మార్గదీపికలు - అచ్చంగా తెలుగు
మార్గదీపికలు
మా బాపట్ల కథలు -25

భావరాజు పద్మిని

“ప్రసాదమా? అయితే నాకొద్దు.” అంది కొత్తగా వచ్చిన పనమ్మాయి. కోడలి సీమంతానికి తమ ఊరికి వెళ్తూ వెళ్తూ, మా పనమ్మాయి లక్ష్మి తాత్కాలికంగా ఈమెను పెట్టి వెళ్ళింది.
“ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగాను నేను.
“నేను బాప్టిజం తీసుకున్నా. మీ ప్రసాదం తినరాదని పాస్టర్ చెప్పినాడు.”
“అవునా, మా ఇంట్లో ఉదయం కాచే పాల నుంచి అన్నీ దేవుడి ప్రసాదంగానే భావిస్తాము. అన్నట్టు, ఎందుకు తినకూడదు?”
“మీ దేవుడ్లంతా సైతాన్లంట. ఈ మజ్జనే మా వోల్లోకళ్ళకి మీ దేవత దుర్గమ్మ పూనింది. మా పాస్టరు సానా కష్టం పడి వెళ్ళగొట్టినాడు. ఇంకోల్లకి ఎంకటేస్వర సామి పూనాడు. మీరంతా పూజ సేసే దేవుళ్లు సైతాన్లంట, మీ ప్రసాదం తింటే మాకూ పూనుతారంట.”
“అలాగా, ప్రసాదాల్లోంచి మా దేవుళ్ళు లేక నీ భాషలో సైతాన్లు బదిలీ అవుతారా? అయితే నువ్వు కష్టపడి బాప్టిసం తీసుకోడం ఎందుకు? హాయిగా చర్చిలో ప్రసాదం తీసుకోవచ్చుగా, సరిపోయేది!”అన్నాను నేను ఒళ్ళు మండి.
“మీరిట్టనే మాటాడతారని, యినద్దని కూడా చెప్పినాడు.”
“అలాగా, మంచి ముందు చూపున్న పాస్టర్. సరే గాని, నీ భాష చూస్తే తెలంగాణా యాసలో లేదే. ఇంతకీ నీ పేరేంటి? మీదేఊరు?”
“నా పేరు వేంకటమ్మ. మాది బాపట్ల.”
“అదేంటి హిందూ పేరు? మాది కూడా బాపట్లే. ఎక్కడ?”
“అవునమ్మా. మతం మార్చుకున్నా గానీ, పేరు మార్చుకోలా. బాపట్ల క్రైస్ట నగర్లో మా ఇల్లు. భర్త పెళ్ళైన పదిహేనేళ్ళకే పోయాడు. జమ్ములపాలెం రోడ్డులో నాకు ఎకరన్నర పొలం ఉండేది. యవసాయం జేసుకుంటా ముగ్గురు పిల్లల్ని పైకిదెచ్చి పెండ్లి జేసినాను.”
“బాగుంది. మరి బాప్టిజం ఎందుకు తీసుకున్నావు?”
“జీవితంలో డబ్బుల కష్టాలు తట్టుకోలేక బాధ పడతాంటే, మా ఇంటికాడ ఉండే పాస్టర్ యేసుపాదం, యేసును నమ్ముకుంటే అన్నీ బాగుంటాయని చెప్పినాడు. అప్పుడే మతం మార్చుకున్నా, నేనే కాదు, మా ఇంట్లో వోళ్ళందరికీ ఇప్పించా. సొమ్ములు కూడా ఇచ్చినారు."
"ఓ, అలాగా. డబ్బిచ్చి మరీ మతం మార్చారా. ఇంకేం నీ కష్టాలు తీరిపోయుంటాయి కదా. మరి ఊరొదిలి ఇంత దూరం ఎందుకొచ్చావ్?"
"లేదమ్మా. తీరిపొయ్యుంటె నేనిలాగొచ్చి గిన్నెలెందుకు తోముకుంట? " మాట్లాడుతూనే కళ్ళ వెంట నీరు కార్చసాగింది వెంకటమ్మ.
మతాలన్నిటికంటే మానవత్వం గొప్పదని నమ్మేదాన్ని నేను. అందుకే వెంటనే కరిగిపోయి,
"అరె, ఊరుకో. పెద్దదానివి, అలా ఏడవకూడదు. ఇంద ఈ టీ తాగి, బిస్కెట్లు తిను. ఇవి నైవేద్యం కాదులే." అన్నాను చేతికందిస్తూ.

