జయ జానకీ ప్రాణ నాయకా!
అక్కిరాజు ప్రసాద్
"జానకీ! ఎక్కడ? తువాలు మర్చిపోయాను, కాస్త ఇవ్వవూ!" అని బాత్రూములో స్నానం చేస్తున్న రామం భార్య జానకిని కేక వేశాడు. "ఏవిటి రామూ, మరీ చిన్నపిల్లాడిలా! నాకేమో బోలెడు ఇంటి పనుంది. ఇదుగో టవల్." అని తువ్వాలు అందించబోయింది జానకి. చక్కగా తలంటి పోసుకొని, బట్టలు వేసుకుని, తల తుడుచుకుంటూ బయటకు వచ్చి భార్యను గట్టిగా వాటేసుకున్నాడు రామం. "పొద్దున్నే ఏవిటీ ఈ సరసాలు, అది కూడా అబద్ధాలు చెప్పా?" అంటూ సిగ్గుతో తలదించుకుంది జానకి. "జానూ! నిద్రలేచినప్పటినుంచి నీ దర్శనం కాలేదు...అందుకే చిన్న అబద్ధం...అని ఉత్సాహంగా "ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణం క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా...నిను చూడలేని క్షణం నాకు క్షణం కాదు..." అని పాటపాడుతూ శ్రీమతిని గాఢంగా కౌగిలించుకున్నాడు. వెచ్చని రామం కౌగిట జానకి వెన్నలాంటి మనసు కరిగిపోయింది.
30 ఏళ్ల శ్రీరాం, 27 ఏళ్ల జానకి - ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్. జేఎన్‌టీయూ కూకట్‌పల్లి ఇంజనీరింగ్ కాలేజీ రోజుల నుండి పరిచయం. రామం అంటే జానకికి అభిమానం, ఆరాధన. అలాగే జానకిని రామం నిరంతరం గమనించేంత అందం ఆమెది. మంచి వాగ్ధాటి, ఉత్సాహం కల యువకుడు రామం. ఇంజనీరింగ్ కాలేజీలో అనేక రకాల పోటీలలో రామానిదే ప్రథమ స్థానం. అప్పుడు ఆమె అతని పట్ల ఆకర్షితురాలైంది. కానీ ప్రేమగా మారే లోపు అతను ఇంజనీరింగ్ పాసై హైదరాబాదులో గూగుల్‌లో ఉద్యోగంలో చేరాడు. తరువాత ఓ ఐదేళ్లు పెద్దగా కలుసుకోలేకపోయారు. విధి ఎంత బలీయమైనదో అంటే మళ్లీ అదే శ్రీరాం జానకికి పెళ్లి సంబంధంగా రావటం, అన్నీ కుదిరి పెళ్లి జరిగిపోవటం...పదిహేను రోజుల్లోనే వారిద్దరూ ఒకటైనారు. జానకికి భర్త పంచ ప్రాణాలు. రామానికి జానకి చుట్టూ జీవితం.
పెళ్లై రెండేళ్లవుతోంది. ఇద్దరూ ఉద్యోగాలు, వారాంతాలతో తీరిక లేని జీవితాలైనా జానకీ శ్రీరాంల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు లాగనే సాగిపోతోంది. సమయం విలువ తెలిసిన వాడు రామం, డబ్బు విలువ తెలిసిన స్త్రీ జానకి కావడంతో సంసారంలో పెద్దగా ఒడిదుడుకులు లేవు. ఆనందంగా ఉండే మనిషి ముఖంలో ఉండే ప్రశాంతత, అందం జానకిలో కనబడతాయి."జానూ! ఇంకా పెళ్లి కూతురు లానే ఉన్నావు! నేను చాలా అదృష్టవంతుడిని" అన్నాడు రామం. "మాష్టారూ! మన పెళ్లై రెండేళ్లే! నేను ఇంకా చిన్నపిల్లనే" అని నవ్వేసింది జానకి. జానకి ఉంటే ఆ రాముడికి ఇంకేమీ పట్టదు. ఆమెకూ అంతే. వీళ్లిద్దరూ ఆఫీసు నుండి ఇంటికి వస్తే అసలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అన్న సంగతే గుర్తుండదు.ఒకరి వెనక ఒకరు ఏదో ఒక పని, కబుర్లు.
