బాలగేయాలు
వివరణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య
గురువు
భారతీయ సాంప్రదాయం గురువులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును త్రిమూర్త్యాత్మకంగా చిత్రించడం మన సంప్రదాయంలోనున్న గొప్ప విషయం. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది. విద్యార్థి, గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ | అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవంతు విద్యయా || అంటారు. విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో 'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం మరో దీపాన్ని ప్రజ్వలించినట్లు చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. ఆచార్యుడు, దేవుడు ఒకే సారి వస్తే అచార్యునికే అగ్రపీఠం అంటాడు కబీర్ దాసు (गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय). గురువుగా అవతరించి కొన్ని తరాలను ఉద్ధరించడం అవతార ప్రక్రియలో ఒక క్లిష్టమైన విషయమంటారు పెద్దలు.
అలాంటి గురువుకు నేడు సంఘంలో స్థానం సన్నగిల్లింది. గురువంటే తేలికభావన ఏర్పడింది. బలిచక్రవర్తి అంతటివాడు గురువు శుక్రాచార్యుని మాట విన్నంతవరకే స్వర్గాధిపత్యం దక్కింది. గురువు మాట వినకపోవడం వలన పాతాళానికి అణగద్రొక్కబడ్డాడు.
గురువంటే ఎవరో తెలిపే చిన్న గీతం ఈ మాసం మీకోసం....
అక్షరాలను నేర్పేవాడు
అక్షరాలా బతుకునిచ్చేవాడు
అజ్ఞానాన్ని తొలగించేవాడు
విజ్ఞానాన్ని అందించేవాడు
అతడే..అతడే...గురువు
బుద్ధిమంతుల్ని చేసేవాడు
సుద్దులెన్నో చెప్పేవాడు
మార్గదర్శిగా నిలిచేవాడు
మంచి మార్గాన్ని చూపేవాడు
అతడే..అతడే..గురువు
భవితను తీర్చి దిద్దేవాడు
ప్రగతికి బాటలు వేసేవాడు
ఉత్తమ వ్యక్తిగ మలిచేవాడు
ఉన్నత దశను కల్పించే వాడు
అతడే..అతడే.. గురువు
జీవితానికి అర్ధం చెప్పేవాడు
జీవితాంతం గుర్తుండేవాడు
జగతికి వెలుగై మెలిగేవాడు
జాతి గౌరవం నిలిపేవాడు
అతడే..అతడే.. గురువు
(బాలబాట సెప్టంబర్-2017 సంచికనుండి)
-0o0-
No comments:
Post a Comment