కాస్త మనసు కుదురుకున్నాకా మళ్ళీ ఇలా  చెప్పసాగింది ఆమె. 
"నా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపేను. ఇక కొడుకు నచ్చిన పిల్లని మనువాడినాడు. వాడికి కట్టం నచ్చదు. రాత్రికి రాత్రి మారాజైపోవాలని, పెళ్ళాం మాట విని, నాకున్న పొలం కాస్తా బలమంతంగా అమ్మించి, కారు గొన్నాడు. ఆ కారు అద్దెకు దిప్పడానికి ఓ డ్రైవరును బెట్టినాడు.‌వాడు తప్పతాగి, రాత్రిపూట ఆక్సిడెంట్ చేసాడు. బండి తుక్కు తుక్కయినాది.  బండి కాడికి బోతే ఈడిని జైల్లొ ఎడతారని, వదిలేసుకున్నాము. కేసు గాకుండా మూడు లక్చలు అప్పు జేసి, కట్టేసినా. మా వోడు పెళ్ళంతో సహా ఊరొదిలి పోయునాడు. వోడికి ముగ్గురాడబిడ్డలు, ఓ కొడుకు. ఎంతగాదన్నా తల్లిని గదా. ఇద్దరాడబిడ్డల్ని నాకాడ బెట్టుకుని, నేను పొలం కూలీ పన్లకి బోతా పదిదాకా చదివించినాను. ఏడనైతే సొంత సేజ్జం జేసుకుని, మారాణిలా బతికానో, ఆడనే కూలికి బోయే గతిబట్టింది. ఏనాడు ఆ పిల్లల కర్సులకి మావోడు రూపాయిచ్చింది లేదు. ఇంకెన్నాల్లు సాకుతా? పైగా ఉన్నిల్లు కూడా లాక్కుని అమ్మినాడు. ఇగ ఆడ ఉండలేక ఊరొదిలి మా దూరపు చుట్టం హైదరాబాదులో ఉంటే ఈడకొచ్చి, ఇంటిపన్లు జేస్తన్నాను. వీల్లింట్లొ ఉన్నందుకు పతీ నెలా డబ్బు కట్టాల. మూడేండ్ల బట్టి పన్లు చేస్తున్న, ఈ మజ్జనే గుండెపోటొచ్చి, డాక్టర్ మూన్నెల్లు పని చెయ్యొద్దన్నాడు.మందు బిళ్ళలు ఏసుకుంటా ఇంట్లొ ఉండేతరికి ఉన్న ఇళ్ళన్ని పోయాయి. ఇదిగో ఇప్పుడు మీ లక్ష్మిని అడిగితే, తను ఊరెల్లొచ్చేదాకా, తనిళ్ళు చెయ్యమన్నాది. ఇలాగొచ్చాను."

