పుష్యమిత్ర - 27 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 27
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. ప్రభుత్వం వారు పుష్యమిత్రునికి హిందీ మొదలైన భాషలను నేర్పిస్తారు. క్రమంగా మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. దిల్లీ లో ఒకరోజు విషవాయువు లీకై జనజీవనం అతలా కుతలమయింది. పుష్యమిత్ర శ్రీలంకలో ఉన్న ఒక చెట్టు ఆకుతో వ్యాధిని నయచేయడం వీలవుతుందనగా ప్రధానితో కలిసి శ్రీలంకకు ఒక హెలికాప్టర్ లో బయలుదేరారు. (ఇక చదవండి)
హెలికాప్టర్ లో బయలుదేరి ఆంధప్రదేశ్లో అమరావతిలోను, చెన్నైలోను ఆగి మళ్ళీ ప్రయాణం కొనసాగించి కన్యాకుమారి దాటి శ్రీలంకలో ప్రవేసిస్తారు.  ముందుగా భారత ప్రభుత్వం వారిచ్చిన సందేశం ప్రకారం సెక్యూరిటీ సమస్యలు లేకుండా వారు తిన్నగా అనూరాధపురం రోడ్డుకు చేరుకున్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రధాని ప్రశ్నకు పుష్యమిత్రుడు చెప్పసాగాడు. రామాయణ కాలంలో హనుమంతుడు హిమాలయాలనుండి సంజీవని పర్వతం తెచ్చినప్పుడు ఆ పర్వతం విరిగి ఈ లంకలో ఐదు చోట్ల పడింది. ఒకటి  రుమాసలాలోను, హిరిపితియా ప్రాంతంలోను, రితిగళ లోను, మనం ఉన్న అనూరాధపుర ప్రాంతంలోని హబర్నా అనే ప్రదేశంలోను, ఉత్తరదిశలో ఉన్న తల్లాడి మన్నార్ ప్రాంతంలో దోలుకంద అనే ప్రదేశంలోను విరిగి పెద్ద శకలాలుగా పడింది. మనం ప్రస్తుతం అనూరాధపుర ప్రాంతంలో ఉన్న హబర్నా అనే కొండ శిఖరానికి దగ్గరలో ఉన్నాం. అంటూ పైలట్ కు వెళ్ళవలసిన కొండ వేపు దారి చూపించాడు. ప్రధాని నవ్వుతూ మనం ఏ చార్టర్డ్ విమానంలో వచ్చి ఉంటే చాలా ఇబ్బందుల పాలయే వాళ్ళం అన్నాడు. నిజమే కదా అన్నాడు పుష్యమిత్రుడు.
హెలికాప్టర్ వెళ్ళే దారిలో పుష్యమిత్రుడు సీతమ్మవారిని దాచిన అశోక వనము, దానికి సంబంధించిన అనేక గుహలు రామాయణ కాలం నాటి విశేషాలను వివరించాడు. అనూరాధపుర ప్రాంతంలో ఆ మూలికలు దొరకకపోవడం వలన దోలుకంద వేపు ప్రయాణం సాగించారు. వారికి శ్రీలంకలో ఎక్కిన ప్రతాపేశ్వరన్ మార్గం చూపసాగాడు. దోలుకంద ఒక నదీ ప్రాంతం. నదిలో మూలికలతో పారే తీయని నీరు రుచి చూసి అందరూ ఆశ్చర్య పోయారు. 
