నెల 'వంక' - అచ్చంగా తెలుగు
నెల 'వంక'
కంభంపాటి రవీంద్ర 

ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు మా ఫ్రెండొకడింటికెళ్తే, వాడు మాటల్లో అన్నాడు 'మా పిల్లలిద్దరికీ విష్ణు సహస్రనామాలు , భగవద్గీత కంఠతా వచ్చు ' అని . 'అవును .. స్థల మహత్యం ' అన్నాను

'అమెరికాలో స్థల మహాత్యమేంట్రా ?.. ' అని వాడడిగితే 'అవును మరి.. ఇండియా లో మా పిల్లలకి ఇవేవీ మేము నేర్పించము .. అసలా మాటకొస్తే పెద్దగా పట్టించుకోము .. ఇక్కడ మీరు ఒక విధంగా మైనారిటీ గా ఉన్నారు కాబట్టి , ఇవన్నీ మనం మిస్సవుతున్నాము అనే బాధతో పిల్లలకి పట్టుబట్టి నేర్పిస్తున్నారు ' అంటే , వాడు కూడా ఆలోచిస్తూ , 'అవునన్నాడు '. 

అక్కడ అమెరికా లో మన పిల్లలకి ఇదీ మన సంస్కృతి , ఇవీ మన కళలు అంటూ చాలా గొప్పగా చెబుతాం , ఎందుకంటే ఆ సమాజం లో ఇవేవీ ఉండవు కాబట్టి . అదే కుటుంబం ఓసారి భారత దేశం లో ఉందనుకోండి , అసలు విష్ణుసహస్రనామం కాదు కదా , ఆ పిల్లలకి శుక్లాంబరధరం కూడా నేర్పించము . 
ఇదంతా ఎందుకూ అంటే   మన సంస్కృతి ని అర్ధం చేసుకోలేకపోవడం , మన సంస్కృతి యొక్క విలువ తెలుసుకోలేకపోవడం తద్వారా మన జాతి మీద మనకే గౌరవం లేకపోవడం ! దీనికి నేనెవర్నీ తప్పు బట్టడం లేదు, ఎందుకంటే మన దేశం లో  సామజిక పరిస్థితులు అలా ఉన్నాయి . 
చాలాకాలం తర్వాత నా చిన్నప్పటి ఫ్రెండొకడిని అనుకోకుండా హైదరాబాద్ లో కలవడం జరిగింది . చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భయపడేవాడిని , ఎందుకంటే అంత సనాతన కుటుంబం వాళ్ళది , ఆచారవ్యవహారాల్ల్లో చాలా నిక్కచ్చిగా ఉండేవారు . నిజం చెప్పాలంటే ఉదయాన్నే పూజ చేసుకోవడం , నుదుటన దేవుడి కుంకుమ పెట్టుకోవడం లాంటివి అన్నీ వాళ్ళ ఇంట్లో చూసే నేర్చుకున్నాను . కానీ ఇప్పుడు వాడి కుటుంబం చూసేసరికి , హైదరాబాద్ లోనే పెరుగుతున్నా, అతని  పిల్లలిద్దరూ తెలుగు మాట్లాడరు , నిజం చెప్పాలంటే రాదు . భార్య తెలుగు మాట్లాడుతుంది , నిజం చెప్పాలంటే వచ్చు ,కానీ వచ్చీ రానట్లు మాట్లాడుతుంది . 
ఇంట్లో అందరూ ఇంగ్లీష్ లో  మాట్లాడుతున్నారు , అక్కడక్కడా హిందీ మాటలు దొర్లుతున్నాయి తప్ప తెలుగు మాట ఒక్కటీ తగల్లేదు వాళ్ళ మాటల్లో . 
