స్వల్ప జాగ్రత్త
కుంతి
“కృషికి తగిన గుర్తింపు లభించును. సంఘములో విశేషమైన మర్యాదా గౌరవము లభించును. అనుకున్న పనులు విజయవంతమగును. ప్రయాణాలు సఫలమగును. కానీ కొన్ని విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము.”
వారఫలాలు చదవడము ముగించాడు గౌతమ్. గౌతమ్ కాకినాడలోనే ప్రముఖ ప్రభుత్వ కళాశాలలో ఫిజిక్స్ ఉపన్యాసకుడు. మేధావి, సహృదయుడు .
కొంత కౌటుంబికముగా, కొంత సంప్రదాయకముగా వచ్చిన ఆలోచనల వల్ల వారము, వర్జ్యము, తిధి, నక్షత్రములను పట్టుకొని వేళ్లాడుతాడు. అలా అని వానిని పూర్తిగా నమ్మడు. తను చదివిన చదువుకు, తను పెరిగిన వాతావరణానికి మధ్య ఉన్న గ్యాప్ వల్ల నలిగిపోతుంటాడు.
చాలా వరకు శాస్త్రీయంగా ,హేతుబద్దంగా ఆలోచించి పనులు చేస్తాడు. కానీ ఎందుకో చిన్న చిన్న బలహీనతలు దాట లేకపోతాడు.
అతడు ఆ రోజు రాత్రి గౌతమీ ఎక్స్ ప్రెస్ లో కాకినాడ నుండి హైదరాబాద్ కు బయలుదేరాలి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చర్ యివ్వాలి. దానికై సిద్ధ పడ సాగాడు.
“అమ్మో! కొన్ని విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరమ’ని వారఫలాలలో ఉన్నది.
“కొన్ని కాదు అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.” అనుకున్నాడు.
వెంటనే తాను అక్కడ యివ్వబోయే లెక్చర్ తాలూకు కాపీని తీసుకొని మూడునాలుగుసార్లు చదువుకున్నాడు. “వెరీ గుడ్! బాగుంది” అనుకున్నాడు.
హైదరాబాద్ ప్రయాణము రెండు మూడు రోజులు కాబట్టి కావలసిన వస్తువులు, వగైరాల గురించి ఆలోచించాడు. ఎందుకైనా మంచిదనుకొని ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాడు. దాని ప్రకారము అన్నీ సర్దుకున్నాడు.
తన లెక్చర్ తాలూకు మాన్యువల్ కాపీని, తను ప్రెసెంట్ చేయబోయే అంశాల పై తయారు చేసిన సీడీలను, తన ల్యాప్ టాప్ ను వరుసగా అన్నీ చెక్ చేసుకున్నాడు.
ఆ క్షణము నుండి అంటే, ఇంటి నుండి కాకినాడ రైల్వే స్టేషన్ కు అక్కడి నుండి రైలు ప్రయాణము, ఆ పై సికింద్రాబాద్ నుండి యూనివర్సిటీకి, యూనివర్సిటీలో కలవాల్సిన వ్యక్తులు, ఇలా ప్రతి అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆలోచించుకుంటూ కావలసిన అంశాలను నోట్ చేసుకుంటూ, తీసుకోవలసిన వస్తువులు, సూట్ కేస్ సర్దుకుంటూ చేయవలసిన అంశాలను నెమరు వేసుకుంటూ, ఎవరెవరితో ఎపుడెపుడు, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకున్నాడు.
ఇదంతా చూస్తుంటే, “ బారిష్గ్టర్ పార్వతీశము నవలలోని పార్వతీశము ఇంగ్లాండ్ ప్రయాణము, తెలుగు బామ్మల కాశీ ప్రయాణము గుర్తుకు వచ్చింది.
ఎంత చేస్తున్నప్పటికీ ఒక పక్క వార ఫలాల తాలూకు స్వల్ప జాగ్రత్త అవసరము అన్న విషయము మనసులో పీకుతూనే ఉంది.
“నీవొక రీసెర్చ్ స్కాలర్ వు. ఫిజిక్స్ లో యూని వర్సిటీ గోల్డ్ మెడలిస్టువు. “శాస్త్రీయ దృక్పధముతో మానవ ప్రగతి” అన్న విషయము పై ఉపన్యాసము ఇవ్వబోతున్నావు. ఏమిటీ ఈ పనికి మాలిన దేబరింపులు” అని మనసు అతడిని ప్రశ్నించింది.
