చిట్టి పొట్టి పిల్లలం
బాలగేయాలు
వివరణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య
అంతర్జాతీయులం మేము
వసుధైక కుటుంబం అనే భావన అందరిలోను ఉండాలి. ముఖ్యంగా పిల్లలలో లోకకళ్యాణం కాంక్షించే మానవతత్త్వం, సత్సంకల్పము కలిగిస్తే... జగతి పురోగమనం ఆనందాన్నిస్తుంది. నిత్యం ఈర్ష్యాదేషాలనే బడబాగ్నుల్లో దగ్ధమయ్యే ప్రజల్లో ప్రసన్నత శాంతపరుస్తుంది. యధ్భావం తద్భవతి అన్నట్లు భావనే అన్ని కర్మలకూ మూలమై ఫలితాన్నిస్తుంది. విశ్వశ్రేయస్సే ఆకాంక్షగా, సహృదయతే ఆలనంబనగా మనిషి ఎదిగితే వసుధైక కుటుంబం ఆదర్శ జీవన పంథాను ప్రతీ ఒక్కరికి ఆపాదిస్తుంది. ఆ విషయం పిల్లలకు చిన్నతనం నుండి బోధపరచాలి. ఆ విషయమై కుల మత ప్రసక్తి లేని విశ్వసౌభ్రాతృత్వాన్ని వారికి బోధిస్తూ డా.ఎస్.గంగప్పగారు రాసిన గీతం ఈ మాసం మీకోసం.
చిట్టి పొట్టి పిల్లలం
చింతలేని పిల్లలం ||చిట్టి||
జాతి మతాలు లేవు మాకు
కుల వర్ణాలు లేవు మాకు ||చిట్టి||
మానవత మా జాతి
మమతయే మా మతం
జాలి తలచడం మా కులం
కరుణ చూపడం మా వర్ణం ||చిట్టి||
మాకు కలవు సమతలు
మాకు లేవు సీమలు ||చిట్టి||
జాతీయులమే కాము మేము
అంతర్జాతీయులము మేము ||చిట్టి||
No comments:
Post a Comment