ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -19
రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు
అక్షర పరబ్రహ్మయోగము
8వ అధ్యాయం
అర్జన ఉవాచః
కింతద్భ్రహ్మకిమధ్యాత్మంకికర్మపురుషోత్తమ
అధి భూతంచకింప్రోక్తమధిదైవంకిముభ్యతే
1వ శ్లోకం
అధియజ్ఞఃకధంకోత్రదేహేస్మిన్మధుసూదన
ప్రయాణకాలేచకధం జ్ఞేయోసినియతాత్మభిః
క్షరమనగా నశించునది. అక్షరమనగా నాశరహితమైనది. నాశరహితమగు పరబ్రహ్మమును గూర్చీ విశదీకరించునదిగావున నీయధ్యాయమునకు అక్షరపరబ్రహ్మయోగమను పేరు వచ్చినది. పురుషశ్రేష్టుడవగు ఓ కృష్టా! బ్రహ్మమేది? ఆధ్యాత్మమెయ్యది ? కర్మమనగా నేమి ? అధి భూతమననేమి ? అధిదైవమనిదేనిని చెప్పుదురు ? దేహమందు అధియజ్ఞుడెవరు ? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే నీవెట్లు తెలుసికొనబడగలవు ?
అను ఏడు ప్రశ్నలను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుచున్నాడు. మొదటి ఆరు ప్రశ్నలకు క్లుప్తముగా సమాధానమిచ్చి చివరి ప్రశ్నయగు అంత్యకాలభగవచ్చింతనమును గూర్చీ విపులముగా ప్రభోదించెను.అంత్యకాలమున యోగనిష్టాపరులెట్టిభావన కలిగియుండినచో బ్రహ్మసాయుజ్యమొందగలరో జీవితమంతయు ధ్యానాది అనుష్టానములు సలుపుట భగవత్ స్థిితియందు నిలకడ కలుగుట కొరకేయగుట వలన ఈ విషయములను గీతాచార్యుడు విపులముగా విశదీకరించెను.
శ్రీ భగవానువాచః
అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకరోవిసర్గః కర్మసంజ్ఞితః
అర్జునుడడిగిన ఏడు ప్రశ్నలకును భగవానుడిచట సమాధాన మొసగుచున్నాడు. మొదటిప్రశ్నయగు బ్రహ్మమనగానేమి ? అనుదానికి సర్వోత్తమమైన నాశరహితవస్తువే బ్రహ్మము. సృష్టిలో సమస్త దశ్యపదార్ధములు కాలక్రమమున నశించిపోవుచున్నవి (యదృశ్యం తన్నశ్యం). నశింపని వస్తువొక్కటియే అదియే పరబ్రహ్మము.అది అక్షరము. ఇక రెండవది అద్యాత్మము. అధ్యాత్మమనగా స్వభావము. అనగా ప్రత్యగాత్మ రూపమే అధ్యాత్మమని అర్ధము. సాధారణజనులు
అజ్ఞానమువలన తాను దేహమని, మనస్సని, ప్రపంచవస్తువని తలచుచున్నారు. అది పొరపాటని ఈ శ్లోకము ద్వారా గీతాచార్యుడు చెప్పుచున్నాడు. తాను దేహమని, మనస్సని, ప్రపంచవస్తువని తలచినంతవరకు మనుజునకు శాంతిగాని,సుఖముగాని యుండనేరవు.ఏలయనిన అవన్నియు క్షరములు అనగా నశించునవి. అక్షరవస్తువునందే శాంతి, సుఖము కలవు. కావున తన స్వరూపము ఆత్మయేకాని నశించబడు వస్తుసముదాయముకాదను దృఢనిశ్చయము కలిగియుండ వలెను. ప్రాణికోట్ల ఉత్పత్తిని కలుగజేయు యజ్ఞాది త్యాగపూర్వకమైన క్రియ కర్మయని చెప్పబడుచున్నది.అదియే ఉత్తమజన్మకు,మోక్షమునకు హేతువగుచున్నది.
అన్తకాలేచమామేవా స్మరణ్ముక్త్వాకలేబరమ్
యః ప్రయాతి సమద్భావం యాతినాస్త్యత్రసంశయః
5వ శ్లోకం
ఎవడు అంత్యకాలము అనగా మరణ సమయమందు నా నామస్మరణ చేయుచు దేహత్యాగము చేయుచున్నాడో ఆతడునన్నే పొందుచున్నాడు.ఇందులకు సంశయమేమియును లేదు.ఇది చివరదగు ఏడవ ప్రశ్నకు సమాధానము.
