జర్నీ ఆఫ్ ఏ టీచర్ -5
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
“మన మ్యాథ్స్ సార్కు తెలుసు ఆ టాపిక్స్ చెప్పి పిల్లలను తృప్తి పరచడం అంత తేలికైన విషయం కాద”ని అంటూ మ్యాథ్స్ సార్ వంక చూశాడు సూర్యప్రకాష్.
“ఔను సార్” అంటూ మద్ధతు పలికాడు మ్యాథ్స్ సార్.
భాగ్యలక్ష్మి తన చేతి వాచ్ వంక చూసుకుంటూంది. సమయం నాలుగు కావస్తోంది.
సూర్యప్రకాష్ భాగ్యలక్ష్మి వంక చూస్తూ “ఈ ఒక్క రోజు కాస్తా ఆలస్యమవుతుందమ్మా..” అన్నాడు.
“ఫరవాలేదు సార్.. చెప్పండి.. చాలా ఇంటరెస్ట్ గా ఉంది” అంటూ ప్రోత్సహించింది.
సూర్యప్రకాష్ కొనసాగించాడు.
***
1985 జులై మాసాంతం.
అనాసబండ జూనియర్ కాలేజీ నుండి రిలీవయ్యాను.
విద్యార్థులు, స్టాఫ్ వీడ్కోలిచ్చారు.
హైదరాబాదు నుండి మునిపల్లికి దాదాపు నూటపది కిలోమీటర్ల దూరం. కాలేజీ మధ్యాహ్నం షిఫ్ట్ లో నడుస్తోంది.. ఆలస్య మౌతుందేమోననే భయంతో ట్రైన్ సౌకర్యమున్నా .. బస్సులో వెళ్లాను.
ట్రైన్ అయితే మళ్ళీ నడవాల్సి వస్తుంది. బస్సైతే కాలేజీ ముందే ఆగుతుంది. అయినా ఆలస్యమే అయింది.
దాదాపు రెండు గంటల ప్రాంతంలో కాలేజీ చేరాను. నేరుగా వెళ్లి ప్రిన్సిపాల్ గదిలో అలా కాలు పెట్టానో లేదో.. ధభాల్న ఎవరో కింద పడినట్లు శబ్డ మయ్యింది. భయానికి నా పాదం ఝడిసి లిప్తకాలం వెనక్కి జరిగింది. ధైర్యం కూడగట్టుకుని కుడి కాలు ముందు పెట్టి తొంగి చూసాను..
“ఎక్స్ క్యూజ్ మీ సార్” అంటూ..
అక్కడి దృశ్యం చూసి బెదరి పోయాను. ఒకతను అడ్మిషన్ రిజిస్టరెత్తి ఇంచార్జ్ ప్రిన్సిపల్ విద్యాసాగర్ తలపై గట్టిగా బాదిన శబ్దమది.. అని అర్థమయ్యింది. అతడి చుట్టూ విద్యార్థుల గుంపు.
నన్ను చూడగానే ఎవరో తెలియక పిల్లలంతా పారి పోయారు. ఇదంతా సర్వసాధారణం.. అన్నట్లు నన్ను చూసాడు విద్యాసాగర్. ఎవరు కావాలి అన్నట్లు కళ్ళు ఎగరేసాడు..
నేను కాస్తా తేరుకొని “సార్ నేను మ్యాథ్స్ లెక్చరర్ని. నాగమణి స్థానంలో వచ్చాను” అనేసరికి విద్యాసాగర్ ఉన్నఫళంగా లేచి షేక్ హేండిచ్చాడు.
ఆరడుగుల ఆజాను బాహుడు.. కర్ల్స్ వెండ్రుకలు.. మనిషి మంచి రంగులో ఉన్నాడు.. చాలా హాండ్సమ్ పర్సనాలిటీ.
“వెల్కం సార్.. వెల్కం..” అంటూ టేబుల్పై ఉన్న పిల్లల అడ్మిషన్ ఫారాలను కాస్తా పక్కకు తోసి కాలింగ్ బెల్ నొక్కాడు.