పుష్యమిత్రుడు ఆ చెట్ల వద్దకు వెళ్ళి ప్రధానికి చూపించి ఈ మూలికల చరిత్ర మీకు చెప్పాలి. దీనిని మృతసంజీవని అంటారు. దీనిని వాసన చూపిస్తే చచ్చిన వాళ్ళు సైతం లేచి కూర్చుంటారు. అదుగో అల్లంత దూరాన వున్న విశల్యకరణి దానిని వాసన చూస్తే శరీరంలో విరిగిన ఎలాంటి బాణాలైన బయటకు వచ్చిపడిపోతాయి. కుడివైపు చూడు ఆ ఓషధి సావర్ణ్యకరణి దీనిని వాసన చూస్తే రక్తప్రవాహమై మూర్ఛిల్లిన దేహులు సైతం తెలివి వచ్చి లేచి కూర్చుంటారు. ఇదుగో ఆ ఎడమవైపు ఉన్న ఓషధీ వృక్షాల పేరు సంధాన కరణి దానిని వాసన చూస్తే విరిగిన ఎముకలు సైతం అంటుకుంటాయి. ప్రస్తుతం మన దేశంలో వివిధ వైద్యశాలలలో ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టే ఆకులు ఇవే. మనం తెచ్చిన బస్తాలలో మనం మొదట చూసిన మృతసంజీవని చెట్ల ఆకులు, కుడివైపు ఉన్న సావర్ణ్యకరణి ఆకులను నింపండి. ఇప్పటికే కాలాతీతమయింది. మనం మరో ఐదారు గంటలలో దిల్లీ నగరం చేరుకోవాలి అన్నాడు. ప్రధాని పుష్యమిత్రుని జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. శ్రీలంక ప్రధాని బలవంతం మీద తేనీటి విందు సాగించి హెలికాప్టర్ దిల్లీ వేపు సాగింది. దారిలో మిలిటరీ వారికి చెప్పిన ప్రకారం గాసొలీన్ నింపుకొని మరలా ప్రయాణం సాగింది.
*     *     *
దిల్లీలో ఆసుపత్రులలో వ్యవహారం దారుణంగా ఉంది. వేలమంది అప్పటికే చేరగా, వందలాది మంది ఇంకా వస్తూనే ఉన్నారు. కొందరు రక్తస్రావమై బాధపడేవారు. మరికొందరు మూర్ఛిల్లిన వారు. మరికొందరికి ఊపిరితిత్తులు పనిచేయక ఊపిరి అందకపోవడం వలన వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజెన్ అందుకొంటున్న వారు. డాక్టర్లకు ఇలాంటి వాయువు లీకైనప్పుడు ఎలాంటి మందులు వాడాలో తెలీక కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేస్తున్నారు. 
*     *     *
దిల్లీ కి దూరంగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య స్థావరంలో సమావేశం.
"ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?" వికటాట్టహాసం చేస్తూ ప్రశ్నించాడు ముస్తఫా.
"దారుణం ఇంకో రోజు గడిస్తే కొన్ని వేలమంది రక్తం కక్కుకుని మరణిస్తారు సాబ్" అసిస్టెంట్ అన్న మాటలకు మళ్ళీ పెద్దగా నవ్వుతూ "ఇది బాంబు కంటే గొప్ప ప్రయోగం. ఆ ఫర్మా కంపెనీ మేజేజర్ కు ఐదు లక్షలు ఇచ్చి డ్యూటీ నుండి వెళ్ళేటప్పుడు ఆ విషవాయువు వాల్వు ఆన్ చేసి వెళ్ళమని చెప్పాను. కానీ సాలా...దానిపై వేలిముద్రలు ఉండడంవలన పట్టుబడ్డాడు. వాడు నిజం చెబితే వాడికే ప్రమాదం. అందుకే చెప్పడు. నేను ఇప్పుడే మన పాక్ ప్రెసిడెంటు తో మాట్లాడాను. మంచి కుషీ గా ఉన్నాడు. మనకు మంచి నజరానా రాబోతున్నది" అంటూ టీ.వీ లలో జరిగే తంతు తిలకిస్తున్నాడు.

