మనవళ్ళ ముచ్చట్లు
పి.ఎస్.ఎం.లక్ష్మి
1. పాపాయి నవ్వులు
ఇవి మా చిన్న మనవడు చి. నివిన్ (రెండు నెలలు) నవ్వులు చూసినప్పుడు, పెద్ద మనవడు చి. ఆరి అల్లరి చూసినప్పుడు నా మనసులో కలిగిన భావాలు... కవిత్వంలో నేను ఓనమః లు కూడా దిద్దలేదు. కానీ, మితృల ముందు నా భావాలు పంచుకోవటానికి సాహసిస్తున్నాను.
పాపాయి నవ్వులు
జలజల రాలే పువ్వులు
తళతళ మెరిసే తారలు
వెలుగులు ఇచ్చే దివ్వెలు
మనసును నింపే వెన్నెలలు
చల్లగా సోకే మారుతాలు
కళ్ళతో తాగే మకరందాలు
అమ్మ గుండెకి అమృత గానాలు
ప్రశాంతత నిలయాలు
హాయికి అర్ధాలు
మనిషికి బంధాలు
దైవానికి ప్రతిరూపాలు
2. అసలుకన్నా వడ్డీ ముద్దు అంటారుగానీ
ఎంతయినా అసలు అసలే వడ్డీ వడ్డీయే
అసలుకోసమే కదా సముద్రాలు దాటి వచ్చింది
వడ్డీ ముద్దయినా వదిలి వెళ్ళవలసిందే కదరా నివిన్!!
3. గుడికెళ్తే భగవంతుణ్ణి కన్నార్పకుండా చూస్తాను
ఆ రూపు మనసులో హత్తుకు పోవాలని
అలాగే నిన్నూ చూస్తున్నారా మనవడా, నివిన్
గూడు చేరినా, జ్ఞాపకాల గుండెలో నిను రోజూ చూద్దామని!
4. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారుగానీ
పసివాడు అందరికన్నా బలవంతుడు
పరుగులు పెట్టిస్తాడు అందరినీ
ఒక్క ఏడుపుతో .. నివిన్ ఏడుస్తున్నాడంటూ...!
5. మనవడితో పోటీపడి ఓడిపోయిందీ అమ్మమ్మ
నేను తీయ వాడు వేయ, నేను తీయ వాడు వేయ
అమ్మమ్మని ఆడుకున్నాడు ఉద్దండుడు మా నివిన్
ఓడి పోతున్న నన్ను పరిహసిస్తూ మళ్ళీ వేశాడు నోట్లో చెయ్యి!!!
6. నా చెయ్యి కనబడటం లేదు .. చూశారా
అమ్మమ్మే దాచేసి వుంటుంది
కొంగు చాటునో, కర్చీఫ్ మాటునో
ఈ నివిన్ నోట్లో పెట్టుకోవాలి అర్జంటుగా ..చూడరా!?
7. మీ తాతకి కూడా దడవని నేను
అగ్గగ్గలాడుతున్నా కదరా నీ ఆదేశాలకి
మాటలే రాని మనవడా, నివిన్,
ఆడిస్తున్నావు కదరా అమ్మమ్మని నీ ఉ..ఊ..ఉంగాలతో!
8. చూడగానె నవ్వేవు, చెయ్యూపి రమ్మనేవు
తెలిసీ తెలియని భాషలో ఊసులెన్నో చెప్పేవు
మనసులకు మమతలకు భాషలెందుకంటావా
చిరునవ్వు నింపుకున్న జీవనమే చాలు కదరా నివిన్!
9. అల్లరెంతొ చేసేవు, అతి బుధ్ధిగాను వుండేవు
ఆరీ! అక్కరలేనిది లేదు కదా నీకు
చిత్తు కాగితం నుంచి రోబో దాకా
వంట సామాను నుంచి వంటకాల వడ్డన దాకా!!
10. నువ్వు అమెరికావాడివైనంత మాత్రాన
నాకు ఇంగ్లీషు రాదని గట్టిగా తేల్చేశావు
అమ్మా నాన్నలకి కూడా ప్రౌనౌన్సేషన్ నేర్పేవు
ఏదీ, తెలుగులో మాట్లాడవయ్యా మనవడా, ఆరీ!!
కవిత రాయటం రాదంటూనే ఎంత బాగా రాసారు. వహ్వా.
ReplyDelete