“సార్ కూర్చోండి..” అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు.
నేను కూర్చుంటూ నా జాయినింగ్ రిపోర్ట్ కు బదిలీ ఉత్తర్వుల కాపీని జతపర్చి ఇచ్చాను. దానిపై ఎండార్స్ మెంట్ వేసాడు.
హాజరు రిజిస్టర్లో నా పేరు రాసి ఆనాటి తేదీలో సంతకం చేయుమని నా ముందుంచాడు.
హేండ్ రైటింగ్ చాలా బాగుంది.
నేను సంతకం చేస్తుంటే కాలేజీ అటెండర్ వీరయ్య వచ్చాడు. నన్ను చూసి అభివాదం చేసాడు.
“స్టాఫ్ రూంకు వెళ్లి మన సార్లనందరిని రమ్మను. కొత్త మ్యాథ్స్ సార్ వచ్చిండని చెప్పు. అట్లనే వెళ్లి చాయలు బిస్కట్లు తీస్కరా..” అంటూ కొన్ని డబ్బులిచ్చాడు.
“సార్ నేనే స్టాఫ్ రూంకు వెళ్లి పరిచయం చేసుకుంటాను. అందరినీ రమ్మనడం బాగుండదేమో..!” అన్నాను సందేహిస్తూ.
“ఓకే..సార్ అలాగే.. మనమే వెళ్దాం. వీరయ్యా స్టాఫ్ రూంకే తీస్కరా..” అంటూ ఫ్లాస్క్ తీసుకొని వెళ్తున్న వీరయ్యకు వినపడేలా చెప్పాడు.
విద్యాసాగర్ నేను స్టాఫ్ రూంకు వెళ్ళాం.
పరిచయాలయ్యాయి. నాగమణి మ్యాథ్స్ మేడం చెప్పినట్లు పాపారావులో నక్క వినయాలు కనబడ్తున్నాయి. అందితే కాలు అందకుంటే జుట్టు పట్టుకునే రకమని అర్థమయ్యింది.
బాటనీ లెక్చరర్ క్రాంతికుమార్ ముఖం అంతా రేపు చస్తామంటే నేనీరోజే చస్తా.. అన్నట్లుగా ఉంది. సర్వం పోగొట్టుకున్న వాడిలా కనబడుతున్నాడు.
పాపారావు కాలేజీ విశేషాలు చెప్పసాగాడు.
“సూర్యప్రకాష్ సార్.. ఈ కాలేజీలో అడ్మిషన్స్ కోసం వార్డు మెంబర్ కాన్నుండి సర్పంచ్ వరకు పైరవీలు చేస్తూనే ఉంటారు. మొన్న ఎమ్మేల్లె సైతం ఒక లిస్టిచ్చి వెళ్ళాడు. మనమేమో.. రిజర్వేషన్లు పాటించాలాయె.. ఎలా వీలవుతుంది చెప్పండి?..
సీటివ్వక పొతే నాయకులను ఎదురించి బతిక బట్టగలమా..? కరువు అంటే కప్పకు కోపం..విడువుమంటే
పాముకు కోపం అన్నట్లుగా కుడితిలో పడ్డ ఎలుకలా గిల గిలా కొట్టుకోవాల్సిందే మనం.. అటు నాయకులు ఇటు పిల్లల చేత మాటలు.. దెబ్బలు తినాల్సిందే..” అంటూ చెబుతుంటే విద్యాసాగర్ను కొట్టిన దృశ్యం జ్ఞప్తికి వచ్చింది.
విద్యాసాగర్ వంక చూసాను. తల దించుకొని ఉన్నాడు.
“నాకు తెలిసింది సార్.. సుధాకర్ వాడో బుడ్డ లీడరు మీ మ్యాథ్స్ గ్రూప్ పిల్లవాడే.. మన ప్రిన్సిపాల్ను రిజిస్టర్తో కొట్టాడట కదా..” అంటూ వీరయ్య టీ బిస్కట్లు తేవడం చూసి మాటమార్చాడు పాపారావు.
