాడు.
మన్విత దృష్టి అనురాగ్ విూద నుండి దీక్షిత మీదకి సాగి అక్కడే ఆగిపోయింది.
అనురాగ్ పక్కన దీక్షితను ఎప్పడు చూసిన చేస్తున్న పని చేయలేక... వస్తున్నఆలోచనలను ఆపలేకపోతుంది.
ఆ ఆలోచనలు ఎంత వద్దనుకున్నా మన్విత మనసు మైదానంలో నుండి లోపలికి దూసుకువచ్చి మనసుని అతలాకుతలం చేస్తున్నాయి. ఆలోచనగా తన దృష్టిని ఒక చోటనిలిపి, జ్ఞాపకాల దొంతరలోకి వెళ్లింది. వెంటనే మన్విత కళ్ల ముందు ఆమె గతం మెదిలింది.
మన్విత తండ్రి స్కూల్ టీచర్.
ఆయన ప్రస్తుతం బమ్మెర అనే ఊరిలో పని చేస్తూ ప్రతిరోజు బస్లో వెళ్లి వస్తుంటాడు. బమ్మెర అనే ఊరికో ప్రత్యేకత ఉంది.
ఆ ప్రత్యేకత మహాకవి పోతన ఆ ఊరిలో జన్మించడమే. పోతనపై అభిమానం వున్నవాళ్లు ఆ గ్రామం వెళ్లి ఆయన మూలాలను దర్శించుకొని వస్తుంటారు. విశ్వనాథ్ కూడా పోతన కవి పట్ల వున్న మక్కువ తోనే ఆ ఊరిలో టీచర్ జాబ్ చేస్తున్నట్లు అప్పడప్పడు చెబుతుంటాడు. ఆయన స్కూల్లో చిన్నపిల్లలకి పాఠాలు చెప్పి వచ్చాక... ఇంకెవరితో మాట్లాడే ఓపిక లేనట్లు మౌనంగా వుంటాడు. ఆయన మౌనాన్ని చూసి మితభాషిలా భావిస్తారు.
మన్విత తల్లి కృష్ణవేణి ... నానమ్మ వర్ధనమ్మ.
వీళ్లిద్దరు ఎప్పడు చూసినా సూటిపోటి మాటలతో క్షణం తీరిక లేనట్లు గొడవ పెట్టుకుంటూ, మూతికి, ముక్కుకి పక్షవాతం వచ్చినట్ల అటు, ఇటు విచిత్రంగా తిప్పుకుంటూ తిరుగుతుంటారు. ఆ ఇంట్లో మన్విత అనే అమ్మాయి ఒకతి వుందని పట్టించుకోరు.
విశ్వనాధ్ ఇంట్లో వుంటే మాత్రం తల్లి గాని, నానమ్మ గాని మాట్లాడుకోరు, పోట్లాడుకోరు. మూగసైగలతో పని చేసుకుంటూ మూగ బొమ్మల్లా తిరుగుతుంటారు. వాళ్ల నటన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే వుంటే బావుండని మన్విత అనుకోని రోజులేదు.
బద్ద శ్రతువుల్లా ఒకే యింట్లో వుంటూ అత్తా , కోడళ్ళ అనుబందానికి అర్థం చేరిపేస్తున్నవాళ్లను చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదు మన్వితకి.
ఒక్కోసారి గట్టిగా అరిచి వాళ్లిద్దర్ని కంట్రోల్లో పెట్టాలన్నంత కోపం వస్తుంది. ఇంకా వినకపోతే నాలుగు తన్నులు తన్ని ఓమూలన కూర్చోబెట్టాలన్నంత అవేశం కూడా వస్తుంది కానీ.... ఒక వైపు తల్లి ఇంకోవైపు నానమ్మ కావటంతో తను అనుకున్నపని చేయలేకపోతోంది. అలాగని వాళ్లను సమర్థించలేక పోతుంది.
ఇంట్లో వున్నంత సేపు అంతర్మధనం ...
ఎప్పడెప్పడు బయటకేల్దామా అన్న కుతూహలం.
బయట కెళ్తే కాళ్లు విరగొడతానని తల్లి బెదిరింపు, ఒక వేళ ఎదిరించి వెళ్తే
" నీ మనవరాలికి నీ పోలికలు మాత్రమే వచ్చాయనుకున్నా. నీ బుద్దులు కూడా ఏడ్చి చచ్చాయి. ఆ రోజుల్లో నువ్వుకూడా ఇలాగే బయట తిరుగుళ్లు తిరిగే దానివా? దగ్గర కూర్చోబెట్టుకొని భయం చెప్పు దానికి. నాకు కోపం వస్తే చంపేస్తా. ముఖ్యంగా మొగ పిల్లలతో ఆటలు నాకు నచ్చవు" అంటూ వర్ధనమ్మ విూదకి పోతుంది.