ఆ తర్వాత వాడికి ఫోన్ చేసి విషయం కనుక్కుంటే 'మా అపార్టుమెంట్ లో ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్ళున్నారు , దాంతో వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లేదా హిందీ తప్పదు , పైగా పిల్లలిద్దరూ ఇంటర్ నేషనల్ స్కూల్లో చదువుతున్నారు , వాళ్ళ క్లాస్ మేట్స్ ఎవరూ తెలుగు మాట్లాడరు , అందుకే వాళ్లకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాం ' అంటూ మొహమాటంగా చెప్పేడు . నాకర్ధం కాక అడిగేను 'ఒరే .. మనం ఉత్తరాదికి వెళ్ళినప్పుడు ఎలాగూ హిందీ నేర్చుకుని మాట్లాడతాం , అలాంటిది అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన భాష ని చంపుకుని వాళ్ళ భాషలో మాట్లాడ్డమెందుకు ?'
'నీ మొహం .. అది మనందరికీ జన్మతః వచ్చిన విద్య .. ఇంగ్లీషువాడు ఇండియా రాగానే మన వాళ్లంతా తెగ సలాములు కొట్టిమరీ మన దేశాన్ని వాడి చేతిలో పెట్టెయ్యలేదా ?..ఇంకా సింపుల్ గా చెబుతాను .. మన చిన్నప్పుడు ఎన్ని తెలుగు పత్రికలు వచ్చేవి ? ఇప్పుడు ఎన్నున్నాయి ? అసలు తెలుగు రాసేవారు ఎంత మంది? చదివేవారు ఎంత మంది? ఇంక ఈ ఐటీ ఉద్యోగాలొచ్చినప్పటి నుంచీ ప్రతీ ఒక్కడూ అమెరికా కో యూరోపు కో వెళ్లడం , ఎలాగూ మనం అక్కడే సెటిల్ అవుతాం కాబట్టి ఇంకా మనకి తెలుగు తో అవసరమా అనుకోవడం .. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ' అన్నాడు 
'నిజమేననుకో .. కానీ ఒకాటాలోచించు .. ఒక ఫ్రెంచ్ వాడు ఫ్రెంచి లోనే మాట్లాడతాడు , ఇంగ్లీషు వాడు ఇంగ్లీషు లోనే మాట్లాడతాడు , జర్మనీ వాడు జర్మన్ లోనే మాట్లాడతాడు , చైనా వాడు చైనీస్ లోనే మాట్లాడతాడు , జపాన్ వాడు జపనీస్ లోనే మాట్లాడతాడు .. అలాంటిది మనం మనతో మన భాషలోనే మాట్లాడుకోడానికేంటి ?' అన్నాను 
'సరేలే .. ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు .. ఎక్కువగా ఆలోచించకు ' అంటూ ఫోనెట్టేసేడు 
నాకు మటుకూ ఈ ఆలోచన వదలదు , మనం ఎందుకు మన సొంతవాటిని నామోషీగా చూస్తాం? బయట ఎవరైనా కుర్రాడు  నుదుట బొట్టెట్టుకున్నాడు అంటే వాడిని వింతగా చూస్తాం , ఎవరైనా అమ్మాయి కాళ్ళకి పసుపు రాసుకుని ఆఫీసుకొచ్చిందంటే విడ్డూరంగా చూసి నవ్వుకుంటాం . 
ఎవరైనా ఇవి మన ఆచారవ్యవహారాలు వీలైనంత పాటించండి అంటే 'ఆ చెప్పొచ్చేవులే .. ఇంకా ఈ రోజుల్లో కూడానా ' అని చిరాకు పడతాం . చుట్టుపక్కల అందరితో కలిసిపోవడం అంటే మన మూలాలు మర్చిపోవడం కాదు . 
కాబట్టి మనకి మన సంస్కృతీ , సంప్రదాయాల మీద నమ్మకం ఉంటే , మనకి చేతనైనంత , వీలైనంత పాటిద్దాం . పోనీ ఆ నమ్మకం లేదనుకోండి , పట్టించుకోవద్దు .. వాటంతట అవే చచ్చిపోతాయి .. 

No comments:

Post a Comment

Pages