ఓ ఆదివారం సాయంత్రం - "రామూ! ఈ నెల నాకు రోజూ సాయంత్రం ఆలస్యమవుతుంది. వచ్చే నల ఫస్ట్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. సాయంత్రం భోజనం సంగతి నువ్వే చూసుకోవాల్సి వస్తుంది..." అంది జానకి. "అలాగే జానూ! కష్టపడి పని చేసుకో!" అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పాడు రామం. జానకికి చేదోడు-వాదోడుగా నిలిచాడు. జానకి ప్రాజెక్టు పూర్తి చేయటానికి అహర్నిశలూ శ్రమిస్తోంది. ఆ ప్రాజెక్టు నమూనా పూర్తయితే తను పని చేసే కంపెనీకి పెద్ద కాంట్రాక్టు వస్తుంది.
ఒకరోజు రాత్రి పది గంటలకు జానకి ఇంటికి తిరిగి వచ్చింది. కాస్త కంగారు గానే "రామూ! నన్నెవరో ఫాలో చేస్తున్నారని అనుమానంగా ఉంది. ఒకే నెంబర్ ఉన్న బైక్ మీద హెల్మెట్‌తో మనింటి సందు చివరివరకూ వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే కనిపించడు...ఏం చేయమంటావు?" అంది. రామం ఆలోచించాడు. "ఇంకో రెండు రోజులు చూడు. అప్పుడు పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం" అన్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.
"రామం గారూ! జానకి గారి మీద యాసిడ్ అటాక్ జరిగింది. వాడెవడో జానకి ముఖం మీద చాలా ఘోరంగా దాడి చేశాడు. మేము అపోలో హాస్పిటల్‌కు తీసుకు వచ్చాము. మీరు వెంటనే బయలుదేరి రండి" అని జానకి సహోద్యోగి శ్రావ్య ఫోన్ చేసింది. రామానికి మెదడు మొద్దు బారింది, దుఃఖం, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. పరుగు పరుగున అపోలో చేరుకున్నాడు. ముఖమంతా ప్లాస్టర్ వేసి ఉంది జానకి. కళ్లెదుట ఉన్న దారుణమైన నిజాన్ని నమ్మలేకపోయాడు. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ మొదలైన చికిత్సలతో ఎంతో కష్టపడి నాలుగు వారాల తరువాత జానకిని ఇంటికి పంపించారు. తన రూపం అద్దంలో చూసుకుని జానకి మౌనంగా కూలబడిపోయింది. ఎక్కడ నాటి అందాల రాణి జానకి, ఎక్కడి ఈ రూపం, అని వెక్కి వెక్కి ఏడ్చింది. రామం భార్య పక్కనే నిల్చుని ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి భార్య-భర్త మధ్య మాటలు లేవు. జానకి ఉద్యోగానికి వెళ్లే పరిస్థితిలో లేదు. రామం, జానకి ఆ యాసిడ్ అటాక్ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ ఓ రెండు మూడు నెలలు తిరిగారు. సీసీటీవీ డేటాతో నిందితుడి రూపం స్కెచ్ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ల సాయంతో నేరస్థుడి ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. అతడెవరో కాదు జానకి కంపెనీలో పని చేసే అటెండెంట్. శాడిజంతో, జానకి అందమైన రూపాన్ని వికృతం చేయాలన్న రాక్షస ప్రవృత్తిలో ఆ నేరానికి పాల్పడ్డాడు. నాలుగు నెలలు నాలుగు యుగాలుగా సాగింది. జానకి మనోధైర్యం కోల్పోయినా, సమాజం, బంధువులు, స్నేహితులు రకరకాల మాటలు అన్నా రామం వాటిని తిప్పికొడుతూ జానకికి అండగా నిలిచాడు. పెళ్లైనప్పుడు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రేమతో జానకికి మళ్లీ జీవితం పట్ల ఆశ కలిగించాడు.