"అయ్యో , ఈ వయసులో నీకెంత కష్టం వచ్చింది. మరి మీ ఆడ పిల్లల ఇళ్ళకే వెళ్ళకపోయావా? ఇక్కడెక్కడో ఉండడం, వాళ్ళకి డబ్బు కట్టడం ఎందుకు?"
"కలిమిలో పిల్లల కాడికి పోవచ్చుగాని, లేమిలో ఎవరు జూతరమ్మ. అందుకే నాలుగు డబ్బులు ఎనకేసుకుంటె రేపు కాళ్ళు, చేతులు ఆడనప్పుడు ఆ డబ్బు జూసన్న నన్ను ఆదరిత్తారని ఆశమ్మా."
"నిజమేలే. మరి మీ బాప్టిజం వాళ్ళు నీ అవసరాలకు మళ్ళీ డబ్బివ్వలేదా?"
"ఒకసారే ఇత్తారమ్మా. ఇకంతే. ఆ పైన వారొం వారొంప్రార్దన చెయడం తప్ప ఏం చెయ్యలేము."
"ఒక మాటడగనా? మన పుట్టుకతో వచ్చిన అమ్మా, నాన్నా, కుటుంబం, వీళ్ళని మార్చుకోగలమా? వీరంతా మనవారని మనం నమ్ముతాము, ప్రేమిస్తాము. చివరిదాకా, ఏ తేడాలొచ్చినా కూడా వదలకుండా వెంట నిలబడతాం కదా. మరి మతమెలా మార్చుకోగలము? ఆ ఇంట్లో, ఆ చోట మనం ఉండాలనే దైవం మనల్ని అక్కడ పుట్టించారు కదా. మధ్యలో వదిలేసి వెళ్ళడమంటే ఆ దైవేచ్ఛను ధిక్కరించడం కదా. అటువంటప్పుడు బ్రతుకు రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది కదా."
"కష్టాలు తీరతాయంటె ఆశపడ్డా. కాసులు కూడా ఇచ్చారు కదా."
" మరి తీరాయా? రెట్టింపు అయ్యాయి కదా. మీ అవసరం, మీ కష్టమే వాళ్ళకు పెట్టుబడి. నెలకు ఎంత పూజ చేసామా, ఎంత సేవ చేసామా అన్నది మాకు ముఖ్యమైతే, ఎంతమంది మతం మార్చామా అన్నది వాళ్ళకు ముఖ్యం. వాళ్ళ పై అధికారులకు వాళ్ళు ఇన్ని తలకాయలని,  లెక్కలు చెప్పాలి. ఈ మతాలు మార్చే అంటువ్యాధి ఇప్పుడు మన బాపట్లలోనే కాదు, ప్రతి చోటా ప్రబలిపోయింది.
నువ్వే కాదు. నాకు తెలిసిన ఒక ఉన్నత కుటుంబం కూడా ఇలాగే ఏవో ఇబ్బందుల్లో మతం మార్చుకున్నారు. ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న దైవ ప్రతిమలు, యంత్రాలు అన్నీ బయట పారేసారు.‌ చివరికి ఆ కుటుంబం పూర్తిగా పతనమై పోయింది. అందరిని బలవంతంగా మతం మార్చుకోమన్న తల్లి కాన్సర్ తో చివరి క్షణాల్లో నరకం చూసి పోయింది. ‌
ఇంకో కథ చెబితే నవ్వుతావేమో. మా పిల్ల చిన్నప్పుడు బట్టలుతికే చాకలి, సీతని ఉండేది. ఆమెకు మొదటి కాన్పులో అమ్మాయని మెగుడు మండిపడి, చావగొట్టసాగాడు. రెండో కాన్పులో నెలలు నిండుతుండగా, ఒక పాస్టర్ ఏసును నమ్ముకుంటే, కొడుకు పుడతాడని చెప్పాడట. భర్తంటే ఉన్న భయం, కొడుకు పుడితే తన బ్రతుకు చక్కబడుతుందన్న ఆశ, మూడోనెలకే ఆడ, మగ లక్షణాలు ఏర్పడతాయని తెలియని అమాయకత్వం, ఆమెను మతం మారేలా చేసాయి. కొడుకే పుట్టాడు, కాని అప్పటికే వేరే అమ్మాయిని మరిగిన మొగుడు తనను వదిలేసి పోయాడు. ఇంటి పన్లు చేసి బ్రతక సాగింది. ఇక మతం మారి తనేం సాధించిందో నాకు తెలీదు."

ఈలోగా వెంకటమ్మకు ఫోనొచ్చింది, అవతల ఆమె కొడుకు, మనవలు మాట్లాడారు. ఫోన్ పెట్టాకా ఇల్లు తుడుస్తూ ఇలా అడిగిందామె,
"మరి నమ్ముకున్న దేవుడు అడిగిన కోరికలు తీర్చకపోతే ఏం చెయ్యాలమ్మా? ఇంకో దేవుడు తీరిస్తే మారొద్దా?"
"అంటే దేవుడున్నది మన కోరికలు తీర్చడానికన్న మాట. మనకు జన్మని, నెత్తురు ని, సత్తువని, ఐనవాళ్ళని, బ్రతికేందుకు భూమిని, ఇవన్నీ ఊరికే ఇచ్చిన దేవుడు ఇంకేదో ఇవ్వలేదని మతం మార్చేసుకోవాలా? ఆ దేవుడూ అడిగిందివ్వకపోతే ఇంకో మతం మారతావా? అలా ఎన్నని మారగలవు?
దైవం ఉన్నది లౌకికమైన కోరికలు తీర్చడానికే కాదు, అంతకు మించిన ఆత్మోన్నతిని, పరమానందాన్ని మనకు ప్రసాదించడానికి. మనం చెప్పినట్లు ఆయన ఆడాలని కోరుకుంటే, అది ఎంతటి స్వార్ధం? అడిగిందల్లా ఇస్తే మొక్కులు తీరుస్తామనడం, దేవుడితో మనం చేసే వ్యాపారమవుతుంది. భక్తి ఎలా అవుతుంది? మన పరిమితమైన బుద్దికి అందని దివ్యమైన ప్రేమ బంధం దైవానిది. ఇదంతా నీకు అర్ధం కాకపోవచ్చు, నీకు అర్ధమయ్యేలా చెబుతాను.
నీ కొడుకు ఎక్కడికక్కడ నిన్ను మోసం చేసాడు, అవసరానికి వాడుకున్నాడు. అయినా నీవతనితో మాట్లాడుతున్నావు, ఎందుకని?"