“ఫియర్ ఆఫ్ ఫేయిల్యూర్ ? గ్రహాల ఆగ్రహము భయపెడుతుందా?” అని కసిరింది.
“లేదు. ఇది ఒక రకమైన హోమ్ వర్క్. మెంటల్ ప్రిపరేషన్. ఇందులో తప్పు యేముంది?” అనుకున్నాడు.
సాయంత్రము ఇంటిలో నుండి బయలుదేరే ముందు మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాడు. కంప్యూటర్ సీడీ, మాన్యువాల్ కాపీలను పరీక్షీంచి చూసుకున్నాడు.
దేవుని గదిలోకి వెళ్ళి దండము పెట్టుకున్నాడు. ఇంటిలో నుండిబయటికి వెళ్ళే ముందు పిల్లీ, గిల్లీ ఎదురు రాకుండా చూసుకొని కుడి కాలు బయట పెట్టి బయలుదేరాడు.
తన నాలుగేళ్ళ కూతురును ఎదురు రమ్మన్నాడు. రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు.
ట్రైన్ కదులుతుండగా మళ్ళీ చెక్ లిస్ట్ చూసుకున్నాడు. దాని ప్రకారము అన్నీ సజావుగానే ఉన్నాయి అనుకున్నాడు. ఒక పక్క తాను చెప్పబోయే విషయాలపై రిహార్సల్స్ చేసుకున్నాడు.
ఈ ”స్వల్ప విషయాలలో జాగ్రత్త” అనే అంశము చదవడము మంచికే అనుకున్నాడు.”ఇప్పటికే టాపిక్ బాగా ప్రిపేర్ అయ్యాను” అనుకున్నాడు.
ట్రైన్ గోదావరి దాటుటుండగా లేచి వెళ్ళి నదీమతల్లికి భక్తితో మొక్కుకున్నాడు. చిల్లర డబ్బులు తీసి నీళ్ళలోకి విసిరాడు. సూట్ కేస్ వగైరా జాగ్రత్తగా లాక్ చేసి బర్త్ ఎక్కి పడుకున్నాడు.
తెలతెలవారుతుండగ మెలకువ అయింది. ట్రైన్ ఆలేరు దాటింది.
యాదగిరి నరసన్న శిఖరము కనబడితే మొక్కుకొన్నాడు. ట్రైన్ సికింద్రాబద్ చేరుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవుళ్లకు మొక్కుకొని కుడికాలు హైదరాబాద్ నేలపైన పెట్టాడు.
“తప్పకూండా వార ఫలాలలోని స్వల్ప జాగ్రత్త నిన్ను భయ పెడుతుంది” అని మనసు వెక్కిరించింది.
“కాదు ! అలాంటిది యేమీ లేదు. శ్రామికుడు ఎన్నడూ భయపడడు” అని సర్ది చెప్పుకున్నాడు.
రెండు గంటలలో యూనివర్సిటీ గెస్ట్ హవుస్ చేరుకున్నాడు. గబగబా సిద్ధమయ్యాడు.
గౌతమ్ చాలా పొడగరి. బాత్రూమ్ లోకి వెళుతూ తల గుమ్మానికి తగలకుండా, బాత్రూమ్ గడియ కిందపడి పోకుండా, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు లిస్ట్ అయ్యేంతగా, ప్రతి అంశములో ప్రతిక్షణము స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. లెక్చర్ హాల్ కు బయలుదేరుతుండగా మృణాళిని నుండి ఫోన్ వచ్చింది.
“హలో !గౌతమ్! నేను లెక్చర్ హాల్ కు వస్తాను. బాగా ప్రెజెంట్ చేయి. బెస్ట్ ఆఫ్ లక్! అక్కడే కలుస్తాను” అంటూ ఫోన్ పెట్టేసింది.
గౌతమ్ మృణాళిని కాకినాడలో కాలేజ్ మెట్స్. వీరి స్నేహము ప్రేమగ మారి పెళ్ళిదాకా వెళ్ళి, గ్రహాల అనుగ్రహాలు లేక, జాతకాలు, నక్షత్రాల మధ్యన నలిగి ఆగిపోయింది.