"రామూ! నువ్వు నా మీద జాలితో ప్రేమగా ఉంటున్నావు కదా?" - ఒకరోజు అడిగింది జానకి. రామం మనస్సు చివుక్కుమంది. "జానూ! రెండు రోజుల తరువాత కేస్ పెడదాములే అన్న నా అలసత్వ ధోరణి నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అన్న ఆలోచన నన్ను చాల రోజులు బాధ పెట్టింది. కానీ, ఆ బాధలో నేను జీవించదలుచుకోలేదు. మనం గత రెండేళ్లుగా పంచుకున్న ప్రేమానురాగాలు నాకు దృఢత్వాన్నిచ్చేలా చేశాయి. యుక్త వయసులో మనకు బాహ్య సౌందర్యంతో ఆకర్షణ కలిగే మాట నిజం. కానీ, ఈరోజు నా పరిస్థితి అలా లేదు. నువ్వు నా దృష్టిలో ఈరోజు ఆరోజు ఒక్కటే" అన్నాడు. రామం ముఖంలో ఆందోళన, సానుభూతి ఏ మాత్రం కనబడటం లేదు. జానకి భర్త మాటలు నమ్మలేక పోయింది. నిజమేనా? రామం నాకు ధైర్యం చెప్పటానికి అలా చెప్పాడా లేక అబద్ధం చెప్పాడా? ఈ ప్రపంచంలో ఏ మగాడైనా స్త్రీ పట్ల ఇలా కూడా ఆలోచించగలడా? నిజమేనోమో? రామం నన్ను ఎంతగా ప్రేమించే వాడు...అన్న రకరకాల భావనలు జానకి మదిలో మెదిలాయి.
ఆరు నెలల తరువాత జానకిపై యాసిడ్ అటాక్ చేసినందుకు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. జానకి తన రెండవ జీవితాన్ని ఆరంభించింది. సమాజం నుండి ప్రశ్నలు, అవసరం లేని సానుభూతి, కొందరి మంచి సలహాలు, కొందరి అతి జాగ్రత్తలు, కొందరి అప్రస్తుత ప్రసంగాలు, కొందరి వ్యంగ్యాలు...అన్నిటినీ జీర్ణించుకొని ముందుకు వెళుతోంది. అయినా, జానకి మళ్లీ అదే కంపెనీలో ఉద్యోగానికి వెళ్లటానికి మానసికంగా సిద్ధం లేదు.
"జానూ! నీ మనసులో ఏముందో నాకర్థమైంది. ఎక్కడి ఆ అందమైన ముఖం, ఎక్కడ ఈ ముఖం, ఎలా ఆ సహోద్యోగుల మధ్యకు తిరిగి వెళ్లి పని చేయటం. ఎలా పనిలో ధ్యాస కలిగి ఉండటం...అనే కదా?"..."అవును రామం! ఇల్లు వేరు, ఆఫీసు వేరు. నిరంతరం పది మంది నా మీద సానుభూతి చూపిస్తే తట్టుకునే పరిస్థితికి ఇంకా నేను చేరుకోలేదు. పైగా ఎటువంటి కామెంట్లు వస్తాయో అని భయంగా ఉంది...ఇట్స్ నాట్ ఎ జోక్..."