"ఎంతైనా కన్నతల్లినమ్మా, కడుపులో పెట్టుకుంటా. వాడు ఏం చేసినా ప్రేమించి, వాడి బాగునే కోరతా."
"కదా. అంటే మనం ప్రేమించే వ్యక్తిని, బంధాన్ని , వస్తువుని, నేలను, దేశాన్ని, ఎన్ని కష్టాలొచ్చినా వదలని నిబద్ధతతో ఉన్నాం కదా. మరి దేవుడిని ఎందుకు మార్చుకోవాలి. అంటే ఆయన పట్ల మనకు నమ్మకం, ప్రేమ లేనట్లేగా."
వెంకటమ్మ ఆలోచనలో పడింది.
"మీ దేవుళ్ళు మాకు పూనతారుగా. "
"మతం మార్చుకునే దాకా నీకు దేవుడైన మా దేవుడు, ఆ తర్వాత సైతానై పూనుతున్నాడు.‌ అలా చెబితే, ఉన్మాదుల్లా ఊగిపోయి, పడిపోయి నటిస్తే, నువ్వు నమ్మేస్తున్నావు. పలుకులు రాని చిలకలా, వాళ్ళేం చెబితే అదే వల్లె వేస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళ బొట్లు చెరిపావు, పూజలు మానావు. నీ కొడుకు చెడ్డవాడైనా సమర్ధించే నువ్వు, నీదైవాన్ని చెడ్డవాడంటే తిరగబడకుండా ఒప్పుకుని, నమ్మావు కదూ. ఇది బాగుందా? నేనే కాదు, ఆత్మ సిద్ధులైన అవధూతలు, సద్గురువులు కూడా ఈ వైఖరిని నిరసిస్తారు. ఒకతను మతం మార్చుకుని, సర్వమత సమదర్శి అయిన షిర్డీ బాబా వద్దకు వెళ్తే, ఆయన లెంపకాయ కొట్టి, 'నీ అబ్బను మార్చుకున్నావట్రా?' అని కోప్పడ్డారని, బాబా చరిత్రలో వస్తుంది. దీన్ని విజ్ఞులైన ఎవరూ సమర్ధించరు."
"అయితే, నేను మళ్ళీ మీ మతంలోకి మారాలంటావా?"
" చూడు వెంకటమ్మ, నీ మతం తిరిగి మార్చడమో, నీ నమ్మకాలు మళ్ళించడమో నా ఉద్దేశం కాదు. నేనే కాదు, ఈ అఖండ భారతావనిలో ఉన్న ఏ హిందువూ తన ఉన్నతికి ,ఇతరుల బాగుకే  ప్రయత్నిస్తాడు తప్ప, మరొకరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని, వాళ్ళను మా‌ మతంలోకి లాగే ప్రయత్నం చెయ్యడు. ఎందుకంటే కన్న తండ్రి వంటి వాళ్ళ దైవం నుండి వారిని వేరుచేసి, బలవంతంగా మరో తండ్రికి దత్తత ఇచ్చేంత కర్కశత్వం మాకు లేదు. అసలు సొంత తండ్రినే గౌరవించనివాడు, అద్దె తండ్రిని ఏం గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు? నమ్మకం, ప్రేమ లేనప్పుడు ఎక్కడా, ఏ మతంలోకి మారినా ఉండవు. అలాంటి వాళ్ళు ఎందులోను ఇమడలేరు. నడి సముద్రంలో నావ వాళ్ళ జీవితం.  
ఆలోచించు, ఇప్పటికైనా, జీవితంలోని ఈ మలి దశలోనైనా కళ్ళు తెరువు.‌ మతాలన్నీ దైవాన్ని చేరే మార్గాలే. ఇది నమ్ముతాము కనుకే మేము సర్వమత సహనాన్ని పాటిస్తాము. ఏ మార్గాన్ని మధ్యలో విడవకుండా, ఏదో ఒక దారిని నమ్మకుని, సాగిపో.‌ నమ్మకం, ప్రేమే దైవం.‌ఇవే దైవాన్ని చేరే దారిలో మనకు ఎదురయ్యే చీకట్ల వంటి కష్టాల్లో, వెలుగు చూపే మార్గదీపికలు."

"ప్రసాదం పెట్టండమ్మా, తిని పోతా." అంటున్న వెంకటమ్మ వైపు చూసి నవ్వి ప్రసాదం పెడుతూ, ఆమెకు జ్ఞాన భిక్ష పెట్టమని ఆ దైవాన్ని వేడుకున్నాను.
*****

No comments:

Post a Comment

Pages