“వీరయ్యా.. ముందుగా కొత్త సార్ కివ్వు..” అంటూ మళ్ళీ చెప్పడమారంభించాడు.
“సార్.. నాయకులడిగే అడ్మిషన్లు అర్థవంతమైనయా.. అంటే అవీ గావు.. ఒక్కొక్కనికి రెండేసి అడ్మిషన్లు. దగ్గరలోనే మరో జూనియర్ కాలేజీ హుమ్నాపూర్లో వుంది. అందులో ఇక్కడా.. ఇంకా వీలయితే మరో కాలేజీలో కూడా దూరుతారంటే అతిశయోక్తి గాదు”
నాకు ఆశ్చర్యమేసింది.. వెంటనే అడిగాను.
“అదేంటి సార్.. ఒక్క పిల్లవానికి రెండుమూడు అడ్మిషన్లెందుకు?”
వీరయ్య స్టాఫందరికి టీ, బిస్కట్లు సర్వ్ చేసాడు.
విద్యాసాగర్ తాగడానికి మంచి నీళ్ళడిగాడు. వెంటనే వీరయ్య ఒక ఖాళీ గ్లాసు విద్యాసాగర్ చేతికిచ్చాడు.
“అదేందిరా.. ఖాళీ గ్లాసిచ్చినౌ..” అంటూ విద్యాసాగర్ కసిరాడు.
“పట్టుకో సార్.. నీళ్ళు తెస్తా” అంటూ కుండ మోసుకుంటూ వచ్చి గ్లాసులో వంపసాగాడు.
సినిమాలో స్లోమోషన్లో చూపిస్తున్నట్లు వీరయ్య నటన చూస్తుంటే నాకొక పక్క నవ్వస్తోంది. కాని నవ్వడం సభ్యత కాదని నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకొని చూస్తున్నాను. స్టాఫ్ చూపంతా నాలాగే ప్రిన్సిపాల్ చేతిలోని గ్లాసు.. వీరయ్య చేతిలోని కుండపైనే ఉంది. కుండ మొత్తం వంచినా ఒక్క చుక్క నీటిబొట్టు కూడా గ్లాసులో పడలేదు..
“ఏంరా బద్మాష్.. నఖరాలు చేస్తానవ్..” అంటూ విద్యాసాగర్ కన్నెర్ర చేసాడు.
వీరయ్య వయ్యారంగా కుండ చంక నెత్తుకొని..
“సార్.. గ్లాసుల నీళ్ళు పడ్డయా..? లేంది ఏడికెల్లి పడతై సార్.. వాడు నీళ్ళు తేలే.. వచ్చిన కాన్నుండి ఒక్కన్ని రంగుల రాట్నం లెక్క ఆడికీడికి తిర్గుతాన.. సామ్యుల్ గాడు యింకా రాలే.. ఇగ నీళ్ళు ఏడికెల్లి వత్తై..” అనుకుంటూ వెళ్తుంటే.. సామ్యుల్ ఎదురై వీరయ్య చేతిలోని కుండను లాక్కొని వేగంగా పరుగుతీసాడు.
“చూస్తున్నారా సార్.. మన కాలేజీ సంగతి.. వాడు సామ్యుల్.. నైట్ వాచ్ మాన్. పొద్దున్నే వాటర్ పెట్టి పోవాలి. వీడు వీరయ్య స్వీపర్. వీళ్ళిద్దరూ కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్నారు.
మరొకడున్నాడు మహానుభావుడు. వాడు పర్మినెంట్ అటెండర్.. పేరు రాములు.. వాడు ఇంకా రాలేదు.. రాత్రి మందెక్కువై యాడ పన్నడో..” అంటూ విద్యాసాగర్ చెబ్తుంటే విస్తుపోయి వినసాగాను.