"జానూ! ప్రపంచం బలహీనంగా కనిపించే వారి పట్ల సానుభూతి చూపించటం సహజమే. కాని ఆ సానుభూతిలోనే మనం జీవించకుండా ఉండాలంటే మన జీవితంపై మనకు స్పష్టత ఉండాలి. అందవికారమైన ముఖము అనేది సమాజంలో ఒక సమస్యే అయినా నీ వ్యక్తిత్వం దానిని అధిగమించేదిలా ఉండాలి. దానికి నువ్వు సిద్ధం కావాలాంటే నిన్ను నీవు మరింత దృఢం చేసుకోవాలి. ధైర్యంగా ఉండే మనిషిని ఈ సమాజం ఏమీ చేయలేదు. ఈ ప్రపంచం దేహ సౌందర్యానికిచ్చే ప్రాధాన్యతను నీ మనస్సులో ఉండే స్పష్టత, దృఢత్వం వలన మాత్రమే ఎదుర్కొని, ఇతరులు చూపించే రకరకాల వికారాలను పక్కకు పెట్టి ముందుకు సాగగలవు. ఈ ప్రపంచానికి నువ్వు చేయవలసింది చాలా ఉంది అన్నది గుర్తు పెట్టుకో!" అన్నాడు. "రామూ! నీ మాటలు విన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది, కానీ లోకాన్ని క్షణ క్షణం ఎదుర్కుంటున్నప్పుడు వీగిపోతున్నాను" అంది. "అందుకే నిన్ను నీవు ఇష్టపడాలి, అది ఎలా ఉన్నా సరే. నువ్వు చేసుకునే సంకల్పం యొక్క బలమే నిన్ను ఆ సామయంలో సరైన రీతిలో స్పందించేలా చేస్తుంది. ఇది నీ ఆత్మశోధన, ఆత్మబలం ద్వారా మాత్రమే రాగలిగే మార్పు" అన్నాడు రామం.
"రాము ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నాడు? జీవితాంతం నా యీ రూపాన్ని చూసుకుంటూ, కలిసి జీవిస్తూ తాను ఆనందంగా ఉండగలడని ఎలా అనుకుంటున్నాడు? ఏమిటీ మనిషి?" అని మనసులో పదే పదే రామం వ్యక్తిత్వంలోని లోతులను తరచి చూడాలన్న ఆలోచనలో మునిగిపోయింది జానకి. రామం నడవడికే ఆమెలోని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమెను ముందుకు నడిపించాయి. ఆమె తిరిగి పాత ఉద్యోగంలో చేరింది.
"జానకీ! యాసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్ వాళ్ళు నీతో మాట్లాడాలిట. చెన్నై నుండి ఫోన్ చేశారు" అని ఫోన్ జానకికిచ్చాడు రామం. ఫౌండేషన్ వాళ్లు జానకితో ఆ సంస్థ ఇటువంటి దాడులలో బాధితురాళ్ల సహాయానికి, అవగాహన పెంచటానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జానకిలో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. "రామూ! ఫౌండేషన్ కార్యక్రమాలలో నేను కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నాలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని చెరిపి వేయటానికి ఇది అత్యుత్తమమైన సాధనం" అని చెప్పింది. "చాలా మంచి నిర్ణయం జానూ! ఒక సమస్యలో పూర్తిగా నిమగ్నమై దానిని పరిష్కరించేందుకు పని చేయటం వలన వ్యక్తిత్వం మరింత దృఢమవుతుంది. బాధితులకు సాయం ఎన్నో రకాలు.ఆల్ ది బెస్ట్" అన్నాడు. ఫౌండేషన్ హైదరాబాద్ శాఖలో ప్రధాన పాత్రకు జానకి ఎంపికైంది. తనలాంటి యువతులకు, బాలికలకు అండగా నిలిచి వారికి సరైన అవగాహన అందించటానికి ప్రెజెంటేషన్లతో కూడిన శిక్షణా తరగతులు, ఆడియో/వీడియో రికార్డింగ్లు, తెలుగు-ఆంగ్ల భాషలలో వ్యాసాలు మొదలైన అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. అనేక రకాల విద్యాసంస్థలకు వెళ్లి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