అకస్మాత్తుగా స్మరించుటకు చివరి సమయములో మనుజుడు కఫ,,వాత,,పిత్తములబడసి శరీరక బాధలనొందుచున్నాడు. అట్టి శరీరక బాధలలో చిక్కునపుడు అకస్మాత్తుగా దైవనామస్మరణ చేయుటకు అవకాశమేలేదు.శరీర ఇంద్రియాదులు సహకరించవు.ఎల్లకాలములందు నన్నే స్మరింపుము అని ముందు ముందు గీతాచార్యుడు ఈ శ్లోక తాత్పర్యమును విశదీకరించును.
స్మరించుటయనగా మనకు అతి ప్రీతికరమైన వస్తువును ఎంతగా ప్రేమిస్తామో అంతకంటే శతాధిక రెట్లు ఎక్కువగా పరమాత్మ రూప నామములు ప్రేమించి స్మరించుటయే నిజమైన భక్తి.అటువంటి భక్తుల స్మరణయే శూన్యము నుండీ తరంగముల వలే ఆ పరమాత్మకు చేరి ఆనందపరవశుణ్ణి చేయును.అదే నిజభక్తి. యంత్రముల వలే స్మరించు నామస్మరణ నిరర్థకము, నిష్ప్రయోజనము. పరమాత్మను పరవశింపజేసే స్మరణవలన సాలోక్య,సామీప్య,సారూప్య, సాయుజ్య, స్థితులు భక్తునికి కలుగజేయుచున్నాడు.
కృపాసముద్రుడగు పరమాత్మ ఎల్ల కాలములయందు ఎవరు తనను మనసారా ప్రార్థిస్తారోయని ఎదురు చూస్తూయుంటాడు. ఆయన దేశ, కాలాతీతుడు. బాహ్య బంధాలలో తగుల్కొని మనమే పూర్తి సమయాన్ని భగవంతుని స్మరణలో వినియోగించలేకపోతున్నాము. అంత్యకాల సంస్కారము కొరకై జీవితమంతయు చిత్తమును పరమార్థ మయమొనరించుకొన వలెను.
అభ్యాస యోగ యుక్తేనా చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతిపార్థాను చిన్తయన్
8వ శ్లోకం
ఏ పద్దతి ఆచరించినచో మనుజుడు ఆత్మ సాక్షాత్కారము పొందగల్గునో ఇచ్చట చెప్పబడినది. అందుకు మూడు ఉపదేశములు సూచించబడినవి.
1.అభ్యాస యేగము
2.చిత్తమును పరమాత్మపై నిలుపుట
3.ఆత్మను గూర్చియే సర్వదా చింతన చేయుట
ఏ సాధనయైనా అభ్యాసము లేనిచో ఎట్లు ఫలించును? మనోనిగ్రహమునకు అభ్యాస, వైరాగ్యములే ముఖ్యమైనవని శ్రీకృష్ణమూర్తి ఆరవ అధ్యాయమునందే చెప్పియున్నాడు."అభ్యాసవైరాగ్యాం తన్నిరోధః " అనిపతంజలి మహర్షియు ఆ విషయాన్నే నొక్కిచెప్పెను. ఆధ్యాత్మరంగమున అభ్యాసము ఉన్నత స్థానమాక్రమించినది.లౌకిక క్షేత్రమందును దాని, ఆవశ్యకతసర్వులకూ విదితమే. సత్సంకల్పములు,సద్విషయములు,దైవవిచారణ అభ్యాసముచే స్థిరత్వమునుబడయగలవు.ఏ యోగసాధనయైననూ అభ్యాసయోగముతో మిళితమైనప్పుడే చక్కనిఫలితము కలుగును.
చిత్తము దృశ్య విషయములపై పరుగిడక ధ్యేయవస్తువగు ఆత్మయందే స్థిరముగానుండవలెను. పరమపురుషుడగు ఆత్మను గూర్చియే మరల మరల చింతనచేయవలెను.ఈ ప్రకారము సాధన చేయుచుండగా మనుజుడు తప్పక ఆ పరమాత్మ పదమును జేరగలడని గీతాచార్యుడు స్పష్టముగా నిరూపించెను. కాబట్టీ ముముక్షువులు భగవంతుని వాక్యములందు పరిపూర్ణ విశ్వాసముంచి వారి వారి సాధనలను పూర్ణ మొనరించి కృతార్థులుగావలెను. అభ్యాసమొకింత సడలి ప్రకృతివైపు పయనించిన మాయామోహితుడై సంసార చక్రమున చిక్కుబడును. క్రమశిక్షణతో అభ్యాసమొనరించిన ధ్యేయవస్తువు తప్పక సిద్ధించును.
***
No comments:
Post a Comment