నా బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ తీసి విద్యాసాగర్కిచ్చాను. తాను తాగి తిరిగి నాకిచ్చాడు. నేను పాపారావు కందించాను.
పాపారావు బాటిల్ ఖాళీ చేసాడు.
“సార్..కొత్త సార్ను అప్పుడే హడల్ కొట్టకండి.. రెండు రోజులు పోతే కాలేజీ వాతావరణమంతా అదే
అర్థమౌతుంది..” అంటూ పాపారావు టీ తాగుతూ విద్యార్థుల గురించి చెప్పసాగాడు.
“సార్.. పిల్లలు కాలేజీకి వచ్చేది చదవడానికి కాదు.
కేవలం స్కాలర్షిప్ కోసం. ప్రభుత్వం హాస్టల్ వసతి బదులు పిల్లలకు మెస్ చార్జీలు నెలవారీ చొప్పునిస్తోంది. ఇంట్లో పేరెంట్స్ కూలీనాలీకి వెళ్తారు. పిల్లలు ఇలా కాలేజీలలో అడ్మిషన్లు పొంది డబ్బులు సమకూర్చుకుంటారు. ఆ డబ్బులూ సరిపోక పార్ట్ టైం ఉద్యోగాలూ చేస్తుంటారు.. లేకుంటే పొట్ట గడవడం కష్టం గదా..” అంటూ టీ తాగడం పూర్తి చేసి సిగరెట్టు వెలిగించాడు.
నాకూ సిగరెట్టు ఆఫర్ చేసాడు. నేను తల అడ్డంగా ఊపాను. దాన్ని విద్యాసాగర్ అందుకొని వెలిగించాడు.
అడ్మిషన్ ఉన్నంత మాత్రాన సరిపోతుందా..! హాజరు వద్దా.. అని ఆలోచిస్తున్నట్లుగా ఉన్న నాముఖాన్ని చూసాడు పాపారావు.
చిరునవ్వు నవ్వుతూ “ సార్..మీరు ఏమాలోచిస్తున్నారో నాకు తెలుసు.. హాజరు గురించే కదా.. ఏం చేస్తాం సార్.. వారి కుటుంబ పరిస్థితి గమనించి దయచూపాల్సి వస్తోంది. వచ్చినా రాకున్నా హాజరు వేస్తాం. లెక్చరర్లందరూ ఇచ్చిన హాజరు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మేస్ చార్జీలు మంజూరయ్యేది.. తప్పదు.. మరి” అన్నాడు.
“పోనీలే సార్.. అవన్నీ ఇప్పుడెందుకు.?. మ్యాథ్స్ సార్ ముందు మీరెక్కడుంటరో చెప్పండి” అంటూ క్రాంతికుమార్ నా వంక చూస్తూ అడిగాడు.
“నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు..” అన్నాను.
“సార్.. మీరు హైద్రాబాదులో ఫ్యామిలీ పెట్టి అప్ అండ్ డౌన్ చేయడం బెటర్..” అంటూ విద్యాసాగర్ సలహా ఇచ్చాడు. స్టాఫంతా సమర్థించారు..
నాకు నచ్చలేదు. అలా అయితే విద్యార్థులకు అన్యాయం చేసిన వాణ్ణవుతాననుకున్నాను..
“లేదు సార్.. నా ఫ్యామిలీని హైదరాబాదులో పెట్టినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను” అని నా మనసులోని దృఢ నిర్ణయాన్ని చెప్పే సరికి స్టాఫ్ రూమంతా లిప్తకాలం నిశ్శబ్దమయ్యింది.
అదే రోజు సాయంత్రం క్రాంతికుమార్ను తీసుకొని ఊరు చూద్దామంటూ బయలు దేరాను.