"జానకి గారూ! మన ప్రాజెక్టు కస్టమరుకు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. గతంలో మీరు ఇచ్చారు. ఈసారి నేను వెళితే బాగుంటుందేమో అని బాస్ అంటున్నారు..ఐ మీన్ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్‌డ్ టు యూ..." అంది సహోద్యోగి శ్రావ్య. "శ్రావ్య! ఎప్పటి లాగే, ఈ ప్రెజెంటేషన్ నేనే ఇస్తాను. నేను బాస్‌తో మాట్లాడతాను" అని దృఢ నిశ్చయంతో, ప్రశాంతంగా సమాధానం చెప్పింది. బాస్ సుధీర్ దగ్గరకు వెళ్లి "సుధీర్! నా సౌందర్యానికి, పనితనానికి సంబంధం లేదు. మీరు దీనిని నమ్ముతారా?" అని సూటిగా అడిగింది. "అవును జానకి. కానీ...". ఆయన పూర్తి చేసే లోపల జానకి అందుకొని "ఐతే నేనే వెళతాను. మీకేమైనా అభ్యంతరమా?" అని గట్టిగా ప్రశ్నించింది. ఆశ్చర్యపోయి సుధీర్ సరే అన్నాడు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని కస్టమర్ ప్రెజెంటెషన్. జానకి బోర్డు రూములోకి ప్రవేశించగానే అందరూ గుసగుసలు. జానకి ప్రశాంతంగా, చిరునవ్వుతో, ఎప్పటిలాగానే తనదైన శైలిలో ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆమె సమాధానాలు ఇచ్చే పద్ధతి, కనబరచిన ఆత్మ విశ్వాసం, లోతైన విషయ పరిజ్ఞానం అందరినీ ఆకట్టుకుంది. ప్రాజెక్ట్ కాంట్రాక్టు జానకి పని చేసే సంస్థకే దక్కింది. ఇండియా తిరిగి వచ్చింది జానకి.
"రామూ! నువ్వు నాపై దాడి జరిగిన మొదట్లో ఏం మాట్లాడవో ఇప్పుడు అర్థమవుతోంది. నాలోని భయాలు, సమాజం అడిగే ప్రశ్నలకు ధైర్యంగా చెప్పలేని మనస్తత్వం నన్ను వెనక్కు లాగాయి. ఒక్కసారి మళ్లీ నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి అని అర్థమైన తరువాత, నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పటంతో పాటు, ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రశాంతంగా అధిగమించగలుగుతున్నాను. దీనికి కారణం నీ స్ఫూర్తే" అని అతను గుండెల మీద తలవాల్చి చెప్పింది. రామం లోలోపల చాలా సంతోషించాడు.
"జానకి! నన్ను క్షమించండి. ఆరోజు మీ రూపం వలన మన కంపెనీకి రావలసిన ప్రాజెక్టు రాదేమో అన్న అపోహలో అలా సందేహంగా మాట్లాడాను. మీ ఆత్మవిశ్వాసంతో మన కంపెనీకి ప్రాజెక్టు తీసుకు వచ్చారు. ఇది నాకు కనువిప్పు. ఇక ముందు ఇలా వ్యవహరించను" అని సుధీర్ అన్నాడు. "సుధీర్! ఇట్స్ ఆల్ రైట్. ప్రపంచంలో చాలామందిలో ఉండే భయమే నాలోనూ ఉండేది, మీలో కూడ కలిగింది. కానీ, మన సామర్థ్యం ఏమిటో తెలియజేసే మన శ్రేయోభిలాషులు ఆ భయాలను తొలగిస్తారు. నేను ఈరోజు ఈ మానసిక స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం మై హస్బెండ్ శ్రీరాం" అని నవ్వుతూ వాతావరణాన్ని తేలిక పరచింది. అక్కడున్న వారికి జానకి ఓ లీడర్. ఓ స్ఫూర్తిదాత.