“మగ పిల్లలతో ఆటలనేవి మా రోజుల్లో మీ రోజుల్లో, ఈ రోజుల్లో - ఏ రోజుల్లో అయినా వుంటాయి. చిన్నప్పడు మగ పిల్లల్లో తెగ ఆడిన వాళ్లు కూడా పెద్దయ్యాక వాళ్ల పిల్లల్ని ఆడనివ్వరు. ఆంక్షలు పెడతారు.అలా పెడితే మంచి తల్లి క్రింద లెక్క... తల్లి భయంగా పెంచుతుందని లోకం కూడా అనుకోవాలి కదా? ఏ టైంలో ఏది చెయ్యాలో అది చెయ్యడంధర్మం.. ఇప్పడు నా ధర్మం" అంటూ వర్ధనమ్మ ఇంకా ఏదో అనబోతుంటే,
“ఇచ్చిన లెక్చరు చాలు దాని సాక్సులు ఎక్కడున్నాయో వెతికి యివ్వండి!" అంటూ కిచెన్ లోకి వెళ్లి ఒక గిన్నె తీయబోయి ఇంకో గిన్నెతీస్తూ వున్న గిన్నెలన్నీ గిన్నెలన్నీ క్రింద పడేసింది కృష్ణవేణి.
ఆ చప్పడుకి ఒక్క క్షణం చెవులు మూసుకుని ...
" నేను వెతుకుంటాను మమ్మీ ! నానమ్మకి ఎందుకు పనులు చెప్తావు? నీ కింకేం పనిలేదా ? ఎప్పడు చూసినా నానమ్మని ఏదో ఒకటి అనందే నీకు పనిచేసే మూడ్ రాదా ? నువ్వు ప్రశాంతంగా వుండవు. మమ్మల్ని ప్రశాంతంగా వుంచవు. ఛ ... ఛ.... ఇంట్లో వుండాలంటేనే కంపరంగా వుంది" అంది చక చక బుక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ.
“గుడ్డు బోయి పిల్ల వెక్కిరించడం అంటే ఇదే ఎక్కడికి పోతాయి బుద్దులు. ఏ నక్షత్రాన నా కడుపున పడ్డావో కాని, నన్ను ఏదో ఒకటి అనకుండా వున్నావా? ఒక్క రోజన్నానా మాట విన్నావా? నా పెళ్ళైన కొత్తలో నీ మేనత్త కూడా ఇంతే ! ఎప్పడు చూసినా నా వెంట పడి నన్ను వేపుకు తినేది". అంటూ తన ఆడపడుచుని గుర్తు చేసుకుంటూ గొణగడం మొదలు పెట్టింది కృష్ణవేణి.
తల్లి మాటలు వింటూ .. సాక్సులు తొడుక్కొని, షూస్ వేసుకొని, గబ గబ బ్యాగ్ ను భుజాలకు తగిలించుకొని పరిగెత్తుతున్నట్టే స్కూల్కి వెళ్తుంటే -
" అయ్యో. అయ్యో తిని వెళ్లవే. లంచ్ బాక్స్ తీసికెళ్లవా ? ఇప్పడు తినకా, మద్యాహ్నం తినక ఎలా ఉంటావే.” అంటూ వీధి మలుపు తిరిగే దాక వెంటబడ్డ తల్లి వైపు చూడాలన్నా చిరాకు వేసి అలాగే స్కూల్ వైపు నడిచింది.
వరంగల్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వెళ్లాగానే ....
స్కూల్ పిల్లల్ని వదిలే ఆటోలు, కార్లు, స్మూటర్లు, పిల్లల్ని స్కూలుకి నడిపించుకుంటూ వచ్చే పెద్ద వాళ్ళు కిటకిట లాడుతున్నారు.
అందర్ని తప్పించుకుంటూ నడవటం రోజు అలవాటైన దానిలా...
భుజాలకున్న బ్యాగును సరిచేసుకుంటూ స్కూల్ లోపలికి అడుగుపెడుతుంటే నీరసంగా అన్పించి టిఫిన్ తిన లేదన్న విషయం గుర్తొచ్చింది.
అసెంబ్లీ మొదలవటంతో....
ప్రేయర్కి సంబంధించిన లైన్స్ ఫాం అయ్యాయి. డ్రమ్స్ సౌండ్ లయబద్దంగా విన్పిస్తుంటే పిల్లలంతా ఎక్సైజ్ లు చేశారు. యూనిఫాంలో వున్న ఆ పిల్లలు నీ రెండలో మెరిసిపోతున్నారు.
తరువాత పిల్లలతో గ్రేట్ మెన్స్ గురించి పబ్లిక్ స్పీచ్ ఇప్పించారు. అనురాగ్ చాల చక్కగా స్పీచ్ ఇచ్చాడు. ఎక్స్ టర్నల్ కాంపిటీషన్ కోసం వెళ్లి ప్రైజులు తెచ్చుకున్నపిల్లలకి మిగాతా పిల్లలకి తెలియటం కోసం ఎనౌన్స్ చేసి ఫ్రెజులు ఇచ్చారు.
ఆ ఫ్రెజుల్లో ఎక్కువ అనురాగ్ కి వచ్చాయి.
వందేమాతరం ... అయ్యాక ఫ్లెడ్జ్ జరిగింది.
ఫ్లెడ్జ్ అయ్యాక....
మన్విత సృహ తప్పి క్రింద పడింది.
(సశేషం)
No comments:
Post a Comment