రోడ్లను ఎర్రమట్టి రాజ్యమేలుతోంది. డాబా ఇండ్లు దాదాపు లేవనే చెప్పాలి. ఇండ్ల కప్పులన్నీ పెంకులు బదులు షాబాదు రాళ్ళు. కాంపౌండ్ వాల్స్ గూడా అవే రాళ్ళు. నాకు ఆశ్చర్యమేసింది. వింతగా చూడసాగాను,
“ఈప్రాంతంలోని తాండూర్ షాబాదు రాళ్ళకు ప్రసిద్ధి సార్. చాలా చౌక. అందుకే అందరూ అవే వాడుతారు” అంటూ నా మనసులోని సందేహాన్ని తీర్చాడు.
అతడి సహాయంతో ఒక గది అద్దెకు తీసుకున్నాను. ఇద్దరం కలిసి మళ్ళీ కాలేజికి వచ్చాం. నాలుగు రోజులు సెలవు కావాలంటూ సెలవు దరఖాస్తు ప్రిన్సిపాల్కిచ్చి అదే సాయంత్రం హైదరాబాదుకు బస్సెక్కాను.
హైదరాబాదులో నాకు స్నేహితులున్నారు. ఆ రాత్రి ఒక స్నేహితుని ఇంట్లో బస చేసాను.
ఆమరునాడు సనత్నగర్లో ఒక ఫ్యామిలీ పోర్షన్ అద్దెకు తీసుకొని మాఊరెళ్ళాను. సామాను సర్దుకొని రెండురోజుల్లో సనత్నగర్ వచ్చాను.
పిల్లలను స్కూల్లో చేర్పించడం వగైరా పనులతో ఒక రోజు ఆలస్యమైంది. ఫోన్ చేసి చేబ్దామంటే అప్పుడు సెల్ఫోన్ సౌకర్యం లేదు. ల్యాండు లైన్ కాలేజీలో లేదు.
కాలేజీకి భయం భయంగా వెళ్ళాను. గబా, గబా ఆలస్యమైనందుకు వివరణ రాస్తూ మరో రోజుకు సెలవు రాసి విద్యాసాగర్ ముందుంచాను. ప్రిన్సిపాల్ భళ్ళున పడీ, పడీ నవ్వాడు. అతనితో శృతి కలిపాడు పాపారావు.
“భలే వారు సార్.. లీవ్ లెటర్ ఆ చెత్తబుట్టలో వేసి సంతకాలు పెట్టండి” అంటూ హాజరు రిజిస్టర్ నా ముందుంచాడు విద్యాసాగర్. నా కాలం అంతా ఖాళీగానే ఉంది.
“కొత్తగా జాయినయ్యారు.. ఫ్యామిలీ షిఫ్ట్ చేయ్యడానికామాత్రం మనలో మనకు సహకారం లేకుంటే ఎలా సార్.. సంతకాలన్నీ పెట్టండి. సి.ఎల్. మార్క్ చేయలేదు” అంటూ విద్యాసాగర్ మరో మారు ముసి ముసి నవ్వులు నవ్వసాగాడు.
పాపారావు అతడి గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాల నుండి నన్ను ఓరకంటగా చూస్తున్నాడు.
“నేను కాలేజీకి రాకుండా సంతకాలు పెడితే ఏమీ కాదా? సార్?” అంటూ అమాయకంగా అడిగాను.
“మిమ్మల్ని ఎవరడుగుతరు సార్.. నేనున్నాగదా.. మీకేం భయం” అంటూ భరోసా మాటలు గుప్పించాడు. నాకు మనస్కరించలేదు. కేవలం ఆ రోజు సంతకం మాత్రమే చేసి బయటకొస్తుంటే పాపారావు నన్ను వింతగా చూడసాగాడు. నా వెనకాల విద్యాసాగర్ మాటలు వినవస్తున్నాయి..
“తెలుగు సార్.. మన కొత్త మ్యాథ్స్ సార్ తోటి కాస్తా జాగ్రత్తగా ఉండాలి..”
నేనా మాటలు వినలేదన్నట్లుగానే స్టాఫ్రూంకు వెళ్ళిపోయాను.
(సశేషం)
బాగుందండి.
ReplyDelete