శీతాకాలం సాయంత్రం. రామం-జానకి బిర్లామందిర్ వెళ్లారు. అలా మెట్లెక్కుతూ పైకి వెళ్లి స్వామిని దర్శించుకుని, వెనుకవైపు కూర్చుని హైదరాబాద్ నగర సౌందర్యాన్ని చూసి ఆనందపడుతున్నారు. "రామూ! నీ ఆలోచనల్లో ఇంతటి స్పష్టత ఎలా వచ్చింది?" అని అడిగింది. "జానూ! మా అమ్మ నాన్నలు ఎలా ఉంటారో నీకు తెలుసు. నాన్న బాగా నలుపు, అమ్మ చాలా అందంగా, మెరిసే రంగుతో ఉంటుంది. అందరికీ నచ్చే చేసుకున్నా, నాన్నను పెళ్లైన తరువాత రకరకాలుగా ఎగతాళి చేసే వాళ్లు. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నలుపు-తెలుపు వివక్ష చాలా ఎక్కువ. ఆయన రూపం ఆయన కోరుకుని వచ్చింది కాదని అందరికీ తెలుసు. కానీ, ఛాన్స్ దొరికినప్పుడల్లా, ఆయన ముందు వెనుక ఆ రంగుపై చర్చ, ఓ వ్యంగ్యమైన మాట. మొదట్లో నాన్న నొచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. అమ్మ సర్ది చెప్పేది. తరువాత ఆయన ఎదిరించటం మొదలు పెట్టారు. కొందరికి అర్థమై సరిదిద్దుకున్నారు, మరికొందరు అయానను నోటి దురుసు మనిషి అన్నారు. అయినా, నాన్న మళ్లీ ఏ నాడూ తన రంగును చర్చలోకి రాకుండా ఆత్మవిశ్వాసంగా నిలిచారు. అదే నాకు జీవితంలో గొప్ప పాఠం. నీపై దాడి జరిగి, ప్లాస్టిక్ సర్జరీ జరిగిన వారానికే నాకు రాబోయే కాలమెంత క్లిష్టమైనదో అర్థమయ్యింది. అప్పుడే నేను దీన్ని ధైర్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను, అదే నా మాటల్లో, చేతల్లో..." అన్నాడు రామం.
"నిజమే రామూ! నాకు కూడా నా రంగు, రూపంపై కాస్త అహంకారమే ఉండేది. ఎందుకంటే, వాటికి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పొగిడే వారు. నాపై జరిగిన దాడితో నాకు కనువిప్పు కలిగింది...నీ సపోర్టు లేకపోతే నేను మళ్లీ నిలదొక్కుకోవటం ఎంత కష్టమయ్యేదో" అంది. "భర్తగా నేను నా ధర్మం నిర్వర్తించాను జానకీ! దాడి నీ దేహంపైన జరిగింది, నీ హృదయం దానితో వీగిపోకూడదు. నీ ఆశలు, కలలు చెదరి పోకూడదు. అది సాధించగలిగావు. చాలా తృప్తిగా, ప్రశాంతంగా ఉంది" అని జానకి చెయిపట్టుకొని మెట్లు దిగుతూ ఆనందంగా ఇంటికి బయలు దేరారు.
"రామూ! ఈరోజు ఈ త్యాగయ్య కీర్తన మరింత అర్థవంతమనిపిస్తోంది. విను" అని త్యాగరాజస్వామి వారి "జగదానంద కారకా! జయ జానకీ ప్రాణ నాయకా! " అనే ఘన రాగ పంచరత్న కృతిని వినిపించింది. "రాముడు లోకానికి, సీతకు ఆనందం కలిగించిన వాడు. నువ్వు కూడా అంతే, ఈ జానకికి, నా ద్వారా మరెందరో మహిళలకు స్ఫూర్తిప్రదాతవు" అని అతనికి దగ్గరగా ఒదిగి ఆనందబాష్పాలు రాల్చింది. వారి హృదయాలు, వారి ఆత్మలు పూర్తిగా అనుసంధానమై ఆనందో బ్రహ్మ అని పలికాయి.
***
Chala bagundi andee.. very inspirational story.. can I please recite or use it in a skit for my radio show?
ReplyDeleteSure andi.
Delete