మృణాళినికి హైదరాబాద్ లో ఒక ఇంజనీర్ తో వివాహము జరిగినది. సెంట్రల్ యూనివర్సిటే లో లెక్చరర్ గా పనిచేస్తుంది.
వీరికి పెళ్ళి కాకపోయినా వీరి స్నేహము మాత్రము పవిత్రముగా కొనసాగుతుంది.
ఇద్దరూ తరచు మాట్లాడుకుంటారు కూడా.
గౌతమ్ గెస్ట్ హవుస్ నుండి లెక్చర్ హాల్ కాంప్లెక్స్ కు వెళ్ళాడు. మృణాళిని కనిపించలేదు.
కొద్ది సేపటిలో గౌతమును ఆహ్వానించారు. గౌతమ్ తన లాప్ టాప్ తదితర సరంజామాతో డయాస్ మీదికి వెళ్ళాడు. స్వల్ప జాగ్రత్తలు తీసుకొని,అన్నీ చూసుకొని, చదువుల తల్లిని మనసారా తలచుకొని, లెక్చర్ ప్రారంభించాడు.
కొద్ది సేపు తన మైండ్ లో ఉన్న అన్నీ ఆలోచనల పొరలను మూసివేసాడు.
లెక్చర్ తాలూకు పొరను తెరచి, విషయాలను క్రమబద్దీకరించి,అద్భుతమైన శైలితో, ధారతో, వాక్పటిమతో కొండ మీద నుండి నేలని తాకుతున్న జల ప్రవాహములాగా దూసుకుపోయాడు. గంటన్నర గడిచింది.
లెక్చర్ హాల్ లో అంత వరకు చీమ చిటుక్కుమన్నా వినపడేంతగా పేరుకు పోయిన నిశ్శబ్దము, గౌతము లెక్చర్ ముగియటముతో కరతాళ ధ్వనులతో బద్దలయింది.
ప్రొఫెసర్లు ,లెక్చరర్స్ అభినందించ సాగారు. యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ వేదిక పైకి వచ్చి ప్రత్యేకంగా అభినందించి వెళ్ళిపోయాడు.
అభినందనలు అందుకుంటూ డయాస్ దిగి వస్తుండగా, మృణాళీని అభినందన దృక్కులతో అతని కేసి వచ్చింది.
“ఒకసారి ఇలారా !” అంటూ లెక్చర్ హాల్ పక్కన ఉన్న మరొక గదిలోకి తీసుకొని వెళ్ళింది.
అక్కడ ఎవరూ లేరు. “´గౌతమ్ ఎక్సలెంట్! అదరగ్గొట్టావు. ప్రారంభములో మిస్ అయ్యాను. నాకు కాస్తా రావడము లేటయింది. ఎనీ హౌ! నీకివే నా శుభాకాంక్షలు” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.
ఆ ఆనందాన్ని విజయాన్ని శ్రమకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న తరుణములో, మృణాళిని , “జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లున్నావు. నీ కష్టము కనబడుతుంది. కానీ... చెప్పకుండా ఉండలేను. దాదాపుగా గంటన్నర నుండి చూడ లేక పోతున్నాను. నీవు సరస్వతీ పుత్రుడవు కాబట్టి, నీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే అల్లరి అయ్యే వాడివి. సారీ! యేమనుకోకు! బహుశా ప్రిపరేషన్ లో పడి , స్వల్ప జాగ్రత్తలు తీసుకోలేక పోయినట్లున్నావు .
నీవు... నీ... ప్యాంట్ జిప్పు... పెట్టుకోలేదు. వస్తాను, మళ్ళీ కలుస్తాను" అని అంటూ వెళ్లిపోయింది.
ఇది తన వ్యక్తిగత నిర్లక్ష్యమా లేదా వార ఫలాలలో చెప్పినట్లుగా స్వల్ప జాగ్రత్తలు తీసుకోకపోవడము వలన వచ్చిన ఫలితమా? లేదా రెండు రోజులుగా విపరీతమైన జాగ్రత్తలు, శ్రద్ధలు తీసుకోవడము వలన జరిగిన తప్పిదమా? అని ఆలోచించుకుంటూ, ఈసారి ,
ఆ... స్వల్ప జాగ్రత్త... కూడా పడి, మరి కొందరి అభినందనలు అందుకోవడానికి లెక్చర్ హాలు లోకి వెళ్ళాడు.
***
No comments:
Post a Comment