ఇంతలో టీ.వీ.లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్  ముందు ఓ హెలికాప్టర్ ఆగింది అందులోనుండి ఏవో మూటలతో ఆర్మీ సైనికులు లోనకు వెళ్తున్నారు. ఒక వింతవ్యక్తి ప్రధానితో     లోపలకు వెళ్ళి డాక్టర్లకు ఏవో సలహాలనిస్తున్నాడు. వారు దూకుడు మీద ఆ కర్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. విషయం ఏమిటో బోధపడడం లేదు. ఇంతలో 50 అంబులెన్సులు ఇన్స్టిట్యూట్ ముందు ఆగాయి. వాటినుండి దిగిన డాక్టర్లకు ఏవో పచ్చటి రసాన్ని ఇవ్వగా క్షణాల్లో అవి సిటీలో ఉన్న అన్ని ఆసుపత్రులకు చేరాయి.
ముస్తఫా భ్రుకుటి ముడుస్తూ..." వో కైన్ హై... ఏ క్యాహై... బాటిల్స్ మే క్యా హై.  క్యాహొరహా హై ఉధర్. దేఖో.. రిపోర్ట్ మీ ఇమ్మీడియట్లీ" అన్నాడు ఏదో అపాయం శంకిస్తూ. అనుచరుడు వెంటనే వెళ్ళిపోయాడు జరిగిన విషయం తెలుసుకునడానికి.
మొబైల్ లో సందేశం. "వాట్ హాపెండ్?  వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హాస్పిటల్స్?. ఆన్సర్ మీ జల్దీ". ప్రెసిడెంట్ ఎస్.ఎం.ఎస్.
*     *     *
డాక్టర్ల లేబోరేటరీ లో అనుమానాస్పదంగా తిరుగున్న ముహమ్మడ్ ను పట్టుకున్నారు.
అతనికి ఎలెక్ట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చి విషయం రాబట్టి అతని సహాయంతో స్తావరం చేరుకున్నారు అర్మీ పోలీసులు.
"హూ ఈస్ దట్ డాక్టర్? క్యాచ్ హిం ఇమ్మీడియట్లీ. కిడ్నాప్ హిం." ఎస్.ఎం.ఎస్ చూసుకున్న ముస్తఫా ఉలిక్కిపడ్డాడు.  ఇంతలో ఏ.కే 47 కాల్పులు వినబడ్డాయి. పదిమంది ఇండియన్ ఆర్మీ గదిలోకి చొరబడి ముస్తఫా ను అరెస్టు చేశారు. 
*     *     *
ఒక వైద్యుని ఆదేశాల ప్రకారం ఒక అరుదైన ఒక చెట్టు పసరుతో విషవాయువు వలన వచ్చిన దుష్ఫలితాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశం ఎటువంటి క్లిష్ట పరిస్తుతులను సైతం ఎదుర్కునే విధంగా ముందుకెళ్తున్నదని అన్నారు ఇంకా టీ.వీ లలో వార్తలు వస్తున్నాయి. ప్రధాని పుష్యమిత్రుని కాళ్ళకు నమస్కరించి "ఈరోజు మీవలన దేశం పరువు కాపాడబడింది". కానీ ఈవిషయంలో కూడా విదేశీ హస్తం ఉంటుందని ఊహించలేకపోయాను అన్నాడు.
"నాదేముంది. మీరు అన్ని ఏర్పాట్లు క్షణాల్లో చెయ్యడంవలనే కదా ప్రమాదం తప్పింది" అన్నాడు.
"మన దేశంలో ఇంకా అనేక భయంకరమైన జబ్బులు ఉన్నాయి పుష్యమిత్రాజీ! క్యాన్సర్. ఎయిడ్స్. ఇంకా అనేక సుఖ వ్యాధులకు మందులు కనిపెట్టబడక జనం అన్యాయంగా మరణిస్తున్నారు"
"మనం నిదానంగా ప్రయత్నిస్తే వాటికి త్వరలోనే మందులు కనుక్కోవచ్చు"
"నిజంగా ఆరోజు వస్తుందా!"
"తప్పకుండా వస్తుంది. దేశం ఆర్ధికంగా పుంజుకోవాలంటే ముందు ధనం కావాలి. మనం ఆ పనిలో ఉండాలి ముందు. (సశేషం)

No comments:

Post a Comment

Pages